Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: షెమినిత్ రాగం. దావీదు కీర్తన.
12 యెహోవా, నన్ను రక్షించుము!
మంచి మనుష్యులంతా పోయారు.
భూమి మీద ఉన్న మనుష్యులందరిలో సత్యవంతులైన విశ్వాసులు ఎవ్వరూ మిగల్లేదు.
2 మనుష్యులు వారి పొరుగువారితో అబద్ధాలు చెబుతారు.
ప్రతి ఒక్క వ్యక్తీ, తన పొరుగువారికి అబద్ధాలు చెప్పి, ఉబ్బిస్తాడు.
3 అబద్ధాలు చెప్పేవారి పెదవులను యెహోవా కోసివేయాలి.
పెద్ద గొప్పలు పలికే వారి నాలుకలను యెహోవా కోసివేయాలి.
4 “మన అబద్ధాలే మనలను ప్రముఖులుగా అయ్యేందుకు తోడ్పడతాయి.
మన నాలుకలు ఉండగా, మన మీద ఎవ్వరూ పెద్దగా ఉండరు.”
అని ఆ ప్రజలు చెప్పుకొంటారు.
5 కాని యెహోవా చెబుతున్నాడు,
“దుర్మార్గులు పేదల దగ్గర వస్తువులు దొంగిలించారు.
ఆ నిస్సహాయ ప్రజలు వారి దుఃఖం వ్యక్తం చేయటానికి గట్టిగా నిట్టూర్చారు.
కాని ఇప్పుడు నేను నిలిచి, దాన్ని కోరేవారికి క్షేమము నిచ్చెదను.”
6 యెహోవా మాటలు సత్యం, నిర్మలం.
నిప్పుల కుంపటిలో కరగించిన స్వచ్ఛమైన వెండిలా పవిత్రంగా ఆ మాటలు ఉంటాయి.
కరిగించబడి ఏడుసార్లు పోయబడిన వెండిలా నిర్మలముగా ఆ మాటలు ఉంటాయి.
7 యెహోవా, నిస్సహాయ ప్రజల విషయమై జాగ్రత్త తీసుకొంటావు.
ఇప్పుడు, శాశ్వతంగా నీవు వారిని కాపాడుతావు.
8 మనుష్యుల మధ్యలో దుష్టత్వము, చెడుతనము పెరిగినప్పుడు
ఆ దుర్మార్గులు వారేదో ప్రముఖులైనట్టు తిరుగుతుంటారు.
10 దుర్మార్గులు ఎల్లప్పుడూ ఇంకా ఎక్కువ దుర్మార్గం చేయాలని కోరుతూంటారు. ఆ మనుష్యులు వారి చుట్టూరా ఉండే వారి మీద ఎలాంటి దయ చూపించరు.
11 ఒక వ్యక్తి ఇతరులకంటే తానే మంచివాడిని అని తలచినప్పటికి, అతడు శిక్షించబడితే ప్రతి ఒక్కరూ ఒక పాఠం నేర్చుకొంటారు. జరిగే సంగతుల మూలంగా జ్ఞానముగలవాడు ఎల్లప్పుడూ నేర్చుకొంటాడు. ఆ వ్యక్తి ఇంకా, ఇంకా ఎక్కువ తెలివి సంపాదిస్తాడు.
12 దేవుడు మంచివాడు. దేవునికి దుర్మార్గులు ఎవరో తెలుసు, ఆయన వారిని శిక్షిస్తాడు.
13 పేద ప్రజలకు సహాయం చేసేందుకు ఒక వ్యక్తి తృణీకరిస్తే తర్వాత అతనికి అవసరమైనప్పుడు ఏ సహాయమూ దొరకదు.
14 ఒక వ్యక్తికి నీ మీద కోపం ఉంటే అతనికి రహస్యంగా ఒక కానుక ఇవ్వు. రహస్యంగా ఇచ్చిన కానుక గొప్ప కోపాన్ని వారించగలదు.
15 న్యాయమైన తీర్పు మంచి మనుష్యులను సంతోషింపజేస్తుంది. కాని దుర్మార్గులను అది భయపెడుతుంది.
16 ఒక మనిషి జ్ఞానమార్గాన్ని విసర్జిస్తే అతడు నాశనానికే పోతున్నాడు.
శాస్త్రుల్ని విమర్శించటం
(మత్తయి 23:1-36; మార్కు 12:38-40; లూకా 11:37-54)
45 ప్రజలు యేసు చెబుతున్న విషయాలు వింటూ అక్కడే ఉన్నారు. ఆయన తన శిష్యులకు ఈ విధంగా చెప్పాడు: 46 “శాస్త్రుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిండుగా అంగీలువేసుకొని తిరగాలి అంటే వారికి చాలా యిష్టం. సంతలో నడుస్తున్నప్పుడు ప్రజలు దండాలు పెడితే సంతసిస్తారు. విందుకు వెళ్ళినప్పుడు, సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ముఖ్యమైన స్థానాల్లో కూర్చోవటానికి ప్రాకులాడుతారు. 47 వితంతువుల్ని మోసం చేసి వాళ్ళ ఇళ్ళు దోచుకుంటారు. కాని పైకి మాత్రం చాలాసేపు ప్రార్థనలు చేస్తూవుంటారు. అలాంటి వాళ్ళను దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు.”
నిజమైన కానుక
(మార్కు 12:41-44)
21 యేసు చుట్టూ చూసాడు. ధనవంతులు హుండీలో కానుకలు వేయటం ఆయన గమనించాడు. 2 అతి పేదరాలైన ఒక వితంతువు రెండు పైసాలు హుండీలో వెయ్యటం కూడా ఆయన గమనించాడు. 3 ఆయన, “నేను చెప్పేదేమిటంటే ఈ బీదవితంతువు అందరికన్నా ఎక్కువ ఆ హుండిలో వేసింది. 4 యితర్లు తమ దగ్గరున్న సంపద నుండి కొంత మాత్రమే కానుకగా వేసారు. కాని ఆమె తాను జీవించటానికి దాచుకొన్నదంతా ఆ హుండీలో వేసింది” అని అన్నాడు.
© 1997 Bible League International