Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 17:1-9

దావీదు ప్రార్థన.

17 యెహోవా, న్యాయంకోసం నా ప్రార్థన ఆలకించుము.
    నా ప్రార్థనా గీతం వినుము.
యదార్థమైన నా ప్రార్థన వినుము.
యెహోవా, నన్ను గూర్చిన సరైన తీర్పు నీ దగ్గర్నుండే వస్తుంది.
    నీవు సత్యాన్ని చూడగలవు.
నీవు నా హృదయాన్ని పరీక్షించుటుకు
    దాన్ని లోతుగా చూశావు.
రాత్రి అంతా నీవు నాతో ఉన్నావు.
    నీవు నన్ను ప్రశ్నించావు, నాలో తప్పేమి కనుగొన లేదు. నేనేమి చెడు తలపెట్టలేదు.
నీ ఆదేశాలకు విధేయుడనగుటకు
    నేను మానవ పరంగా సాధ్యమైనంత కష్టపడి ప్రయత్నించాను.
నేను నీ మార్గాలు అనుసరించాను.
    నీ జీవిత విధానంనుండి నా పాదాలు, ఎన్నడూ తొలగిపోలేదు.
దేవా, నేను నీకు మొరపెట్టినప్పుడెల్ల నీవు నాకు జవాబు యిచ్చావు.
    కనుక ఇప్పుడు నా మాట వినుము.
ఆశ్చర్యమైన నీ ప్రేమను చూపించుము.
    నీ ప్రక్కన కాపుదలను వెదకేవారిని వారి శత్రువులనుండి నీవు రక్షించుము.
నీ అనుచరులలో ఒకనిదైన ఈ ప్రార్థన వినుము.
నీ కంటిపాపవలె నన్ను కాపాడుము.
    నీ రెక్కల నీడను నన్ను దాచిపెట్టుము.
యెహోవా, నన్ను నాశనం చేయాలని చూస్తున్న దుర్మార్గులనుండి నన్ను రక్షించుము.
నన్ను బాధించుటకు నా చుట్టూరా ఉండి ప్రయత్నిస్తున్న మనుష్యుల బారినుండి నన్ను కాపాడుము.

ద్వితీయోపదేశకాండము 25:5-10

“ఇద్దరు సోదరులు కలిసి జీవిస్తుండగా, వారిలో ఒకరు చనిపోవటం, అతనికి కుమారుడు లేకపోవటం జరిగితే, చనిపోయిన సోదరుని భార్య, ఆ కుటుంబానికి దూరస్తుల్ని ఎవరినీ పెళ్లి చేసుకోకూడదు. ఆమె భర్త సోదరుడు ఆమెను భార్యగా స్వీకరించి, ఆమెకు భార్యాధర్మం జరిగించాలి. ఒక భర్త సోదరుని విధులను ఆమె భర్త సోదరుడు ఆమెకు జరిగించాలి. అప్పుడు ఆమెకు పుట్టిన బిడ్డ, ఆ పురుషుని మృత సోదరునికి వారసుడుగా ఉంటాడు. అప్పుడు చనిపోయిన సోదరుని పేరు ఇశ్రాయేలు నుండి రూపు మాసిపోదు. ఒకవేళ ఆ మనుష్యుడు తన సోదరుని భార్యను స్వీకరించడానికి ఇష్టపడకపోతే, ఆమె పట్టణ సమావేశ స్థలం దగ్గర నాయకుల వద్దకు వెళ్లాలి. అతని సోదరుని భార్య, ‘నా భర్త సోదరుడు తన సోదరుని పేరు ఇశ్రాయేలులో సజీవంగా ఉంచేందుకు నిరాకరిస్తున్నాడు. భర్త సోదరుని విధులను అతడు నాకు జరిగించటం లేదు’ అని నాయకులతో చెప్పాలి. అప్పుడు ఆ పట్టణపు నాయకులు అతణ్ణి పిలిపించి, అతనితో మాట్లాడాలి. అతడు మొండివాడై, ‘ఆమెను నేను స్వీకరించను’ అని చెబితే అతని సోదరుని భార్య ఆ నాయకుల ముందుకు రావాలి. ఆమె అతని కాలి నుండి అతని చెప్పు ఊడదీయాలి. అప్పుడు ఆమె అతని ముఖం ముందు ఉమ్మివేయాలి. ‘తన సోదరుని కుటుంబాన్ని ఉద్ధరించని సోదరునికి యిలా చేస్తున్నాను’ అని ఆమె చెప్పాలి. 10 అప్పుడు ఆ సోదరుని కుటుంబం ‘చెప్పు తీయబడ్డ మనిషి కుటుంబంగా’ ఇశ్రాయేలులో చెప్పుకోబడుతుంది.

అపొస్తలుల కార్యములు 22:22-23:11

22 ప్రజలు పౌలు చెప్పింది అంతదాకా విన్నారు. కాని అతడు ఈ మాట అనగానే, బిగ్గరగా, “అతడు బ్రతకటానికి వీల్లేదు, చంపి పారవేయండి!” అని కేకలు వేసారు. 23 వాళ్ళు తమ దుస్తుల్ని చింపి పారవేస్తూ, దుమ్ము రేపుతూ కేకలు వేసారు. 24 సేనాధిపతి పౌలును కోట లోపలికి తీసుకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ప్రజలు అతణ్ణి చూసి ఎందుకిలా కేకలు వేస్తున్నారో తెలుసుకోవటానికి పౌలును కొరడాలతో కొట్టమని ఆజ్ఞాపించాడు. 25 అతణ్ణి కొట్టటానికి కట్టి వేస్తుండగా పౌలు అక్కడున్న శతాధిపతితో, “నేరస్తుడని నిర్ణయం కాకముందే రోమా పౌరుణ్ణి కొరడా దెబ్బలు కొట్టటం న్యాయమేనా?” అని అడిగాడు.

