Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 సమూయేలు 2:1-10

హన్నా కృతజ్ఞతలు

హన్నా దేవుని ఇలా కీర్తించెను:

“నా హృదయం దేవునిలో పరవశించి పోతూవుంది.
    నా దేవుని ద్వారా నాకు బలము కలిగెను.
నా శత్రువులను నేను పరిహసించగలను.
    నా విజయానికి మురిసిపోతున్నాను.
యెహోవా వంటి మరో పరిశుద్ధ దేవుడు లేడు.
    నీవు తప్ప మరో దేవుడు లేడు!
    మన దేవుని వంటి బండ[a] మరొకడు లేడు.
ఇక డంబాలు పలుకవద్దు!
గర్వపు మాటలు కట్టి పెట్టండి!
    ఎందువల్లనంటే యెహోవా దేవునికి అంతా తెలుసు దేవుడు మనుష్యులను నడిపిస్తాడు,
వారికి తీర్పు తీరుస్తాడు.
మహా బలశాలుల విల్లులు విరిగిపోతాయి!
    బలహీనులు బలవంతులవుతారు!
ఇది వరకు సమృద్ధిగా భోజనం ఉన్నావారు
    భోజనం కోసం పని చేయాలి ఇప్పుడు
కాని ఇదివరకు ఆకలితో కుమిలేవారికి
    ఇప్పుడు సమృద్ధిగా భోజనం!
గొడ్రాలుకు ఏడుగురు పిల్లలు!
    సంతానవతికి పుత్రనాశనంతో దుఃఖపాటు.
యెహోవా జనన మరణ కారకుడు!
దేవుడు నరులను చావుగోతికి తోసివేయ గలడు.
    ఆయన వారిని మరల బ్రతికించగలడు.
యెహోవా కొందరిని పేద వారిగా చేస్తాడు,
    మరికొందరిని ధనవంతులుగా చేస్తాడు.
పతనానికీ, ఉన్నతికీ కారకుడు యెహోవాయే.
మట్టిలో ఉండే వారిని యెహోవా ఉన్నతికి తీసుకొని వస్తాడు ఆయన వారి దుఃఖాన్ని నిర్ములిస్తాడు.
    యెహోవా పేదవారిని ప్రముఖులుగా చేస్తాడు.
యువ రాజుల సరసన కూర్చుండబెడ్తాడు.
    యెహోవా వారిని ఘనులతో బాటు ఉన్నతాసీనులను చేస్తాడు.
పునాదుల వరకూ ఈ సర్వజగత్తూ యెహోవాదే!
    యెహోవా ఈ జగత్తును ఆ పునాదులపై నిలిపాడు.
యెహోవా తన పరిశుద్ధ ప్రజలను కాపాడుతాడు.
    వారు పడిపోకుండా ఆయన వారిని కాపాడుతాడు.
కాని దుష్టులు నాశనం చేయబడతారు.
    వారు అంధకారంలో పడిపోతారు.
వారి శక్తి, వారు జయించేందుకు తోడ్పడదు.
10 యెహోవా తన శత్రువులను నాశనం చేస్తాడు.
    సర్వోన్నతుడైన దేవుడు ప్రజల గుండెలదిరేలా పరలోకంలో గర్జిస్తాడు.
సర్వలోకానికీ యెహోవా తీర్పు ఇస్తాడు!
    యెహోవా తన రాజుకు శక్తి ఇస్తాడు.
    ఆయన నియమించిన రాజును బలవంతునిగా చేస్తాడు.”

ఆదికాండము 37:2-11

ఇది యాకోబు కుటుంబ గాధ.

యోసేపు 17 సంవత్సరాల యువకుడు. గొర్రెల్ని, మేకల్ని కాయటం అతని పని. బిల్హా, జిల్ఫా కుమారులైన తన సోదరులతో కలిసి యోసేపు ఈ పని చేశాడు. (బిల్హా, జిల్ఫా అతని తండ్రి భార్యలు.) అతని సోదరులు చేసే చెడ్డ పనులను గూర్చి యోసేపు తన తండ్రితో చెప్పేవాడు. అతని తండ్రి ఇశ్రాయేలు (యాకోబు) చాలా వృద్ధుడుగా ఉన్నప్పుడు యోసేపు పుట్టాడు. కనుక ఇశ్రాయేలు (యాకోబు) తన కుమారులందరికంటే యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. యాకోబు తన కుమారునికి ఒక ప్రత్యేకతగల అంగీ ఇచ్చాడు. ఈ అంగీ చాలా పొడుగ్గా, అందంగా ఉంది. యోసేపు సోదరులు వారి తండ్రి వారందరికంటే యోసేపును ఎక్కువగా ప్రేమించటం గమనించారు. అందుచేత వారు వారి సోదరుణ్ణి ద్వేషించారు. వాళ్లు యోసేపుతో స్నేహభావంతో మాట్లాడలేదు.

ఒకసారి యోసేపుకు ఒక ప్రత్యేకమైన కల వచ్చింది. తర్వాత ఈ కల విషయం యోసేపు తన అన్నలతో చెప్పాడు. దీని తర్వాత అతని అన్నలు అతణ్ణి మరింతగా ద్వేషించారు.

