Revised Common Lectionary (Complementary)
23 “యూదా కాపరులకు (నాయకులకు) చాలా చెడ్డదిగా ఉంటుంది. వారు నా గొర్రెలను (ఇశ్రాయేలీయులను) చెదరు గొట్టుతున్నారు. నా పచ్చిక బయలు నుండి గొర్రెలను పొమ్మని నలుదిశలా తోలి వేస్తున్నారు.” ఇది యెహోవా నుంచి వచ్చిన వాక్కు.
2 ఆ కాపరులు (నాయకులు) నా ప్రజలకు బాధ్యులు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆ కాపరులకు ఈ విషయాలు చెపుతున్నాడు: “ఓ కాపరులారా (నాయకులు), మీరు నా గొర్రెల మందను నలుదిశలా పారిపోయేలా చేశారు. వారు పోవటానికి మీరు ఒత్తిడి తెచ్చారు. మీరు వారిని గురించి శ్రద్ధ వహించలేదు. కాని నేను మీతో వ్యవహరిస్తాను. మీరు చేసిన చెడుకార్యాలకు నేను మిమ్మల్ని శిక్షిస్తాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. 3 “నేను నా గొర్రెల మందను (ప్రజలను) ఇతర దేశాలకు పంపాను. పోయిన నా మందలను (ప్రజలను) నేను చేరదీస్తాను. వాటిని పచ్చిక బయలుకు (దేశానికి) మరల చేర్చుతాను. నా మందలు (ప్రజలు) వాటి పచ్చిక బీటికి (దేశానికి) తిరిగి చేరుకోగానే వాటికి సంతానోత్పత్తి జరిగి, అభివృద్ధి చెందుతాయి. 4 నా గొర్రెల మందపై నేను క్రొత్త కాపరులను (నాయకులను) నియమిస్తాను. ఆ కాపరులు నా మంద విషయమై శ్రద్ధ వహిస్తారు. నా మంద బెదరిపోయేలా గాని, జడిసి పోయేలా గాని చేయబడదు. నా మందలో ఒక్క గొర్రె కూడా తప్పిపోదు.” ఇదే యెహోవా వాక్కు.
నీతియుక్తమైన “అంకురం” (క్రొత్త రాజు)
5 “నేనొక నీతి యుక్తమైన అంకురాన్ని[a] మొలిపింప జేసే సమయం వస్తూవుంది,”
ఇదే యెహోవా వాక్కు.
అతడు మంచి తెలివి తేటలతో పరిపాలించగల రాజు.
దేశానికి ఏది యోగ్యమైనదో, ఏది మంచిదో అతడది చేస్తాడు.
6 శుద్ధమైన మంచి బీజోత్పత్తి సమయమందు యూదా ప్రజలు రక్షింపబడతారు.
ఇశ్రాయేలు సురక్షితంగా నివసిస్తుంది.
“యెహోవా మనకు న్యాయం”[b]
అని అతనికి పేరుగా ఉంటుంది.
సంగీత నాయకునికి: కోరహు కుమారుల అలామోతు రాగ గీతం.
46 దేవుడు మా ఆశ్రయం, మా శక్తి.
ఆయన యందు, మాకు కష్ట కాలంలో ఎల్లప్పుడూ సహాయం దొరుకుతుంది.
2 అందుచేత భూమి కంపించినప్పుడు,
మరియు పర్వతాలు సముద్రంలో పడినప్పుడు మేము భయపడము.
3 సముద్రాలు పొంగినను, చీకటితో నిండినను,
భూమి, మరియు పర్వతాలు కంపించినను మేము భయపడము.
4 ఒక నది ఉంది. దాని కాలువలు దేవుని నివాసానికి,
మహోన్నత దేవుని పరిశుద్ధ పట్టణానికి సంతోషం తెచ్చి పెడ్తాయి.
5 ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. కనుక అది ఎన్నటికీ నాశనం చేయబడదు.
సూర్యోదయానికి ముందే దేవుడు సహాయం చేస్తాడు.
6 రాజ్యాలు భయంతో వణకుతాయి.
యెహోవా గద్దించగా ఆ రాజ్యాలు కూలిపోతాయి. భూమి పగిలిపోతుంది.
7 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
8 యెహోవా చేసే మహత్తర కార్యాలు చూడండి.
ఆ కార్యాలు భూమి మీద యెహోవాను ప్రసిద్ధి చేస్తాయి.
9 భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను యెహోవా ఆపివేయగలడు.
సైనికుల విల్లులను, వారి ఈటెలను ఆయన విరుగగొట్టగలడు. రథాలను ఆయన అగ్నితో కాల్చివేయగలడు.
10 దేవుడు చెబుతున్నాడు, “మౌనంగా ఉండి, నేను దేవుణ్ణి అని తెలుసుకొనండి.
రాజ్యాలతో నేను స్తుతించబడతాను.
భూమిమీద మహిమపర్చబడతాను.”
11 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
11 సర్వశక్తి సంపన్నుడైన దేవుడు మీకు శక్తినిచ్చు గాక! అప్పుడు అన్నిటినీ సంతోషంతో భరించగల సహనము మీలో కలుగుతుంది.
