Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
138 దేవా, నా హృదయపూర్తిగా నేను నిన్ను స్తుతిస్తాను.
దేవుళ్లందరి యెదుట నేను నీ కీర్తనలు పాడుతాను.
2 దేవా, నీ పవిత్ర ఆలయం వైపు నేను సాగిలపడతాను.
నీ నామం, నీ నిజప్రేమ, నీ నమ్మకములను బట్టి నేను స్తుతిస్తాను.
నీ నామాన్ని, నీ వాక్యాన్ని అన్నిటికన్నా పైగా హెచ్చించావు.
3 దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను.
నీవు నాకు జవాబు ఇచ్చావు. నీవు నాకు బలం ఇచ్చావు.
4 యెహోవా, భూరాజులందరూ నిన్ను స్తుతించెదరు గాక!
నీవు చెప్పిన విషయాలను వారు విన్నారు.
5 ఆ రాజులు అందరూ యెహోవా మార్గాన్ని గూర్చి పాడాలి అని నేను ఆశిస్తున్నాను.
యెహోవా మహిమ గొప్పది.
6 దేవుడు గొప్పవాడు.
అయితే దీనులను గూర్చి దేవుడు శ్రద్ధ వహిస్తాడు.
గర్విష్ఠులు చేసే పనులు యెహోవాకు తెలుసు.
కాని ఆయన వారికి సన్నిహితంగా ఉండడు.
7 దేవా, నేను కష్టంలో ఉంటే నన్ను బ్రతికించుము.
నా శత్రువులు నా మీద కోపంగా ఉంటే నన్ను వారినుండి తప్పించుము.
8 యెహోవా, నీవు వాగ్దానం చేసిన వాటిని నాకు ఇమ్ము.
యెహోవా, నీ నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
యెహోవా, నీవు మమ్మల్ని చేశావు కనుక మమ్మల్ని విడిచిపెట్టవద్దు.
7 మహారాజు అహష్వేరోషు పాలనలో పన్నెండవ సంవత్సరం, నీసాను అనబడే మొదటి నెలలో హామాను తన కార్యక్రమానికి మంచి రోజును, నెలను ఎంచుకొనేందుకు చీటీలు వేశాడు. (ఆ రోజుల్లో ఈ చీటీలను “పూరు” అనేవారు). దాంట్లో అదారు అనబడే పన్నెండవ నెల ఎన్నిక చేయబడింది. 8 అప్పుడిక హామాను అహష్వేరోషు మహారాజు దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు: “మహారాజా, మీ సామ్రాజ్యంలోని అన్ని సామంత రాజ్యాల్లోనూ చెదురుమదురుగా ఒక జాతివాళ్లు వున్నారు. వాళ్లు ఆ దేశాల ప్రజలతో కలిసివుండక వేరుగా వుంటారు. వాళ్ల ఆచార సంప్రదాయాలు మిగిలిన ప్రజల వాటికి భిన్నమైనవి. వాళ్లు మహారాజు శాసనాలను పాటించరు. వాళ్లను మీ సామ్రాజ్యంలో ఉండనివ్వడం క్షేమ దాయకం కాదు.
9 “మహారాజు మన్నిస్తే నాదొక సలహా. ఆ జాతి ప్రజలను హతమార్చేందుకు ఆజ్ఞ జారీ చెయ్యండి. ఇందుకయ్యే ఖర్చుకుగాను నేను 10,000 వెండి నాణ్యాలు రాజ్య ఖజానాలో జమకడతాను. ఈ కార్య క్రమాన్ని నిర్వహించేవారికి వేతనాలు చెల్లించేందుకు ఈ మొత్తాన్ని వినియోగించవచ్చు.”
10 మహారాజు రాజముద్రిక ఉన్న ఉంగరాన్ని తీసి హామానుకు ఇచ్చాడు. హామాను అగాగీయుడైన హమ్మెదాతా కొడుకు. హామాను యూదులకు బద్ధ శత్రువు. 11 మహారాజు హామానుతో ఇలా అన్నాడు, “ఆ సొమ్ము నీ దగ్గరే వుంచుకో. ఆ జాతివాళ్ల విషయంలో నువ్వేమి చెయ్యదలచుకున్నావో చెయ్యి.”
12 అటు తర్వాత మొదటి నెల 13వ రోజున మహారాజుగారి లేఖకులు పిలువనంపబడ్డారు. వాళ్లు హామాను ఆజ్ఞలన్నింటినీ ఒక్కొక్క దేశపు భాషాలిపిలో వ్రాశారు. వాళ్లు వాటిని ఆయా ప్రజాబృందాల భాషల్లో వ్రాశారు. వాళ్లు మహారాజు సామంతులకు, ఆయా ప్రాంతాల పాలకులకు ఆ తాఖీదులు పంపారు. వాళ్లు ఆ తాఖీదులను మహారాజు పేరిట, మహారాజు ముద్రికతో పంపారు.
13 వార్తాహరులు ఆయా సామంత దేశాలకు యీ తాఖీదు పత్రాలను తీసుకెళ్లారు. యూదులందర్నీ చంపి వేయాలి, ఆ జాతి మొత్తాన్ని సర్వనాశనం చేయాలి, యిదీ మహారాజు ఆజ్ఞ. అంటే, యూదులందరూ పిల్లపాపలూ, యువతీ యువకులూ, ముసలి, వయస్సులో వున్నవాళ్లు, వయస్సు మళ్లినవాళ్లు, ఒక్కరోజులో హతమార్చ బడాలన్నమాట. ఆ రోజు అదారు అనబడే 12వ నెలలో 13వ రోజు అవుతుంది. ఆ ఆజ్ఞలో మరో అంశం యూదులకు చెందిన వస్తువులన్నింటినీ తీసేసు కోవడం. ఈలాగున ఆ తాఖీదు పత్రాలలో వ్రాయబడియున్నది.
