Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
21 యెహోవా, నీ బలం రాజును సంతోషపరుస్తుంది.
నీవు అతన్ని రక్షించినప్పుడు అతడు ఎంతగానో సంతోషించాడు.
2 రాజు కోరినవాటిని నీవు అతనికిచ్చావు. రాజు కొన్నింటికోసం అడిగాడు.
మరియు యెహోవా, రాజు అడిగినవాటిని నీవు అతనికిచ్చావు.
3 యెహోవా, నీవు నిజంగా ఎన్నో మంచివాటిని రాజుకిచ్చావు.
బంగారు కిరీటం నీవు అతని తలకు ధరింపజేసావు.
4 దేవా, జీవంకోసం అతడు నిన్ను అడిగాడు. నీవు దానిని అతనికిచ్చావు.
నీవు రాజుకు నిరంతరం సాగే దీర్ఘాయువు నిచ్చావు.
5 రాజుకు నీవు విజయాన్నిచ్చావు కనుక అతనికి గొప్ప కీర్తి వచ్చింది.
నీవు అతనికి గౌరవం, ఘనత ఇచ్చావు.
6 దేవా, నీవు రాజుకు నిజంగా శాశ్వత ఆశీర్వాదాలు ఇచ్చావు.
నీ సన్నిధానము రాజును ఎక్కువగా సంతోషపెడ్తుంది.
7 రాజు వాస్తవంగా యెహోవాను నమ్ముతున్నాడు.
సర్వోన్నతుడైన దేవుడు అతన్ని నిరాశపర్చడు.
8 రాజా! నీవు బలవంతుడవని నీ శత్రువులందరికీ నీవు చూపిస్తావు.
నిన్ను ద్వేషించే ప్రజలను నీ శక్తి ఓడిస్తుంది.
9 నీవు కనబడినప్పుడు
ఆ శత్రువులను వేడి పొయ్యిలోని నిప్పువలె చేస్తావు.
యెహోవా కోపము వేడి మంటవలె కాలుస్తుంది.
మరియు ఆయన ఆ శత్రువులను నాశనం చేస్తాడు.
10 ఆ శత్రువుల కుటుంబాలు నాశనం చేయబడతాయి.
వారు భూమి మీద నుండి తొలగిపోతారు.
11 ఎందుకంటే, యెహోవా, ఆ ప్రజలు నీకు విరోధంగా దుష్టపథకాలు వేసారు.
చెడుకార్యాలు చేయాలని వారు యోచించారు గాని వారు సాధించలేదు.
12 కాని యెహోవా, వారు వెనుతిరిగి పారిపోయేలా చేస్తావు.
ఎందుకంటే నీవు విల్లును వారి ముఖాలకు గురిపెడతావు.
13 యెహోవా, నీ బలంతో లెమ్ము. నీ గొప్పదనం గూర్చి
మేము కీర్తనలు పాడుతాము, వాద్యాలు వాయిస్తాము.
అబ్రాముతో దేవుని ఒడంబడిక
15 ఈ సంగతులన్నీ జరిగాక, ఒక దర్శనంలో అబ్రాముకు యెహోవా వాక్కు వచ్చి, “అబ్రామా, భయపడకు, నేను నిన్ను కాపాడుతాను. నేను నీకు గొప్ప ప్రతిఫలం ఇస్తాను” అని దేవుడు అన్నాడు.
