Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: కోరహు కుమారుల అలామోతు రాగ గీతం.
46 దేవుడు మా ఆశ్రయం, మా శక్తి.
ఆయన యందు, మాకు కష్ట కాలంలో ఎల్లప్పుడూ సహాయం దొరుకుతుంది.
2 అందుచేత భూమి కంపించినప్పుడు,
మరియు పర్వతాలు సముద్రంలో పడినప్పుడు మేము భయపడము.
3 సముద్రాలు పొంగినను, చీకటితో నిండినను,
భూమి, మరియు పర్వతాలు కంపించినను మేము భయపడము.
4 ఒక నది ఉంది. దాని కాలువలు దేవుని నివాసానికి,
మహోన్నత దేవుని పరిశుద్ధ పట్టణానికి సంతోషం తెచ్చి పెడ్తాయి.
5 ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. కనుక అది ఎన్నటికీ నాశనం చేయబడదు.
సూర్యోదయానికి ముందే దేవుడు సహాయం చేస్తాడు.
6 రాజ్యాలు భయంతో వణకుతాయి.
యెహోవా గద్దించగా ఆ రాజ్యాలు కూలిపోతాయి. భూమి పగిలిపోతుంది.
7 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
8 యెహోవా చేసే మహత్తర కార్యాలు చూడండి.
ఆ కార్యాలు భూమి మీద యెహోవాను ప్రసిద్ధి చేస్తాయి.
9 భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను యెహోవా ఆపివేయగలడు.
సైనికుల విల్లులను, వారి ఈటెలను ఆయన విరుగగొట్టగలడు. రథాలను ఆయన అగ్నితో కాల్చివేయగలడు.
10 దేవుడు చెబుతున్నాడు, “మౌనంగా ఉండి, నేను దేవుణ్ణి అని తెలుసుకొనండి.
రాజ్యాలతో నేను స్తుతించబడతాను.
భూమిమీద మహిమపర్చబడతాను.”
11 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
18 కావున యోషీయా కుమారుడైన యెహోయాకీము రాజునకు యెహోవా చెప్పుచున్న దేమనగా:
“యూదా ప్రజలు యెహోయాకీమును గూర్చి ఏడ్వరు ‘అయ్యో, నా సోదరుడా, నేను యెహోయాకీమును గురించి దుఃఖిస్తున్నాను!
అయ్యో, నా సహోదరీ, నేను యెహోయాకీమును గురించి విచారిస్తున్నాను!’
అని ప్రజలు ఒకరి కొకరు చెప్పుకోరు.
యూదా ప్రజలు యెహోయాకీమును గిరించి విచారించరు.
‘ఓ యజమానీ, నేను మిక్కిలి దుఃఖిస్తున్నాను.
ఓ రాజా, నేను నీకై విచారిస్తున్నాను!’
అని వారతనిని గురించి చెప్పరు.
19 చచ్చిన గాడిదను పూడ్చి పెట్టినట్లు యెరూషలేము ప్రజలు యెహోయాకీమును పాతిపెడతారు.
అతని శవాన్ని వారు ఈడ్చి పార వేస్తారు. వారు అతని శవాన్ని యెరూషలేము తలుపుల బయటికి విసరి వేస్తారు.
20 “యూదా! లెబానోను పర్వతం మీదికి వెళ్లి కేకలువేయి.
నీ స్వరము బాషాను పర్వతాలలో వినిపించనియ్యి.
అబారీము పర్వతాలలో మిక్కిలి రోదించు.
ఎందువల్లనంటే నీవు మోహించిన వారంతా నాశనమవబోతున్నారు.
21 “యూదా! నీవు చాలా సురక్షితంగా ఉన్నట్టు భావించావు.
కాని నిన్ను నేను హెచ్చరించాను!
నేను నిన్ను హెచ్చరించినా
నీవు లక్ష్యపెట్టలేదు!
నీవు చిన్న వయస్సులో ఈ విధంగా నివసించావు.
యూదా, నీ చిన్న వయస్సు నుండే నీవు నాకు విధేయుడవు కాలేదు
22 యూదా, నేను విధించే శిక్ష తుఫానులా వస్తుంది.
అది నీ గొర్రెల కాపరుల నందరినీ (నాయకులను) ఊది వేస్తుంది.