12 దేవుడు తన వెలుగు రాజ్యంలో, అంటే తన విశ్వాసుల కోసం ప్రత్యేకంగా ఉంచిన దానిలో మీకు భాగం లభించేటట్లు చేసాడు. దానికి మీరు తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతతో ఉండండి. 13 మనల్ని చీకటి రాజ్యం నుండి రక్షించి, తాను ప్రేమించే కుమారుని రాజ్యంలోకి రప్పించాడు. 14 కుమారుడు మన పక్షాన మన పాపాల నిమిత్తం తన ప్రాణం చెల్లించాడు. కనుక ఆయన కారణంగా దేవుడు మనల్ని క్షమించాడు.
క్రీస్తు యొక్క గొప్పతనము
15 క్రీస్తు కనిపించని దేవుని ప్రతిబింబం. ఆయన
అన్నిటికన్నా పూర్వంనుండి అనగా జగత్తుకు
పునాది వేయుటకు ముందునుండి ఉన్నవాడు.
16 క్రీస్తు అన్నిటినీ సృష్టించాడు.
పరలోకంలో ఉన్న వాటిని, భూమ్మీద కనిపించే వాటిని, కనిపించని వాటిని,
సింహాసనాలను, ప్రభుత్వాలను, పాలకులను, అధికారులను, అన్నిటినీ ఆయనే సృష్టించాడు.
అన్నీ తన కోసం సృష్టించుకొన్నాడు.
17 క్రీస్తు ఆదినుండి ఉన్నాడు.
ఆయనలో అన్నీ ఐక్యమై ఉన్నాయి.
18 సంఘం ఆయన శరీరం. ఆయన సంఘానికి శిరస్సు.
ఆయనే అన్నిటికీ మూలం.
చనిపోయి తిరిగి బ్రతికినవాళ్ళలో ఆయన మొదటివాడు.
అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత ఉండాలని దేవుడు యిలా చేసాడు.
19 దేవుడు తనలో ఉన్న పరిపూర్ణత ఆయనలో ఉండటానికి ఆనందంగా అంగీకరించాడు.
20 దేవుడు అన్నిటినీ, అంటే భూమ్మీద ఉన్నవాటినీ, పరలోకంలో ఉన్నవాటిని,
కుమారుని ద్వారా తిరిగి తనలో చేర్చుకోవాలనుకొన్నాడు.
తన కుమారుడు సిలువపై చిందించిన రక్తం ద్వారా ఈ సంధి కలగాలని ఆయన ఉద్దేశ్యం.
33 కల్వరి[a] అనబడే స్థలాన్ని చేరుకొన్నాక ఆ నేరస్థులు యిద్దర్నీ ఒకణ్ణి యేసుకు కుడివైపు, మరొకణ్ణి ఎడమవైపు ఉంచి ముగ్గుర్నీ సిలువకు వేసారు.
34 యేసు, “తండ్రి, వాళ్ళను క్షమించు, వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు”[b] అని అన్నాడు.
వాళ్ళు చీట్లు వేసి ఆయన దుస్తుల్ని పంచుకొన్నారు. 35 ప్రజలు జరుగుతున్న వాటిని చూస్తూ నిలబడి ఉన్నారు. పాలకులు ఎగతాళి చేసారు. వాళ్ళు, “ఇతర్లను రక్షించాడే! తాను దేవుడెన్నుకొన్న వాడైనట్లైతే, తాను ‘క్రీస్తు’ అయినట్లైతే తనను తాను రక్షించుకోనీ!” అని అన్నారు.
36 భటులు కూడా దగ్గరకు వచ్చి ఆయన్ని హేళన చేసారు. వాళ్ళు ఆయనకు పులిసిన ద్రాక్షారసం యిస్తూ 37 “నీవు యూదుల రాజువైతే నిన్ను నీవు రక్షించుకో!” అని ఎగతాళి చేసారు. 38 “ఇతడు యూదుల రాజు” అని వ్రాసి సిలువకు తగిలించారు.
39 ఆయనతో సహా సిలువకు వేయబడిన ఒక నేరస్థుడు, “నీవు క్రీస్తువు కదా! నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు!” అని అవమానపరిచాడు.
40 కాని మరొక నేరస్థుడు మొదటి వాణ్ణి గద్దిస్తూ, “నీవు దేవునికి భయపడవా! నీవు కూడా అదే శిక్ష అనుభవిస్తున్నావు కదా! మనల్ని శిక్షించటం న్యాయమే. 41 మనము చేసిన నేరానికి తగిన శిక్ష అనుభవిస్తున్నాము. కాని ఆయన ఏ అపరాధమూ చెయ్యలేదు” అని అన్నాడు. 42 ఆ తదుపరి ఆయనతో, “యేసూ! నీవు నీ రాజ్యం చెయ్యటం మొదలు పెట్టినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకో” అని అన్నాడు.
43 యేసు, “ఇది నిజం, ఈ రోజు నువ్వు నాతో సహా పరదైసులో[c] ఉంటావు” అని సమాధానం చెప్పాడు.
© 1997 Bible League International