Revised Common Lectionary (Complementary)
5 సహాయం కోసం దేవుణ్ణి అడిగేవారు చాలా సంతోషంగా ఉంటారు.
ఆ మనుష్యులు వారి దేవుడైన యెహోవా మీద ఆధారపడతారు.
6 భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.
సముద్రాన్నీ, అందులో ఉన్న సమస్తాన్నీ యెహోవా చేశాడు.
యెహోవా వాటిని శాశ్వతంగా కాపాడుతాడు.
7 అణచివేయబడిన ప్రజలకు యెహోవా సరియైన సహాయం చేస్తాడు.
ఆకలితో ఉన్న ప్రజలకు దేవుడు ఆహారం ఇస్తాడు.
చెరలోవున్న ప్రజలను యెహోవా విడుదల చేస్తాడు.
8 గుడ్డివారు మరల చూచుటకు యెహోవా సహాయం చేస్తాడు.
కష్టంలో ఉన్న ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు.
మంచి మనుష్యులను యెహోవా ప్రేమిస్తాడు.
9 మన దేశంలో నివసిస్తున్న పరాయి వాళ్లను యెహోవా కాపాడుతాడు.
విధవరాండ్రు, అనాథల విషయమై యెహోవా శ్రద్ధ తీసికొంటాడు.
అయితే దుర్మార్గుల పథకాలను యెహోవా నాశనం చేస్తాడు.
10 యెహోవా శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
సీయోనూ, నీ దేవుడు శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
యెహోవాను స్తుతించండి!
హన్నా కృతజ్ఞతలు
2 హన్నా దేవుని ఇలా కీర్తించెను:
“నా హృదయం దేవునిలో పరవశించి పోతూవుంది.
నా దేవుని ద్వారా నాకు బలము కలిగెను.
నా శత్రువులను నేను పరిహసించగలను.
నా విజయానికి మురిసిపోతున్నాను.
2 యెహోవా వంటి మరో పరిశుద్ధ దేవుడు లేడు.
నీవు తప్ప మరో దేవుడు లేడు!
మన దేవుని వంటి బండ[a] మరొకడు లేడు.
3 ఇక డంబాలు పలుకవద్దు!
గర్వపు మాటలు కట్టి పెట్టండి!
ఎందువల్లనంటే యెహోవా దేవునికి అంతా తెలుసు దేవుడు మనుష్యులను నడిపిస్తాడు,
వారికి తీర్పు తీరుస్తాడు.
4 మహా బలశాలుల విల్లులు విరిగిపోతాయి!
బలహీనులు బలవంతులవుతారు!
5 ఇది వరకు సమృద్ధిగా భోజనం ఉన్నావారు
భోజనం కోసం పని చేయాలి ఇప్పుడు
కాని ఇదివరకు ఆకలితో కుమిలేవారికి
ఇప్పుడు సమృద్ధిగా భోజనం!
గొడ్రాలుకు ఏడుగురు పిల్లలు!
సంతానవతికి పుత్రనాశనంతో దుఃఖపాటు.
6 యెహోవా జనన మరణ కారకుడు!
దేవుడు నరులను చావుగోతికి తోసివేయ గలడు.
ఆయన వారిని మరల బ్రతికించగలడు.
7 యెహోవా కొందరిని పేద వారిగా చేస్తాడు,
మరికొందరిని ధనవంతులుగా చేస్తాడు.
పతనానికీ, ఉన్నతికీ కారకుడు యెహోవాయే.
8 మట్టిలో ఉండే వారిని యెహోవా ఉన్నతికి తీసుకొని వస్తాడు ఆయన వారి దుఃఖాన్ని నిర్ములిస్తాడు.
యెహోవా పేదవారిని ప్రముఖులుగా చేస్తాడు.
యువ రాజుల సరసన కూర్చుండబెడ్తాడు.
యెహోవా వారిని ఘనులతో బాటు ఉన్నతాసీనులను చేస్తాడు.
పునాదుల వరకూ ఈ సర్వజగత్తూ యెహోవాదే!
యెహోవా ఈ జగత్తును ఆ పునాదులపై నిలిపాడు.
యోహాను బోధించటం
(మత్తయి 3:1-12; మార్కు 1:1-8; యోహాను 1:19-28)
3 కైసరు తిబెరి రాజ్యపాలన చేస్తున్న పదు నైదవ సంవత్సరములో:
యూదయ దేశాన్ని పొంతి పిలాతు పాలిస్తూ ఉన్నాడు.
హేరోదు గలిలయ దేశానికి సామంతరాజుగా ఉన్నాడు.
హేరోదు తమ్ముడు ఫిలిప్పు ఇతూరయ, త్రకోనీత ప్రాంతాలకు పాలకుడుగా ఉన్నాడు.
లుసానియా అబిలేనే రాష్ట్రానికి సామంతరాజుగా ఉన్నాడు.
