Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
15 యెహోవా, నీ పవిత్ర గుడారంలో ఎవరు నివసించగలరు?
నీ పవిత్ర పర్వతం మీద ఎవరు నివసించగలరు?
2 ఎవరైతే పరిశుద్ధ జీవితం జీవించగలరో, మంచి కార్యాలు చేయగలరో తమ హృదయంలో నుండి సత్యం మాత్రమే మాట్లాడుతారో
అలాంటి వ్యక్తులు మాత్రమే నీ పర్వతం మీద నివసించగలరు.
3 అలాంటి వ్యక్తి ఇతరులను గూర్చి చెడు సంగతులు మాట్లాడడు.
ఆ మనిషి తన పొరుగు వారికి కీడు చేయడు.
ఆ మనిషి తన స్వంత కుటుంబం గూర్చి సిగ్గుకరమైన విషయాలు చెప్పడు.
4 ఆ మనిషి దేవుని చేత నిరాకరింపబడిన ప్రజలను గౌరవించడు.
అయితే యెహోవాను సేవించేవారందరినీ ఆ మనిషి గౌరవిస్తాడు.
ఆ మనిషి గనుక తన పొరుగువానికి ఒక వాగ్దానం చేస్తే
అతడు ఏమి చేస్తానన్నాడో దాన్ని నెరవేరుస్తాడు.
5 ఆ మనిషి ఎవరికైనా అప్పిస్తే
అతడు దాని మీద వడ్డీ తీసుకోడు.
నిర్దోషులకు కీడు చేయుటకుగాను అతడు డబ్బు తీసుకోడు.
ఒక మనిషి ఆ మంచి వ్యక్తిలాగ జీవిస్తే, అప్పుడు ఆ మనిషి ఎల్లప్పుడూ దేవునికి సన్నిహితంగా ఉంటాడు.
అబ్రాము కనానుకు తిరిగి వచ్చుట
13 కనుక అబ్రాము ఈజిప్టును విడిచిపెట్టాడు. తన భార్యను, స్వంతంగా తనకు ఉన్నదంతా తీసుకొని, నెగెబుగుండా అబ్రాము ప్రయాణం చేశాడు. లోతు కూడా వాళ్లతో ఉన్నాడు. 2 ఈ సమయానికి అబ్రాము చాలా ఐశ్వర్యవంతుడు. అతనికి చాలా విస్తారంగా పశువులు ఉన్నాయి. చాలా వెండి, బంగారం ఉన్నాయి.
3 అబ్రాము చుట్టుప్రక్కల సంచరిస్తూనే ఉన్నాడు. నెగెబును విడిచిపెట్టి మళ్లీ వెనుకకు బేతేలుకు వెళ్లాడు. బేతేలు పట్టణానికి, హాయి పట్టణానికి మధ్యనున్న చోటుకు అతడు వెళ్లాడు. ఇంతకు ముందు అబ్రాము నివసించిన స్థలమే ఇది. 4 అబ్రాము ఒక బలిపీఠాన్ని నిర్మించిన స్థలమిది. కనుక ఈ స్థలంలో అబ్రాము యెహోవాను ఆరాధించాడు.
అబ్రాము, లోతు వేరుపడటం
5 ఈ సమయంలో అబ్రాముతో లోతు కూడా ప్రయాణం చేస్తున్నాడు. లోతుకు గొర్రెలు, పశువులు, గుడారాలు చాలా ఉన్నాయి. 6 అబ్రాముకు, లోతుకు పశువులు విస్తారంగా ఉన్నందువల్ల వాళ్లిద్దరికి ఆ భూమి సరిపోలేదు. 7 అబ్రాము గొర్రెల కాపరులు, లోతు గొర్రెల కాపరులు వాదించుకోవడం మొదలు పెట్టారు. అదే సమయంలో కనానీయులు, పెరిజ్జీయులు కూడా ఈ దేశంలో నివసిస్తున్నారు.
8 కనుక లోతుతో అబ్రాము ఇలా అన్నాడు: “నీకు, నాకు మధ్య వాదం ఏమీ ఉండకూడదు. నీ మనుష్యులు నా మనుష్యులు వాదించుకోగూడదు. మనమంతా సోదరులం. 9 మనం వేరైపోవాలి. నీకు ఇష్టం వచ్చిన స్థలం ఏదైనా నీవు కోరుకో. నీవు ఎడమకు వెళ్తే, నేను కుడికి వెళ్తాను. నీవు కుడికి వెళ్తే, నేను ఎడమకు వెళ్తాను.”