“నాకో కల వచ్చింది, మనమంతా పొలంలో పని చేస్తున్నాం. మనం గోధుమ పనలు కడ్తున్నాం. నా పన నిలబడింది, దాని చుట్టూ మీ పనలు లేచి నిలబడ్డాయి. అప్పుడు మీ పనలన్నీ నా పనకు సాష్టాంగపడ్డాయి” అని చెప్పాడు యోసేపు.

అతని సోదరులు, “అంటే మా మీద నీవు రాజువై అధికారం చేస్తావా?” అని అడిగారు. వారిని గూర్చి యోసేపుకు వస్తోన్న కలల మూలంగా ఇప్పుడు వారు అతణ్ణి ఇంకా ఎక్కువగా ద్వేషించారు.

అప్పుడు యోసేపుకు మళ్లీ ఒక కల వచ్చింది. ఈ కలను గూర్చి యోసేపు తన సోదరులకు చెప్పాడు. “నాకు ఇంకో కల వచ్చింది. సూర్యుడు, చంద్రుడు, మరియు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగపడటం నేను చూశాను” అంటూ చెప్పాడు యోసేపు.

10 ఈ కల విషయమై యోసేపు తన తండ్రితో కూడ చెప్పాడు. కాని అతని తండ్రి అతణ్ణి విమర్శించాడు. “ఇదేం కల? నేనూ, మీ అమ్మ, నీ సోదరులు అందరం నీకు సాష్టాంగపడతామని నీవు నమ్ముతున్నావా?” అన్నాడు అతని తండ్రి. 11 యోసేపు సోదరులు మాత్రం అతని మీద అసూయ పడుతూనే ఉన్నారు. అయితే యోసేపు తండ్రి వీటన్నింటిని గూర్చి చాలా ఆలోచన చేసి వీటి భావం ఏమై ఉంటుందా అని ఆశ్చర్యపడుతూ వున్నాడు.

మత్తయి 1:1-17

యేసు వంశావళి

(లూకా 3:23-38)

యేసు క్రీస్తు వంశక్రమము: ఈయన దావీదు మరియు అబ్రాహాము వంశానికి చెందినవాడు.

అబ్రాహాము కుమారుడు ఇస్సాకు.

ఇస్సాకు కుమారుడు యాకోబు.

యాకోబు కుమారులు యూదా మరియు అతని సహోదరులు.

యూదా కుమారులు పెరెసు మరియు జెరహు. (పెరెసు, జెరహుల తల్లి తామారు.)

పెరెసు కుమారుడు ఎస్రోము.

ఎస్రోము కుమారుడు అరాము.

అరాము కుమారుడు అమ్మీనాదాబు.

అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను.

నయస్సోను కుమారుడు శల్మా.

శల్మా కుమారుడు బోయజు. (బోయజు తల్లి రాహాబు.)

బోయజు కుమారుడు ఓబేదు. (ఓబేదు తల్లి రూతు.)

ఓబేదు కుమారుడు యెష్షయి.

యెష్షయి కుమారుడు రాజు దావీదు.

దావీదు కుమారుడు సొలొమోను. (సొలొమోను తల్లి పూర్వం ఊరియా భార్య.)

సొలొమోను కుమారుడు రెహబాము.

రెహబాము కుమారుడు అబీయా.

అబీయా కుమారుడు ఆసా.

ఆసా కుమారుడు యెహోషాపాతు.

యెహోషాపాతు కుమారుడు యెహోరాము.

యెహోరాము కుమారుడు ఉజ్జియా.

ఉజ్జియా కుమారుడు యోతాము.

యోతాము కుమారుడు ఆహాజు.

ఆహాజు కుమారుడు హిజ్కియా.

10 హిజ్కియా కుమారుడు మనష్షే.

మనష్షే కుమారుడు ఆమోసు.

ఆమోసు కుమారుడు యోషీయా.

11 యోషీయా కుమారులు యెకొన్యా మరియు అతని సోదరులు. వీళ్ళ కాలంలోనే యూదులు బబులోను నగరానికి బందీలుగా కొనిపోబడినారు.

12 బబులోను నగరానికి కొనిపోబడిన తరువాతి వంశ క్రమము:

యెకొన్యా కుమారుడు షయల్తీయేలు.

షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు.

13 జెరుబ్బాబెలు కుమారుడు అబీహూదు.

అబీహూదు కుమారుడు ఎల్యాకీము.

ఎల్యాకీము కుమారుడు అజోరు.

14 అజోరు కుమారుడు సాదోకు.

సాదోకు కుమారుడు ఆకీము.

ఆకీము కుమారుడు ఎలీహూదు.

15 ఎలీహూదు కుమారుడు ఎలియాజరు.

ఎలియాజరు కుమారుడు మత్తాను.

మత్తాను కుమారుడు యాకోబు.

16 యాకోబు కుమారుడు యోసేపు.

యోసేపు భార్య మరియ.

మరియ కుమారుడు యేసు. ఈయన్ని క్రీస్తు అంటారు.

17 అంటే అబ్రాహాము కాలం నుండి దావీదు కాలం వరకు మొత్తం పదునాలుగు తరాలు. దావీదు కాలం నుండి బబులోను నగరానికి బందీలుగా కొనిపోబడిన కాలం వరకు పదునాలుగు తరాలు. అలా కొనిపోబడిన కాలం నుండి క్రీస్తు వరకు పదునాలుగు తరాలు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International