Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 82

ఆసాపు స్తుతి కీర్తన.

82 దైవ సమాజంలో దేవుడు తన స్థానాన్ని తీసుకొన్నాడు. సమాజంలో దేవుడు నిలుచున్నాడు.
    ఆ దేవుళ్ళ సమాజంలో ఆయన తీర్పునిస్తాడు.
ప్రజలారా, “ఎంతకాలం మీరు అన్యాయపు తీర్పు తీరుస్తారు?
    దుర్మార్గులు శిక్షించబడకుండా ఎన్నాళ్లు తప్పించుకోనిస్తారు?” అని దేవుడు అంటున్నాడు.

“అనాధలను, పేద ప్రజలను కాపాడండి.
    న్యాయం జరగని పేద ప్రజల, అనాధుల హక్కులను కాపాడండి.
పేదలకు, నిస్సహాయ ప్రజలకు సహాయం చేయండి.
    దుర్మార్గుల బారినుండి వారిని రక్షించండి.

“ఏమి జరుగుతుందో ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు.
    వారు గ్రహించరు.
వారు చేస్తున్నది ఏమిటో వారికి తెలియదు.
    వారి ప్రపంచం వారి చుట్టూరా కూలిపోతుంది.”
నేను (దేవుడు) మీతో చెప్పాను,
    “మీరు దైవాలు, మీరందరూ సర్వోన్నతుడైన దేవుని కుమారులు.
కాని మనుష్యులందరూ మరణించినట్టుగానే మీరు కూడా మరణిస్తారు.
    ఇతర నాయకులందరి వలెనే మీరు కూడా మరణిస్తారు.”

దేవా, లెమ్ము. నీవే న్యాయమూర్తివిగా ఉండుము!
    దేవా, రాజ్యములన్నీ నీకు చెందినవే.

1 సమూయేలు 5

పవిత్ర పెట్టె మూలంగా ఫిలిష్తీయులకు కష్టకాలం

ఫిలిష్తీయులు దేవుని పవిత్ర పెట్టెను ఎబెనెజరు నుంచి అష్డోదుకి తీసుకుని వెళ్లారు. దేవుని పవిత్ర పెట్టెను వారు దాగోను[a] దేవాలయంలోనికి తీసుకుని పోయి దాగోను విగ్రహం పక్కన వుంచారు. అష్డోదు ప్రజలు ఆ మరునాడు తెల్లవారుఝామునే లేచి దాగోను విగ్రహం బోర్లపడి వుండటం చూశారు. యెహోవా దేవుని పవిత్ర పెట్టె ముందు దాగోను విగ్రహం పడిపోయి ఉంది.

అష్డోదు ప్రజలు దాగోను విగ్రహాన్ని తిరిగి యధాస్థానంలో వుంచారు. కాని మరునాటి ఉదయం అష్డోదు ప్రజలు వచ్చి చూడగా దాగోను విగ్రహం మళ్లీ పడిపోయివుంది. దాగోను దేవుని పవిత్ర పెట్టెముందు పడిపోయివున్నాడు. ఈసారి దాగోను తల, చేతులు విరిగిపోయి ఆలయ గుమ్మం మీద పడి ఉన్నాయి. దాగోను మొండెం మాత్రం ఒక్క ముక్కగా మిగిలింది. అందువల్ల ఈ నాటికీ దాగోను యాజకులు గాని, ఇతరులుగాని అష్డోదులో దాగోను ఆలయం గడప తొక్కేందుకు నిరాకరిస్తారు.

అష్డోదు ప్రజలకు, వారి ఇరుగు పొరుగు గ్రామాల వారికి యెహోవా తీవ్రంగా శిక్ష విధించాడు. బహు కష్టాలపాలు చేశాడు. వారంతా శరీరం నిండా గడ్డలు కలిగి బాధపడ్డారు. వారి మీదికి ఎలుకల దండును పంపించాడు. వాళ్ల ఓడలలోను, పంట పొలాల్లోను ఎలుకలు విపరీతంగా తిరగటం ప్రారంభించాయి. నగర వాసులంతా భయభ్రాంతులయ్యారు. అష్డోదు ప్రజలు అక్కడ జరుగుతున్నదంతా బాగా గమనించారు. “మనల్ని, మన దైవం దాగోనును బాగా శిక్షిస్తూవుంది గనుక, ఇశ్రాయేలు దేవుని పవత్ర పెట్టె ఇక ఏమాత్రం మనతో వుండరాదు.” అని అనుకున్నారు.

