Revised Common Lectionary (Complementary)
హన్నా కృతజ్ఞతలు
2 హన్నా దేవుని ఇలా కీర్తించెను:
“నా హృదయం దేవునిలో పరవశించి పోతూవుంది.
నా దేవుని ద్వారా నాకు బలము కలిగెను.
నా శత్రువులను నేను పరిహసించగలను.
నా విజయానికి మురిసిపోతున్నాను.
2 యెహోవా వంటి మరో పరిశుద్ధ దేవుడు లేడు.
నీవు తప్ప మరో దేవుడు లేడు!
మన దేవుని వంటి బండ[a] మరొకడు లేడు.
3 ఇక డంబాలు పలుకవద్దు!
గర్వపు మాటలు కట్టి పెట్టండి!
ఎందువల్లనంటే యెహోవా దేవునికి అంతా తెలుసు దేవుడు మనుష్యులను నడిపిస్తాడు,
వారికి తీర్పు తీరుస్తాడు.
4 మహా బలశాలుల విల్లులు విరిగిపోతాయి!
బలహీనులు బలవంతులవుతారు!
5 ఇది వరకు సమృద్ధిగా భోజనం ఉన్నావారు
భోజనం కోసం పని చేయాలి ఇప్పుడు
కాని ఇదివరకు ఆకలితో కుమిలేవారికి
ఇప్పుడు సమృద్ధిగా భోజనం!
గొడ్రాలుకు ఏడుగురు పిల్లలు!
సంతానవతికి పుత్రనాశనంతో దుఃఖపాటు.
6 యెహోవా జనన మరణ కారకుడు!
దేవుడు నరులను చావుగోతికి తోసివేయ గలడు.
ఆయన వారిని మరల బ్రతికించగలడు.
7 యెహోవా కొందరిని పేద వారిగా చేస్తాడు,
మరికొందరిని ధనవంతులుగా చేస్తాడు.
పతనానికీ, ఉన్నతికీ కారకుడు యెహోవాయే.
8 మట్టిలో ఉండే వారిని యెహోవా ఉన్నతికి తీసుకొని వస్తాడు ఆయన వారి దుఃఖాన్ని నిర్ములిస్తాడు.
యెహోవా పేదవారిని ప్రముఖులుగా చేస్తాడు.
యువ రాజుల సరసన కూర్చుండబెడ్తాడు.
యెహోవా వారిని ఘనులతో బాటు ఉన్నతాసీనులను చేస్తాడు.
పునాదుల వరకూ ఈ సర్వజగత్తూ యెహోవాదే!
యెహోవా ఈ జగత్తును ఆ పునాదులపై నిలిపాడు.
9 యెహోవా తన పరిశుద్ధ ప్రజలను కాపాడుతాడు.
వారు పడిపోకుండా ఆయన వారిని కాపాడుతాడు.
కాని దుష్టులు నాశనం చేయబడతారు.
వారు అంధకారంలో పడిపోతారు.
వారి శక్తి, వారు జయించేందుకు తోడ్పడదు.
10 యెహోవా తన శత్రువులను నాశనం చేస్తాడు.
సర్వోన్నతుడైన దేవుడు ప్రజల గుండెలదిరేలా పరలోకంలో గర్జిస్తాడు.
సర్వలోకానికీ యెహోవా తీర్పు ఇస్తాడు!
యెహోవా తన రాజుకు శక్తి ఇస్తాడు.
ఆయన నియమించిన రాజును బలవంతునిగా చేస్తాడు.”
వాగ్దాన పుత్రుడు ఇస్సాకు
15 అబ్రాహాముతో దేవుడు అన్నాడు: “నీ భార్య శారయికి నేను ఒక క్రొత్త పేరు పెడ్తాను. ఆమె క్రొత్త పేరు శారా.[a] 16 ఆమెను నేను ఆశీర్వదిస్తాను. ఆమెకు ఒక కుమారుణ్ణి నేను ఇస్తాను, మరి నీవు తండ్రివి అవుతావు. అనేక క్రొత్త జనాంగములకు ఆమె తల్లి అవుతుంది. జనముల రాజులు ఆమెలోనుండి వస్తారు.”
17 దేవుణ్ణి గౌరవించుటకు అబ్రాహాము ముఖం క్రిందికి దించుకొన్నాడు. అయితే అతడు నవ్వి, తనలో తాను అనుకొన్నాడు: “నా వయస్సు 100 సంవత్సరాలు. నాకు కొడుకు పుట్టజాలడు. మరి శారా వయస్సు 90 సంవత్సరాలు. ఆమెకు శిశువు జన్మించడం అసాధ్యం.”
18 అప్పుడు అబ్రాహాము దేవునితో ఇలా అన్నాడు: “నా కుమారుడు ఇష్మాయేలు జీవించి నిన్ను సేవిస్తాడని ఆశిస్తున్నాను.”
