Revised Common Lectionary (Complementary)
దావీదు యాత్ర కీర్తన.
124 గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మనకు ఏమి జరిగి ఉండేదో?
ఇశ్రాయేలూ, నాకు జవాబు చెప్పుము.
2 గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మాకు ఏమి జరిగి ఉండేదో?
ప్రజలు మనమీద దాడి చేసినప్పుడు ఏమి జరిగి ఉండేదో?
3 అప్పుడు మన శత్రువులకు మన మీద కోపం వచ్చినప్పుడల్లా
వాళ్లు మనల్ని సజీవంగా మింగేసి ఉండేవాళ్లు.
4 అప్పుడు మన శత్రుసైన్యాలు మనల్ని కొట్టుకుపోయే ప్రవాహంలా,
మనల్ని ముంచివేసే నదిలా ఉండేవి.
5 అప్పుడు ఆ గర్విష్ఠులు నోటి వరకూ పొంగుతూ
మనల్ని ముంచి వేసే నీళ్లలా పొంగుతూ ఉండేవాళ్లు.
6 యెహోవాను స్తుతించండి. మన శత్రువులు
మనల్ని పట్టి చంపకుండునట్లు యెహోవా చేశాడు.
7 మనం వలలో పట్టబడి తర్వాత తప్పించుకొన్న పక్షిలా ఉన్నాము.
వల తెగిపోయింది. మనం తప్పించుకొన్నాము.
8 మనకు సహాయం యెహోవా దగ్గర నుండే వచ్చింది.
భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.
జల ప్రళయం ఆగి పోవుట
8 అయితే నోవహును దేవుడు మరచిపోలేదు. నోవహును, అతనితో కూడ ఓడలో ఉన్న జంతువులన్నింటిని, పశువులన్నింటిని దేవుడు జ్ఞాపకం చేసుకొన్నాడు. భూమిమీద గాలి వీచేటట్లు దేవుడు చేశాడు. నీళ్లన్నీ కనపడకుండా పోయాయి.
2 ఆకాశం నుండి వర్షం కురవటం ఆగిపోయింది. భూమి క్రింద నుండి నీళ్లు ఉబుకుట కూడ నిలిచిపోయింది. 3-4 నేలమీద నిండిన నీళ్లు బాగా ఇంకిపోవడం మొదలయింది. 150 రోజుల తర్వాత నీళ్లు బాగా తగ్గిపోయాయి, గనుక ఓడ మరల నేలమీద నిలిచింది. అరారాతు పర్వతాల్లో ఒకదాని మీద ఓడ నిలిచింది. ఇది ఏడవ నెల పదిహేడవ రోజు. 5 నీళ్లు ఇంకిపోతూనే ఉన్నాయి, పదవ నెల మొదటి రోజుకు కొండ శిఖరాలు నీళ్లకు పైగా కనబడ్డాయి.
6 నలభై రోజుల తర్వాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తెరిచాడు. 7 ఒక కాకిని నోవహు బయటకు పంపాడు. నీళ్లన్నీ ఇంకి పోయి, నేల ఆరిపోయేంత వరకు ఒక చోటునుండి మరో చోటుకు ఆ కాకి ఎగురుతూనే ఉంది. 8 ఒక పావురాన్ని కూడా నోవహు పంపించాడు. ఆరిన నేలను పావురం తెల్సుకోవాలనుకొన్నాడు నోవహు. అతడు నేల ఇంకా నీళ్లతో నిండి ఉందేమో తెల్సుకోవాలనుకొన్నాడు.
9 నేలమీద ఇంకా నీళ్లు నిండి ఉండటం చేత పావురం తిరిగి ఓడలోకి వచ్చేసింది. నోవహు చేయి బయటకు చాచి పావురాన్ని పట్టుకున్నాడు. ఆ పావురాన్ని నోవహు మళ్లీ ఓడలోకి తెచ్చాడు.
