Revised Common Lectionary (Complementary)
ఆసాపు కీర్తనలలో ఒకటి.
50 దేవాధి దేవుడు యెహోవా మాట్లాడాడు.
సూర్యోదయ దిక్కు నుండి సూర్యాస్తమయ దిక్కు వరకు భూమి మీది ప్రజలందరినీ ఆయన పిలుస్తున్నాడు.
2 సీయోను నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. ఆ పట్టణపు అందము పరిపూర్ణమైనది.
3 మన దేవుడు వస్తున్నాడు, ఆయన మౌనంగా ఉండడు.
ఆయన యెదుట అగ్ని మండుతుంది.
ఆయన చుట్టూరా గొప్ప తుఫాను ఉంది.
4 తన ప్రజలకు తీర్పు చెప్పుటకు పైన ఆకాశాన్ని,
క్రింద భూమిని ఆయన పిలుస్తున్నాడు.
5 “నా అనుచరులను నా చుట్టూరా చేర్చండి.
వారు బలియర్పణ ద్వారా నాతో ఒడంబడిక చేసుకున్నారు” అని ఆయన అంటాడు.
6 అప్పుడు ఆకాశాలు ఆయన న్యాయాన్ని చెప్పాయి.
ఎందుకంటే, దేవుడే న్యాయమూర్తి.
7 దేవుడు చెబుతున్నాడు: “నా ప్రజలారా, నా మాట వినండి.
ఇశ్రాయేలు ప్రజలారా, మీకు విరోధంగా నా రుజువును కనపరుస్తాను.
నేను దేవుణ్ణి, మీ దేవుణ్ణి.
8 నేను మీ బలుల విషయంలో మిమ్ములను సరిచేయటంలేదు. గద్దించటంలేదు.
ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మీ దహన బలులను ఎల్లప్పుడూ తెస్తున్నారు. ప్రతిరోజు వాటిని మీరు నాకిస్తున్నారు.
9 మీ ఇంటినుండి ఎద్దులను తీసుకోను.
మీ శాలలనుండి మేకలు నాకవసరం లేవు.
10 ఆ జంతువులు నాకు అవసరం లేదు. అరణ్యంలో ఉన్న జంతువులన్నీ ఇది వరకే నా సొంతం.
వేలాది పర్వతాల మీద జంతువులన్నీ ఇది వరకే నా సొంతం.
11 కొండల్లో ఉండే ప్రతి పక్షి నాకు తెలుసు.
పొలాల్లో చలించే ప్రతిదీ నా సొంతం
12 నాకు ఆకలి వేయదు! నాకు ఆకలిగా ఉంటే ఆహారం కోసం నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు
ప్రపంచం, అందులో ఉన్న సమస్తమూ, నా సొంతం.
13 నేను ఎద్దుల మాంసం తినను. నేను మేకల రక్తం త్రాగను.”
14 దేవునికి కృతజ్ఞతార్పణలను ఇవ్వండి. మహోన్నతుడైన దేవునికి మీ మొక్కుబడిని చెల్లించండి,
దేవుడు ఇలా అన్నాడు: మీరు వాగ్దానం చేసినది ఇవ్వండి.
15 “ఇశ్రాయేలు ప్రజలారా, మీకు కష్టాలు వచ్చినప్పుడు నన్ను ప్రార్థించండి!
నేను మీకు సహాయం చేస్తాను. అప్పుడు మీరు నన్ను గౌరవించవచ్చు.”
16 దుర్మార్గులతో దేవుడు చెబుతున్నాడు,
“నా న్యాయ విధులను చదువుటకు,
నా ఒడంబడికకు బద్ధులమని ప్రకటించుటకును మీకేమి హక్కున్నది?[a]
17 కనుక నేను మిమ్మల్ని సరిదిద్దినప్పుడు దానిని మీరు ద్వేషిస్తారు.
నేను మీతో చెప్పే సంగతులను మీరు నిరాకరిస్తారు.
18 మీరు ఒక దొంగను చూస్తారు, వానితో చేయి కలపడానికి పరుగెడతారు.
