Revised Common Lectionary (Complementary)
రెండవ భాగం
(కీర్తనలు 42–72)
సంగీత నాయకునికి: కోరహు కుటుంబంవారి దైవధ్యానం
42 దప్పిగొన్న దుప్పి, చల్లటి సెలయేటి ఊటల్లో నీళ్లు త్రాగాలని ఆశిస్తుంది.
అలాగే దేవా, నీకోసం నా ఆత్మ దాహంగొని ఉంది.
2 సజీవ దేవుని కోసం, నా ఆత్మ దాహంగొని ఉంది.
ఆయనను కలుసుకొనుటకు నేను ఎప్పుడు రాగలను?
3 నా కన్నీళ్లే రాత్రింబవళ్లు నా ఆహారం.
నా శత్రువు ఎంతసేపూను “నీ దేవుడు ఎక్కడ?” అంటూనే ఉన్నాడు.
4 కనుక నన్ను వీటన్నిటినీ జ్ఞాపకం ఉంచుకోనిమ్ము.
నా ఆత్మను కుమ్మరించనిమ్ము. దేవుని ఆలయానికి నడవటం,
ప్రజల గుంపులను నడిపించటం నాకు జ్ఞాపకం.
అనేకమంది ప్రజలు పండుగ చేసుకొంటూ సంతోష స్తుతిగానాలు పాడటం నాకు జ్ఞాపకం.
5 నేను ఎందుకు అంత విచారంగా ఉన్నాను?
ఎందుకు నేనంత తల్లడిల్లిపోయాను?
దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి.
ఆయనను ఇంకా స్తుతించుటకు నాకు అవకాశం దొరుకుతుంది.
ఆయన నన్ను కాపాడుతాడు.
6 నాకు సహాయమైన దేవా! నా మనస్సులో నేను కృంగియున్నాను.
కనుక నేను నిన్ను యొర్దాను ప్రదేశమునుండియు, హెర్మోను ప్రాంతంనుండియు, మీసారు కొండనుండియు జ్ఞాపకం చేసుకొంటున్నాను.
7 నీ జలపాతాల ఉరుము ధ్వని అఘాధంలోనుండి పిలుస్తోంది.
నీ అలలు అన్నియు నామీదుగా దాటియున్నవి.
8 ప్రతిరోజూ యెహోవా తన నిజమైన ప్రేమను చూపిస్తాడు.
అప్పుడు రాత్రిపూట నేను ఆయన పాటలు పాడుతాను. నా సజీవ దేవునికి నేను ప్రార్థన చేస్తాను.
9 ఆశ్రయ బండ అయిన నా దేవునితో,
“యెహోవా! నీవు నన్ను ఎందుకు మరిచావు?
నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి నేనెందుకు విచారంగా ఉండాలి?” అని నేను వేడుకుంటాను.
10 నా శత్రువులు నన్ను చంపుటకు ప్రయత్నించారు.
“నీ దేవుడు ఎక్కడ?” అని వారు అన్నప్పుడు వారు నన్ను ద్వేషిస్తున్నట్టు వారు చూపెట్టారు.
11 నేను ఎందుకు ఇంత విచారంగా ఉన్నాను?
నేను ఎందుకు ఇంతగా తల్లడిల్లిపోయాను?
దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి.
నేను ఇంకా ఆయన్ని స్తుతించే అవకాశం దొరుకుతుంది.
నా సహాయమా! నా దేవా!
యెరూషలేమును ఆశీర్వదించటానికి యెహోవా మాట యిచ్చుట
8 సర్వశక్తిమంతుడైన యెహోవానుండి వచ్చిన ఒక వర్తమానం ఇది. 2 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “నేను సీయోనును నిజంగా ప్రేమిస్తున్నాను. నేనామెను ఎంతగా ప్రేమిస్తున్నానంటే, ఆమె నాపట్ల విశ్వాసం లేకుండా ప్రవర్తించినప్పుడు నాకు కోపం వచ్చింది.” 3 యెహోవా చెపుతున్నాడు, “నేను సీయోనుకు తిరిగి వచ్చాను. నేను యెరూషలేములో నివసిస్తున్నాను. యెరూషలేము విశ్వాసంగల నగరం అని పిలవబడుతుంది. నా పర్వతం పవిత్ర పర్వతం అని పిలవబడుతుంది.”
4 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “వృద్ధులైన స్త్రీ వురుషులు మళ్లీ యెరూషలేము బహిరంగ ప్రదేశాలలో కనబడతారు. ప్రజలు నడవటానికి చేతి కర్రలు కావలసివచ్చే వయసువరకు నివసిస్తారు. 5 వీధుల్లో ఆడుకునే పిల్లలతో నగరం నిండిపోతుంది. 6 చావగా మిగిలినవారు ఇదంతా అద్భుతం అనుకుంటారు. నేనూ ఇది అద్భుతం అనుకుంటాను!”
7 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “చూడు, తూర్పు, పడమటి దేశాలలో ఉన్న నా ప్రజలను నేను రక్షిస్తున్నాను. 8 వారిని ఇక్కడికి తిరిగి తీసుకు వస్తాను. వారు యెరూషలేములో నివసిస్తారు. వారు నా ప్రజగా పుంటారు. నేను వారికి మెచ్చదగిన, విశ్వసనీయమైన దేవునిగా వుంటాను.”
