Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: “ఒప్పందం పుష్పాలు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.
80 ఇశ్రాయేలీయుల కాపరీ, నా మాట వినుము.
యోసేపు గొర్రెలను (ప్రజలను) నీవు నడిపించుము.
కెరూబులపై నీవు రాజుగా కూర్చున్నావు. ప్రకాశించుము.
2 ఇశ్రాయేలీయుల కాపరీ, ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షేలకు నీ మహాత్యం చూపించుము.
వచ్చి మమ్మల్ని రక్షించుము.
3 దేవా, మరల మమ్మల్ని స్వీకరించుము.
మేము రక్షించబడునట్లు నీ ముఖాన్ని మా మీద ప్రకాశింపచేయుము.
4 సర్వశక్తిగల యెహోవా దేవా, నీవు మా మీద ఎప్పటికి కోపంగానే ఉంటావా?
మా ప్రార్థనలు నీవు ఎప్పుడు వింటావు?
5 నీవు నీ ప్రజలకు కన్నీళ్లే ఆహారంగా ఇచ్చావు.
నీ ప్రజల కన్నీళ్లతో నిండిన పాత్రలే నీవు నీ ప్రజలకు ఇచ్చావు. అవే వారు తాగుటకు నీళ్లు.
6 మా పొరుగువారు పోరాడుటకు నీవు మమ్మల్ని హేతువుగా ఉండనిచ్చావు.
మా శత్రువులు మమ్మల్ని చూచి నవ్వుచున్నారు.
7 సర్వశక్తిమంతుడవైన దేవా, మరల మమ్మల్ని అంగీకరించుము.
నీ ముఖము మామీద ప్రకాశించునట్లు మమ్మల్ని రక్షించుము.
17 దేవా, నీ కుడి ప్రక్క నిలిచి ఉన్న నీ కుమారుని ఆదుకొనుము.
నీవు పెంచిన నీ కుమారుని ఆదుకొనుము.
18 అతడు మరల నిన్ను విడువడు.
అతన్ని బ్రదుక నీయుము. అతడు నీ నామాన్ని ఆరాధిస్తాడు.
19 సర్వశక్తిమంతుడవైన యెహోవా, దేవా, తిరిగి మా దగ్గరకు రమ్ము.
నీ ముఖ మహిమను మామీద ప్రకాశించనీయుము. మమ్మల్ని రక్షించుము.
దేవాలయ నిర్మాణానికి దావీదు ఆలోచన
7 దావీదు తన కొత్త ఇంటిలో నివసించుచున్న కాలంలో యెహోవా అతనికి చుట్టూ వున్న శత్రువుల నుండి ఏ బాధలూ లేకుండా శాంతిని సమకూర్చాడు. 2 రాజు (దావీదు) నాతాను అనే ఒక ప్రవక్త వద్దకు వెళ్లి, “చూడు, నేను దేవదారు కలపతో నిర్మించబడిన ఒక భవంతిలో ఉంటున్నాను. కాని దేవుని పవిత్ర పెట్టె ఇంకా గుడారంలోనే ఉంచబడింది!” అన్నాడు
3 రాజుతో (దావీదు) నాతాను, “వెళ్లు. నీవు వాస్తవంగా ఏమి చేయాలని అనుకుంటున్నావో అది చేయుము. యెహోవా నీతో ఉన్నాడు” అని చెప్పాడు.
4 కాని ఆ రాత్రి యెహోవా వాక్యం నాతానుకు చేరింది.
5 “యెహోవా నాతానును పిలచి ఆయన మాటగా, ఆయన సేవకుడైన దావీదుతో ఇలా చేప్పమన్నాడు: ‘నా కొరకు ఆలయ నిర్మాణం చేయవలసిన వ్యక్తివి నీవు కాదు. 6 ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి తీసుకొని వచ్చినప్పుడు నేను ఆలయంలో నివసించలేదు. ఒక గుడారంలో వుంటూనే అటూ ఇటూ పయనించాను. గుడారాన్నే నివాసంగా వినియోగించుకున్నాను. 7 ఇశ్రాయేలు వంశము వారిలో ఏ ఒక్కరికీ దేవదారు కలపతో నాకు ఆలయం నిర్మించే విషయంపై ఒక్క మాటకూడ చెప్పియుండలేదు.’