వ్యభిచార పాపం చేసే మనుష్యులతో పాటు మీరు మంచం మీదికి దూకుతారు.
19 మీరు చెడు సంగతులు చెబుతారు, అబద్ధాలు పలుకుతారు.
20 మీరు మీ సహోదరుని గూర్చి ఎడతెగక చెడ్డ సంగతులు చెబుతారు.
మీరు మీ తల్లి కుమారుని అపనిందలపాలు చేస్తారు.
21 మీరు ఈ చెడ్డ విషయాలు చేసారు. నేను మౌనంగా ఉండిపోయాను
నేను మీలాంటివాడినని మీరనుకొన్నారు.
కాని నేనిప్పుడు మిమ్ములను కోపంతో గద్దిస్తాను.
మరియు మీ ముఖంమీద నిందమోపుతాను.
22 నేను మిమ్ములను చీల్చివేయకముందే,
దేవుని మరచిన జనాంగమైన మీరు,
ఈ విషయమును గూర్చి ఆలోచించాలి.
అదే కనుక జరిగితే, ఏ మనిషి మిమ్మల్ని రక్షించలేడు.
23 ఒక వ్యక్తి కృతజ్ఞత అర్పణను చెల్లిస్తే, అప్పుడు అతడు నన్ను గౌరవిస్తాడు.
నా మార్గాన్ని అనుసరించే వానికి రక్షించగల దేవుని శక్తిని నేను చూపిస్తాను.”
నెహెమ్యా చివరి ఆదేశాలు
13 ఆ రోజున మోషే గ్రంథం ప్రజలందరకీ వినిపించేలా బిగ్గరగా పఠింపబడింది. అమ్మోనీయుల్లోగాని, మెయాబీయుల్లోగాని ఏ ఒక్కరూ దేవుని ప్రజల మధ్య ఎల్లప్పుడు ఉండుటకు అనుమతింపబడరన్న నిబంధన మోషే గ్రంథంలో వ్రాసి వుందన్న విషయం జనం గ్రహించారు. 2 ఇశ్రాయేలీయులకి వాళ్లు ఆహారంగాని, నీరుగాని ఇవ్వలేదు. అందుకే ఈ నిబంధన లిఖించబడింది. పైగా ఇశ్రాయేలీయులకు శాపం ఇచ్చేందుకు బిలాముకు డబ్బు కూడా చెల్లించారు. కాని దేవుడు ఆ శాపాన్ని తిప్పికొట్టి, దాన్ని మనకొక వరంగా చేశాడు. 3 ఇశ్రాయేలు ప్రజలు ఆ నిబంధనను విన్నారు. వాళ్లు దాన్ని పాటించారు. విదేశీయుల సంతానాల నుంచి వాళ్లు తమని తాము వేరుజేసుకున్నారు.
23 ఆ రోజుల్లో కొందరు యూదులు అష్టోదు, అమ్మోను, మోయాబు దేశాలకు చెందిన స్త్రీలను పెళ్లి చేసుకున్న విషయం కూడా నేను గమనించాను. 24 ఆ వివాహాల ఫలితంగా పుట్టిన పిల్లల్లో సగం ముదికి యూదా భాషలో మాట్లాడటం చేతకాదు. ఆ పిల్లలు అష్డోదు, అమ్మోను లేక మోయాబు భాష మాట్లడేవారు. 25 అందుకని, వాళ్లు పొరపాటు చేస్తున్నారని నేను వాళ్లకి చెప్పాను. నేను వాళ్లని శపించాను. వాళ్లలో నేను కొందర్ని కొట్టాను కూడా. కొందర్ని జుట్టు పట్టుకొని గుంజాను. వాళ్లచేత నేను బలవంతాన దేవుని సాక్షిగా ప్రమాణం చేయించాను. నేను వాళ్లకి ఇలా చెప్పాను: “మీరు వాళ్ల అమ్మాయిల్ని పెళ్లి చేసుకో కూడదు. ఆ విదేశీయుల కూతుళ్లని మీ అబ్బాయిలు పెళ్లి చేసుకోకుండా చూడండి. అలాగే, మీ అమ్మాయిలు ఆ విదేశీయుల కొడుకుల్ని పెళ్లిచేసుకోకుండా చూడండి. 26 ఇలాంటి పెళ్లిళ్లు సొలొమోను లాంటివాడు సైతం పాపం చేసేందుకు కారణమయ్యాయని మీకు తెలుసు. ఎన్నెన్నో దేశాల్లో సొలొమోనంతటి గొప్ప రాజు లేడు. సొలొమోను దేవుని ప్రేమ పొందినవాడు. దేవుడు సొలొమోనును ఇశ్రాయేలు దేశమంతటికీ రాజును చేశాడు. అలాంటి సొలొమోను సైతం విదేశీ స్త్రీల మూలంగా పాపం చేయవలసి వచ్చింది. 27 మరి ఇప్పుడు మీరు కూడా అలాంటి ఘోర పాపమే చేస్తున్నట్లు వింటున్నాం. మీరు దేవునిపట్ల నమ్మకంగా వ్యవహరించడం లేదు. మీరు విదేశీ స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నారు.”