ఇతర దేశాలు కొన్ని నీకు సహాయపడతాయని అనుకున్నావు.
కాని ఆ రాజ్యాలు కూడ ఓడింపబడతాయి.
అప్పుడు నీకు తప్పక అవమానము కలుగుతుంది.
నీవు చేసిన దుష్కార్యాలను తలచుకొని నీవు సిగ్గుపడతావు.
23 “ఓ రాజా, కొండ మీద దేవదారు కలపతో నిర్మించిన భవనంలో నీవు నివసిస్తున్నావు.
ఈ కలప తేబడిన లెబానోను దేశంలోనే నీవున్నట్లుగా వుంది.
కొండ మీది ఆ పెద్ద భవంతిలో నీకు నీవు
సురక్షితం అనుకుంటున్నావు.
కాని నీకు శిక్ష వచ్చినప్పుడు నీవు నిజంగా రోదిస్తావు.
స్త్రీ ప్రసవ వేదన అనుభవించినట్లు నీవు బాధపడతావు.”
యెహోయాకీను (కొన్యా) పై తీర్పు
24 “యెహోయాకీము కుమారుడవు, యూదా రాజువైన యెహోయాకీనూ, నేను నివసించునంత నిశ్చయముగ చెపుతున్నాను.” ఇది యెహోవా వాక్కు ఇది నీకు చేస్తాను. “నీవు నా చేతి ఉంగరమైనా నిన్ను నేను లాగి పడవేస్తాను! 25 యెహోయాకీనూ, నిన్ను నేను బబులోను రాజైన నెబుకద్నెజరుకు, కల్దీయులకు అప్పగిస్తాను. వారిని గురించే నీవు భయపడుతున్నావు. వారు నిన్ను చంపచూస్తున్నారు. 26 నిన్ను, నీ తల్లినీ మీరు పుట్టని దేశానికి త్రోసి వేస్తారు. నీవు, నీ తల్లి ఆ పరాయి దేశంలో చనిపోతారు. 27 యెహోయాకీనూ, నీ మాతృ భూమికి రావాలని నీవు గాఢంగా కోరుకుంటావు. కాని నీ కోరిక తీరదు. నీవు వచ్చుటకు నేను అనుమతించను.”
28 ఒక వ్యక్తిచే నేలకు విసరి కొట్టబడిన మట్టి కుండ మాదిరి, కొన్యా యొక్క (యోహోయాకీను) స్థితి వున్నది.
ఎవ్వరికీ పనికిరాని ఓటి కుండ మాదిరిగా అతడున్నాడు.
యెహోయాకీను, అతని పిల్లలు ఎందుకు విసర్జించబడతారు?
వారెందుకు అన్య దేశానికి తోయబడతారు?
29 యూదా రాజ్యమా, ఓ రాజ్యమా, ఓ రాజ్యమా!
యెహోవా వర్తమానం వినుము!
30 యెహోవా ఇలా అంటున్నాడు: “యెహోయాకీను గురించి ఈ విషయం వ్రాసి పెట్టండి:
‘అతడు పిల్లలు లేని వానితో లెక్క!
తన జీవిత కాలంలో యెహోయాకీను ఏమీ సాధించలేడు.
అతని పిల్లలలో ఎవ్వడూ దావీదు సింహాసనం మీద కూర్చోడు.
అతని సంతానంలో ఎవడూ యూదా రాజ్యాన్ని ఏలడు.’”
యేసు చిన్నపిల్లల్ని దీవించటం
(మత్తయి 19:13-15; మార్కు 10:13-16)
15 యేసు వారిని తాకాలని ప్రజలు చిన్న పిల్లల్ని ఆయన దగ్గరకు పిలుచుకు వచ్చారు. శిష్యులు యిది చూసి ప్రజల్ని వారించారు. 16 కాని, యేసు ఆ చిన్న పిల్లల్ని తన దగ్గరకు పిలుస్తూ, “చిన్న పిల్లల్ని నా దగ్గరకు రానివ్వండి. వాళ్ళను ఆపకండి. దేవుని రాజ్యం వాళ్ళలాంటి వారిదే. 17 యిది నిజం. దేవుని రాజ్యాన్ని చిన్న పిల్లల్లా అంగీరించనివాడు ఆందులోకి ప్రవేశించలేడు” అని అన్నాడు.
© 1997 Bible League International