Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన. బత్షెబతో దావీదు పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త దావీదు దగ్గరకి వెళ్లినప్పుడు వ్రాసిన కీర్తన.
51 దేవా, నీ నమ్మకమైన ప్రేమ మూలంగా
నా మీద దయ చూపించుము.
నీ మహా దయ మూలంగా
నా పాపాలన్నీ తుడిచివేయుము.
2 దేవా, నా దోషం అంతా తీసివేయుము.
నా పాపాలు కడిగివేసి, నన్ను మరల శుద్ధి చేయుము.
3 నేను పాపం చేశానని నాకు తెలుసు.
నేను ఎల్లప్పుడు నా పాపాన్ని ఎరిగియున్నాను.
4 తప్పు అని నీవు చెప్పే వాటినే నేను చేసాను.
దేవా, నీకే వ్యతిరేకంగా నేను పాపం చేసాను.
కనుక నేను దోషినని నీవు అన్నప్పుడు నీ మాట నిజమే.
నీవు నన్ను నిందించేటప్పుడు నీవు న్యాయవంతుడవే.
5 నేను పాపంలో పుట్టాను.
పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది.
6 దేవా, సంపూర్ణ భక్తిని లేదా యదార్థతను నీవు కోరతావు.
అందుచేత నా హృదయంలో నాకు జ్ఞానమును బోధించుము.
7 హిస్సోపు ముక్కను ప్రయోగించి నన్ను పవిత్రం చేసే క్రమం జరిగించుము.
నేను హిమం కంటె తెల్లగా ఉండేంతవరకు నన్ను కడుగుము.
8 నీవు విరుగ గొట్టిన ఎముకలను సంతోషించనిమ్ము.
నన్ను సంతోషపరచుము! మరల నన్ను సంతోషపరచుము.
9 నా పాపాలను చూడకుము!
వాటన్నింటినీ తుడిచి వేయుము.
10 దేవా, నాలో పవిత్ర హృదయాన్ని కలిగించుము
నా ఆత్మను నూతనపరచి బలపరచుము.
20 అప్పుడు యెహోవాకు ఒక బలిపీఠాన్ని నోవహు కట్టాడు. పవిత్రమైన పక్షులన్నింటిలో నుండి, పవిత్రమైన జంతువులన్నింటిలో నుండి కొన్నింటిని నోవహు తీసుకొని, దేవునికి కానుకగా బలిపీఠం మీద వాటిని దహించాడు.
21 యెహోవా ఈ బలుల సువాసనను ఆఘ్రాణించి ఆనందించాడు. యెహోవా తనలో తాను అనుకొన్నాడు, “మనుష్యుల్ని శిక్షించేందుకోసం ఒక పద్ధతిగా మరల ఎన్నడు నేను భూమిని శపించను. మనుష్యులు చిన్నప్పటినుండే దుర్మార్గులు కనుక భూమిమీద జీవిస్తున్న వాటన్నింటిని మరల ఎన్నడును నాశనం చేయను. లేదు, మరల నేను ఇలా చేయను. 22 భూమి ఉన్నంత కాలమూ నాటుటకు, పంట కోయుటకు ఎల్లప్పుడూ ఒక సమయం ఉంటుంది. భూమిమీద ఎప్పటికీ చల్లదనం, వేడి, వేసవికాలం, చలికాలం, పగలు, రాత్రిళ్లు ఉంటాయి.”
