Revised Common Lectionary (Complementary)
సొలొమోను కీర్తన.
72 దేవా, రాజు నీవలె జ్ఞానముగల తీర్మానాలు చేయుటకు సహాయం చేయుము.
రాజకుమారుడు నీ మంచితనం గూర్చి నేర్చుకొనేందుకు సహాయం చేయుము.
2 నీ ప్రజలకు న్యాయంగా తీర్పు తీర్చేందుకు రాజుకు సహాయం చేయుము.
నీ పేద ప్రజలకు ఏది మంచిదో దానిని చేయుటకు అతనికి సహాయం చేయుము.
3 దేశం అంతటా శాంతి, న్యాయం ఉండనీయుము.
4 పేద ప్రజలకు రాజు న్యాయంగా ఉండునుగాక.
నిస్సహాయులకు అతణ్ణి సహాయం చేయనిమ్ము. వారిని బాధించే ప్రజలను అతణ్ణి శిక్షించనిమ్ము.
5 సూర్యుడు ప్రకాశించునంత వరకు ఆకాశంలో చంద్రుడు ఉన్నంత వరకు
ప్రజలు రాజుకు భయపడి గౌరవిస్తారని ఆశిస్తున్నాను.
ప్రజలు అతనికి శాశ్వతంగా భయపడి గౌరవిస్తారని నేను ఆశిస్తున్నాను.
6 పొలాల మీద కురిసే వర్షంలా రాజు ఉండునట్లు అతనికి సహాయం చేయుము.
నేలమీద పడే జల్లులా ఉండుటకు అతనికి సహాయం చేయుము.
7 అతడు రాజుగా ఉండగా మంచితనం వికసించనిమ్ము.
చంద్రుడున్నంతవరకు శాంతిని కొనసాగనిమ్ము.
18 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించండి.
అలాంటి అద్భుతకార్యాలు చేయగలవాడు దేవుడు ఒక్కడే.
19 ఆయన మహిమగల నామాన్ని శాశ్వతంగా స్తుతించండి.
ఆయన మహిమ ప్రపంచమంతా వ్యాపించును గాక.
ఆమేన్, ఆమేన్!
2 ఆ సమయంలో యెహోవా మొక్క (యూదా) చాలా అందంగా, గొప్పగా ఉంటుంది. అప్పటికి ఇంకా ఇశ్రాయేలులో జీవించి ఉండే ప్రజలు ఆ దేశంలో పండే వాటిని చూచి ఎంతో గర్విస్తారు. 3 ఆ సమయంలో ఇంకా సీయోనులో, యెరూషలేములో జీవిస్తున్న ప్రజలు పరిశుద్ధ (ప్రత్యేక) ప్రజలు అని పిలువ బడతారు. ఒక ప్రత్యేక జాబితాలో పేర్లు ఉన్న ప్రజలందరికీ ఇలా జరుగుతుంది. బ్రతికేందుకు అనుమతించబడిన ప్రజల జాబితా అది.
4 సీయోను స్త్రీల కల్మషాన్ని యెహోవా కడిగి వేస్తాడు. యెరూషలేములోని రక్తమంతా యెహోవా కడిగివేస్తాడు. దేవుడు న్యాయ ఆత్మను ప్రయోగించి, న్యాయంగా తీర్పు తీరుస్తాడు. మరియు ఆయన దహించే ఆత్మను ప్రయోగించి, సమస్తాన్నీ శుద్ధి చేస్తాడు. 5 ఆయన తన ప్రజలతో ఉన్నట్టు ఆ సమయంలో దేవుడు రుజువు చేస్తాడు. పగలు పొగల మేఘాన్ని, దేవుడు చేస్తాడు. రాత్రి ప్రకాశించే అగ్ని జ్వాలను దేవుడు చేస్తాడు. ఇవి ప్రతి ఇంటిమీద, ఆకాశంలోను, సీయోను కొండమీద, ప్రజల ప్రతి సమావేశం మీద నిలిచి ఉంటాయి. ప్రతి వ్యక్తి మీద కాపుదల ఉంటుంది. 6 ఆ కాపుదల ఒక భద్రతా స్థలం. ఆ కాపుదల సూర్యుని వేడినుండి ప్రజలను కాపాడుతుంది. అన్ని రకాల వర్షాలు వరదల నుండి దాగుకొనేందుకు ఆ కాపుదల క్షేమ స్థానంగా ఉంటుంది.