19 దేవుడు చెప్పాడు: “లేదు! నీ భార్య శారాకు కుమారుడు పుడతాడని నేను చెప్పాను. అతనికి ఇస్సాకు[b] అని నీవు పేరు పెడ్తావు. అతనితో నేను నా ఒడంబడిక చేసుకొంటాను. ఆ ఒడంబడిక అతని సంతానాలన్నిటితోను శాశ్వతంగా కొనసాగే ఒడంబడికగా ఉంటుంది.
20 “ఇష్మాయేలును గూర్చి నీవు నన్ను అడిగావు, నేను విన్నాను. అతణ్ణి నేను ఆశీర్వదిస్తాను. అతనికి చాలా మంది పిల్లలు ఉంటారు. పన్నెండు మంది మహా నాయకులకు అతడు తండ్రి అవుతాడు. అతని కుటుంబం ఒక గొప్ప జాతి అవుతుంది. 21 అయితే ఇస్సాకుతో నేను నా ఒడంబడిక చేస్తాను. శారాకు పుట్టబోయే కుమారుడు ఇస్సాకు. వచ్చే సంవత్సరం సరిగ్గా ఇదే కాలంలో నీకు కుమారుడు పుడతాడు.”
22 అబ్రాహాముతో దేవుడు మాట్లాడటం ముగించిన తర్వాత అబ్రాహాము ఒంటరిగా ఉన్నాడు. దేవుడు లేచి అబ్రాహామును విడిచి వెళ్లిపోయాడు.
గలతీయుల పట్ల పౌలు శ్రద్ధ
8 ఇదివరలో మీకు నిజమైన దేవుణ్ణి గురించి తెలియదు. కనుక మీరు వట్టి దేవుళ్ళకు బానిసలై జీవించారు. 9 కాని యిప్పుడు మీకు దేవుడెవరో తెలుసు. లేక దేవుడు మిమ్మల్ని తెలుసుకొన్నాడు. అలాంటప్పుడు బానిసలు కావటానికి నిస్సారమైన, నిరర్థకమైన ఆ శక్తుల వైపు మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు? 10 మీరు ప్రత్యేకమైన దినాలను, నెలలను, ఋతువులను, సంవత్సరాలను యింకా పాటిస్తున్నారు. 11 మిమ్మల్ని చూస్తే నాకు దిగులు వేస్తోంది. మీకోసం వ్యర్థంగా శ్రమపడ్డానేమోనని అనిపిస్తోంది.
12 సోదరులారా! నేను మీలా అయ్యాను. కనుక మీరు నాలా కావాలని విన్నవించుకుంటున్నాను. మీరు నా పట్ల ఏ అపరాధమూ చెయ్యలేదు. 13 నాకు అనారోగ్యంగా ఉండటం వల్ల నేను మీ దగ్గరకు వచ్చాను. తద్వారా మీకు మొదట సువార్త ప్రకటించే అవకాశం నాకు కలిగింది. 14 నా అనారోగ్యం మీకు కష్టం కలిగించినా మీరు నన్ను తిరస్కరించలేదు. విసుక్కోలేదు. దానికి మారుగా నేనొక దేవదూతనైనట్లు, నేను యేసు క్రీస్తునైనట్లు నాకు స్వాగతం చెప్పారు. 15 మీ ఆనందం ఏమైంది? మీరు నా సహాయం కోసం మీ కళ్ళు కూడా పీకి నాకిచ్చి ఉండేవాళ్ళు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. 16 నిజం చెప్పటంవల్ల యిప్పుడు నేను మీ శత్రువునయ్యానా?
17 వాళ్ళు మిమ్మల్ని లోబరచుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దానివల్ల మీకు మంచి కలుగదు. మానుండి మిమ్మల్ని వేరు చెయ్యాలని వాళ్ళ ప్రయత్నం. మీరు వాళ్ళను మాత్రమే అనుసరించాలని వాళ్ళ ఉద్దేశ్యం. 18 ఉద్దేశ్యం మంచిదైతే పట్టుదలతో ఉండటం మంచిదే. కనుక నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఎప్పుడూ అదే విధంగా ఉండండి. 19 నా ప్రియమైన బిడ్డలారా! క్రీస్తులో మీరు మరలా రూపం దాల్చే వరకూ నేను మీకోసం మళ్ళీ ఈ ప్రసవవేదన పడ్తూ ఉండవలసిందే. 20 మీ విషయంలో నాకు చాలా దిగులుగా ఉంది. కనుక మీతో ప్రత్యక్షంగా మాట్లాడాలని, మరొక విధంగా మీకు చెప్పాలని ఉంది.
© 1997 Bible League International