); Proverbs 8:22-31 (Wisdom’s part in creation); 1 John 5:1-12 (Whoever loves God loves God’s child) (Telugu Holy Bible: Easy-to-Read Version)
Revised Common Lectionary (Complementary)
148 యెహోవాను స్తుతించండి!
పైన ఉన్న దూతలారా, ఆకాశంలో యెహోవాను స్తుతించండి!
2 సకల దూతలారా, యెహోవాను స్తుతించండి!
ఆయన సర్వ సైనికులారా,[a] ఆయనను స్తుతించండి!
3 సూర్యచంద్రులారా, యెహోవాను స్తుతించండి.
ఆకాశంలోని నక్షత్రాలూ, వెలుతురూ యెహోవాను స్తుతించండి!
4 మహా ఉన్నతమైన ఆకాశంలోని యెహోవాను స్తుతించండి.
ఆకాశం పైగా ఉన్న జలములారా, ఆయనను స్తుతించండి.
5 యెహోవా నామాన్ని స్తుతించండి.
ఎందుకనగా దేవుడు ఆజ్ఞ యివ్వగా ప్రతి ఒక్కటీ సృష్టించబడింది.
6 ఇవన్నీ శాశ్వతంగా కొనసాగేందుకు దేవుడు చేశాడు.
ఎన్నటికి అంతంకాని న్యాయచట్టాలను దేవుడు చేశాడు.
7 భూమి మీద ఉన్న సమస్తమా. యెహోవాను స్తుతించు!
మహా సముద్రాలలోని గొప్ప సముద్ర జంతువుల్లారా, యెహోవాను స్తుతించండి.
8 అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి,
తుఫాను, గాలులు అన్నింటినీ దేవుడు చేశాడు.
9 పర్వతాలను, కొండలను, ఫలవృక్షాలను,
దేవదారు వృక్షాలను దేవుడు చేశాడు.
10 అడవి జంతువులను, పశువులను, పాకే ప్రాణులను, పక్షులను అన్నింటినీ దేవుడు చేశాడు.
11 భూమి మీద రాజ్యాలను రాజులను దేవుడు చేశాడు.
నాయకులను, న్యాయాధిపతులను దేవుడు చేశాడు.
12 యువతీ యువకులను దేవుడు చేశాడు.
వృద్ధులను, యవ్వనులను దేవుడు చేశాడు.
13 యెహోవా నామాన్ని స్తుతించండి!
ఆయన నామాన్ని శాశ్వతంగా ఘనపర్చండి!
భూమిపైన, ఆకాశంలోను ఉన్న
సమస్తం ఆయనను స్తుతించండి!
14 దేవుడు తన ప్రజలను బలవంతులుగా చేస్తాడు.
దేవుని అనుచరులను మనుష్యులు పొగడుతారు.
ఎవరి పక్షంగా అయితే దేవుడు పోరాడుతున్నాడో ఆ ఇశ్రాయేలీయులను మనుష్యులు పొగడుతారు. యెహోవాను స్తుతించండి!
22 “ఆదిలో మొట్టమొదటగా చాలా కాలం క్రిందట
యెహోవాచేత చేయబడింది నేనే
23 నేను (జ్ఞానము) ఆదిలో చేయబడ్డాను.
ప్రపంచం ప్రారంభం గాక ముందే నేను చేయబడ్డాను.
24 నేను (జ్ఞానము) మహా సముద్రాలు పుట్టక ముందే పుట్టాను.
నీళ్లు లేక ముందు నేను చేయబడ్డాను.
25 నేను (జ్ఞానము) పర్వతాలకంటె ముందు పుట్టాను. కొండలు రాక మందే నేను పుట్టాను.
26 యెహోవా భూమిని చేయకముందే నేను (జ్ఞానము) పుట్టాను. పొలాలకంటె ముందు నేను పుట్టాను.
ప్రపంచంలోని మొదటి ధూళిని, దేవుడు చేయక ముందే నేను పుట్టాను.
27 యెహోవా ఆకాశాలను చేసినప్పుడు
నేను (జ్ఞానము) అక్కడ ఉన్నాను.
