Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
25 యెహోవా, నేను నీకు నన్ను అర్పించుకొంటాను.
2 నా దేవా, నేను నిన్ను నమ్ముకొంటున్నాను.
నేను నిరాశచెందను.
నాశత్రువులు నన్ను చూచి నవ్వరు.
3 నిన్ను నమ్ముకొనే ఏ మనిషి నిరాశచెందడు.
కాని నమ్మక ద్రోహులు నిరాశపడతారు.
వారికి ఏమీ దొరకదు.
4 యెహోవా, నీ మార్గాలు నేర్చుకొనుటకు నాకు సహాయం చేయుము.
నీ మార్గాలను ఉపదేశించుము.
5 నన్ను నడిపించి, నీ సత్యాలు నాకు ఉపదేశించుము.
నీవు నా దేవుడవు, నా రక్షకుడవు.
రోజంతా నేను నిన్ను నమ్ముతాను.
6 యెహోవా, నా యెడల దయ చూపుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
నీవు ఎల్లప్పుడూ చూపిస్తూ వచ్చిన ఆ ప్రేమను నా యెడల చూపించుము.
7 నేను యౌవ్వనంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు చెడు కార్యాలు జ్ఞాపకం చేసుకోవద్దు.
యెహోవా, నీ నామ ఘనతకోసం ప్రేమతో నన్ను జ్ఞాపకం చేసుకొనుము.
8 యెహోవా నిజంగా మంచివాడు.
జీవించాల్సిన సరైన మార్గాన్ని పాపులకు ఆయన ఉపదేశిస్తాడు.
9 దీనులకు ఆయన తన మార్గాలను ఉపదేశిస్తాడు.
న్యాయంగా ఆయన వారిని నడిపిస్తాడు.
10 యెహోవా ఒడంబడికను, వాగ్దానాలను అనుసరించే మనుష్యులందరికి
ఆయన మార్గాలు దయగలవిగా, వాస్తవమైనవిగా ఉంటాయి.
37 ఇది చాలా చక్కని తలంపులా కనబడింది ఫరోకు. అతని సేవకులంతా ఒప్పుకొన్నారు. 38 “ఈ పని చేసేందుకు యోసేపు కంటే మంచివాడ్ని ఇంకెవరినైనా మీరు కనుగొనగలరా? దేవుని ఆత్మ మూలంగా ఇతడు నిజంగా జ్ఞాని” అని ఫరో తన సేవకులతో చెప్పాడు.
39 కనుక ఫరో, “వీటన్నింటిని దేవుడే నీకు చూపెట్టాడు కనుక నీవు అందరిలో మహా జ్ఞానివై ఉండాలి. 40 అంచేత నిన్నే ఈ దేశం మీద అధిపతిగా నేను చేస్తాను. ప్రజలు నీ ఆజ్ఞలన్నింటికి విధేయులవుతారు. ఈ దేశంలో నేను ఒక్కడ్ని మాత్రమే నీకంటె గొప్ప అధికారిగా ఉంటాను” అని యోసేపుతో చెప్పాడు.
41 (ఫరో యోసేపును రాజ్యపాలకునిగా నియమించినప్పుడు ప్రత్యేక సమావేశం మరియు ఊరేగింపు ఉండినవి.) అప్పుడు ఫరో, “ఇప్పుడు ఈజిప్టు దేశం అంతటి మీద నిన్ను నేను పాలకునిగా నియమిస్తున్నాను” అని యోసేపుతో చెప్పాడు. 42 అప్పుడు ఫరో రాజముద్రగల తన ఉంగరాన్ని యోసేపుకు ఇచ్చాడు. యోసేపు ధరించటానికి నాణ్యతగల ఒక అంగీని అతడు ఇచ్చాడు. యోసేపు మెడలో ఒక బంగారు గొలుసు ఫరో వేశాడు. 43 రెండో రాజరథం మీద తిరగమని ఫరో యోసేపుతో చెప్పాడు. ప్రత్యేక సంరక్షకులు అతని రథానికి ముందర నడిచారు. “ప్రజలారా, యోసేపుకు సాష్టాంగపడండి” అంటూ వాళ్లు ప్రజలను హెచ్చరించారు. కనుక ఈజిప్టు దేశం అంతటి మీద యోసేపు పాలకునిగా నియమించబడ్డాడు.
