Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 124

దావీదు యాత్ర కీర్తన.

124 గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మనకు ఏమి జరిగి ఉండేదో?
    ఇశ్రాయేలూ, నాకు జవాబు చెప్పుము.
గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మాకు ఏమి జరిగి ఉండేదో?
    ప్రజలు మనమీద దాడి చేసినప్పుడు ఏమి జరిగి ఉండేదో?
అప్పుడు మన శత్రువులకు మన మీద కోపం వచ్చినప్పుడల్లా
    వాళ్లు మనల్ని సజీవంగా మింగేసి ఉండేవాళ్లు.
అప్పుడు మన శత్రుసైన్యాలు మనల్ని కొట్టుకుపోయే ప్రవాహంలా,
    మనల్ని ముంచివేసే నదిలా ఉండేవి.
అప్పుడు ఆ గర్విష్ఠులు నోటి వరకూ పొంగుతూ
    మనల్ని ముంచి వేసే నీళ్లలా పొంగుతూ ఉండేవాళ్లు.

యెహోవాను స్తుతించండి. మన శత్రువులు
    మనల్ని పట్టి చంపకుండునట్లు యెహోవా చేశాడు.

మనం వలలో పట్టబడి తర్వాత తప్పించుకొన్న పక్షిలా ఉన్నాము.
    వల తెగిపోయింది. మనం తప్పించుకొన్నాము.
మనకు సహాయం యెహోవా దగ్గర నుండే వచ్చింది.
    భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.

యెషయా 54:1-10

దేవుడు తన ప్రజలను స్వదేశానికి తీసుకొనివస్తాడు

54 ఓ స్త్రీ, సంతోషంగా ఉండు!
నీకు పిల్లలు పుట్టలేదు,
    కానీ నీవు చాలా సంతోషంగా ఉండాలి.

“భర్తగల స్త్రీకంటె ఒంటరి స్త్రీ[a]
    ఎక్కువ మంది పిల్లలను కంటుంది.”
అని యెహోవా చెబుతున్నాడు.
నీ గుడారం విశాలం చేయి.
    నీ ద్వారాలు పూర్తిగా తెరువు.
    నీ కుటుంబాన్ని వృద్ధి చేయటం ఆపుజేయకు.
నీ గుడారాన్ని విశాలం చేయి, బలంగా చేయి.
    ఎందుకంటే నీవు చాలా పెరిగిపోవటం మొదలు పెడతావు.
నీ పిల్లలు అనేక రాజ్యాల నుండి ప్రజలను తీసుకొనివస్తారు.
    నాశనం చేయబడిన పట్టణాల్లో ఆ పిల్లలు తిరిగి నివసిస్తారు.
భయపడవద్దు!
    నీవు నిరాశ చెందవు.
నీ మీద ప్రజలు చెడ్డ మాటలు చెప్పరు.
    నీవేమీ ఇబ్బంది పడవు.
నీవు చిన్నదానివిగా ఉన్నప్పుడు నీవు సిగ్గుపడ్డావు.
    కానీ ఆ సిగ్గు నీవు ఇప్పుడు మరచిపోతావు.
నీ భర్త పోయినప్పుడు నీకు కలిగిన అవమానాన్ని
    నీవు జ్ఞాపకం చేసుకోవు.
ఎందుకంటే నిన్ను చేసిన వాడు నీ భర్త (దేవుడు)
    గనుక ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా.
ఇశ్రాయేలును రక్షించేవాడు ఆయనే. ఆయన ఇశ్రాయేలు పరిశుద్ధుడు.
    ఆయన సర్వభూమికి దేవుడు అని పిలువ బడతాడు.

నీవు భర్త విడిచిన భార్యవలె ఉన్నావు.
    ఆత్మలో నీవు చాలా దుఃఖించావు.
కానీ యెహోవా నిన్ను తనదిగా ఉండేందుకు పిలిచాడు.
    యవ్వనంలో వివాహమై, భర్తచే విడిచి పెట్టబడిన స్త్రీలా నీవు ఉన్నావు.
కానీ దేవుడు నిన్ను తనదానిగా ఉండుటకు పిలిచాడు.
దేవుడు చెబుతున్నాడు,
“నేను నిన్ను విడిచిపెట్టాను. కానీ కొంతకాలం మట్టుకే.
    నేను నిన్ను మళ్లీ నా దగ్గరకు చేర్చుకొంటాను. నేను నీకు గొప్ప దయ చూపిస్తాను.
నేను చాలా కోపగించి కొద్ది కాలం పాటు నీ నుండి దాక్కున్నాను.
    కానీ శాశ్వతంగా నిన్ను నేను దయతో ఆదరిస్తాను.”
నీ రక్షకుడైన యెహోవా ఇది చెప్పాడు.
దేవుడు చెబుతున్నాడు:
“నోవహు కాలంలో ప్రళయంతో నేను ప్రపంచాన్ని శిక్షించినట్టుగా ఉంది ఇది.
    ప్రపంచాన్ని మళ్లీ ఎన్నడూ ప్రళయంతో ముంచివేయనని నొవహుకు నేను వాగ్దానం చేశాను.
అదే విధంగా, నేను మరల ఎన్నడు నీ మీద కోపగించి, నిన్నుగూర్చి చెడుగా మాట్లాడనని ప్రమాణం చేస్తున్నాను.”