2 అయితే అబ్రాము అన్నాడు: “యెహోవా దేవా, నన్ను సంతోష పెట్టగలిగేందుకు నీవు ఇవ్వగలిగింది ఏదీ లేదు. ఎందుచేతనంటే నాకు కుమారుడు లేడు. కనుక నేను చనిపోయిన తర్వాత, నా సేవకుడును దమస్కువాడైన ఎలీయెజెరు నా ఆస్తి అంతటికి వారసుడు అవుతాడు. 3 చూడు దేవా, నాకు నీవు కుమారుణ్ణి ఇవ్వలేదు. కనుక నా ఇంటిలో పుట్టిన సేవకుడు నాకు ఉన్న ఆస్తి అంతా దక్కించుకొంటాడు,”
4 అప్పుడు అబ్రాముతో యెహోవా మాట్లాడాడు: “నీకు ఉన్నవాటన్నింటిని పొందేవాడు నీ సేవకుడు కాదు. నీకు ఒక కుమారుడు కలుగుతాడు. నీకు ఉన్నవాటన్నింటిని నీ కుమారుడు పొందుతాడు.”
5 అంతట దేవుడు అబ్రామును గుడారము బయటకు తీసుకొని వెళ్లి, ఇలా చెప్పాడు: “ఆకాశం చూడు, అక్కడ ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో చూడు. అవి చాలా ఉన్నాయి. నీవు లెక్కపెట్టలేవు. భవిష్యత్తులో నీ కుటుంబం అలాగే ఉంటుంది.”
6 అబ్రాము దేవుణ్ణి నమ్మాడు, అబ్రాముయొక్క విశ్వాసాన్ని దేవుడు నీతిగా అంగీకరించాడు. 7 అబ్రాముతో దేవుడు ఇలా అన్నాడు, “కల్దీయుల ఊరు అను పట్టణము నుండి నిన్ను బయటకు నడిపించిన యెహోవాను నేనే. ఈ దేశాన్ని నీకు ఇచ్చేందుకు నేను అలా చేశాను. ఈ దేశం నీ స్వంతం అవుతుంది.”
8 అయితే అబ్రాము, “యెహోవా, నా ప్రభువా, ఈ దేశం నాదే అవుతుందని నాకు ఎలా తెలుస్తుంది?” అన్నాడు.
9 అబ్రాముతో దేవుడు అన్నాడు: “మనం ఒక ఒడంబడిక చేసుకొందాం. మూడు సంవత్సరాల ఆవు ఒకటి, మూడు సంవత్సరాల మేక ఒకటి, మూడు సంవత్సరాల పొట్టేలు ఒకటి తీసుకురా. ఇంకా నా కోసం ఒక పావురాన్ని, ఒక చిన్న పావురాన్ని తీసుకురా.”
10 దేవుని కోసం వీటన్నిటిని అబ్రాము తెచ్చాడు. ఆ జంతువులన్నింటిని చంపి ఒక్కోదాన్ని రెండేసి ముక్కలు చేశాడు, తర్వాత అబ్రాము ఈ భాగాలను ఒకదానికొకటి ఎదురెదురుగా వేశాడు. పక్షులను రెండు భాగాలుగా అబ్రాము ఖండించలేదు. 11 తర్వాత ఈ జంతువులను తినటానికి పెద్ద పక్షులు వచ్చి వాలాయి. కాని అబ్రాము వాటిని వెళ్లగొట్టేశాడు.
12 తర్వాత ఆ రోజు సూర్యుడు అస్తమిస్తున్నాడు. అబ్రాముకు బాగా నిద్ర వచ్చి నిద్రపోయాడు. అతడు నిద్రపోతూ ఉండగా భయంకర గాఢ చీకటి కమ్మింది. 13 అప్పుడు అబ్రాముతో యెహోవా ఇలా చెప్పాడు: “ఈ సంగతులు నీవు తెలుసుకోవాలి, నీ సంతానము విదేశీయులై, వారి స్వంతం కాని దేశంలో అపరిచితులుగా ఉంటారు. వారు అక్కడ బానిసలుగా ఉంటారు. ఇంకా, 400 సంవత్సరాలు కఠినంగా వాళ్లు శ్రమ పెట్టబడతారు. 14 అయితే వాళ్లకు యజమానిగా ఉన్న దేశాన్ని, 400 సంవత్సారాల తరువాత నేను శిక్షిస్తాను. మరి నీ ప్రజలేమో ఆ దేశాన్ని విడిచిపెట్టేస్తారు. నీ ప్రజలు వెళ్లిపోయేటప్పుడు విస్తారమైన ఆస్తులను వారితో తీసుకొనిపోతారు.