26 ఇది విన్నాక ఆ సేనాధిపతి, సహస్రాధిపతి దగ్గరకు వెళ్ళి పౌలు అన్నది చెబుతూ, “మీరేమి చేస్తున్నారో మీకు తెలుసా? అతడు రోమా పౌరుడట!” అని అన్నాడు.

27 ఆ సహస్రాధిపతి పౌలు దగ్గరకు వెళ్ళి, “ఇప్పుడు చెప్పు! నీవు రోమా పౌరుడివా?” అని అడిగాడు.

“ఔను!” పౌలు సమాధానం చెప్పాడు.

28 సహస్రాధిపతి, “నేను రోమా పౌరుడవటానికి చాలా డబ్బు యివ్వవలసి వచ్చింది” అని అన్నాడు.

పౌలు, “నేను పుట్టినప్పటినుండి రోమా పౌరుణ్ణి!” అని అన్నాడు.

29 అతణ్ణి ప్రశ్నలడగాలనుకొన్నవాళ్ళు తక్షణమే వెనుకంజ వేసారు. ఆ సహస్రాధిపతి కూడా తాను రోమా పౌరుణ్ణి బంధించిన విషయం గమనించి భయపడిపోయాడు.

పౌలు యూదుల నాయకులతో మాట్లాడటం

30 అతడు పౌలుపై యూదులు మోపిన నిందకు సరియైన కారణం తెలుసుకోవాలనుకొన్నాడు. కనుక మరుసటి రోజు ప్రధానయాజకుల్ని, మిగతా సభ్యుల్ని సమావేశం కమ్మని ఆజ్ఞాపించాడు. పౌలును విడుదల చేసి వాళ్ళ ఎదుటకు పిలుచుకు వెళ్ళాడు.

23 పౌలు మహాసభ వైపు సూటిగా చూసి, “సోదరులారా! నేను ఈనాటి వరకు నిష్కల్మషంగా జీవించాను. దీనికి దేవుడే సాక్షి” అని అన్నాడు. ఈ మాటలు అనగానే ప్రధాన యాజకుడైన అననీయ, పౌలు ప్రక్కన నిలుచున్నవాళ్ళతో, “అతని మూతి మీద కొట్టి నోరు మూయించండి” అని ఆజ్ఞాపించాడు. అప్పుడు పౌలు అతనితో, “దేవుడు నీ నోరు మూయిస్తాడు. నీవు సున్నం కొట్టిన గోడవి. ధర్మశాస్త్రం ప్రకారం నా మీద తీర్పు చెప్పటానికి నీవక్కడ కూర్చున్నావు. కాని నన్ను కొట్టమని ఆజ్ఞాపించి నీవా ధర్మశాస్త్రాన్నే ఉల్లంఘిస్తున్నావు” అని అన్నాడు.

పౌలు ప్రక్కన నిలుచున్నవాళ్ళు, “దేవుని ప్రధానయాజకుని అవమానించటానికి నీకెంత ధైర్యం?” అని అన్నారు.

అందుకు పౌలు, “సోదరులారా! ప్రధానయాజకుడని నాకు తెలియదు. మన లేఖనాల్లో యిలా వ్రాయబడివుంది, ‘ప్రజానాయకుల్ని గురించి చెడుగా మాట్లాడరాదు.’”(A)

పౌలుకు వాళ్ళలో కొందరు సద్దూకయ్యులని, మరి కొందరు పరిసయ్యులని తెలుసు. అందువల్ల అతడు ఆ మహాసభలో బిగ్గరగా, “సోదరులారా! నేను పరిసయ్యుణ్ణి. నా తండ్రి పరిసయ్యుడు. నేను యిక్కడ నిందితునిగా నిలుచోవటానికి కారణం చనిపోయినవాళ్ళు బ్రతికి వస్తారన్నదే నాలోని ఆశ” అని అన్నాడు.

అతడీ మాట అనగానే, సద్దూకయ్యులకు, పరిసయ్యులకు సంఘర్షణ జరిగి వాళ్ళు రెండు భాగాలుగా చీలిపోయారు. సద్దూకయ్యులు మనుష్యులు బ్రతికి రారని, దేవదూతలు, ఆత్మలు అనేవి లేవని వాదిస్తారు. కాని పరిసయ్యులు యివి ఉన్నాయి అంటారు. సభలో పెద్ద అలజడి మొదలైంది. పరిసయ్యులకు సంబంధించిన కొందరు పండితులు లేచి బిగ్గరగా వాదిస్తూ, “యితనిలో మాకే తప్పు కనిపించలేదు. దేవదూతో లేక ఆత్మో అతనితో మాట్లాడి ఉండవచ్చు!” అని అన్నారు.

10 సంఘర్షణ చాలా తీవ్రంగా మారిపోయింది. ఆ రెండు గుంపులు కలిసి, పౌలును చీల్చివేస్తారేమోనని సహస్రాధిపతి భయపడిపొయ్యాడు. అతడు తన సైనికులతో, “వెళ్ళండి! అతణ్ణి వాళ్ళనుండి విడిపించుకొచ్చి కోట లోపలికి తీసుకెళ్ళండి” అని ఆజ్ఞాపించాడు.

11 ఆ రాత్రి ప్రభువు పౌలు ప్రక్కన నిలుచొని, “ధైర్యంగా ఉండి, నా గురించి నీవు యెరూషలేములో బోధించిన విధంగా రోమాలో కూడా బోధించాలి” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International