Revised Common Lectionary (Complementary)
113 యెహోవాను స్తుతించండి!
యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి!
యెహోవా నామాన్ని స్తుతించండి.
2 ఇప్పుడు, ఎల్లప్పుడూ, యెహోవా నామము స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
3 తూర్పున ఉదయించే సూర్యుడి దగ్గర్నుండి,
సూర్యుడు అస్తమించే స్థలం వరకు యెహోవా నామం స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
4 యెహోవా జనాలన్నింటికంటె ఉన్నతమైనవాడు.
ఆయన మహిమ ఆకాశాలంత ఉన్నతం.
5 ఏ మనిషి మన యెహోవా దేవునిలా ఉండడు.
దేవుడు పరలోకంలో ఉన్నతంగా కూర్చుంటాడు.
6 ఆకాశాలను, భూమిని దేవుడు చూడాలంటే
ఆయన తప్పక కిందికి చూడాలి.
7 దేవుడు పేదవారిని దుమ్ములో నుండి పైకి లేపుతాడు.
భిక్షగాళ్లను చెత్తకుండీలో నుండి బయటకు తీస్తాడు.
8 ఆ మనుష్యులను దేవుడు ప్రముఖులుగా చేస్తాడు.
ఆ మనుష్యులను దేవుడు ప్రముఖ నాయకులుగా చేస్తాడు.
9 ఒక స్త్రీకి పిల్లలు లేకపోవచ్చును.
కాని దేవుడు ఆమెకు పిల్లలను ఇచ్చి ఆమెను సంతోషపరుస్తాడు.
యెహోవాను స్తుతించండి!
పనికిరాని చెత్తవంటి ఇశ్రాయేలు
17 యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు, 18 “నరపుత్రుడా, వెండితో పోల్చినప్పుడు కంచు, ఇనుము, సీసము, తగరము మొదలైనవి చాలా విలువతక్కువ లోహాలు. పనివారు వెండిని శుద్ధి చేయటానికి అగ్నిలో వేస్తారు. కరిగిన వెండి నుంచి పనివారు అలా మైలను వేరు చేస్తారు. ఇశ్రాయేలు దేశం అలా వేరు చేయబడిన మలిన పదార్థంలా తయారయ్యింది. 19 కావున ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, ‘మీ ప్రజలంతా పనికిరాని చెత్తలా తయారయ్యారు. అందువల్ల మిమ్మల్నందరినీ యెరూషలేముకు చేర్చుతాను. 20 పనివారు వెండిని, కంచును, ఇనుమును, సీసాన్ని, తగరాన్ని నిప్పులో వేసి, నిప్పురగిలేలా కొలిమి వూదుతారు. లోహాలు కరగటం మొదలు పెడతాయి. అదేమాదిరి, మిమ్మల్ని నా అగ్నిలో వేసి కరగబెడతాను. నా రగిలే కోపమే ఆ నిప్పు. 21 ఆ నిప్పులో మిమ్మల్ని వేస్తాను. నా కోపాగ్నిని బాగా రగిలేలా చేస్తాను. అప్పుడు మీరు కరగటం మొదలు పెడతారు. 22 వెండి నిప్పులో కరుగుతుంది. పనివారు శుద్ధ వెండిని వేరుచేసి దానిని భద్రపరుస్తారు. అదేమాదిరి మీరు నగరంలో కరుగుతారు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు. నా కోపాన్ని మీమీద క్రుమ్మరించానని మీరు తెలుసుకొంటారు.’”
యెహెజ్కేలు యెరూషలేముకు వ్యతిరేకంగా మాట్లాడుట
23 యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా చెప్పాడు, 24 “నరపుత్రుడా, ఇశ్రాయేలుతో మాట్లాడుము. ఆమె పవిత్రురాలు కాదని నీవామెతో చెప్పుము. నేను ఆ రాజ్యాల మీద కోపంగావున్నాను. అందువల్ల ఆ రాజ్యంలో వానలు పడవు. 25 యెరూషలేములోని ప్రవక్తలు కుట్రలు పన్నుతున్నారు. తను తినదల్చిన జంతువును పట్టుకున్నప్పుడు గర్జించు సింహంలా వారున్నారు. ఆ ప్రవక్తలు ఎన్నో జీవితాలను నాశనం చేశారు. వారెన్నో విలువైన వస్తువులను తీసుకున్నారు. యెరూషలేములో ఎందరో స్త్రీలు విధవలు కావటానికి వారు కారకులయ్యారు.
