Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: షెమినిత్ రాగం. దావీదు కీర్తన.
12 యెహోవా, నన్ను రక్షించుము!
మంచి మనుష్యులంతా పోయారు.
భూమి మీద ఉన్న మనుష్యులందరిలో సత్యవంతులైన విశ్వాసులు ఎవ్వరూ మిగల్లేదు.
2 మనుష్యులు వారి పొరుగువారితో అబద్ధాలు చెబుతారు.
ప్రతి ఒక్క వ్యక్తీ, తన పొరుగువారికి అబద్ధాలు చెప్పి, ఉబ్బిస్తాడు.
3 అబద్ధాలు చెప్పేవారి పెదవులను యెహోవా కోసివేయాలి.
పెద్ద గొప్పలు పలికే వారి నాలుకలను యెహోవా కోసివేయాలి.
4 “మన అబద్ధాలే మనలను ప్రముఖులుగా అయ్యేందుకు తోడ్పడతాయి.
మన నాలుకలు ఉండగా, మన మీద ఎవ్వరూ పెద్దగా ఉండరు.”
అని ఆ ప్రజలు చెప్పుకొంటారు.
5 కాని యెహోవా చెబుతున్నాడు,
“దుర్మార్గులు పేదల దగ్గర వస్తువులు దొంగిలించారు.
ఆ నిస్సహాయ ప్రజలు వారి దుఃఖం వ్యక్తం చేయటానికి గట్టిగా నిట్టూర్చారు.
కాని ఇప్పుడు నేను నిలిచి, దాన్ని కోరేవారికి క్షేమము నిచ్చెదను.”
6 యెహోవా మాటలు సత్యం, నిర్మలం.
నిప్పుల కుంపటిలో కరగించిన స్వచ్ఛమైన వెండిలా పవిత్రంగా ఆ మాటలు ఉంటాయి.
కరిగించబడి ఏడుసార్లు పోయబడిన వెండిలా నిర్మలముగా ఆ మాటలు ఉంటాయి.
7 యెహోవా, నిస్సహాయ ప్రజల విషయమై జాగ్రత్త తీసుకొంటావు.
ఇప్పుడు, శాశ్వతంగా నీవు వారిని కాపాడుతావు.
8 మనుష్యుల మధ్యలో దుష్టత్వము, చెడుతనము పెరిగినప్పుడు
ఆ దుర్మార్గులు వారేదో ప్రముఖులైనట్టు తిరుగుతుంటారు.
12 సరిగ్గా ఉంది అని మనుష్యులు తలంచే ఒక మార్గం ఉంది. కాని ఆ మార్గం మరణానికి మాత్రమే దారి తీస్తుంది.
13 ఒక మనిషి నవ్వుతూ ఉన్నా, అతడు విచారంగానే ఉండవచ్చు. నవ్వటం అయిపొయ్యాకగూడ ఆ విచారం అలాగే ఉంటుంది.
14 దుర్మార్గులు చేసే చెడుపనులకు వారికి పూర్తిగా చెల్లించబడుతుంది (శిక్షించబడుతారు). మరియు మంచివాళ్లు చేసే మంచి పనులకు పూర్తిగా బహుమానం పొందుతారు.
15 బుద్ధిహీనుడు ఏది వింటే అది నమ్ముతాడు. కాని జ్ఞానము గలవాడు ప్రతిదాని గూర్చి జాగ్రత్తగా ఆలోచిస్తాడు.
16 జ్ఞానముగలవాడు యెహోవాను గౌరవిస్తాడు, దుర్మార్గానికి దూరంగా ఉంటాడు. కాని బుద్ధిహీనుడు ఆలోచన లేకుండా పనులు చేస్తాడు జాగ్రత్తగా ఉండడు.
17 త్వరగా కోపగించుకొనేవాడు బుద్ధిహీనమైన పనులు చేస్తాడు. కాని జ్ఞానముగలవాడు ఓర్పు కలిగి ఉంటాడు.
18 తెలివితక్కువ వారు తమ తెలివితక్కువ తనాన్ని బట్టి శిక్షించబడుతారు. కాని జ్ఞానముగలవారికి తెలివి బహుమానంగా ఇవ్వబడుతుంది.
19 చివరికి చెడ్డవారిమీద మంచి వాళ్లు గెలుస్తారు. చెడ్డవాళ్లు మంచివాళ్లకు నేవ చేయుటకు బలవంతం చేయబడుతారు.
20 పేదవానికి స్నేహితులు ఎవ్వరూ ఉండరు. అతనికి పొరుగువారు కూడ ఉండరు. కాని ధనికులకు చాలా మంది స్నేహితులు ఉంటారు.
21 ఇతరులకంటే నీవే మంచివాడవని తలచటం తప్పు. నీవు సంతోషంగా ఉండాలంటే పేదవారి యెడల దయ కలిగి ఉండు.
22 దుర్మార్గం చేయాలనే వ్యక్తి ఎవరైనా సరే అతడు తప్పు చేస్తున్నాడు. అయితే మంచి జరిగించడానికి ప్రయత్నించే వ్యక్తికి, అతన్ని ప్రేమించి అతన్ని నమ్ముకొనే స్నేహితులు ఉంటారు.
