Revised Common Lectionary (Complementary)
స్తుతి కీర్తన.
98 యెహోవా, నూతన అద్బుత క్రియలు చేశాడు
గనుక ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి.
ఆయన పవిత్ర కుడి హస్తం
ఆయనకు విజయం తెచ్చింది.
2 యెహోవా రక్షించగల తన శక్తిని రాజ్యాలకు చూపెట్టాడు.
యెహోవా తన నీతిని వారికి చూపించాడు.
3 ఇశ్రాయేలీయుల యెడల ఆయన తన దయను, నమ్మకమును జ్ఞాపకముంచుకొన్నాడు.
రక్షించగల మన దేవుని శక్తిని దూరదేశాల ప్రజలు చూసారు.
4 భూమి మీది ప్రతి జనము యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
త్వరగా స్తుతి కీర్తనలు పాడటం ప్రారంభించండి.
5 స్వరమండలములారా, యెహోవాను స్తుతించండి.
స్వరమండలసంగీతమా, ఆయనను స్తుతించుము.
6 బూరలు, కొమ్ములు ఊదండి.
మన రాజైన యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
7 భూమి, సముద్రం, వాటిలో ఉన్న
సమస్త జీవుల్లారా, బిగ్గరగా పాడండి.
8 నదులారా, చప్పట్లు కొట్టండి.
పర్వతములారా, ఇప్పుడు మీరంతా కలిసి గట్టిగా పాడండి.
9 యెహోవా ప్రపంచాన్ని పాలించుటకు వస్తున్నాడు
గనుక ఆయన ఎదుట పాడండి.
ఆయన ప్రపంచాన్ని న్యాయంగా పాలిస్తాడు.
నీతితో ఆయన ప్రజలను పాలిస్తాడు.
గిబియోనీయులు సౌలు కుటుంబాన్ని శిక్షించమని కోరటం
21 దావీదు కాలంలో ఒకసారి కరువు సంభవించింది. ఆ కరువు మూడు సంవత్సరాలు కొనసాగింది. దావీదు యెహోవాను ప్రార్థించాడు. దావీదు ప్రార్థన ఆలకించి యెహోవా ఇలా అన్నాడు: “సౌలు, మరియు అతని హంతకుల కుటుంబం[a] ఈ కరువుకు కారణం. ఇప్పడీ కాటకం (కష్టం) సౌలు గిబియోనీయులను చంపివేసినందుకు వచ్చింది.” 2 (గిబియోనీయులు ఇశ్రాయేలు వారు కాదు. చావగా మిగిలిన అమ్మోరీయులకు చెందిన ఒక గుంపువారు. ఇశ్రాయేలీయులు వారికి కీడు చేయబోమని గిబియోనీయులకు[b] ప్రమాణ పూర్వకంగా చెప్పియున్నారు. కాని సౌలు ఇశ్రాయేలీయుల పట్ల, యూదా వారి పట్ల ప్రేమకలవాడై గిబియోనీయులను చంపబూనాడు)
దావీదు రాజు గిబియోనీయులను పిలిచాడు. అతడు వారితో మాట్లాడాడు. 3 “నేను మీకు ఏమి సహాయం చేయగలను? మీరు యెహోవా ప్రజలను[c] దీవించేలాగున నేను ఇశ్రాయేలు వారి పాపాన్ని పోగొట్టటానికి ఏమి చేయాలి?” అని దావీదు గిబియోనీయులను అడిగాడు.
4 “సౌలు, అతని కుటుంబం వారు చేసిన పాపాలకు పరిహారంగా వెండి బంగారాలు ఇవ్వాలని అడిగే హక్కుగాని, ఇశ్రాయేలులో ఎవ్వరినైనా చంపేహక్కుగాని మాకు లేదు” అని గిబియోనీయులు దావీదుతో అన్నారు.
“అయితే మీకు నేనేమి చేయగలను?” అని దావీదు అడిగాడు.