మత్తీయని ఎన్నుకోవటం
12 ఆ తర్వాత వాళ్ళు ఒలీవల కొండనుండి యెరూషలేముకు తిరిగి వచ్చారు. ఈ కొండ పట్టణానికి విశ్రాంతి రోజున నడిచినంత దూరంలో ఉంటుంది.[a] 13 వాళ్ళు వచ్చి మేడ మీద తాము నివసిస్తున్న గదిలోకి వెళ్ళారు. అక్కడున్న అపొస్తలులు ఎవరనగా: పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, “జెలోతే”[b] అని పిలువబడే సీమోను, యాకోబు కుమారుడు యూదా.
14 వీళ్ళంతా సమావేశమై ఒకే మనస్సుతో ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు. కొందరు స్త్రీలు, యేసు తల్లి మరియ, యేసు సోదరులు కూడా వీళ్ళతో ఉండేవాళ్ళు.
15 ఒక రోజు భక్తులందరూ సమావేశం అయ్యారు. వాళ్ళ సంఖ్య నూట ఇరవై. పేతురు మాట్లాడటానికి లేచి నిలుచున్నాడు. 16 అతడు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నా సోదరులారా! చాలా కాలం క్రిందటే పవిత్రాత్మ యూదాను గురించి దావీదు నోటి ద్వారా పలికాడు. లేఖనాల్లో వ్రాయబడిన ఈ విషయాలు తప్పక జరుగవలసినవి. ఈ యూదా యేసును బంధించిన వాళ్ళకు దారి చూపాడు. 17 యూదా మాలో ఒకడు. మాతో కలిసి సేవ చెయ్యటానికి ఎన్నుకోబడ్డవాడు.”
21 “ఇప్పుడు యింకొకడు మనలో చేరాలి. అతడు వాళ్ళలో, అంటే యేసు మనతో కలిసి జీవించినంత కాలం మనతో కలిసి ఉన్నవాళ్ళలో ఒకడై ఉండాలి. 22 అతడు యేసు ప్రభువు చావునుండి బ్రతికి వచ్చాడన్న దానికి మనతో కలిసి సాక్ష్యం చెప్పాలి. యోహాను బాప్తిస్మము నివ్వటం మొదలు పెట్టినప్పటినుండి యేసును మననుండి పరలోకానికి తీసుకు వెళ్ళిన దినం దాకా మనతో కలిసి జీవించినవాడై ఉండాలి.”
23 వాళ్ళు ఇద్దరి పేర్లను సూచించారు. బర్సబ్బా అని పిలువబడే యోసేపు పేరు, ఇతన్నే యూస్తు అని కూడా అంటారు, మత్తీయ పేరు. 24-25 అంతా కలిసి ఈ విధంగా ప్రార్థించారు: “ప్రభూ! నీకు ప్రతి ఒక్కరి మనస్సు తెలుసు. యూదా తన స్థానాన్ని వదిలి తాను వెళ్ళతగిన స్థానానికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ ఇద్దరిలో అపొస్తలత్వాన్ని, ఈ సేవా స్థానాన్ని ఆక్రమించటానికి నీవెన్నుకొన్నవాణ్ణి మాకు చూపించు.” 26 ఆ తర్వాత వాళ్ళు చీటీలు వేసారు. వాళ్ళు తీసిన చీటీలో మత్తీయ పేరు వ్రాయబడి ఉంది. అందువల్ల అతడు ఆ పదకొండుగురిలాగే అపొస్తలుడయ్యాడు.
© 1997 Bible League International