8 “సర్వశక్తిమంతుడైన యెహోవా నాతానును దావీదుతో ఇంకా ఇలా చెప్పమన్నాడు, ‘నిన్ను నేను పచ్చిక బయళ్ల నుండి పట్టుకొచ్చాను. నీవు గొర్రెలను కాస్తూ వుండగా నిన్ను పట్టుకొచ్చాను. నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు నాయకునిగా వుండేందుకు నిన్ను తెచ్చాను. 9 నీవు ఎక్కడికి వెళితే అక్కడికల్లా నేను నీతో వచ్చాను. నీ కొరకు నీ శత్రువులందకరినీ ఓడించాను. ఇప్పుడు ఈ భూమి మీద అతి ప్రముఖ వ్యక్తులలో ఒకరిగా నిన్ను నేను చేస్తాను. 10-11 ఇశ్రాయేలీయులైన నా ప్రజలకు నేనొక స్థలాన్ని ఎంపిక చేస్తాను. ఇశ్రాయేలీయులందరినీ అక్కడ స్థిరపడేలా చేసి వారి స్వంత స్థలంలో వారుండేలా చేస్తాను. ఆ తరువాత వారెన్నడూ కదిలే పనివుండదు. గతంలో నా ఇశ్రాయేలు ప్రజలకు మార్గదర్శకులుగా నేను న్యాయాధిపతులను పంపియున్నాను. కాని దుష్ట జనులు వారిని బాధించారు. అదిప్పుడు జరగదు. నీ శ్రతువులందరి నుండి నీకు శాంతి లభించేలా చేస్తాను. నీ వంశంలో రాజులు వర్ధిల్లేలా చేస్తానని కూడా చెబుతున్నాను.[a]
12 “‘నీకు అంత్యకాలం సమీపించినప్పుడు నీ పూర్వీకుల వద్దనే సమాధి చేయబడతావు. అప్పుడు నేను నీ స్వంత పిల్లలలో ఒకనిని రాజుగా చేస్తాను. 13 అతడు నా నామాన్ని ఘనపర్చే విధంగా ఒక దేవాలయం నిర్మిస్తాడు. అతని రాజ్యాన్ని శాశ్వత ప్రాతిపదికపై చాలా బలమైనదిగా చేస్తాను. 14 అతనికి తండ్రిగా నేను వ్యవహరిస్తాను. అతడు నాకు కుమారుడు. అతడు పాపం చేస్తే, అతనిని శిక్షించటానికి వేరే ప్రజలను వినియోగిస్తాను. వారు దండములు ధరించి నా తరుపున పనిచేస్తారు. 15 కాని నేనతనిని ప్రేమతో చూడక మానను. నేనతనిపట్ల దాక్షిణ్యాలు కలిగి ఉంటాను. నేను నా ప్రేమను, దయను సౌలునుండి తొలగించాను. నేను నీ వైపునకు తిరిగినప్పుడు, సౌలును ప్రక్కకు నెట్టాను. నీ వంశానికి నేనది చేయను. 16 నీ వంశం, నీ రాజ్యం శాశ్వతంగా నా ముందు కొనసాగుతాయి.’”
17 నాతాను దావీదుకు అంతా చెప్పాడు. అతను తన దర్శనంలో విన్నదంతా దావీదుకు చెప్పాడు.
23 విశ్వాసం లేకముందు మనం ధర్మశాస్త్రం యొక్క ఖైదీలము. విశ్వాసం మనకు బయలు పడేదాకా మనము ఖైదీలుగా ఉన్నాము. 24 మనము విశ్వాసం ద్వారా నీతిమంతులం కావటానికి, మనల్ని క్రీస్తు దగ్గరకు పిలుచుకు వెళ్ళటానికి ఈ ధర్మశాస్త్రం నియమింపబడింది. 25 ఇప్పుడు ఆ విశ్వాసం వచ్చింది. కనుక ధర్మశాస్త్రానికి మనపై ఇక ఏ మాత్రం అధికారం లేదు.
26 యేసుక్రీస్తులో మీకు విశ్వాసం వుండటం వల్ల మీరంతా దేవుని పుత్రులయ్యారు. 27 ఎందుకంటే క్రీస్తులో బాప్తిస్మము పొందిన మీరు క్రీస్తును ధరించుకొన్నారు. 28 ఇప్పుడు యేసుక్రీస్తులో యూదుడని, యూదుడుకానివాడని, బానిసని, యజమాని అని, ఆడ అని, మగ అని వ్యత్యాసం లేదు. క్రీస్తు యేసులో మీరందరు సమానం. 29 మీరు క్రీస్తుకు చెందితే అబ్రాహాము సంతానంగా పరిగణింపబడతారు. దేవుడు అబ్రాహాముతో చేసిన వాగ్దానం ప్రకారం దేవుని ఆశీర్వాదాలకు మనం వారసులమౌతాం.
© 1997 Bible League International