10 లోతు పరిశీలించి యోర్దాను లోయను చూశాడు. అక్కడ నీళ్లు విస్తారంగా ఉన్నట్లు లోతు చూశాడు. (ఇది సొదొమ గొమొఱ్ఱాలను యెహోవా నాశనము చేయకముందు. ఆ కాలంలో సోయరు వరకు యొర్దాను లోయ యెహోవా తోటలా ఉంది, ఈజిప్టు భూమిలా ఇది కూడ మంచి భూమి.) 11 అందుచేత యొర్దాను లోయలో జీవించాలని లోతు నిర్ణయించుకొన్నాడు. ఆ ఇద్దరు మనుష్యులు వేరైపోయారు, లోతు తూర్పు దిక్కుగా ప్రయాణం మొదలు పెట్టాడు. 12 అబ్రాము కనాను దేశంలోనే ఉండిపోయాడు, లోతు లోయలోని పట్టణాల్లో నివసించాడు. బాగా దక్షిణాదిన ఉన్న సొదొమకు తరలిపోయి అక్కడ లోతు నివాసం ఏర్పర్చుకొన్నాడు. 13 సొదొమ ప్రజలు చాలా దుర్మార్గులు. వాళ్లు ఎప్పుడూ యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు.
14 లోతు వెళ్లిపోయిన తర్వాత అబ్రాముతో యెహోవా ఇలా అన్నాడు: “నీ చుట్టు చూడు. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర చూడు. 15 నీవు చూస్తోన్న ఈ దేశం అంతా నీకు, నీ వారసులకు నేను ఇస్తాను. ఇది శాశ్వతంగా నీ దేశం అవుతుంది. 16 భూమిమీద ధూళి కణాలు ఎంత విస్తారమో, నీ వారసులను గూడ అంత విస్తరింప జేస్తాను. నేలమీద ధూళి కణాలను ఎవరైనా లెక్కించగలిగితే అది నీ ప్రజల సంఖ్య అవుతుంది. 17 కనుక వెళ్లు, నీ దేశంలో సంచరించు. దానిని ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను.”
18 కనుక అబ్రాము తన గుడారాలను తరలించాడు, మమ్రే సమీపంలోని మహా వృక్షాల దగ్గర నివసించాలని అతడు వెళ్లాడు. ఇది హెబ్రోను పట్టణానికి దగ్గరగా ఉంది. యెహోవాను ఆరాధించటానికి ఈ స్థలంలో ఒక బలిపీఠాన్ని అబ్రాము కట్టించాడు.
ఎఫెసీయుల కోసం ప్రార్థన
14 ఈ కారణాన నేను తండ్రి ముందు మోకరిల్లుచున్నాను. 15 కనుక భూలోకంలో, పరలోకంలో ఉన్న విశ్వాసులందరు ఆయన పేరులో ఒకే కుటుంబముగా జీవిస్తున్నారు. 16 ఆయన తన అనంతమైన మహిమతో పరిశుద్ధాత్మ ద్వారా శక్తినిచ్చి ఆత్మీయంగా బలపరచాలని వేడుకొంటున్నాను. 17 అప్పుడు క్రీస్తు మీలో విశ్వాసం ఉండటం వల్ల మీ హృదయాల్లో నివసిస్తాడు. మీ వేర్లు ప్రేమలో నాటుక పోయేటట్లు చేయమనీ, మీ పునాదులు ప్రేమలో ఉండేటట్లు చేయమనీ ప్రార్థిస్తున్నాను. 18 అప్పుడు మీరు పవిత్రులతో సహా క్రీస్తు ప్రేమ ఎంత అనంతమైనదో, ఎంత లోతైనదో అర్థం చేసుకోకలుగుతారు. 19 జ్ఞానాన్ని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలని దేవునిలో ఉన్న పరిపూర్ణత మీలో కలగాలని నా ప్రార్థన.
20 దేవుడు మనమడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఎక్కువే యివ్వగలడు. ఇది మనలో పని చేస్తున్న ఆయన శక్తి ద్వారా సంభవిస్తోంది. 21 సంఘంలో యేసు క్రీస్తు ద్వారా దేవునికి చిరకాలం శాశ్వతమైన మహిమ కలుగుగాక! ఆమేన్.
© 1997 Bible League International