Revised Common Lectionary (Complementary)
ఎజ్రాహివాడైన ఏతాను ధ్యానగీతం.
89 యెహోవా ప్రేమను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతాను.
ఆయన నమ్మకత్వం గూర్చి శాశ్వతంగా, ఎప్పటికీ నేను పాడుతాను!
2 యెహోవా, నీ ప్రేమ శాశ్వతంగా నిలుస్తుందని నేను నిజంగా నమ్ముతాను.
నీ నమ్మకత్వం ఆకాశాలవలె కొనసాగుతుంది!
3 దేవుడు చెప్పాడు, “నేను ఏర్పరచుకొన్న రాజుతో నేను ఒడంబడిక చేసుకొన్నాను.
నా సేవకుడైన దావీదుకు నేను ఒక వాగ్దానం చేసాను.
4 ‘దావీదూ, నీ వంశం శాశ్వతంగా కొనసాగేట్టు నేను చేస్తాను.
నీ రాజ్యాన్ని శాశ్వతంగా ఎప్పటికీ నేను కొనసాగింపజేస్తాను.’”
5 యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి ఆకాశాలు స్తుతిస్తున్నాయి.
పరిశుద్ధుల సమాజం నీ నమ్మకత్వం గూర్చి పాడుతుంది.
6 పరలోకంలో ఎవ్వరూ యెహోవాకు సమానులు కారు.
“దేవుళ్లు” ఎవ్వరూ యెహోవాకు సాటికారు.
7 యెహోవా పరిశుద్ధ దూతలను కలిసినప్పుడు
ఆ దేవ దూతలు భయపడి యెహోవాను గౌరవిస్తారు.
వారు ఆయన పట్ల భయముతో నిలబడుతారు.
8 సర్వశక్తిమంతుడైన యెహోవా, దేవా, నీ అంతటి శక్తిగలవారు ఒక్కరూ లేరు.
మేము నిన్ను పూర్తిగా నమ్మగలము.
9 ఉప్పొంగే మహా సముద్రపు అలలపై నీవు అధికారం చేస్తావు.
దాని కోపపు అలలను నీవు నిమ్మళింప జేయగలవు.
10 దేవా, నీవు రహబును[a] ఓడించావు.
నీ మహా శక్తితో, నీవు నీ శత్రువును ఓడించావు.
11 దేవా, ఆకాశంలోనూ, భూమి మీదనూ ఉన్న సర్వం నీదే.
ప్రపంచాన్నీ, అందులో ఉన్న సర్వాన్నీ నీవు చేశావు.
12 ఉత్తర దక్షిణాలను నీవే సృష్టించావు.
తాబోరు పర్వతం, హెర్మోను పర్వతం నీ నామాన్ని కీర్తిస్తాయి. స్తుతి పాడుతాయి.
13 దేవా, నీకు శక్తి ఉంది!
నీ శక్తి గొప్పది!
విజయం నీదే!
14 సత్యం, న్యాయం మీద నీ రాజ్యం కట్టబడింది.
ప్రేమ, నమ్మకత్వం నీ సింహాసనం ఎదుట సేవకులు.
15 దేవా, నమ్మకమైన నీ అనుచరులు నిజంగా సంతోషంగా ఉన్నారు.
వారు నీ దయ వెలుగులో జీవిస్తారు.
16 నీ నామం వారిని ఎల్లప్పుడూ సంతోష పరుస్తుంది.
వారు నీ మంచితనాన్ని స్తుతిస్తారు.
17 నీవే వారి అద్భుత శక్తివి,
వారి శక్తి నీ నుండే లభిస్తుంది.
18 యెహోవా, నీవే మమ్మల్ని కాపాడేవాడవు.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు మా రాజు.
మంచి కొమ్మ
14 ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది: “నేను ఇశ్రాయేలు, యూదా ప్రజలకు ఒక ప్రత్యేకమైన వాగ్దానం చేసియున్నాను. నేనిచ్చిన మాట నెరవేర్చుకునే సమయం ఆసన్నమవుతూ వుంది. 15 ఆ సమయంలో దావీదు వంశం నుండి ఒక మంచి ‘కొమ్మ’ చిగురించి పెరిగేలా చేస్తాను. ఆ మంచి ‘కొమ్మ’ (రాజు) దేశానికి ఏది మంచిదో, ఏది నీతి దాయకమో అది చేస్తుంది. 16 ఈ ‘కొమ్మ’ చిగిర్చిన కాలంలో యూదా ప్రజలు రక్షింపబడతారు. యెరూషలేములో ప్రజలు సురక్షితంగా జీవిస్తారు. ఈ కొమ్మ పేరు ‘యెహోవాయే మా నీతి.’”
17 యెహోవా ఇలా చెపుతున్నాడు, “దావీదు వంశంలోని ఒక వ్యక్తి సదా సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలీయులను పరిపాలిస్తాడు. 18 లేవీయుల వంశంలోనివారే ఎల్లప్పుడూ యాజకులుగా ఉంటారు. ఆ యాజకులు సదా నా ఎదుట నిలచి నాకు దహన బలులు, ధాన్యార్పణలు, బలులు అర్పిస్తారు.”
