Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
138 దేవా, నా హృదయపూర్తిగా నేను నిన్ను స్తుతిస్తాను.
దేవుళ్లందరి యెదుట నేను నీ కీర్తనలు పాడుతాను.
2 దేవా, నీ పవిత్ర ఆలయం వైపు నేను సాగిలపడతాను.
నీ నామం, నీ నిజప్రేమ, నీ నమ్మకములను బట్టి నేను స్తుతిస్తాను.
నీ నామాన్ని, నీ వాక్యాన్ని అన్నిటికన్నా పైగా హెచ్చించావు.
3 దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను.
నీవు నాకు జవాబు ఇచ్చావు. నీవు నాకు బలం ఇచ్చావు.
4 యెహోవా, భూరాజులందరూ నిన్ను స్తుతించెదరు గాక!
నీవు చెప్పిన విషయాలను వారు విన్నారు.
5 ఆ రాజులు అందరూ యెహోవా మార్గాన్ని గూర్చి పాడాలి అని నేను ఆశిస్తున్నాను.
యెహోవా మహిమ గొప్పది.
6 దేవుడు గొప్పవాడు.
అయితే దీనులను గూర్చి దేవుడు శ్రద్ధ వహిస్తాడు.
గర్విష్ఠులు చేసే పనులు యెహోవాకు తెలుసు.
కాని ఆయన వారికి సన్నిహితంగా ఉండడు.
7 దేవా, నేను కష్టంలో ఉంటే నన్ను బ్రతికించుము.
నా శత్రువులు నా మీద కోపంగా ఉంటే నన్ను వారినుండి తప్పించుము.
8 యెహోవా, నీవు వాగ్దానం చేసిన వాటిని నాకు ఇమ్ము.
యెహోవా, నీ నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
యెహోవా, నీవు మమ్మల్ని చేశావు కనుక మమ్మల్ని విడిచిపెట్టవద్దు.
మొర్దెకై ఒక కుట్రను కనిపెట్టుట
19 రెండవసారి యువతులందరూ ఒకచోట చేర్చబడినప్పుడు మొర్దెకై మహారాజు భవన ద్వారంవద్దనే కూర్చుని వున్నాడు. 20 తను యూదురాలనన్న విషయాన్ని ఎస్తేరు యింకా గుప్తంగానే వుంచింది. తన కుటుంబ గోత్రాలను గురించి ఆమె ఎవ్వరికీ చెప్పలేదు. అది ఆమెకు మొర్దెకై ఇచ్చిన ఆజ్ఞ. తను మొర్దెకై పెంపకంలో ఉన్నప్పటి మాదిరిగానే, యింకా ఆమె అతని ఆజ్ఞలను పాటిస్తోంది.
21 మొర్దెకై మహారాజు భవన ద్వారం దగ్గర కూర్చున్న సమయంలో జరిగిన విషయం ఇది: బిగ్తాను, తెరెషు అనే యిద్దరు రాజభవన ద్వార పాలకులు మహారాజువట్ల కుపితులై అహష్వేరోషు మహారాజును హతమార్చాలని కుట్ర పన్నుతున్నారు. 22 అయితే, మొర్దెకై ఈ కుట్ర పథకాలను కనిపెట్టి ఎస్తేరు మహారాణికి ఈ విషయం చెప్పాడు. అప్పుడీ విషయాన్ని ఆమె మహారాజుకి చెప్పింది. ఈ కుట్రను గురించి తెలుసుకున్నది మొర్దెకై అని కూడా ఆమె మహారాజుకు చెప్పింది. 23 తర్వాత ఆ విషయమై విచారణ చేయబడింది. విచారణలో మొర్దెకై చెప్పిన సమాచారం సరైనదేనని తేలింది. మహారాజును హత్యచేయాలని దుష్ట వథకం వేసిన ద్వారపాలకులిద్దరూ ఉరితీయబడ్డారు. మహారాజు సమక్షంలోనే యీ విషయాలన్నీ మహారాజుల చరిత్ర విశేషాల గ్రంథంలో నమోదు చేయబడ్డాయి.