28 యోయాదా ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు కొడుకు. యోయాదా కొడుకుల్లో ఒకడు హోనానువాసి అయిన సన్బల్లటుకి అల్లుడు. నేను అతని చోటు విడిచిపెట్టేలా చేశాను. నేనతను పారిపోయేలా కట్టడిచేశాను.
29 ఓ నా దేవా, నీవు వాళ్లని శిక్షించు. వాళ్లు యాజకత్వాన్ని అపవిత్రం చేశారు. అదేదో అంత ముఖ్యం కాదన్నట్లు వాళ్లు వ్యవహరించారు. యాజకులతోనూ, లేవీయులతోనూ నీవు చేసుకున్న ఒడంబడికను వాళ్లు పాటించలేదు. 30 అందుకని నేనా యాజకులనూ, లేవీయులనూ శుచులనుగా, పరిశుద్ధులనుగా చేశాను. నేను విదేశీయులందర్నీ, వాళ్లు నేర్పిన వింత విషయాల్నీ తొలగించాను. నేను లేవీయులకీ, యాజకులకీ వాళ్ల అసలైన సొంత విధులనూ, బాధ్యతలనూ అప్పగించాను. 31 జనం కట్టెల కానుకలనూ, తొలి ఫలాలనూ సరైన సమయాల్లో పట్టుకు వచ్చేలా చూశాను.
ఓ నా దేవా, నేను చేసిన ఈ మంచి పనుల దృష్ట్యా నన్ను గుర్తుంచుకో.
9 నేను నా లేఖల్లో లైంగిక అవినీతి కలవాళ్ళతో సాంగత్యం చేయవద్దని వ్రాసాను. 10 అంటే, సంఘానికి చెందని అవినీతిపరులతో, లోభులతో, మోసగాళ్ళతో, విగ్రహారాధకులతో సాంగత్యం చేయవద్దని నేను చెప్పటం లేదు. అలా చేస్తే మీరు ఈ ప్రపంచాన్నే వదిలివేయవలసి వస్తుంది. 11 నేను ప్రస్తుతం వ్రాసేది ఏమిటంటే తాను సోదరుణ్ణని చెప్పుకొంటూ, లైంగిక అవినీతితో జీవించేవానితో, లోభత్వం చేసేవానితో, విగ్రహారాధన చేసేవానితో, ఇతరులను దూషించేవానితో, త్రాగుబోతుతో, మోసం చేసేవానితో, సహవాసం చేయవద్దని చెపుతున్నాను. అలాంటి వానితో కలిసి భోజనం కూడా చేయవద్దు.
12 సంఘానికి చెందనివానిపై తీర్పు చెప్పే అధికారం నాకు లేదు. కాని సంఘంలో ఉన్నవానిపై తీర్పు చెప్పవలసిన అవసరం ఉంది. 13 “ఆ దోషిని మీ సంఘం నుండి వెలివేయండి.”(A) కాని సంఘానికి చెందనివాళ్ళపై దేవుడు తీర్పు చెపుతాడు.
© 1997 Bible League International