10 యెహోవా చెబుతున్నాడు: “పర్వతాలు కనిపించకుండా పోవచ్చు,
    కొండలు ధూళి కావచ్చును.
కానీ నా దయ నిన్ను ఎన్నటికీ విడువదు.
నేను నీతో సమాధానపడతాను,
    అది ఎన్నటికీ అంతం కాదు.”
యెహోవా నీ యెడల కరుణ చూపిస్తాడు. మరియు ఈ సంగతులు చెప్పిన వాడు ఆయనే.

మత్తయి 24:23-35

23 “ఆ రోజుల్లో మీలో ఎవరైనా, ‘ఇదిగో చూడండి క్రీస్తు యిక్కడ ఉన్నాడు’ అని కాని, లేక, ‘అక్కడున్నాడు’ అని కాని అంటే నమ్మకండి. 24 ఎందుకంటే క్రీస్తులమని, ప్రవక్తలమని చెప్పుకొంటూ ప్రజల్ని మోసం చెయ్యటానికి గొప్ప మహత్యాలు, ఆశ్చర్యం కలిగించే కార్యాలు చేసే మోసగాళ్ళు బయలు దేరుతారు. వీళ్ళు వీలైతే దేవుడు ఎన్నుకొన్నవాళ్ళను కూడా మోసం చెయ్యటానికి ప్రయత్నిస్తారు. 25 చూడండి! ముందే మీకు చెబుతున్నాను.

26 “కనుక మీతో ఎవరైనా, ‘అదిగో! ఆయన నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్నాడు’ అంటే, అక్కడికి వెళ్ళకండి. లేక, ‘యిక్కడ గదుల్లో ఉన్నాడు’ అంటే, నమ్మకండి. 27 తూర్పునుండి పడమర దాకా మెరిసే మెరుపు వలే మనుష్యకుమారుడు వస్తాడు. 28 శవమున్న చోటే రాబందులు ప్రోగౌతాయి.

29 “ఆ కష్టకాలం గడిచిన వెంటనే,

‘దేవుడు సూర్యుణ్ణి చీకటిగా చేస్తాడు.
    చంద్రుడు వెలుగునివ్వడు
నక్షత్రాలు ఆకాశంనుండి రాలిపోతాయి
    ఆకాశంలోని శక్తులు కదలిపోతాయి.’[a]

30 “అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశంలో కనిపిస్తుంది. భూమ్మీద ఉన్న దేశాలన్నీ దుఃఖిస్తాయి. మనుష్యకుమారుడు శక్తితో, గొప్ప తేజస్సుతో ఆకాశంలోని మేఘాలపై రావటం వాళ్ళు చూస్తారు. 31 అప్పుడు దేవుడు తన దూతల్ని గొప్ప బూరధ్వనితో పంపుతాడు. ఆ దూతలు నలువైపుల నుండి అంటే, ఆ చివరి నుండి ఈ చివరిదాకా గాలించి దేవుడెన్నుకొన్న వాళ్ళను ప్రోగు చేస్తారు.

32 “ఇక ఇప్పుడు అంజూరపు చెట్టు ఉపమానాన్ని గురించి నేర్చుకొండి. వాటి రెమ్మలు మృదువై ఆకులు చిగురించగానే, ఎండకాలం దగ్గరకు వచ్చిందని మీకు తెలిసి పోతుంది. 33 అదే విధంగా నేను చెప్పినవన్నీ చూసిన వెంటనే ఆయన దగ్గరలోనే ఉన్నాడని అంటే మీ తలుపు ముందే ఉన్నాడని తెలుసుకొంటారు. 34 ఇది సత్యం. ఇవన్నీ జరిగేదాకా ఈ తరం వాళ్ళు జీవించే ఉంటారు. 35 భూమి, ఆకాశము నశించి పోతాయి కాని నా మాటలు శాశ్వతంగా నిలిచి పోతాయి!

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International