Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
15 యెహోవా, నీ పవిత్ర గుడారంలో ఎవరు నివసించగలరు?
నీ పవిత్ర పర్వతం మీద ఎవరు నివసించగలరు?
2 ఎవరైతే పరిశుద్ధ జీవితం జీవించగలరో, మంచి కార్యాలు చేయగలరో తమ హృదయంలో నుండి సత్యం మాత్రమే మాట్లాడుతారో
అలాంటి వ్యక్తులు మాత్రమే నీ పర్వతం మీద నివసించగలరు.
3 అలాంటి వ్యక్తి ఇతరులను గూర్చి చెడు సంగతులు మాట్లాడడు.
ఆ మనిషి తన పొరుగు వారికి కీడు చేయడు.
ఆ మనిషి తన స్వంత కుటుంబం గూర్చి సిగ్గుకరమైన విషయాలు చెప్పడు.
4 ఆ మనిషి దేవుని చేత నిరాకరింపబడిన ప్రజలను గౌరవించడు.
అయితే యెహోవాను సేవించేవారందరినీ ఆ మనిషి గౌరవిస్తాడు.
ఆ మనిషి గనుక తన పొరుగువానికి ఒక వాగ్దానం చేస్తే
అతడు ఏమి చేస్తానన్నాడో దాన్ని నెరవేరుస్తాడు.
5 ఆ మనిషి ఎవరికైనా అప్పిస్తే
అతడు దాని మీద వడ్డీ తీసుకోడు.
నిర్దోషులకు కీడు చేయుటకుగాను అతడు డబ్బు తీసుకోడు.
ఒక మనిషి ఆ మంచి వ్యక్తిలాగ జీవిస్తే, అప్పుడు ఆ మనిషి ఎల్లప్పుడూ దేవునికి సన్నిహితంగా ఉంటాడు.
లోతు బంధించబడ్డాడు
14 షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాసరు రాజు అర్యోకు, ఏలాం రాజు కదొర్లాయోమెరు, మరియు గోయీయుల రాజు తిదాలు. 2 ఈ రాజులంతా కలసి సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షా, అద్మా రాజైన షినాబు, సెబోయీయుల రాజైన షెమేబెరు, బెల (సోయరు అని కూడ బెల పిలవబడింది) రాజుతోను యుద్ధము చేశారు.
3 ఈ రాజులంతా సిద్దీము లోయలో వారి సైన్యాలతో కలుసుకున్నారు. (సిద్దీము లోయ యిప్పుడు ఉప్పు సముద్రం). 4 ఈ రాజులు పన్నెండు సంవత్సరాల పాటు కదొర్లాయోమెరుకు సేవ చేశారు. అయితే 13వ సంవత్సరంలో వారంతా అతని మీద తిరుగుబాటు చేశారు. 5 కనుక 14వ సంవత్సరంలో కదొర్లాయోమెరు రాజు, అతనితో ఉన్న రాజులు వీరిమీద యుద్ధం చేయటానికి వచ్చారు. కదొర్లొయోమెరు, అతనితో ఉన్న రాజులు అష్తారోతు కర్నాయిములో రఫాయి ప్రజలను ఓడించారు. హాములో జూజీయులను కూడా వారు ఓడించారు. షావే కిర్యతాయిములో ఏమీయులను వారు ఓడించారు. 6 శేయీరు[a] కొండ ప్రదేశం నుండి ఏల్పారాను వరకు హోరీయులను వారు ఓడించారు. (ఏల్పారాను ఎడారి దగ్గరగా ఉంది.) 7 తర్వాత కదొర్లాయోమెరు రాజు ఉత్తర దిశగా తిరిగి ఏన్మిష్పతు (అంటే కాదేషు)కు వెళ్లి, అమాలేకీ ప్రజలందర్నీ ఓడించాడు. అమోరీ ప్రజలను కూడా అతడు ఓడించాడు. హససోన్ తామారులో ఈ ప్రజలు నివసిస్తారు.
8 ఆ సమయంలో సొదొమ రాజు, గొమొర్రా రాజు, అద్మా రాజు, సెబోయీము రాజు, బెల రాజు (బెల అంటె సోయరు) కలసి వారి శత్రువుల మీద సిద్దీము లోయలో యుద్ధం చేయటానికి వెళ్లారు. 9 ఏలాము రాజు కదొర్లాయోమెరు, గోయీయుల రాజు తిదాలు, షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాసరు రాజు అర్యోకు మీద వారు యుద్ధము చేశారు. అందుచేత ఈ నలుగురు రాజులు ఆ ఐదుగురితో యుద్ధం చేశారు.
10 సిద్దీం లోయలో తారుతో నింపబడ్డ గుంటలు చాలా ఉన్నాయి. సొదొమ, గొమొర్రాల రాజులు వారి సైన్యాలు పారిపోయారు. చాలా మంది సైనికులు ఆ గుంటల్లో పడిపోయారు. అయితే మిగిలినవాళ్లు కొండల్లోకి పారిపోయారు.