14 ఆ ఆజ్ఞల ప్రతులు రాజశాసనంగా అందరికీ పంపబడ్డాయి. ఈ తాఖీదును అన్ని సామంత రాజ్యాల్లోనూ శాసనంగా చెల్లుబడి చెయ్యాలి, దాన్ని సామ్రాజ్యంలో అన్ని జాతుల ప్రజలకీ ప్రకటించాలి. 15 రాజాజ్ఞ మేరకు వార్తాహరులు హుటాహుటిగా బయల్దేరారు. రాజధాని నగరం షూషనులో కూడా యీ తాఖీదు ప్రతులు పంచబడ్డాయి. మహారాజూ, హామానూ మద్యం సేవిస్తూ కూర్చుండగా, అటు షూషను నగరం గందరగోళంలో మునిగిపోయింది.
22 “ఇశ్రాయేలు ప్రజలారా! ఇది వినండి. దేవుడు నజరేతు నివాసియైన యేసును, తాను ప్రత్యేకంగా నియమించాడన్న విషయం మీకు నిరూపించాలని ఆయన ద్వారా మహత్యాలు, అద్భుతాలు మీకోసం చేసాడు. సూచనలు చూపాడు. ఈ మహత్యాలు, అద్భుతాలు చేసినట్లు, సూచనలు చూపినట్లు మీకు ఇదివరకే తెలుసు. 23 దైవ సంకల్పానుసారం ఆయన దివ్య జ్ఞానానుసారం యేసు మీకు అప్పగింపబడ్డాడు. ఆ తర్వాత మీరు దుర్మార్గుల సహాయంతో ఆయనను సిలువకు వేసి, మేకులు కొట్టి ఆయన్ని చంపారు. 24 కాని దేవుడాయన్ని బ్రతికించాడు. ఆయనకు మరణవేదననుండి విముక్తి కలిగించాడు. మరణానికి ఆయన్ని బంధించి ఉంచటం చేతకాలేదు. 25 దావీదు యేసును గురించి ఈ విధంగా అన్నాడు:
‘ప్రభువును, నేను నా ముందు అన్ని వేళలా చూసాను.
నన్ను రక్షించటానికి ప్రభువు నా వెంట ఉన్నాడు!
26 అందుకే నా మాటల్లో
ఆనందం నిండియున్నది.
అందుకే నా దేహం ఆశతో జీవిస్తోంది.
27 ఎందుకంటే, నా ఆత్మను నీవు చనిపోయిన వాళ్ళతో వదిలివేయవు
నీవు నీ భక్తుని దేహాన్ని కుళ్ళనీయవు.
28 నాకు జీవపు దారుల్ని చూపావు!
నా వెంటే ఉండి నాకు ఆనందం కలిగించావు!’(A)
29 “సోదరులారా! మన వంశీయుడైన దావీదును గురించి నేనిది ఖచ్చితంగా చెప్పగలను. అతడు చనిపొయ్యాడు. అతణ్ణి సమాధి చేసారు. ఆ సమాధి ఈ నాటికీ ఉంది. 30 దావీదు ఒక ప్రవక్త. దావీదు వంశంలో పుట్టిన వాణ్ణొకణ్ణి సింహాసనంపై కూర్చోబెడ్తానని దేవుడు అతనికి ప్రమాణ పూర్వకంగా వాగ్దానం చేసాడు. ఇది దావీదుకు తెలుసు. 31 ఈ జరుగనున్న దాన్ని గురించి దావీదుకు ముందే తెలుసు. అందువల్లే అతడు క్రీస్తు బ్రతికి రావటాన్ని గురించి ఈ విధంగా అన్నాడు:
‘దేవుడు ఆయన్ని సమాధిలో వదిలివేయ లేదు.
ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు.’
క్రీస్తు సమాధినుండి లేచే విషయమై దావీదు మాటలాడుచూ ఉన్నాడు. 32 కావున దేవుడు ఈ యేసునే మృత్యువునుండి బ్రతికించినాడు. దీనికి మేమంతా సాక్ష్యము. 33 యేసు పరలోకానికి ఎత్తబడినాడు. ఇప్పుడు యేసు దేవునితో ఆయన కుడిప్రక్కన ఉన్నాడు. తండ్రి పరిశుద్ధాత్మను యేసుకు ఇచ్చాడు. దేవుడు ఇస్తానని వాగ్దానము చేసినది పరిశుద్ధాత్మయే. యేసు ఇప్పుడాయాత్మను ఇస్తున్నాడు. ఇదే మీరు వింటున్నది, చూస్తున్నది. 34-35 యేసులా దావీదు పరలోకానికి వెళ్ళలేదు. అయినా, అతడీవిధంగా అన్నాడు:
‘ప్రభువు నా ప్రభువుతో,
నేను నీ శత్రువుల్ని నీ పాదపీఠంగా చేసేవరకు
నీవు నా కుడివైపు కూర్చో!’(B)
36 “అందువల్ల ఇశ్రాయేలు ప్రజలందరూ యిది ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవుడు, మీరు సిలువకు వేసి చంపిన ఈ యేసును ప్రభువుగా, క్రీస్తుగా నియమించాడు.”
© 1997 Bible League International