5 అప్పుడు గిబియోనీయులు దావీదుతో ఇలా అన్నారు, “సౌలు మాకు వ్యతిరేకంగా కుట్రపన్నాడు. ఇశ్రాయేలులో మిగిలివున్న మా ప్రజలందరినీ సర్వనాశనం చేయాలని ప్రయత్నించాడు. 6 సౌలు యోహోవాచే ఎంపిక చేయబడిన రాజు. కావున అతని ఏడుగురు కుమారులను మా వద్దకు తీసుకొని రా. వారిని మేము సౌలు యొక్క గిబియా పర్వతం మీద యెహోవా ఎదుట ఉరితీస్తాము.”
రాజైన దావీదు, “వారిని మీకు నేను అప్పగించెద” నని అన్నాడు. 7 కాని రాజు యోనాతాను కుమారుడైన మెఫిబోషెతుకు రక్షణ కల్పించాడు. (యోనాతాను సౌలు కుమారుడు) ఆ మేరకు దావీదు యెహోవా పేరు మీద యోనాతానుకు ప్రమాణం[d] చేసియున్నాడు. అందువల్ల రాజు వారిని మెఫీబోషెతుకు హాని చేయించలేదు. 8 అయ్యా కుమార్తెయగు రిస్పాకు సౌలువలన పుట్టిన ఇద్దరు కుమారులను రాజు తీసుకున్నాడు. వారిద్దరి పేర్లు అర్మోని మరియు మెఫీబోషెతు[e] రిస్పా కుమారులైన ఈ ఇద్దరినీ, మరియు సౌలు కుమార్తెయగు మెరాబునకు పుట్టిన ఐదుగురు కుమారులను రాజు తీసుకున్నాడు. (మెహూలతీయుడగు బర్జిల్లయి కుమారుడైన అద్రీయేలువలన మెరాబునకు పుట్టిన వారీ ఐదుగురు పుత్రులు) 9 దావీదు ఈ ఏడుగురు కుమారులను గిబియోనీయులకు అప్పగించాడు. అప్పుడు గిబియోనీయులు ఈ ఏడుగురిని గిబియా పర్వతంమీద యెహోవా సాన్నిధ్యంలో ఉరితీశారు. ఈ ఏడుగురు కుమారులు కలిసి చనిపోయారు. యవల ధాన్యంపంట కోత ప్రారంభకాలంలో వారు చంపబడ్డారు.
రిస్పా తన కుమారుల శవాలకు కాపలా వుండటం
10 అయ్యా కుమార్తె రిస్పా విషాద సూచకమైన ఒక వస్త్రం తీసుకొని కొండ[f] మీద పరచింది. ఆ వస్త్రం పంట కోతలు మొదలు పెట్టినపప్పటి నుండి దానిమీద వర్షం పడే వరకు ఆ కొండ మీద పర్చబడివుంది. పగటి వేళ పక్షులు వచ్చి తన కుమారుల శవాలను ముట్టకుండా రిస్పా చూచేది. రాత్రిళ్లు పొలాల్లో నుంచి జంతువులు వచ్చి కుమారుల శవాలను ముట్టకుండగనూ కాపాడేది.
11 అయ్యా కుమార్తెయు, సౌలు దాసి అగు రిస్పా చేస్తున్నదంతా ప్రజలు దావీదుకు చెప్పారు. 12 అప్పుడు దావీదు యాబేష్గిలాదు వారి నుండి సౌలు యొక్కయు, యోనాతాను యొక్కయు ఎముకలను తీసుకున్నాడు. (యాబేషు వారు ఈ ఎముకలను బేత్షానులోని పధ్రాన వీధి నుండి దొంగిలించారు. బేత్షానులోని ఈ వీధిలోనే గతంలో ఫిలిష్తీయులు సౌలు, యోనాతానుల శవాలను వేలాడదీశారు. గిల్బోవ వద్ద సౌలును చంపిన తరువాత ఫిలిష్తీయులు ఆ శవాలను వేలాడదీశారు) 13 దావీదు గిలాదు నుంచి సౌలు యొక్కయు, అతని కుమారుడైన యోనాతాను యొక్కయు ఎముకలను తెచ్చినాడు. తరువాత ప్రజలు ఉరి తీయబడిన సౌలు యొక్క ఏడుగురి కమారుల శవాలను సేకరించారు. 14 బెన్యామీనులోని సేలా అనేచోట సౌలు యొక్క అతని కుమారుడు యోనాతాను యొక్క ఎముకలను వారు పాతి పెట్టారు. శవాలను మాత్రం సౌలు తండ్రి కీషు సమాధియందు వారు పాతిపెట్టారు. రాజు యొక్క ఆజ్ఞాను సారం ప్రజలు ఇవన్నీ చేశారు. రాజ్యంలోని ప్రజల ప్రార్థన దేవుడు ఆలకించాడు.
