Revised Common Lectionary (Complementary)
ఇమ్మానుయేలు-దేవుడు మనతో ఉన్నాడు
10 అప్పుడు యెహోవా ఆహాజుతో మాట్లాడటం కొనసాగించాడు. 11 యెహోవా చెప్పాడు: “ఈ సంగతులు సత్యం అని నీ మట్టుకు నీవు రుజువు చేసుకొనేందుకు ఒక సూచన కోసం అడుగు. నీకు కావాల్సిన ఏ సూచన కోసమైనా నీవు అడగవచ్చు. ఆ సూచన పాతాళమంత లోతునుండి రావచ్చు, లేక ఆ సూచన ఆకాశమంత ఎత్తునుండి అయినా రావచ్చును.”
12 కాని ఆహాజు, “రుజువుగా సూచన కావాలి అని నేను అడగను. యెహోవాను నేను పరీక్షించను” అన్నాడు.
13 అప్పుడు యెషయా చెప్పాడు, “దావీదు వంశమా, జాగ్రత్తగా ఆలకించు. మీరు ప్రజల సహనాన్ని పరీక్షిస్తారు. కానీ అది మీకు ముఖ్యంకాదు. కనుక మీరు ఇప్పుడు నా దేవుని సహనాన్ని పరీక్షిస్తున్నారు. 14 కాబట్టి ఆయనే మీకు ఒక సూచన చూపిస్తాడు.
ఇదిగో ఒక కన్య గర్భము ధరించి, ఒక కుమారుడ్ని కని,
ఆయన్ని ఇమ్మానుయేలు అనే పేరుతో పిలుస్తుంది.
15 అతను పెరుగు, తేనె తినును
చెడును విసర్జించి మంచిని చేపట్టి తెలివి వచ్చేవరకు అతను ఇలా జీవిస్తాడు.
16 కానీ ఆ బాలుడు మంచి, చెడులను తెలుసుకొనక ముందే
ఎఫ్రాయిము (ఇశ్రాయేలు), సిరియా నిర్జనం అయిపోతాయి. మీరు ఆ ఇద్దరు రాజులను గూర్చి భయపడుతున్నారు.
సంగీత నాయకునికి: “ఒప్పందం పుష్పాలు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.
80 ఇశ్రాయేలీయుల కాపరీ, నా మాట వినుము.
యోసేపు గొర్రెలను (ప్రజలను) నీవు నడిపించుము.
కెరూబులపై నీవు రాజుగా కూర్చున్నావు. ప్రకాశించుము.
2 ఇశ్రాయేలీయుల కాపరీ, ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షేలకు నీ మహాత్యం చూపించుము.
వచ్చి మమ్మల్ని రక్షించుము.
3 దేవా, మరల మమ్మల్ని స్వీకరించుము.
మేము రక్షించబడునట్లు నీ ముఖాన్ని మా మీద ప్రకాశింపచేయుము.
4 సర్వశక్తిగల యెహోవా దేవా, నీవు మా మీద ఎప్పటికి కోపంగానే ఉంటావా?
మా ప్రార్థనలు నీవు ఎప్పుడు వింటావు?
5 నీవు నీ ప్రజలకు కన్నీళ్లే ఆహారంగా ఇచ్చావు.
నీ ప్రజల కన్నీళ్లతో నిండిన పాత్రలే నీవు నీ ప్రజలకు ఇచ్చావు. అవే వారు తాగుటకు నీళ్లు.
6 మా పొరుగువారు పోరాడుటకు నీవు మమ్మల్ని హేతువుగా ఉండనిచ్చావు.
మా శత్రువులు మమ్మల్ని చూచి నవ్వుచున్నారు.
7 సర్వశక్తిమంతుడవైన దేవా, మరల మమ్మల్ని అంగీకరించుము.
నీ ముఖము మామీద ప్రకాశించునట్లు మమ్మల్ని రక్షించుము.
17 దేవా, నీ కుడి ప్రక్క నిలిచి ఉన్న నీ కుమారుని ఆదుకొనుము.
నీవు పెంచిన నీ కుమారుని ఆదుకొనుము.
18 అతడు మరల నిన్ను విడువడు.
అతన్ని బ్రదుక నీయుము. అతడు నీ నామాన్ని ఆరాధిస్తాడు.
