Revised Common Lectionary (Complementary)
మరియ పాడిన భక్తి గీతం
46 మరియ ఈ విధంగా అన్నది:
47 “నా ఆత్మ ప్రభువును కొలిచింది.
దేవుడు చేసిన ఈ మంచికి నా మనస్సు ఆనందం పొందింది. ఆయనే నా రక్షకుడు.
48 దీనురాల్ని నేను!
ఆయన దాసీని నేను, నన్ను కరుణించాడు!
ఇకనుండి అందరూ
నన్ను ధన్యురాలంటారు!
49 దేవుడు సర్వశక్తి సంపన్నుడు.
ఆయన నాకు ఎంతో మంచి చేశాడు! ఆయన నామం పవిత్రం!
50 తనంటే భయపడే వాళ్ళపై తరతరాలు దయ చూపుతాడు.
51 తన బలమైన హస్తాన్ని జాపి
గర్వించే వాళ్ళను వాళ్ళ ఆలోచనల్ని అణిచి వేస్తాడు.
52 రాజుల్ని, వాళ్ళ సింహాసనాల నుండి దింపి వేస్తాడు.
దీనులకు గొప్ప స్థానాలిస్తాడు.
53 పేదవాళ్ళ అవసరాలన్నీ తీరుస్తాడు.
ధనవంతుల్ని వట్టి చేతుల్తో పంపేస్తాడు.
54 తరతరాల నుండి మన పూర్వీకులతో, అబ్రాహాముతో,
అతని సంతతితో చెప్పినట్లు
55 దేవుని ఇష్టానుసారం జీవించిన ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేశాడు. మరవకుండా వాళ్ళపై దయ చూపాడు.”
దేవుడు వస్తున్నాడు
60 “నా వెలుగైన యెరూషలేమా లెమ్ము!
నీ వెలుగు (దేవుడు) వస్తున్నాడు. యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తుంది.
2 ఇప్పుడు భూమిని,
దాని ప్రజలను చీకటి ఆవరించి ఉంది.
కానీ యెహోవా నీ మీద ప్రకాశిస్తాడు.
నీ చుట్టూరా ఆయన మహిమను ప్రజలు చూస్తారు.
3 ఆ సమయంలో రాజ్యాలు నీ వెలుగు (దేవుడు) దగ్గరకు వస్తాయి.
ప్రకాశవంతమైన నీ వెలుగు దగ్గరకు రాజులు వస్తారు.
4 నీ చుట్టూ చూడు,
చూడు ప్రజలు చూట్టూ చేరి, నీ దగ్గరకు వస్తున్నారు.
ఆ ప్రజలు దూరం నుండి వస్తున్న నీ కుమారులు.
మరియు వారితో నీ కుమార్తెలు వస్తున్నారు.
5 “భవిష్యత్తులో ఇది సంభవిస్తుంది. ఆ సమయంలో నీ ప్రజలను నీవు చూస్తావు.
ఆనందంతో మీ ముఖాలు ప్రకాశిస్తాయి.
మొదట, మీరు భయపడతారు,
కానీ తర్వాత మీరు సంబరపడతారు.
సముద్రాల ఆవలి రాజ్యాల ఐశ్వర్యాలన్నీ నీ ముందు ఉంచబడతాయి.
రాజ్యాల ఐశ్వర్యాలు నీకు సంక్రమిస్తాయి.
6 మిద్యాను, ఏయిఫాల నుండి ఒంటెల మందలు
నీ దేశంలో నిండిపోతాయి.
షేబనుండి ఒంటెలు బారులు తీరి వస్తాయి.
బంగారం, బోళం అవి తెస్తాయి.
ప్రజలు యెహోవాకు స్తుతులు పాడతారు.
జెకర్యా చెప్పిన భవిష్యం
67 ఆ బాలుని తండ్రి జెకర్యా పవిత్రాత్మతో నింపబడి దేవుని సందేశాన్ని ఈ విధంగా చెప్పాడు:
68 “తన ప్రజలకు స్వేచ్ఛ కలిగించి, రక్షించ వచ్చిన ప్రభువును స్తుతించండి!
ఇశ్రాయేలు ప్రజల దేవుణ్ణి స్తుతించండి!
69 మహాశక్తిగల రక్షకుణ్ణి తన సేవకుడైన దావీదు వంశం నుండి
మనకోసం పంపాడు.
70 గతంలో మహాత్ములైన ప్రవక్తల ద్వారా
ఈ విషయం చెప్పాడు.
71 దేవుడు శత్రువుల బారినుండి,
మనలను ద్వేషించేవారినుండి మనల్ని రక్షిస్తాడు.
72 మన తండ్రులను, తాత ముత్తాతలను కరుణిస్తానన్నాడు.
పవిత్రమైన ఒడంబడిక మరిచి పోనన్నాడు!
73 శత్రువుల బారినుండి రక్షిస్తానని మన తండ్రి అబ్రాహాముతో ప్రమాణం చేశాడు.
74 మనం ఏ భయం లేకుండా తనను సేవించాలి.
75 జీవితాంతం పవిత్రంగా, ధర్మంగా, తన కోసం జీవించాలని ఆయన ఉద్దేశ్యం!
76 “ఓ శిశువా! నీవు సర్వోన్నతుని ప్రవక్తవని పిలువబడతావు!
ప్రభువు కన్నా ముందు వెళ్ళి ప్రభువు రాకకు మార్గం వేస్తావు!
77 పాపక్షమాపణ ద్వారా రక్షణ కలుగుతుందన్న జ్ఞానాన్ని ఆయన ప్రజలకు బోధిస్తావు!
78 “మన దేవుడు తన కనికరంవల్ల పరలోకం నుండి
ఒక నీతిసూర్యుణ్ణి పంపించి,
79 మరణమనే చీకటి నీడలో నివసించే మనపై ప్రకాశించునట్లు చేసి
మనల్ని శాంతి మార్గంలో నడిపిస్తాడు!”
80 ఆ బాలుడు పెరిగి పెద్దవాడై ఆత్మలో బలం పొందాడు. ఇశ్రాయేలు ప్రజలకు బోధించే సమయం వచ్చే దాకా యోహాను ఎడారుల్లో జీవించాడు.
© 1997 Bible League International