10 ఏడు రోజుల తర్వాత నోవహు పావురాన్ని మళ్లీ బయటకి పంపించాడు. 11 ఆ మధ్యాహ్నం ఆ పావురం మళ్లీ నోవహు దగ్గరకు వచ్చేసింది. తాజా ఒలీవ ఆకు ఆ పావురం నోటిలో ఉంది. భూమిమీద ఆరిన నేల ఉన్నట్లుగా నోవహుకు అది ఒక గుర్తు. 12 ఏడు రోజుల తర్వాత నోవహు పావురాన్ని మరల బయటకి పంపించాడు. అయితే ఈసారి పావురం మరల ఎన్నడూ తిరిగిరాలేదు.
13 ఆ తర్వాత నోవహు ఓడ తలుపులు తెరిచాడు. నేల ఆరిపోయినట్లుగా నోవహు చూశాడు. అది సంవత్సరములో మొదటి నెల మొదటి రోజు. అప్పుడు నోవహు వయస్సు 601 సంవత్సరాలు. 14 రెండవ నెల 27వ రోజుకు నేల పూర్తిగా ఆరిపోయింది.
15 అప్పుడు యెహోవా నోవహుతో అన్నాడు: 16 “ఓడ నేలకు దిగింది. నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడళ్లు ఇప్పుడు బయటకు వెళ్లాలి. 17 జీవమున్న ప్రతి జంతువును, పక్షులన్నింటిని, భూమిమీద ప్రాకు ప్రాణులన్నిటిని నీతోబాటు బయటకు తీసుకొనిరా. ఆ జంతువులు సంతానాభివృద్ధి చెంది, అవి మరల భూమిని నింపుతాయి.”
18 తన కుమారులు, తన భార్య, తన కోడళ్లతో నోవహు బయటకు వెళ్లాడు. 19 జంతువులన్నీ ప్రాకు ప్రాణులన్నీ, ప్రతి పక్షి ఓడను విడచి వెళ్లాయి. జంతువులన్నీ వాటి జాతి ప్రకారం గుంపులుగా బయటకు వచ్చాయి.
పాపం విషయంలో మరణించాము గాని క్రీస్తులో బ్రతికినాము
6 దైవానుగ్రహం అధికం కావాలని మనం పాపం చేసుకొంటూ పోదామంటారా? 2 ఎన్నటికి కాదు. పాపపు జీవితం విషయంలో మనం మరణించినవారము. అలాంటప్పుడు మనం పాపంలో జీవించుకొంటూ ఎట్లా ఉండగలము? 3 బాప్తిస్మము పొందిన మన మందరము క్రీస్తు యేసులో ఐక్యత పొందాము. ఈ బాప్తిస్మము ద్వారా ఆయన మరణంలో కూడా భాగం పంచుకొన్నామని మీకు తెలియదా? 4 ఈ బాప్తిస్మము ద్వారా మరణించి మనం ఆయనతో సహా సమాధి పొందాము. తండ్రి తేజస్సు ద్వారా క్రీస్తు బ్రతికింపబడినట్లుగానే మనం కూడా నూతన జీవితాన్ని పొందటమే ఇందులోని ఉద్దేశ్యం.
5 మనం ఆయన మరణంలో ఐక్యమైనట్లుగా ఆయన పునరుత్ధానములో కూడా మనం ఐక్యం కాగలం. 6 మన పాపజీవితం క్రీస్తుతో కూడ సిలువ వేయబడినందున, ఈ పాప శరీరం బలహీనమై, మనమిక పాపానికి దాసులుగానుండమని మనకు తెలుసు. 7 ఎందుకంటే మరణించిన ప్రతి వ్యక్తి పాపంనుండి విముక్తి పొందుతాడు.
8 మనం క్రీస్తుతో కలిసి మరణిస్తే ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముచున్నాము. 9 దేవుడు క్రీస్తును బ్రతికించాడని, ఆయనకు మళ్ళీ మరణం ప్రాప్తించదని మనకు తెలుసు. మరణానికి ఆయనపై అధికారం ఉండదు. 10 పాపం విషయమై ఆయన ఒకే ఒకసారి మరణించాడు. కాని ఆయన జీవిస్తున్న జీవితం దేవుని కోసం జీవిస్తున్నాడు. 11 అదే విధంగా, మీరు పాపం విషయంలో మరణించినట్లు దేవునికోసం యేసుక్రీస్తులో జీవిస్తున్నట్లు భావించండి.
© 1997 Bible League International