Revised Common Lectionary (Complementary)
యెహోవా తన ప్రజల ఎడల దయ చూపిస్తూ ఉన్నాడు
7 యెహోవా దయగలవాడు అని నేను జ్ఞాపకం చేసుకొంటాను.
మరియు యెహోవాను స్తుతించటం నేను జ్ఞాపకం చేసుకొంటాను.
ఇశ్రాయేలు వంశానికి యెహోవా అనేకమైన మంచివాటిని ఇచ్చాడు.
యెహోవా మా యెడల చాలా దయచూపించాడు.
యెహోవా మా యెడల కరుణ చూపించాడు.
8 “వీరు నా పిల్లలు. ఈ పిల్లలు అబద్ధమాడరు”
అని యెహోవా చెప్పాడు.
కనుక యెహోవా ఈ ప్రజలను రక్షించాడు.
9 ప్రజలకు చాలా కష్టాలు వచ్చాయి.
కానీ యెహోవా వారికి విరోధంగా లేడు.
యెహోవా ప్రజలను ప్రేమించాడు. వారిని గూర్చి ఆయన విచారించాడు.
కనుక యెహోవా ప్రజలను రక్షించాడు.
వారిని రక్షించేందుకు ఆయన తన ప్రత్యేక దేవదూతను పంపించాడు.
మరియు యెహోవా ఆ ప్రజలను గూర్చి శ్రద్ధ తీసుకోవటం శాశ్వతంగా కొనసాగిస్తాడు. ఆ ప్రజలను గూర్చి శ్రద్ధ తీసుకోవటం ఎన్నడైనా చాలించాలని యెహోవా కోరలేదు.
148 యెహోవాను స్తుతించండి!
పైన ఉన్న దూతలారా, ఆకాశంలో యెహోవాను స్తుతించండి!
2 సకల దూతలారా, యెహోవాను స్తుతించండి!
ఆయన సర్వ సైనికులారా,[a] ఆయనను స్తుతించండి!
3 సూర్యచంద్రులారా, యెహోవాను స్తుతించండి.
ఆకాశంలోని నక్షత్రాలూ, వెలుతురూ యెహోవాను స్తుతించండి!
4 మహా ఉన్నతమైన ఆకాశంలోని యెహోవాను స్తుతించండి.
ఆకాశం పైగా ఉన్న జలములారా, ఆయనను స్తుతించండి.
5 యెహోవా నామాన్ని స్తుతించండి.
ఎందుకనగా దేవుడు ఆజ్ఞ యివ్వగా ప్రతి ఒక్కటీ సృష్టించబడింది.
6 ఇవన్నీ శాశ్వతంగా కొనసాగేందుకు దేవుడు చేశాడు.
ఎన్నటికి అంతంకాని న్యాయచట్టాలను దేవుడు చేశాడు.
7 భూమి మీద ఉన్న సమస్తమా. యెహోవాను స్తుతించు!
మహా సముద్రాలలోని గొప్ప సముద్ర జంతువుల్లారా, యెహోవాను స్తుతించండి.
8 అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి,
తుఫాను, గాలులు అన్నింటినీ దేవుడు చేశాడు.
9 పర్వతాలను, కొండలను, ఫలవృక్షాలను,
దేవదారు వృక్షాలను దేవుడు చేశాడు.
10 అడవి జంతువులను, పశువులను, పాకే ప్రాణులను, పక్షులను అన్నింటినీ దేవుడు చేశాడు.
11 భూమి మీద రాజ్యాలను రాజులను దేవుడు చేశాడు.
నాయకులను, న్యాయాధిపతులను దేవుడు చేశాడు.
12 యువతీ యువకులను దేవుడు చేశాడు.
వృద్ధులను, యవ్వనులను దేవుడు చేశాడు.
13 యెహోవా నామాన్ని స్తుతించండి!
ఆయన నామాన్ని శాశ్వతంగా ఘనపర్చండి!
భూమిపైన, ఆకాశంలోను ఉన్న
సమస్తం ఆయనను స్తుతించండి!
14 దేవుడు తన ప్రజలను బలవంతులుగా చేస్తాడు.
దేవుని అనుచరులను మనుష్యులు పొగడుతారు.
ఎవరి పక్షంగా అయితే దేవుడు పోరాడుతున్నాడో ఆ ఇశ్రాయేలీయులను మనుష్యులు పొగడుతారు. యెహోవాను స్తుతించండి!
10 దేవుడు తన కుమారుల్లో చాలామంది తన మహిమలో భాగం పంచుకొనేటట్లు చెయ్యాలని, వాళ్ళ రక్షణకు కారకుడైనటువంటి యేసును కష్టాలనుభవింపజేసి, ఆయనలో పరిపూర్ణత కలుగ చేసాడు. ఎవరికోసం, ఎవరిద్వారా, ఈ ప్రపంచం సృష్టింపబడిందో ఆ దేవుడు ఈ విధంగా చేయటం ధర్మమే! యేసు మానవుల్ని పవిత్రం చేస్తాడు.