11 కనుక సొదొమ, గొమొర్రా ప్రజల ఆస్తినంతా వారి శత్రువులు తీసుకుపోయారు. వారి బట్టలు, భోజనం అంతా తీసుకొని వారు వెళ్లిపోయారు. 12 అబ్రాము సోదరుని కుమారుడు లోతు సొదొమలో నివసిస్తుండగా శత్రువు అతణ్ణి బంధించాడు. అతని ఆస్తి మొత్తం తీసుకొని శత్రువు వెళ్లిపోయాడు. 13 పట్టుబడని లోతుయొక్క మనుష్యులలో ఒకడు అబ్రాము దగ్గరకు వెళ్లి జరిగినదాన్ని చెప్పాడు. అమ్మోరీవాడగు మమ్రే చెట్లదగ్గర అబ్రాము నివాసం చేస్తున్నాడు. మమ్రే, ఎష్కోలు, అనేరు ఒకరికి ఒకరు సహాయ ఒడంబడిక చేసుకొన్నారు. అబ్రాముకు సహాయం చేసేందుకు కూడ వారు ఒక ఒడంబడిక చేసుకొన్నారు.
అబ్రాము లోతును రక్షించుట
14 లోతు బంధించబడ్డాడని అబ్రాముకు తెలిసింది. కనుక అబ్రాము తన కుటుంబం అంతటిని సమావేశ పర్చాడు. వారిలో 318 మంది శిక్షణ పొందిన సైనికులు ఉన్నారు. అబ్రాము తన మనుష్యులకు నాయకత్వం వహించి, దాను పట్టణం వరకు శత్రువును పూర్తిగా తరిమివేశాడు. 15 ఆ రాత్రి అతడు, అతని మనుష్యులు శత్రువు మీద అకస్మాత్తుగా దాడి జరిపారు. వారు శత్రువును ఓడించి దమస్కుకు ఉత్తరాన హోబ వరకు వారిని తరిమివేశారు. 16 అప్పుడు అబ్రాము శత్రువు దొంగిలించిన వస్తువులన్నింటిని మరల వెనుకకు తీసుకొని వచ్చాడు. స్త్రీలను, సేవకులను, లోతును, అతని ఆస్తి అంతటిని అబ్రాము వెనుకకు తీసుకొని వచ్చాడు.
రైతు విత్తనాలు చల్లుటను గురించిన ఉపమానం
(మత్తయి 13:1-17; మార్కు 4:1-12)
4 అనేక గ్రామాల నుండి ప్రజలు యేసు దగ్గరకు వచ్చారు. ఒక పెద్ద గుంపు సమావేశమైంది. యేసు వాళ్ళకీ ఉపమానం చెప్పడం మొదలు పెట్టాడు:
5 “ఒక రైతు విత్తనాలు చల్లడానికి పొలానికి వెళ్ళాడు. అతడు విత్తనాలు చల్లుతుండగా కొన్ని విత్తనాలు దారిపై పడ్డాయి. వాటిని ప్రజలు త్రొక్కి వేసారు. పక్షులు వచ్చి వాటిని తిని వేసాయి. 6 మరికొన్ని విత్తనాలు మట్టి కొద్దిగా ఉన్న రాతి నేలపై పడ్డాయి. అవి మొలకెత్తాయి, కాని వాటికి తేమ దొరకనందువలన అవి వాడిపొయ్యాయి. 7 మరికొన్ని విత్తనాలు ముళ్ళ మొక్కల స్థలంలో పడ్డాయి. ఈ విత్తనాలతో పాటు ముళ్ళ మొక్కలు కూడా పెరిగి వాటిని పెరగనివ్వలేదు. 8 మరి కొన్ని విత్తనాలు సారవంతమైన భూమ్మీద పడ్డాయి. అవి మొలకెత్తి, పెరిగి పెద్దవై నూరు రెట్లు ఫలాన్నిచ్చాయి.”
ఈ విధంగా చెప్పి, “వినే వాళ్ళు జాగ్రత్తగా వినాలి” అని బిగ్గరగా అన్నాడు.
9 శిష్యులు, “ఈ ఉపమానానికి అర్థమేమిటని” ఆయన్ని అడిగారు.
10 యేసు, “దేవుని రాజ్యం యొక్క రహస్య జ్ఞానం తెలుసుకొనే అవకాశం మీకివ్వబడింది. కాని యితర్లకు, ఆ రహస్యం ఉపమానాలు ఉపయోగించి చెబుతాను. ఎందుకంటే,
‘వాళ్ళు చూస్తున్నట్లే వుండి
చూడలేరు,
వాళ్ళు వింటున్నదానిని
అర్థం చేసుకోలేరు.’(A)
© 1997 Bible League International