యెహోవా భూమి చుట్టూరా సరిహద్దు వేసినప్పుడు,
మహా సముద్రానికి ఆయన హద్దులు నిర్ణయించినప్పుడు
నేను (జ్ఞానము) అక్కడ ఉన్నాను.
28 ఆకాశంలో యెహోవా మేఘాలను
ఉంచకముందే నేను పుట్టాను.
మహా సముద్రంలో యెహోవా నీళ్లు ఉంచినప్పుడు
నేను అక్కడ ఉన్నాను.
29 సముద్రాలలో నీళ్లకు యెహోవా హద్దులు పెట్టినప్పుడు
నేను అక్కడ ఉన్నాను.
యెహోవా అనుమతించిన దానికంటె నీళ్లు ఎత్తుగా పోవు,
భూమికి యెహోవా పునాదులు వేసినప్పుడు నేను అక్కడ ఉన్నాను.
30 నైపుణ్యంగల పనివానిలా నేను ఆయన ప్రక్కనే ఉన్నాను. నా మూలంగా యెహోవా ప్రతి రోజూ సంతోషించాడు.
ఆయన ముందు నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాను.
31 యెహోవా తాను చేసిన ప్రపంచాన్ని చూచి ఉప్పొంగి పోయాడు.
అక్కడ ఆయన మనుష్యుల విషయమై సంతోషించాడు.
దేవుని కుమారునిలో విశ్వాసము
5 యేసే క్రీస్తు అని నమ్మినవాణ్ణి దేవుడు తన సంతానంగా పరిగణిస్తాడు. తండ్రిని ప్రేమించిన ప్రతీ ఒక్కడు కుమారుణ్ణి ప్రేమించినట్లుగా పరిగణింపబడతాడు. 2 దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞల్ని పాటించటం వల్ల ఆయన కుమారుణ్ణి ప్రేమిస్తున్నట్లు మనము తెలుసుకోగలము. 3 ఆయన ఆజ్ఞల్ని పాటించి మనము మన ప్రేమను వెల్లడి చేస్తున్నాము. ఆయన ఆజ్ఞలు కష్టమైనవి కావు. 4 దేవుని కారణంగా జన్మించినవాడు ప్రపంచాన్ని జయిస్తాడు. మనలో ఉన్న ఈ విశ్వాసం వల్ల మనము ఈ ప్రపంచాన్ని జయించి విజయం సాధించాము. 5 యేసు దేవుని కుమారుడని విశ్వసించే వాళ్ళే ప్రపంచాన్ని జయిస్తారు.
దేవుడు తన కుమారుణ్ణిగూర్చి మనకు చెప్పాడు
6 యేసు క్రీస్తు నీళ్ళద్వారా, రక్తంద్వారా వచ్చాడు. ఆయన నీళ్ళద్వారా మాత్రమే రాలేదు. నీళ్ళద్వారా, రక్తంద్వారా కూడా వచ్చాడు. ఆత్మ సత్యవంతుడు. అందుకే ఆ ఆత్మ సాక్ష్యం చెపుతున్నాడు. 7 సాక్ష్యం చెప్పేవారు ముగ్గురున్నారు. 8 ఆత్మ, నీళ్లు, రక్తం. ఈ ముగ్గురూ ఒకే సాక్ష్యాన్ని చెపుతున్నారు.
9 మనము మనుష్యుల సాక్ష్యం అంగీకరిస్తాము. కాని యిది దేవుని సాక్ష్యం కనుక యింకా గొప్పది. ఈ సాక్ష్యం తన కుమారుణ్ణి గురించి యిచ్చింది. 10 దేవుని కుమారుని పట్ల విశ్వాసమున్నవాడు ఈ సాక్ష్యాన్ని నమ్ముతాడు. దేవుడు తన కుమారుని విషయంలో యిచ్చిన సాక్ష్యం నమ్మనివాడు దేవుడు అసత్యవంతుడని నిందించినవాడౌతాడు. 11 ఆ సాక్ష్యం యిది! దేవుడు మనకు నిత్యజీవం యిచ్చాడు. ఈ జీవము ఆయన కుమారునిలో ఉంది. 12 కుమారుణ్ణి స్వీకరించినవానికి ఈ జీవము లభిస్తుంది. ఆ కుమారుణ్ణి స్వీకరించనివానికి జీవం లభించదు.
© 1997 Bible League International