అష్డోదు ప్రజలు ఫిలిష్తీయుల పాలకులు ఐదుగురినీ ఒక్కచోటికి పిలువనంపారు. “ఇశ్రాయేలీయుల దేవుని పవిత్ర పెట్టె విషయంలో తాము ఏమి చేయాలని వారిని అడిగారు.”

అది విన్న పాలకులు, “ఇశ్రాయేలు దేవుని పవిత్ర పెట్టెను గాతునకు తరలించమనగా” వారలా చేశారు.

అలా ఫిలిష్తీయులు దేవుని పవిత్ర పెట్టెను గాతునకు తరలించిన పిమ్మట, యెహోవా ఆ నగరాన్ని కూడా శిక్షించాడు. ప్రజలు భయభ్రాంతులయ్యారు. గాతులో చిన్న, పెద్ద అందరినీ కలవరపెట్టాడు. వారికి కూడ శరీరం నిండా కంతులు, గడ్డలు లేచేలా చేశాడు. 10 కనుక ఫిలిష్తీయులు దేవుని పవిత్ర పెట్టెను ఎక్రోనుకు పంపించారు.

కానీ దేవుని పవిత్ర పెట్టె ఎక్రోనుకు చేరగానే అక్కడి ప్రజలు, “ఇశ్రాయేలు ప్రజల దేవుని పవిత్ర పెట్టెను మా ఎక్రోను నగరానికి ఎందుకు తీసుకుని వస్తున్నారు? మమ్ములనందరినీ మీరు చంపదలిచారా?” అంటూ అరవటం మొదలు పెట్టారు. 11 వారు ఫిలిష్తీయుల పాలకులనందరినీ ఒక్క చోటికి పిలిపించి “ఇశ్రాయేలు దేవుని పవిత్ర పెట్టె మమ్మల్నీ, ప్రజలందరినీ చంపకముందే దానిని యధాస్థానానికి పంపించి వేయమన్నారు.”

ఎక్రోనీయులు మిక్కిలి భీతి చెందియున్నారు. అక్కడ దేవుని దండన చాలా భయంకరంగా ఉంది. 12 చావగా మిగిలిన వారు శరీరంపై గడ్డలతో బాధపడ్డారు. ఎక్రోను ప్రజల అరుపులు ఆకాశాన్ని తాకు నట్లుగా ఉండెను.

హెబ్రీయులకు 10:32-39

మీకు కలిగిన ధైర్యసహనాల్ని కాపాడుకోండి

32 మీరు వెలిగింపబడిన రోజుల్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఆ రోజుల్లో మీరు ఎన్నో కష్టాలు అనుభవించారు. అయినా మీరు వాటిని సహించారు. 33 కొన్నిసార్లు మీరు అవమానాన్ని, హింసను బహిరంగంగా అనుభవించారు. మరికొన్నిసార్లు అవమానాన్ని, హింసను అనుభవించేవాళ్ళ ప్రక్కన నిలుచున్నారు. 34 అంతేకాక, చెరసాలల్లో ఉన్నవాళ్ళ పట్ల మీరు సానుభూతి చూపించారు. పైగా “మీ ఆస్తుల్ని” దోచుకొంటుంటే ఆనందంగా అంగీకరించారు. ఎందుకంటే, మీరు పొందిన ఆస్తి మీరు పోగొట్టుకొన్న ఆస్తికన్నా ఉత్తమమైనదని మీకు తెలుసు. అది శాశ్వతమైనదని కూడా మీకు తెలుసు.

35 అందువల్ల మీ విశ్వాసాన్ని వదులుకోకండి. దానికి మంచి ప్రతిఫలం లభిస్తుంది. 36 మీరు పట్టుదలతో ఉండాలి. దైవేచ్ఛ ప్రకారం నడుచుకోవాలి. ఆ తర్వాత దేవుడు, తాను వాగ్దానం చేసినదాన్ని ప్రసాదిస్తాడు. 37 ఎందుకంటే,

“త్వరలోనే వస్తున్నాడు, వస్తాడు,
    ఆలస్యం చెయ్యడు!
38 నీతిమంతులైన నా ప్రజలు
    నన్ను విశ్వసిస్తూ జీవిస్తారు.
కాని వాళ్ళలో ఎవరైనా వెనుకంజ వేస్తే
    నా ఆత్మకు ఆనందం కలుగదు.”(A)

39 కాని, మనం వెనుకంజ వేసి నశించిపోయేవాళ్ళలాంటి వారం కాదు. గాని విశ్వాసం ద్వారా రక్షంచబడేవాళ్ళ లాంటివారం.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International