19 యిర్మీయాకు యెహోవా నుండి ఈ వర్తమానం వచ్చింది. 20 యెహోవా ఇలా అన్నాడు: “నాకు రాత్రింబవళ్లతో ఒక ఒడంబడిక ఉంది. అవి అలా ఎల్లప్పుడూ సరైన సమయంలో వస్తాయి. ఆ ఒడంబడికను మీరు మార్చలేరు! దివారాత్రులు క్రమం తప్పక అలా వస్తూనే ఉంటాయి. మీరా నిబంధన మార్చగల్గిననాడు, 21 నా సేవకుడైన దావీదు, నా సేవకులైన లేవీయులతో యాజకులతో నా ఒడంబడికను కూడా మార్చగల్గుతారు. అప్పుడు దావీదు వంశంలోని వారు రాజులు కాలేరు. లేవీ వంశం వారు యాజకులు కాలేరు. 22 కాని నేను నా సేవకుడైన దావీదు వంశం, లేవీ వంశం అభివృద్ధి పొందేలా చేస్తాను. ఆకాశంలో నక్షత్రాల్లా వారి సంతతి వృద్ధి పొందుతుంది. ఆ నక్షత్రాలను ఎవ్వరూ లెక్కపెట్టలేరు. మరియు వారి సంతానం సముద్ర తీరాన గల ఇసుక రేణువుల్లా వృద్ధి పొందుతుంది. ఆ ఇసుక రేణువులను ఎవ్వరూ లెక్క పెట్టలేరు.”
23 యిర్మీయా ఈ వర్తమానాన్ని యెహోవా నుండి విన్నాడు: 24 “యిర్మీయా, ప్రజలేమనుకుంటున్నారో నీవు విన్నావా? ‘యెహోవా ఇశ్రాయేలు, యూదా రెండు వంశాల వారికి విముఖుడయ్యాడు. యెహోవా వారిని ముందు ఎన్నుకున్నాడు. కాని ఇప్పుడాయన వారిని తిరస్కరించాడు.’ వారు మా ప్రజలను ఎంతగా ద్వేషస్తున్నారంటే, మా ప్రజలు ఒక రాజ్యంగా కూడా అంగీకరించటం లేదు.”
25 అయితే యెహోవా ఇలా అంటున్నాడు: “దివారాత్రులతో నా ఒడంబడిక కొనసాగకపోతే, భూమ్యాకాశాలకు సంబంధించిన న్యాయసూత్రాలను నేను చేయకపోతే, బహుశః నేనా ప్రజలను వదిలి వేస్తాను. 26 బహుశః అప్పుడు యాకోబు సంతతి నుండి నేను దూరంగా ఉంటాను. బహుశః అప్పుడే నేను దావీదు వంశం వారు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు సంతతి వారిని ఏలకుండా చేస్తాను. కానీ నిర్బంధంలో నుండి వారిని మరలా వారి స్వదేశానికి తెస్తాను. ఆ ప్రజల పట్ల దయగలిగి ఉంటాను.”
నమ్మదగిన సేవకుడు ఎవరు
(మత్తయి 24:45-51)
41 పేతురు, “ప్రభూ! మీరీ ఉపమానం మాకోసం చెబుతున్నారా లేక అందరి కోసమా?” అని అడిగాడు.
42 ప్రభువు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “తెలివిగల ఉత్తమ సేవకుడు ఎవడు? ఆ యజమాని తిరిగి వచ్చినప్పుడు తాను విశ్వసించగల వాణ్ణి, తెలివి గలవాణ్ణి తన యితర సేవకులకు సరియైన ఆహారం ఇవ్వటానికి వాళ్ళపై అధికారిగా నియమిస్తాడు. 43 ఆ యజమాని వచ్చినప్పుడు, అతడు చెప్పిన విధంగా నడుచుకొన్న సేవకుడు ధన్యుడు. 44 ఇది నిజం. ఆ యజమాని అతణ్ణి తన ఆస్థికంతటికి అధికారిగా నియమిస్తాడు.
45 “కాని ఒకవేళ ఆ సేవకుడు తనలో తాను, ‘నా యజమాని త్వరలో రాడు’ అని అనుకొని తన క్రింద పనిచేసేవాళ్ళను ఆడా మగా అనే భేదం లేకుండా కొట్టి, తిని త్రాగటం మొదలు పెడతాడనుకోండి. 46 యజమాని ఆ సేవకుడు ఎదురుచూడని రోజున అనుకోని సమయంలో వచ్చి ఆ సేవకుణ్ణి నరికించి భక్తిహీనుల గుంపులో చేరుస్తాడు.
47 “తన యజమాని మనస్సు తెలిసి కూడా, అతని యిష్టానుసారం పని చెయ్యని సేవకుడికి ఎక్కువ దెబ్బలు తగులుతాయి. 48 కాని తెలియక శిక్షార్హమైన పనులు చేసిన వాడికి తక్కువ దెబ్బలు తగులుతాయి. దేవుడు తాను ఎక్కువగా యిచ్చిన వాళ్ళనుండి ఎక్కువ కోరుతాడు. ఎక్కువ అప్పగించినవాళ్ళ నుండి యిచ్చిన దానికన్నా ఎక్కువ ఆశిస్తాడు.
© 1997 Bible League International