15 “నీవు మట్టుకు చాలా వృద్ధాప్యం వరకు జీవిస్తావు, మనశ్శాంతితో నీవు మరణిస్తావు. నీ వంశం వారితో నీవు పాతిపెట్టబడతావు. 16 నాలుగు తరాల తర్వాత నీ ప్రజలు మరల ఈ దేశం వస్తారు. ఆ సమయంలో అమోరీ ప్రజలను నీ ప్రజలు ఓడిస్తారు. అక్కడ నివసిస్తోన్న అమోరీ ప్రజలను శిక్షించటానికి నీ ప్రజలను నేను వాడుకొంటాను. ఇది భవిష్యత్తులో జరుగుతుంది. ఎందుచేతనంటే, శిక్షకు తగినంత చెడుతనం ఇప్పుడు అమోరీ ప్రజల్లో లేదు.”
17 సూర్యుడు అస్తమించాక, చాలా చీకటి పడింది, చచ్చిన జంతువులు రెండేసి ముక్కలుగా ఖండించబడి, ఇంకా అక్కడే నేలమీద పడి ఉన్నాయి. ఆ సమయంలో పొగమంటల వరుస[a] చచ్చిన జంతువుల రెండేసి ముక్కల మధ్యగా సాగిపోయింది. దేవుడు అబ్రాముతో చేసుకొన్న ఒప్పందానికి ఇది ఒక “ముద్ర” లేక “సంతకం.” ఆ రోజుల్లో, కోయబడ్డ జంతువుల ముక్కల మధ్య నడవడం అనే ఒడంబడిక ఆ మనిషి యొక్క నిజాయితీని తెలుపుతుంది. “నేను ఈ ఒడంబడికను అనుసరించకపోతే ఇదే నాకు జరుగనీ” అన్నది దీని అర్థం.
18 కనుక ఆనాడు ఒక వాగ్దానాన్ని, ఒక ఒడంబడికను అబ్రాముతో యెహోవా చేశాడు. యెహోవా అన్నాడు: “ఈ దేశాన్ని నీ సంతానమునకు నేను ఇస్తాను. ఈజిప్టు నదికి, యూఫ్రటీసు నదికి మధ్య ఉన్న దేశాన్ని నేను వారికి ఇస్తాను.
నీవు చేయునది నీవేమైయున్నావని చూపుతుంది
(లూకా 6:43-45)
33 “మీరు మంచిఫలాలు కావాలనుకుంటే, చెట్టును మంచిగా చేయాలి. నీ చెట్టు మంచిది కాకపోతే దానికి చెడ్డ ఫలాలు కాస్తాయి. పండును బట్టి చెట్టు ఎట్టిదో చెప్పబడుతుంది. 34 మీరు పాముల్లాంటి వాళ్ళు. దుష్టులు మంచి మాటలేవిధంగా ఆడగలుగుతారు. హృదయంలో ఉన్నదాన్ని నోరు మాట్లాడుతుంది. 35 మంచివానిలో మంచి ఉంటుంది. కనుక అతని నుండి మంచి బయటికి వస్తుంది. దుష్టునిలో చెడు ఉంటుంది కనుక అతని నుండి చెడు బయటికి వస్తుంది. 36 కాని నేను చెప్పేదేమిటంటే మానవులు తాము నిర్లక్ష్యంగా ఆడిన ప్రతి మాటకు తీర్పు చెప్పే రోజున లెక్క చెప్పవలసి ఉంటుంది. 37 ఎందుకంటే మీరాడిన మాటల్ని బట్టి మీరు నిరపరాధులో, అపరాధులో నిర్ణయింపబడుతుంది” అని అన్నాడు.
© 1997 Bible League International