26 “యాజకులు నా ధర్మ బోధనలను నిజంగా గాయపర్చారు. వారు నా పవిత్ర వస్తువులను మైల చేశారు. వారు వాటిని ముఖ్యమైనవిగా పరిగణించరు. పవిత్ర వస్తువులను అతి సామాన్యమైనవిగా చూస్తారు. శుభ్రమైన వస్తువులను వారు మురికైనవిగా చూస్తారు. ఈ విషయాలను గూర్చి వారు ప్రజలకు బోధించరు. నేను నిర్దేశించిన ప్రత్యేక విశ్రాంతి రోజులను వారు గౌరవించి పాటించరు. నేను వారివల్ల తృణీకరించబడ్డాను.
27 “తాను పట్టిన జంతువును తీంటున్న తోడేలులా ఇశ్రాయేలు నాయకులు వున్నారు. వారు ధనవంతులు కావాలనే కోర్కెతో ఆ నాయకులు ప్రజలను చంపివేస్తారు.
28 “ప్రవక్తలు ప్రజలను హెచ్చరించరు. వారు నిజాన్ని దాచివేస్తారు. వారు గోడ నిర్మాణం చేయకుండా, పగుళ్లపై బంకమట్టి పూసే పనివారిలావుంటారు. వారి కండ్లకు కేవలం అబద్ధాలే కన్పిస్తాయి. భవిష్యత్తును తెలుసుకొనటానికి వారు మంత్ర తంత్రాలను వినియోగిస్తారు. అయినా వారు అబద్ధాలు మాత్రమే చెపుతారు. వారు, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు’ అని అంటారు. కాని వారు అబద్ధ మాడుచున్నారు. యెహోవా వారితో మాట్లాడలేదు!
29 “సామాన్య ప్రజలు ఒకరికొకరు అన్యాయం చేసుకుంటారు. ఒకరి నొకరు మోసపుచ్చుకుని, ఒకరి సొమ్ము నొకరు దొంగిలించుకుంటారు. వారు పేదలను, ఆసరాగా పెట్టుకొని ధనవంతులవుతారు. వారితో నివసిస్తున్న పరదేశీయులను మోసగిస్తారు. వాళ్లకు ఎప్పుడూ న్యాయంగా ఉండరు.
30 “తమ జీవిత విధానాన్ని మార్చుకొని, తమ దేశాన్ని రక్షించుకోమని నేను ప్రజలకు హితవు చెప్పాను. గోడలను పటిష్ట పర్చమని నేను ప్రజలకు చెప్పాను. బీటలు వారిన గోడలవద్ద నిలబడి, తమ నగర పరిరక్షణకు పోరాడమని చెప్పాను. కాని ఏ ఒక్కడు సహాయపడటానికి ముందుకు రాలేదు! 31 కావున వారికి నా కోపాన్ని చూపిస్తాను. వారిని సర్వనాశనం చేస్తాను! వారు చేసిన చెడుకార్యాలకు వారిని నేను శిక్షిస్తాను. ఇదంతా వారి స్వయంకృత అపరాధమే!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
క్రీస్తు యేసులో దేవుని ప్రేమ
31 మరి, మనము దీనికి ఏమి ప్రత్యుత్తరం ఇవ్వగలము? దేవుడే మనవైపు ఉన్నప్పుడు మనకు విరుద్ధంగా ఎవరుంటారు? 32 మనందరికోసం, ఆయన తన స్వంత కుమారుణ్ణి ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు. అలాంటప్పుడు తన కుమారునితో సహా అన్నీ మనకివ్వడా? 33 దేవుడు ఎన్నుకొన్న వాళ్ళపై ఎవరు నేరం మోపుతారు? మనల్ని నీతిమంతులుగా చేసేవాడు దేవుడే. 34 ఇక మనకు ఎవ్వరూ శిక్ష విధించలేరు. చనిపోయి బ్రతికి వచ్చిన యేసుక్రీస్తు దేవుని కుడిచేతి వైపు కూర్చొని మన పక్షాన వేడుకుంటున్నాడు. 35 క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు దూరం చెయ్యగలరు? కష్టం, దుఃఖం, హింస, కరువు, దిగంబరత్వం, అపాయం, ఖడ్గం మనల్ని దూరం చెయ్యగలవా? 36 దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“నీ కోసం దినమంతా మరణాన్ని ఎదుర్కొంటూ ఉన్నాము,
మేము చంపబడనున్న గొఱ్ఱెల వలె ఉన్నాం.”(A)
37 ఈ విషయాలన్నిటిలో, మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా సంపూర్ణ విజయాన్ని సాధించాము. 38 చావుగాని, బ్రతుకుగాని, దేవదూతలుగాని, దయ్యాలుగాని, ప్రస్తుతంగాని, భవిష్యత్తుగాని, మరే శక్తులుగాని 39 ఎత్తుగాని, అగాధంగాని, సృష్టిలో ఉన్న మరేదైనాగాని మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మనకు లభిస్తున్న దేవుని ప్రేమనుండి మనల్ని విడదీయలేవని నేను ఖండితంగా చెప్పగలను.
© 1997 Bible League International