9 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “ధైర్యంగా ఉండండి! సర్వశక్తిమంతుడైన యెహోవా ముందుగా తన ఆలయాన్ని నిర్మించటానికి పునాదులు వేసినప్పుడు ప్రవక్తలు ఇచ్చిన సందేశాన్నే ప్రజలైన మీరు ఈనాడు వింటున్నారు. 10 అంతకు ముందు, పనివారిని పెట్టటానికి, జంతువులను బాడుగకు తీసుకోటానికి మనుష్యులవద్ద డబ్బు లేదు. పైగా మనుష్యులు రావటానికి, పోవటానికి కూడ క్షేమకరం కాని సమయం. బాధలన్నిటి నుండి ఉపశమనం లేదు. నేను ప్రతివాడిని తన పొరుగు వానిపై తిరుగబడేలా చేశాను. 11 కాని ఇప్పుడు పూర్వం మాదిరిగా లేదు. బతికివున్నవారికి ఇక అలా జరుగదు.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
12 “ఈ ప్రజలు శాంతియుత వాతావరణంలో మొక్కలు. నాటుతారు. వారి ద్రాక్షాతోటలు కాయలు కాస్తాయి. భూమి విస్తారంగా పంటనిస్తుంది. ఆకాశం వర్షిస్తుంది. వీటన్నిటినీ నా ప్రజలైన వీరికి ఇస్తాను. 13 ప్రజలు తమ శాపాలతో ఇశ్రాయేలును, యూదాను వాడటం మొదలు పెట్టారు. కాని ఇశ్రాయేలును, యూదాను నేను రక్షిస్తాను. ఆ పేర్లు ఒక దీవెనగా మారుతాయి. కావున భయపడవద్దు. ధైర్యంగా ఉండండి!”
14 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “మీ పూర్వీకులు నాకు కోపం కలిగించారు. అందువల్ల వారిని నేను నాశనం చేయ సంకల్పించాను. నా మనస్సు మార్చుకోకూడదని నేను నిర్ణయించుకున్నాను.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 15 “కాని ఇప్పుడు నా మనస్సు మార్చుకున్నాను. అదేమాదిరి నేను యెరూషలేముపట్ల, యూదాప్రజలపట్ల మంచిగా వుండటానికి నిర్ణయించుకున్నాను. కావున భయపడవద్దు! 16 అయితే మీరు మాత్రం ఇవి తప్పక చేయండి: మీ పొరుగు వారికి నిజం చెప్పండి. మీరు మీ నగరాలలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీరు సరిగా ప్రవర్తించండి. ధర్మమైన శాంతికి దోహదపడే పనులు చేయండి. 17 మీ పొరుగు వారిని బాధించడానికి మీరు రహస్య పథకాలు వేయకండి! బూటకపు వాగ్దానాలు చేయకండి! అటువంటి పనులు చేయటంపట్ల ఆసక్తి కనపరచకండి. ఎందుకంటే, వాటిని నేను అసహ్యించుకుంటాను!” యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
యేసు అనేకులను నయం చేయటం
(మార్కు 1:29-34; లూకా 4:38-41)
14 యేసు పేతురు యింటికి వచ్చి పేతురు అత్త జ్వరంతో మంచం పట్టి ఉండటం చూసాడు. 15 ఆయన ఆమె చేతిని తాకగానే, జ్వరం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. ఆమె లేచి ఆయనకు సపర్యలు చెయ్యటం మొదలుపెట్టింది.
16 ప్రజలు సాయంత్రం కాగానే, దయ్యాలు పట్టిన వాళ్ళను చాలా మందిని యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. ఆయన ఒక మాటతో దయ్యాల్ని వదిలించాడు. రోగాలున్న వాళ్ళందరికి నయం చేసాడు. 17 యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన ఈ మాటలు నిజం కావటానికి ఇలా జరిగింది:
“మన రోగాల్ని ఆయన తనపై వేసుకొన్నాడు. మన బాధల్ని ఆయన అనుభవించాడు.”(A)
దయ్యం పట్టిన యిద్దరిని నయం చేయటం
(మార్కు 5:1-20; లూకా 8:26-39)
28 యేసు, సరస్సు ఆవలి పైపుననున్న గదరేనీయుల ప్రాంతాన్ని చేరుకున్నాడు. దయ్యాలు పట్టిన మనుష్యులిద్దరు స్మశానం నుండి వచ్చి ఆయన్ని కలుసుకొన్నారు. వీళ్ళ క్రూర ప్రవర్తన వల్ల ఆ దారిమీద ఎవ్వరూ వెళ్ళేవాళ్ళు కారు. 29 అవి, “దేవుని కుమారుడా! మాకేం చెయ్యాలని వచ్చావు తగిన సమయం రాకముందే మమ్మల్ని శిక్షించాలని యిక్కడికి వచ్చారా?” అని బిగ్గరగా అన్నాయి.
30 వాళ్ళకు కొంత దూరంలో ఒక పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది. 31 ఆ దయ్యాలు యేసుతో, “మీరు మమ్మల్ని వెళ్ళగొట్టాలని అనుకొంటే ఆ పందుల గుంపులోకి పంపండి” అని ప్రాధేయపడ్డాయి.
32 ఆయన వాటితో, “వెళ్ళండి!” అని అన్నాడు. అందువల్ల అవి వెలుపలికి వచ్చి ఆ పందుల్లోకి ప్రవేశించాయి. ఆ పందుల గుంపంతా నిటారుగా ఉన్న కొండ మీదనుండి జారి సరస్సులో పడి చనిపొయ్యాయి. 33 ఆ పందుల్ని కాస్తున్న వాళ్ళు అక్కడి నుండి పరుగెత్తి గ్రామంలోకి వెళ్ళి జరిగిందంతా, అంటే ఆ దయ్యం పట్టిన వాళ్ళకేమైందో అంతా చెప్పారు. 34 ఇది విని ఆ గ్రామమంతా యేసును కలవటానికి వచ్చింది. వాళ్ళాయన్ని చూసాక తమ పరిసరాల్ని వదిలి వెళ్ళమని ఆయనను ప్రాధేయపడ్డారు.
© 1997 Bible League International