2 ఇతని కాలంలోనే అన్న మరియు కయప ప్రధాన యాజకులుగా ఉన్నారు. వీళ్ళ కాలంలోనే జెకర్యా కుమారుడైన యోహాను అరణ్య ప్రాంతాల్లో జీవిస్తూ ఉన్నాడు. అక్కడ అతనికి దేవుని సందేశం లభించింది. 3 ఆతర్వాత అతడు యొర్దాను నది చుట్టూ ఉన్న ప్రాంతాలన్ని తిరిగి, “పాప క్షమాపణ పొందాలంటే మారుమనస్సు కలిగి బాప్తిస్మము పొందాలి” అని బోధించాడు. 4 దీన్ని గురించి యెషయా ప్రవక్త గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడివుంది:
“‘ప్రభువు కోసం మార్గం వేయుమని ఆయన
బాటలు చక్కగా చేయుమని ఎడారి ప్రాంతములో
ఒక గొంతు ఎలుగెత్తి పలికింది.
5 లోయలు పూడ్చివేయ బడుతాయి.
కొండలు గుట్టలు నేలమట్టమౌతాయి.
వంకర బాటలు చక్కగా ఔతాయి.
కరుకు బాటలు నునుపుగా ఔతాయి.
6 మానవులు దేవుడు ప్రసాదించే రక్షణను చూస్తారు!’”(A)
7 ప్రజలు బాప్తిస్మము పొందటానికి గుంపులు గుంపులుగా యోహాను దగ్గరకు వచ్చారు. యోహాను, “మీరు సర్పసంతానం. దేవునికి కోపం రానున్నది. ఆ కోపం నుండి పారిపోవాలనుకుంటున్నారు. అలా చేయుమని ఎవరు చెప్పారు? 8 మారుమనస్సు పొందినట్లు ఋజువు చేసే పనులు చెయ్యండి. ‘అబ్రాహాము మా తండ్రి’ అని గొప్పలు చెప్పుకొన్నంత మాత్రాన లాభం లేదు. ఈ రాళ్ళనుండి దేవుడు అబ్రాహాము సంతానాన్ని సృష్టించగలడని నేను చెబుతున్నాను. 9 చెట్లవేళ్ళమీద గొడ్డలి సిద్ధంగా ఉంది. మంచి ఫలమివ్వని చెట్టును కొట్టెసి ఆయన మంటల్లో పార వేస్తాడు” అని అన్నాడు.
10 “మరి మేము ఏం చెయ్యాలి?” అని ప్రజలు అడిగారు.
11 యోహాను, “రెండు చొక్కాలున్న వాడు ఒక చొక్కాకూడా లేని వానితో వాటిని పంచుకోవాలి. అలాగే మీ ఆహారం కూడా పంచుకోవాలి” అని అన్నాడు.
12 పన్నులు సేకరించేవాళ్ళు కూడా బాప్తిస్మము పొందటానికి వచ్చారు. వాళ్ళు, “బోధకుడా! మేము ఏం చెయ్యాలి?” అని అడిగారు.
13 “సేకరించ వలసిన పన్నుల కన్నా ఎక్కువ పన్నులు సేకరించవద్దు” అని అతడు వాళ్ళతో అన్నాడు.
14 కొందరు సైనికులు కూడా వచ్చి, “మేము ఏం చెయ్యాలి?” అని అతణ్ణి అడిగారు.
అతడు సమాధానం చెబుతూ, “ప్రజల నుండి డబ్బుగుంజవద్దు! వాళ్ళపై తప్పుడు నిందలు మోపకండి. మీ జీతంతో తృప్తి చెందండి” అని అన్నాడు.
15 ప్రజలు రానున్న వాని కోసం ఆశతో కాచుకొని ఉన్నరోజులవి. వాళ్ళు యోహానే క్రీస్తు అయి ఉండవచ్చనుకున్నారు.
16 యోహాను వాళ్ళకు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నేను మీకు నీటిలో బాప్తిస్మము[a] నిచ్చాను. కాని నాకన్నా శక్తిగలవాడు వస్తాడు. ఆయన కాలిచెప్పులు విప్పే అర్హతకూడా నాకు లేదు. ఆయన మీకు పవిత్రాత్మలో, అగ్నిలో బాప్తిస్మమునిస్తాడు. 17 చేట ఆయన చేతిలో ఉంది. ఆయన ఆ చేటతో ధాన్యాన్ని శుభ్రపరచి తన ధాన్యాన్ని కొట్టులో దాచుకొని, పొట్టును ఆరని మంటల్లో కాల్చివేస్తాడు.” 18 యోహాను వాళ్ళకు హెచ్చరిక కలిగేటట్లు యింకా ఎన్నో విషయాలు చెప్పాడు. సువార్త కూడా ప్రకటించాడు.
© 1997 Bible League International