యూదుల వినాశనానికి హామాను పథకం
3 ఈ సంఘటనల తర్వాత అహష్వేరోషు మహారాజు హామానుకు గౌరవనీయ స్థానం ఇచ్చాడు. అగాగీయుడైన హామాను హమ్మెదాతా కొడుకు. మహారాజు హామానుకు ఉన్నత పదవి ఇచ్చి, అతన్ని మిగిలిన అధికారులందరికంటె ఉన్నత స్థానంలో ఉంచాడు. 2 రాజభవన ద్వారం దగ్గర వుండే అధికారులందరూ హామానుకు మోకరిల్లి, నమస్కరించాలని మహారాజు ఆజ్ఞ జారీ చేశాడు. అధికారులందరూ ఈ ఆజ్ఞను పాటించేవారు. అయితే, మొర్దెకై మాత్రం మోకరిల్లేందుకూ, గౌరవాభివందనం చేసేందుకూ నిరాకరించాడు. 3 అప్పుడు ద్వారం దగ్గరి ఉద్యోగులు మొర్దెకైని “హామాను ముందు మోకరిల్లాలన్న మహారాజు ఆజ్ఞను నువ్వెందుకు పాటించడం లేదు?” అని ప్రశ్నించారు.
4 ఆ రాజోద్యోగులు ప్రతిరోజూ మొర్దెకైతో ఈ విషయమై ప్రస్తావించేవారు. అయితే, హామాను ముందు మోకరిల్లాలన్న ఆజ్ఞను పాటించేందుకు మొర్దెకై తిరస్కరిస్తూ వచ్చాడు. దానితో, ఆ ఉద్యోగులు ఈ విషయాన్ని హామానుకు తెలియ జెప్పారు. మొర్దెకై విషయంలో హామాను ఏమి చేస్తాడో చూద్దామనుకున్నారు. తను యూదుడనన్న విషయాన్ని మొర్దెకై ఆ ఉద్యోగులకు చెప్పాడు. 5 మొర్దెకై తన ముందు మోకరిల్లి, గౌరవాభివందనం చేసేందుకు నిరాకరించాడని విన్న హామాను చాలా కోపం చెందాడు. 6 మొర్దెకై యూదుడు అన్న విషయం హామానుకు తెలిసింది. అయితే, ఒక్క మొర్దెకైని మాత్రమే చంపడం అతనికి తృప్తికరంగా కనిపించలేదు. మొర్దెకై జాతీయులందర్నీ, అంటే, అహష్వేరోషు సామ్రాజ్యంలోని రాజ్యాలన్నింట్లో గల యూదులందర్నీ సమూలంగా నాశనం చేసే మార్గం వెదక నారంభించాడు.
15 ఒక రోజు భక్తులందరూ సమావేశం అయ్యారు. వాళ్ళ సంఖ్య నూట ఇరవై. పేతురు మాట్లాడటానికి లేచి నిలుచున్నాడు. 16 అతడు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నా సోదరులారా! చాలా కాలం క్రిందటే పవిత్రాత్మ యూదాను గురించి దావీదు నోటి ద్వారా పలికాడు. లేఖనాల్లో వ్రాయబడిన ఈ విషయాలు తప్పక జరుగవలసినవి. ఈ యూదా యేసును బంధించిన వాళ్ళకు దారి చూపాడు. 17 యూదా మాలో ఒకడు. మాతో కలిసి సేవ చెయ్యటానికి ఎన్నుకోబడ్డవాడు.”
18 యూదా చేసిన ఈ కుట్రకు అతనికి డబ్బు దొరికింది. ఆ డబ్బుతో ఒక భూమి కొనబడింది. ఆ తర్వాత యూదా తలక్రిందుగా పడిపోయాడు. అతని దేహం చీలిపోయి ప్రేగులు బయటపడ్డాయి. 19 యెరూషలేములోని వాళ్ళంతా దీన్ని గురించి విన్నారు. అందువలన తమ భాషలో ఆ భూమిని అకెల్దమ అని పిలిచేవాళ్ళు. దీని అర్థం “రక్తపు భూమి.”
20 పేతురు యింకా ఈ విధంగా అన్నాడు: “దీన్ని గురించి కీర్తనల గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడివుంది:
‘అతని భూమిని పాడు పడనిమ్ము
అక్కడెవ్వరూ నివసించకుండా పోనిమ్ము.’(A)
‘అతని స్థానాన్ని యింకొకడు ఆక్రమించనిమ్ము!’(B)
© 1997 Bible League International