44 అతనితో ఫరో అన్నాడు: “నేను ఫరోను అంటే రాజును. కనుక నేను ఏమి అయినా చేయాలనుకొంటే అది చేస్తాను. కానీ, ఈజిప్టులో మరి ఏ వ్యక్తి అయినా నీవు చెప్పకుండ ఒక చేయి ఎత్తకూడదు, కాలు కదపగూడదు.”
45 ఫరో యోసేపుకు జప్నత్పనేహు అనే మరో పేరు పెట్టాడు. ఓను యాజకుడు పోతీఫెర కుమార్తె ఆసెనతును యోసేపుకు భార్యగా ఫరో ఇచ్చాడు. కనుక ఈజిప్టు దేశం అంతటిమీద యోసేపు పాలకుడయ్యాడు.
46 యోసేపు ఈజిప్టు రాజు కొలువులో పని చేయడం మొదలు బెట్టినప్పుడు అతని వయస్సు 30 సంవత్సరాలు. యోసేపు ఈజిప్టు దేశం అంతటా సంచారం చేశాడు. 47 ఏడు మంచి సంవత్సరాల కాలంలోనూ దేశంలో పంటలు బాగుగా పండాయి. 48 ఆ ఏడు సంవత్సరాల్లో యోసేపు చాలా ధాన్యం ఈజిప్టులో పొదుపు చేశాడు. ఆహారాన్ని యోసేపు పట్టణాల్లో భద్రపరచాడు. ప్రతి పట్టణం చుట్టు ప్రక్కల పండిన పంటను ఆ పట్టణంలోనే యోసేపు భద్రపరచాడు. 49 యోసేపు విస్తారంగా ధాన్యం చేర్చి పెట్టాడు. సముద్రపు ఇసుకలా ఉంది అదంతాను. కొలిచేందుకు గూడ వీలు లేనంత విస్తారంగా ఉంది అతడు చేర్చిపెట్టిన ధాన్యం.
9 “వీళ్ళకు, తమలో ఒకడైన యోసేపు మీద ఈర్ష్య ఉండేది. అందువల్ల వాళ్ళతణ్ణి ఈజిప్టు దేశానికి బానిసగా అమ్మేసారు. కాని దేవుడతనికి అండగా ఉండి, 10 అతణ్ణి కష్టాలనుండి రక్షించాడు. అతనికి జ్ఞానాన్ని యిచ్చాడు. ఆ జ్ఞానంతో అతడు ఈజిప్టు రాజైన ‘ఫరో’ అభిమానాన్ని సంపాదించాడు. ఫరో అతణ్ణి ఈజిప్టు దేశానికి పాలకునిగా, తన రాజభవనాలకు అధికారిగా నియమించాడు. 11 ఇంతలో ఈజిప్టు, కనాను దేశాల్లో కరువు రాగా ప్రజలు చాలా కష్టాలనుభవించారు. మన పూర్వికులకు తినటానికి తిండి కూడా లేకుండింది.
12 “ఈజిప్టు దేశంలో ధాన్యం ఉందని తెలియగానే యాకోబు మన పూర్వికుల్ని మొదటి సారిగా అక్కడకు పంపాడు. 13 రెండవసారి వచ్చినప్పుడు, యోసేపు తానెవ్వరన్న విషయం తన సోదరులకు చెప్పాడు. యోసేపు కుటుంబాన్ని గురించి ఫరోకు తెలిసిపోయింది. 14 ఆ తర్వాత యోసేపు తన తండ్రి యాకోబును, డెభ్బై ఐదు మందిగల తన కుటుంబాన్ని పిలవనంపాడు. 15 యాకోబు ఈజిప్టు దేశానికి వచ్చాక, అతడు, మన పూర్వికులు అందరూ చనిపోయారు. 16 వాళ్ళ దేహాలు షెకెము పట్టణానికి తేబడ్డాయి. అబ్రాహాము యిదివరలో హమోరు వంశం వాళ్ళకు డబ్బిచ్చి వాళ్ళనుండి ఒక స్మశాన భూమిని కొని ఉంచాడు. వాళ్ళు అక్కడ సమాధి చేయబడ్డారు.
© 1997 Bible League International