Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 15

దావీదు కీర్తన.

15 యెహోవా, నీ పవిత్ర గుడారంలో ఎవరు నివసించగలరు?
    నీ పవిత్ర పర్వతం మీద ఎవరు నివసించగలరు?
ఎవరైతే పరిశుద్ధ జీవితం జీవించగలరో, మంచి కార్యాలు చేయగలరో తమ హృదయంలో నుండి సత్యం మాత్రమే మాట్లాడుతారో
    అలాంటి వ్యక్తులు మాత్రమే నీ పర్వతం మీద నివసించగలరు.
అలాంటి వ్యక్తి ఇతరులను గూర్చి చెడు సంగతులు మాట్లాడడు.
    ఆ మనిషి తన పొరుగు వారికి కీడు చేయడు.
    ఆ మనిషి తన స్వంత కుటుంబం గూర్చి సిగ్గుకరమైన విషయాలు చెప్పడు.
ఆ మనిషి దేవుని చేత నిరాకరింపబడిన ప్రజలను గౌరవించడు.
    అయితే యెహోవాను సేవించేవారందరినీ ఆ మనిషి గౌరవిస్తాడు.
ఆ మనిషి గనుక తన పొరుగువానికి ఒక వాగ్దానం చేస్తే
    అతడు ఏమి చేస్తానన్నాడో దాన్ని నెరవేరుస్తాడు.
ఆ మనిషి ఎవరికైనా అప్పిస్తే
    అతడు దాని మీద వడ్డీ తీసుకోడు.
నిర్దోషులకు కీడు చేయుటకుగాను అతడు డబ్బు తీసుకోడు.
    ఒక మనిషి ఆ మంచి వ్యక్తిలాగ జీవిస్తే, అప్పుడు ఆ మనిషి ఎల్లప్పుడూ దేవునికి సన్నిహితంగా ఉంటాడు.

ఆదికాండము 12:10-20

ఈజిప్టులో అబ్రాము

10 ఆ కాలంలో భూమి చాలా ఎండిపోయింది. వర్షం లేదు కనుక ఏ పంటా పెరగటం లేదు. కనుక అబ్రాము నివసించటానికి ఈజిప్టుకు వెళ్లాడు. 11 తన భార్య శారయి చాలా అందంగా ఉండటం అబ్రాము గమనించాడు. కనుక వారు ఈజిప్టు చేరకముందే అబ్రాము శారయితో ఇలా చెప్పాడు: “నీవు చాలా అందమైన స్త్రీవని నాకు తెలుసు. 12 ఈజిప్టీయులు నిన్ను చూస్తారు. ఈ స్త్రీ అతని భార్య అని వాళ్లు అంటారు. తర్వాత వాళ్లు నిన్ను ఆశించి నన్ను చంపేస్తారు. 13 కనుక నీవు నా సోదరివి అని ప్రజలతో చెప్పు. అప్పుడు వాళ్లు నన్ను చంపరు. నేను నీ సోదరుణ్ణి అని అనుకొంటారు గనుక వాళ్లు నామీద దయ చూపిస్తారు. ఈ విధంగా నీవు నా ప్రాణం కాపాడుతావు.”

14 కనుక అబ్రాము తన భార్యతో ఈజిప్టు దేశంలో ప్రవేశించాడు. శారయి చాలా అందగత్తె అని ఈజిప్టు ప్రజలు చూశారు. 15 ఈజిప్టు నాయకులు కూడ కొందరు ఆమెను చూశారు. ఆమె చాలా అందగత్తె అని ఫరోతో వాళ్లు చెప్పారు. ఆ నాయకులు శారయిని ఫరో యింటికి తీసుకెళ్లారు. 16 శారయికి అబ్రాము సోదరుడు అనుకొని ఫరో అబ్రాము మీద దయ చూపించాడు. గొర్రెలు, పశువులు, గాడిదలను ఫరో అబ్రాముకు ఇచ్చాడు. సేవకులు, సేవకురాండ్రు, ఒంటెలను కూడా అబ్రాముకు ఇచ్చాడు.

17 అబ్రాము భార్యను ఫరో తీసుకొన్నాడు. కనుక ఫరోకు అతని ఇంటిలోని మనుష్యులందరికి చాలా తీవ్రమైన రోగాలు వచ్చేటట్లు యెహోవా చేశాడు. 18 అందుచేత ఫరో అబ్రామును పిలిచాడు. ఫరో ఇలా అన్నాడు, “నీవు నాకు చాలా అపకారం చేశావు. శారయి నీ భార్య అని నాతో ఎందుకు నీవు చెప్పలేదు? 19 ఈమె నీ సోదరి అని చెప్పావు. నీవు ఎందుకలా చెప్పావు? ఆమె నా భార్యగా ఉండాలని అమెను నేను తీసుకొన్నాను. అయితే ఇప్పుడు నీ భార్యను మరల నేను నీకు ఇచ్చేస్తున్నాను. ఆమెను తీసుకొని వెళ్లిపో!” 20 తర్వాత అబ్రామును ఈజిప్టు నుండి పంపించి వేయమని ఫరో తన మనుష్యులకు ఆజ్ఞాపించాడు. కనుక అబ్రాము, అతని భార్య ఆ స్థలం విడిచి వెళ్లిపోయారు. వాళ్లకు ఉన్న సమస్తాన్ని తీసుకొని వెళ్లిపోయారు.

హెబ్రీయులకు 5:1-6

ఆధ్యాత్మిక విషయాల్లో, తమ పక్షాన పని చెయ్యటానికి ప్రజలు తమ నుండి ప్రధాన యాజకుని ఎన్నుకొంటారు. పాప పరిహారార్థం అర్పించే కానుకల్ని, బలుల్ని దేవునికి యితడు సమర్పిస్తాడు. ఇతనిలో కూడా ఎన్నో రకాల బలహీనతలు ఉంటాయి కనుక, అజ్ఞానంతో తప్పులు చేస్తున్న ప్రజల పట్ల యితడు సానుభూతి కనుబరుస్తాడు. ఈ కారణంగానే, ప్రజల పాపాలకు బలిని అర్పించినట్లే తన పాపాలకు కూడా బలిని అర్పించవలసి వుంటుంది.

ప్రధాన యాజకుని స్థానం గౌరవనీయమైంది. ఆ స్థానాన్ని ఎవ్వరూ, స్వయంగా ఆక్రమించలేరు. దేవుడు అహరోనును పిలిచినట్లే ఈ స్థానాన్ని ఆక్రమించటానికి అర్హత గలవాణ్ణి పిలుస్తాడు. క్రీస్తు ప్రధాన యాజకుని యొక్క గౌరవ స్థానాన్ని స్వయంగా ఆక్రమించలేదు. దేవుడాయనతో,

“నీవు నా కుమారుడవు.
    నేడు నేను నీకు తండ్రినయ్యాను”(A)

అని చెప్పి మహిమ పరచాడు. మరొక చోట, ఇలా అన్నాడు:

“నీవు మెల్కీసెదెకు వలె చిరకాలం
    యాజకుడవై ఉంటావు.”(B)

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International