నూతన ఆరంభం
9 నోవహును, అతని కుమారులను దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు అతనితో చెప్పాడు: “అధిక సంతానం కలిగి, నీ జనంతో భూమిని నింపు. 2 భూమిమీదనున్న ప్రతి జంతువు, గాలిలో ఎగిరే ప్రతి పక్షి, నేలమీద ప్రాకు ప్రతి ప్రాణి, సముద్రంలోని ప్రతి చేప నీకు భయపడతాయి. వాటన్నిటిపైన నీవు పాలకునిగా ఉంటావు.” 3 “గతంలో నీవు తినేందుకు పచ్చ మొక్కల్ని ఇచ్చాను. ఇప్పుడు ప్రతి జంతువు నీకు ఆహారం అవుతుంది. భూమిపైనున్న సమస్తాన్ని నీకు ఇస్తున్నాను. అదంతా నీదే. 4 అయితే నీకు నేను ఒక ఆజ్ఞ యిస్తున్నాను. దానిలో ఇంకా ప్రాణము (రక్తం) ఉన్న మాంసాన్ని మీరు తినకూడదు. 5 అనగా ఏ మనిషినైనా ఒక జంతువు చంపితే దాని రక్తాన్ని అడుగుతాను, అలానే ఏ మనిషినైనా మరో మనిషి ప్రాణం తీస్తే, ఆ మనిషి రక్తాన్ని అడుగుతాను.
6 “దేవుడు అచ్చం తనలాగే మనుష్యులను చేశాడు.
కనుక యింకొక మనిషిని చంపినవాడు మరో మనిషి చేత చంపబడాలి.
7 “నోవహూ! నీవు, నీ కుమారులు అధిక సంతానం కలిగి, నీ జనంతో భూమిని నింపుదురు గాక!”
11 “మంచి కాపరి గొఱ్ఱెల కోసం చావటానికి కూడా సిద్ధమౌతాడు. నేను ఆ మంచి కాపరిని. 12 కూలి కోసం పనిచేసే వాడు కాపరికాడు. గొఱ్ఱెలు అతనివి కావు. కనుక అతడు తోడేళ్ళు రావటం చూస్తే గొఱ్ఱెల్ని వదిలి పారిపోతాడు. అప్పుడు తోడేళ్ళు వచ్చి మంద మీద పడి వాటిని చెదరగొడతాయి. 13 అతడు కూలి కొరకు పని చేసేవాడు కాబట్టి గొఱ్ఱెల క్షేమం చూడడు.
14-15 “నేను మంచి కాపరిని. నా తండ్రికి నన్ను గురించి, నాకు నా తండ్రిని గురించి తెలుసు. అదే విధంగా నాకు నా గొఱ్ఱెల్ని గురించి, నా గొఱ్ఱెలకు నా గురించి తెలుసు. నా గొఱ్ఱెల కోసం నేను ప్రాణం ఇస్తాను. 16 ఈ మందకు చెందని గొఱ్ఱెలు కొన్ని ఉన్నాయి. అవికూడా నావే. వాటిని కూడా నేను తీసుకొని రావాలి. అవి నా మాట వింటాయి. అప్పుడు అన్నీ ఒకే మందగా ఉంటాయి. ఒకే ఒక కాపరి ఉంటాడు. 17 నేను నా ప్రాణం యివ్వటానికి సిద్ధంగా ఉన్నాను. దాన్ని తిరిగి పొందడానికి శక్తిమంతుడను. కనుకనే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. 18 నా ప్రాణాన్ని నానుండి ఎవ్వరూ తీసుకోలేరు. నేను స్వయంగా నా ప్రాణం యిస్తాను. నా ప్రాణం యివ్వటానికి, తిరిగి తీసుకోవటానికి నాకు అధికారం ఉంది. అది నా తండ్రి ఆజ్ఞ.”
19 ఈ మాటల వల్ల యూదుల్లో తిరిగి చీలికలు వచ్చాయి. 20 చాలా మంది, “దయ్యం పట్టి అతనికి బాగా పిచ్చెక్కింది. అతని మాటలెందుకు వినటం?” అని అన్నారు.
21 కాని మరికొందరు, “అవి దయ్యం పట్టినవాని మాటలు కావు. దయ్యం గ్రుడ్డి వాళ్ళకు ఎట్లా దృష్టిని కలిగించగలదు?” అని అన్నారు.
© 1997 Bible League International