Revised Common Lectionary (Complementary)
సొలొమోను కీర్తన.
72 దేవా, రాజు నీవలె జ్ఞానముగల తీర్మానాలు చేయుటకు సహాయం చేయుము.
రాజకుమారుడు నీ మంచితనం గూర్చి నేర్చుకొనేందుకు సహాయం చేయుము.
2 నీ ప్రజలకు న్యాయంగా తీర్పు తీర్చేందుకు రాజుకు సహాయం చేయుము.
నీ పేద ప్రజలకు ఏది మంచిదో దానిని చేయుటకు అతనికి సహాయం చేయుము.
3 దేశం అంతటా శాంతి, న్యాయం ఉండనీయుము.
4 పేద ప్రజలకు రాజు న్యాయంగా ఉండునుగాక.
నిస్సహాయులకు అతణ్ణి సహాయం చేయనిమ్ము. వారిని బాధించే ప్రజలను అతణ్ణి శిక్షించనిమ్ము.
5 సూర్యుడు ప్రకాశించునంత వరకు ఆకాశంలో చంద్రుడు ఉన్నంత వరకు
ప్రజలు రాజుకు భయపడి గౌరవిస్తారని ఆశిస్తున్నాను.
ప్రజలు అతనికి శాశ్వతంగా భయపడి గౌరవిస్తారని నేను ఆశిస్తున్నాను.
6 పొలాల మీద కురిసే వర్షంలా రాజు ఉండునట్లు అతనికి సహాయం చేయుము.
నేలమీద పడే జల్లులా ఉండుటకు అతనికి సహాయం చేయుము.
7 అతడు రాజుగా ఉండగా మంచితనం వికసించనిమ్ము.
చంద్రుడున్నంతవరకు శాంతిని కొనసాగనిమ్ము.
18 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించండి.
అలాంటి అద్భుతకార్యాలు చేయగలవాడు దేవుడు ఒక్కడే.
19 ఆయన మహిమగల నామాన్ని శాశ్వతంగా స్తుతించండి.
ఆయన మహిమ ప్రపంచమంతా వ్యాపించును గాక.
ఆమేన్, ఆమేన్!
ఇశ్రాయేలు శిక్ష ముగుస్తుంది
40 మీ దేవుడు చెబుతున్నాడు,
“ఆదరించండి, నా ప్రజలను ఆదరించండి!
2 యెరూషలేముతో దయగా మాట్లాడండి.
‘నీ సేవాసమయం అయిపోయింది
నీ పాపాలకు విలువ నీవు చెల్లించావు’ అని యెరూషలేముతో చెప్పండి
యెరూషలేము చేసిన ప్రతి పాపానికి రెండేసి సార్లు యెహోవా యెరూషలేమును శిక్షించాడు.”
3 వినండి! ఒక మనిషి గట్టిగా ఎడారిలో బోధిస్తున్న శబ్దం మీరు వినగలరు.
“యెహోవా మార్గాన్ని సిద్ధం చేయండి.
ఎడారిలో మన దేవుని కోసం తిన్ననిదైన ఒక రాజమార్గాన్ని వేయండి.
4 ప్రతి లోయనూ పూడ్చండి
ప్రతి పర్వతాన్ని కొండను చదును చేయండి.
వంకర మార్గాలను చక్కగా చేయండి.
కరకు నేలను సమనేలగా చేయండి.
5 అప్పుడు యెహోవా మహిమ కనబడుతుంది
మనుష్యులందరూ కలిసి యెహోవా మహిమను చూస్తారు.
సాక్షాత్తూ యెహోవాయే ఈ సంగతులు చెప్పాడు కనుక ఇది జరుగుతుంది.”
6 ఒక స్వరం పలికింది, “మాట్లాడు” అని.
కనుక ఆ మనిషి అన్నాడు, “నేనేమి చెప్పను?”
ఆ స్వరం అంది, “ఇలా చెప్పు: మనుష్యులు అందరూ గడ్డిలా ఉన్నారు.
మనుష్యుల మంచి తనం క్రొత్త గడ్డి పరకలా ఉంది.
7 యెహోవా నుండి ఒక బలమైన గాలి గడ్డిమీద వీస్తుంది.
ఆ గడ్డి ఎండిపోయి, చస్తుంది.
సత్యం ఏమిటంటే: మనుష్యులంతా గడ్డి.
8 గడ్డి చచ్చిపోయి ఎండిపోతుంది.