3 సోదరులారా! మీ విశ్వాసం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. మీ మధ్య ఉన్న ప్రేమ వర్ధిల్లుతోంది. కనుక మీ విషయంలో మేము దేవునికి అన్నివేళలా కృతజ్ఞతగా ఉండాలి. 4 మీరు ఓర్పుతో సహిస్తున్న హింసలను గురించి, కష్టాలను గురించి విశ్వాసాన్ని గురించి మేము పొగడుతూ దేవుని ఇతర సంఘాలకు చెపుతూ ఉంటాము.
దేవుని తీర్పు గూర్చి పౌలు చెప్పటం
5 దేవుడు న్యాయంగా తీర్పు చెబుతాడన్నదానికి ఇది సాక్ష్యం. మీరు దేనికొరకు వీటిని అనుభవిస్తున్నారో ఆ రాజ్యానికి దేవుడు మిమ్మల్ని అర్హులుగా చేస్తాడు. 6 దేవుడు నీతిమంతుడు. మిమ్మల్ని కష్టపెట్టినవాళ్ళకు కష్టం కలిగిస్తాడు. 7 ఆయన మనందరి కష్టాలు తొలిగిస్తాడు. ఇది యేసు ప్రభువు పరలోకం నుండి శక్తిగల దేవదూతలతో, అగ్నిజ్వాలలతో వచ్చినప్పుడు సంభవిస్తుంది. 8 దేవుడు అంటే ఎవరో తెలియనివాళ్ళను, మన ప్రభు యేసు సువార్తను అంగీకరించనివాళ్ళను ఆయన శిక్షిస్తాడు. 9 వాళ్ళు ప్రభువు సమక్షంలో నుండి, ఆయన గొప్పశక్తి నుండి దూరమై శాశ్వతంగా నాశనమై పోతారు. 10 ఆయన వచ్చినప్పుడు ఆయన విశ్వాసులు ఆయనతో సహా మహిమను పొందుతారు. అప్పుడు ఆయనయందు విశ్వసించినవాళ్ళు ఆయన్ని చూసి దిగ్భ్రాంతి చెందుతారు. మేము చెప్పిన సందేశాన్ని మీరు కూడా విశ్వసించారు కనుక మహిమను పొందేవాళ్ళలో మీరు కూడా ఉన్నారు.
11 ఇది మనస్సులో పెట్టుకొని తాను పిలిచిన పిలుపుకు తగినట్లు మీ జీవితాలను నడపమని మేము దేవుణ్ణి ప్రతిరోజూ ప్రార్థిస్తూ ఉంటాము. అంతేకాక, మీరు మంచి చేయాలని ఆశిస్తూ కోరుకొన్న ప్రతి కోరికను, విశ్వాసంవల్ల మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని దేవుడు తన శక్తి ద్వారా పూర్తి చేయాలనీ ప్రార్థిస్తూ ఉంటాము. 12 మీ ద్వారా మన యేసు క్రీస్తు ప్రభువు మహిమ పొందాలని, మీకు ఆయన ద్వారా తన మహిమలో భాగం కలగాలని మేము ప్రార్థిస్తూ ఉంటాము. ఇది మన దేవుని అనుగ్రహంవల్ల, యేసు క్రీస్తు ప్రభువు యొక్క కృప వల్ల సంభవిస్తుంది.
© 1997 Bible League International