11 ఆయన పవిత్రం చేసిన ప్రజలు, పవిత్రం చేసే ఆయన ఒకే కుటుంబానికి చెందినవాళ్ళు. అందువలనే, వాళ్ళు తన సోదరులని చెప్పుకోవటానికి యేసు సిగ్గుపడటంలేదు. 12 ఆయన ఈ విధంగా అన్నాడు:
“నిన్ను గురించి నా సోదరులకు తెలియ చేస్తాను.
సభలో, నిన్ను స్తుతిస్తూ పాటలు పాడతాను!”(A)
13 మరొక చోట
“నేను దేవుణ్ణి నమ్ముతున్నాను!”(B)
అంతేకాక ఇలా కూడా అన్నాడు:
“నేను, దేవుడు నాకిచ్చిన సంతానం యిక్కడ ఉన్నాము!”(C)
14 ఆయన “సంతానమని” పిలువబడినవాళ్ళు రక్తమాంసాలుగల ప్రజలు. యేసు వాళ్ళలా అయిపోయి వాళ్ళ మానవనైజాన్ని పంచుకొన్నాడు. ఆయన తన మరణం ద్వారా మరణంపై అధికారమున్న సాతాన్ను నాశనం చేయాలని ఇలా చేశాడు. 15 తద్వారా జీవితాంతం మరణానికి భయపడి జీవించే వాళ్ళకు స్వేచ్ఛకలిగించాడు. 16 నిజానికి, ఆయన దేవదూతలకు సహయం చెయ్యాలని రాలేదు. అబ్రాహాము సంతానానికి సహయం చెయ్యాలని వచ్చాడు. 17 ఈ కారణంగా ఆయన అన్ని విధాల తన సోదరులను పోలి జన్మించవలసి వచ్చింది. ఆయన మహాయాజకుడై తన ప్రజలపై దయ చూపటానికి మానవ జన్మనెత్తాడు. ఆయన ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తం చెయ్యాలని వారిలో ఒకడయ్యాడు. 18 శోధన సమయాల్లో యేసు కష్టాలను అనుభవించాడు. కనుక యిప్పుడు శోధనలకు గురౌతున్న వాళ్ళకు ఆయన సహాయం చేయగలడు.
ఈజిప్టు దేశానికి తరలి వెళ్ళటం
13 వాళ్ళు వెళ్ళిపొయ్యాక దేవదూత యోసేపుకు కలలో కనిపించి, “లెమ్ము! తప్పించుకొని తల్లీబిడ్డలతో ఈజిప్టు దేశానికి వెళ్ళు! హేరోదు శిశువును చంపాలని అతని కోసం వెతుకనున్నాడు. కనుక నేను చెప్పే వరకు అక్కడే ఉండు” అని అన్నాడు.
14 యోసేపు లేచి తల్లీ బిడ్డలతో ఆ రాత్రి ఈజిప్టు దేశానికి బయలుదేరాడు. 15 యోసేపు హేరోదు మరణించేదాకా అక్కడే ఉండి పొయ్యాడు. తద్వారా ప్రభువు ప్రవక్త ద్వారా, “నేను నా కుమారుణ్ణి ఈజిప్టు నుండి పిలుస్తాను”(A) అని అన్న మాట నిజమైంది.
హెరోదు బెత్లెహేములో మగపిల్లలను చంపటం
16 జ్ఞానులు తనను మోసం చేసారని గ్రహించి హేరోదు కోపంతో మండిపొయ్యాడు. అతడు వాళ్ళు చెప్పిన కాలాన్ననుసరించి బేత్లేహేములో, దాని పరిసర ప్రాంతాల్లో రెండు సంవత్సరాలు, లేక అంతకన్నా తక్కువ వయస్సుగల బాలురనందర్ని చంపివేయమని ఆజ్ఞాపించాడు. 17 తద్వారా యిర్మీయా ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన ఈ విషయం నిజమైంది:
18 “రామా గ్రామంలో అతి దుఃఖంతో
ఏడుస్తున్న స్వరం వినిపించింది.
రాహేలు తన సంతానం కొఱకు ఏడ్చింది.
ఎవరు ఓదార్చిన వినలేదు.
ఆమె సంతానంలో ఎవ్వరూ మిగల్లేదు.”(B)
నజరేతుకు తిరుగు ప్రయాణం
19 హేరోదు మరణించిన తర్వాత దేవదూత ఈజిప్టులో ఉన్న యోసేపుకు కలలో కనిపించి, 20 “లెమ్ము! శిశువును చంపాలని ప్రయత్నం చేసిన వాళ్ళు చనిపోయారు. కనుక తల్లిని, బిడ్డను తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు” అని అన్నాడు.
21 అందువల్ల యోసేపు లేచి తల్లిని, బిడ్డను తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాడు. 22 కాని, యూదయ దేశాన్ని హేరోదుకు మారుగా అతని కుమారుడు అర్కెలాయు పాలిస్తున్నాడని విని అక్కడికి వెళ్ళటానికి భయపడిపొయ్యాడు. అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ప్రభువు హెచ్చరించటంవల్ల అతడు గలిలయ ప్రాంతానికి వెళ్ళిపొయ్యాడు. 23 అక్కడికి వెళ్ళి నజరేతు అనే గ్రామంలో నివసించాడు. తద్వారా, ఆయన నజరేతు నివాసి అని పిలువబడతాడు అని దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పిన మాటలు నిజమయ్యాయి.
© 1997 Bible League International