కానీ మన దేవుని మాటలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి.”
రక్షణః దేవుని శుభ వార్త
9 సీయోనూ, నీవు చెప్పాల్సిన శుభవార్త ఉంది.
ఎత్తయిన పర్వతం మీదకు ఎక్కి గట్టిగా ప్రకటించు.
యెరూషలేమూ, నీవు చెప్పాల్సిన శుభవార్త ఉంది.
భయపడవద్దు. గట్టిగా మాట్లాడు.
యూదా పట్టణాలన్నింటికి ఈ విషయాలు చెప్పు:
“చూడు, ఇదిగో మీ దేవుడు!
10 చూడు, యెహోవా, నా ప్రభువు శక్తితో వస్తున్నాడు.
మనుష్యులందరినీ పాలించుటకు ఆయన తన శక్తిని ప్రయోగిస్తాడు.
యెహోవా తన ప్రజలకు ప్రతిఫలం తెస్తాడు.
వారి జీతం యెహోవా దగ్గర ఉంది.
11 గొర్రెల కాపరి తన గొర్రెలను నడిపించినట్టు యెహోవా తన ప్రజలను నడిపిస్తాడు.
యెహోవా తన హస్తాన్ని (శక్తిని) ఉపయోగించి తన గొర్రెలను ఒక చోట చేరుస్తాడు.
గొర్రెపిల్లలను యెహోవా పట్టుకొని వాటిని ఆయన తన చేతుల్లో ఎత్తుకొంటాడు. వాటి తల్లులు ఆయన చెంత నడుస్తాయి.”
బాప్తిస్మము నిచ్చిన యోహాను యొక్క సందేశము
(మత్తయి 3:1-12; మార్కు 1:1-8; లూకా 3:1-9, 15-17)
19 యోహానును అడిగి, అతడెవరన్న విషయం కనుక్కురావటానికి, యెరూషలేములోని యూదులు యాజకులను లేవీయులను[a] అతని దగ్గరకు పంపారు. 20 యోహాను సమాధానం చెప్పటానికి నిరాకరించలేదు. పైగా ఏదీ దాచకుండా స్పష్టంగా సమాధానం చెప్పాడు. యోహాను, “నేను క్రీస్తును[b] కాదు!” అని చెప్పాడు.
21 వాళ్ళు అతణ్ణి, “మరి నీవెవరు? ఏలీయావా?” అని అడిగారు.
అతడు, “కాదు” అని అన్నాడు.
వాళ్ళు, “ప్రవక్తవా?” అని అడిగారు.
అతడు, “కాదు” అని అన్నాడు.
22 చివరకు వాళ్ళు, “మరి నీవెవరవు? మమ్మల్ని పంపిన వాళ్ళకు చెప్పటానికి మాకో సమాధానం చెప్పండి. మమ్మల్ని పంపిన వాళ్ళకు చెప్పటానికి నీ గురించి నీవేమని చెప్పుచున్నావు?” అని అడిగారు.
23 యోహాను యిలా సమాధానం చెప్పాడు:
“ప్రభువు కోసం చక్కటి మార్గం వేయుమని ఎడారి ప్రాంతాల్లో
ఒక స్వరం ఎలుగెత్తి పలికింది.”(A)
ఇవి యెషయా ప్రవక్త అన్న మాటలు.
24 వీళ్ళను పంపింది పరిసయ్యులు. 25 వాళ్ళు మరొక ప్రశ్న వేస్తూ, “నీవు క్రీస్తువు కానంటున్నావు, ఏలీయావుకానంటున్నావు, ప్రవక్తవుకానంటున్నావు. అటువంటప్పుడు నీవు ప్రజలకు బాప్తిస్మము ఎందుకిస్తున్నావు?” అని అడిగారు.
26 యోహాను సమాధానం చెబుతూ, “నేను నీళ్ళ ద్వారా బాప్తిస్మము యిస్తున్నాను. కాని మీరెరుగని వాడొకాయన మీ మధ్య ఉన్నాడు. 27 నా తర్వాత రానున్నవాడు ఆయనే. ఆయన చెప్పులు విప్పటానికి కూడా నేను తగను” అని అన్నాడు.
28 ఈ సంఘటనలన్నీ బేతనియ గ్రామంలో జరిగాయి. అది యోహాను బాప్తిస్మము ఇచ్చిన యొర్దాను నదికి అవతల వైపున ఉంది.
© 1997 Bible League International