23 నీవు కష్టపడి పని చేస్తే, అప్పుడు నీవు కోరుకొనేవి నీకు ఉంటాయి. కాని నీవు మాట్లాడటం తప్ప పని ఏమి చేయకపోతే నీవు పేదవానివిగా ఉంటావు.
24 జ్ఞానముగలవారు ఐశ్వర్యాన్ని బహుమానంగా పొందుతారు. కాని బుద్ధిహీనులు తెలివితక్కువ తనాన్ని బహుమానంగా పొందుతారు.
25 సత్యం పలికే మనిషి ఇతరులకు సహాయం చేస్తాడు. అబద్ధాలు చెప్పే మనిషి ఇతరులకు హాని చేస్తాడు.
26 యెహోవాను గౌరవించే మనిషి క్షేమంగా ఉంటాడు. మరియు అతని పిల్లలు క్షేమంగా జీవిస్తారు.
27 యెహోవా యెడల భక్తి నిజమైన జీవాన్ని ప్రసాదిస్తుంది. అది ఒక వ్యక్తిని మరణవు ఉచ్చునుండి రక్షిస్తుంది.
28 ఒక రాజు అనేకమంది ప్రజలను పాలిస్తే అతడు గొప్పవాడు. కాని ప్రజలు ఎవ్వరూ లేకపోతే అప్పుడు ఆ రాజు యొక్క విలువ శూన్యం.
29 సహనంగల మనిషి చాలా తెలివిగలవాడు. త్వరగా కోపపడు మనిషి బుద్ధిహీనుడని కనపరచుకుంటాడు.
30 ఒక మనిషి మనస్సులో శాంతి ఉంటే అతని శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కాని అసూయ శరీరంలో వ్యాధి కలిగిస్తుంది.
31 పేద ప్రజలకు కష్టాలు కలిగించే మనిషి దేవుణ్ణి గౌరవించటం లేదని చూపెడతాడు. ఇద్దరినీ దేవుడే చేశాడు. కాని ఒక మనిషి పేద ప్రజల యెడల దయ కలిగి ఉంటే, అప్పుడు అతడు దేవుణ్ణి గౌరవిస్తాడు.
అపొస్తలులు మరియు యూదుల మహాసభ
4 యాజకులు, మందిరం యొక్క ద్వారపాలకుల అధిపతి, సద్దూకయ్యులు కలిసి పేతురు, యోహాను ఉన్న చోటికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు ప్రజలకు ఉపదేశిస్తూ ఉన్నారు. 2 ఆ అపొస్తలులు ప్రజలకు ఉపదేశించటం, యేసును ఉదాహరణగా తీసుకొని చనిపోయినవాళ్ళు బ్రతికి వస్తారని ప్రకటించటం విని వాళ్ళకు చాలా కోపం వచ్చింది. 3 వాళ్ళు పేతురును, యోహానును బంధించారు. అప్పటికే సాయంకాలమై ఉండటం వల్ల మరుసటి రోజు దాకా వాళ్ళను బంధించి ఉంచారు. 4 వాళ్ళ సందేశాన్ని విని అనేకులు విశ్వాసులయ్యారు. ఆ విశ్వాసుల సంఖ్య సుమారు అయిదు వేలదాకా పెరిగిపోయింది.
5 మరుసటి రోజు నాయకులు, పెద్దలు, పండితులు యెరూషలేములో సమావేశం అయ్యారు. 6 “అన్న” అనే ప్రధాన యాజకుడు, కయప, యోహాను, అలెక్సంద్రు, ప్రధాన యాజకుని కుటుంబానికి చెందినవాళ్ళంతా ఆ సమావేశంలో ఉన్నారు. 7 పేతురును, యోహానును వీళ్ళ ముందుకు పిలుచుకు వచ్చారు. “ఏ అధికారంతో, ఎవరి పేరిట మీరాపని చేసారు?” అని వాళ్ళు ప్రశ్నించటం మొదలు పెట్టారు.
8 అదే సమయంలో, పేతురు పవిత్రాత్మతో నిండినవాడై వాళ్ళకు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ప్రజా నాయకులారా! పెద్దరాలా! 9 ఒక కుంటివానికి చేసిన ఉపకారాన్ని గురించి మమ్మల్ని ప్రశ్నించాలనుకొంటున్నారా? అతనికి ఎవరు నయం చేసారని తెలుసుకోవాలనుకొంటున్నారా? 10 అలాగైతే మీరు, ఇశ్రాయేలు ప్రజలు ఇది తెలుసుకోవాలి. నజరేతు నివాసి యేసు క్రీస్తు పేరిట ఈ కుంటివాడు పూర్తిగా నయమై మీ ముందు నిలుచున్నాడు. మీరు యేసును సిలువకు వేసి చంపినా దేవుడాయన్ని బ్రతికించాడు.
11 ‘ఇల్లు కట్టువాళ్ళైన మీరు పారవేసిన రాయి ఈ యేసే!
ఇప్పుడది మూలకు తలరాయి అయింది.’(A)
12 రక్షణ యింకెవరి ద్వారా లభించదు. ఎందుకంటే, రక్షణ పొందటానికి ఈ పేరు (యేసు క్రీస్తు) తప్ప మరే పేరును దేవుడు మానవులకు తెలుపలేదు. ఈ పేరుకు తప్ప ఆ శక్తి ప్రపంచంలో మనుష్యులకివ్వబడిన మరే పేరుకు లేదు.”
© 1997 Bible League International