19 సర్వశక్తిమంతుడవైన యెహోవా, దేవా, తిరిగి మా దగ్గరకు రమ్ము.
నీ ముఖ మహిమను మామీద ప్రకాశించనీయుము. మమ్మల్ని రక్షించుము.
1 యేసు క్రీస్తు సేవకుడైన పౌలు నుండి:
దేవుడు తన అపొస్తలునిగా[a] పని చేయటానికి రమ్మని నన్ను పిలిచినాడు. దేవుని సువార్తను ప్రకటించటానికి నన్ను ప్రత్యేకించినాడు. 2 దేవుడు ఈ సువార్తను తన ప్రవక్తలతో వ్రాయించి పవిత్ర లేఖనముల ద్వారా ఇంతకు క్రితమే తెలియచేసాడు. 3 ఈ సువార్త దేవుని కుమారుడును మన ప్రభువును అయిన యేసు క్రీస్తును గురించి. ఆయన దావీదు వంశంలో మానవునిగా జన్మించాడు. 4 పవిత్రమైన దేవుని ఆత్మ ఆయన్ని తన శక్తితో బ్రతికించి, ప్రభువైన యేసు క్రీస్తు దేవుని కుమారుడని నిరూపించినాడు.
5 ఆయన ద్వారా నేను దేవుని దయను పొంది ఆయన కోసం అపొస్తలుడనయ్యాను. ప్రజలందరు సువార్తను విశ్వసించి దాన్ని అనుసరించాలని దేవుని ఉద్దేశ్యం. 6 యేసు క్రీస్తుకు చెందిన వారవుటకు పిలువబడినవాళ్ళలో మీరు కూడా ఉన్నారు.
7 అందువల్ల రోము పట్టణంలో ఉన్న మీ అందరికీ వ్రాయుటమేమనగా మీరు దేవునికి ప్రియమైనవాళ్ళు. ఆయన మిమ్మల్ని తన ప్రజగా ఉండటానికి పిలిచాడు.
మన తండ్రియైన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువు మీకు అనుగ్రహాన్ని ప్రసాదించి మీలో శాంతి కలుగుజేయునుగాక!
యేసు క్రీస్తు జననం
(లూకా 2:1-7)
18 యేసు క్రీస్తు జననం ఇలా సంభవించింది: యేసు క్రీస్తు తల్లి మరియకు, యోసేపు అనే వ్యక్తికి వివాహం నిశ్చయమై ఉంది. వివాహంకాకముందే పవిత్రాత్మ శక్తి ద్వారా మరియ గర్భవతి అయింది. 19 కాని ఆమె భర్త యోసేపు నీతిమంతుడు. అందువల్ల అతడు అమెను నలుగురిలో అవమాన పరచదలచుకోలేదు. ఆమెతో రహస్యంగా తెగతెంపులు చేసుకోవాలని మనస్సులో అనుకొన్నాడు.
20 అతడీవిధంగా అనుకొన్న తర్వాత, దేవదూత అతనికి కలలో కనిపించి, “యోసేపూ, దావీదు కుమారుడా, మరియ పవిత్రాత్మ ద్వారా గర్భవతి అయింది. కనుక ఆమెను భార్యగా స్వీకరించటానికి భయపడకు. 21 ఆమె ఒక మగ శిశువును ప్రసవిస్తుంది. ఆయన తన ప్రజల్ని వాళ్ళు చేసిన పాపాలనుండి రక్షిస్తాడు. కనుక ఆయనకు ‘యేసు’ అని పేరు పెట్టు” అని అన్నాడు.
22-23 ప్రవక్త ద్వారా ప్రభువు ఈ విధంగా చెప్పాడు: “కన్యక గర్భవతియై మగ శిశువును ప్రసవిస్తుంది. వాళ్ళాయనను ఇమ్మానుయేలు అని పిలుస్తారు”(A) ఇది నిజం కావటానికే ఇలా జరిగింది.
24 యోసేపు నిద్రలేచి దేవదూత ఆజ్ఞాపించినట్లు చేసాడు. మరియను తన భార్యగా స్వీకరించి తన ఇంటికి పిలుచుకు వెళ్ళాడు. 25 కాని, ఆమె కుమారుణ్ణి ప్రసవించే వరకు అతడు ఆమెతో కలియలేదు. అతడు ఆ బాలునికి “యేసు” అని నామకరణం చేసాడు.
© 1997 Bible League International