Add parallel Print Page Options

యేసు ఒక మనుష్యుని దయ్యాలనుండి విడిపించటం

(మత్తయి 8:28-34; మార్కు 5:1-20)

26 యేసు మరియు ఆయన శిష్యులు గెరాసేనులు అనే ప్రజలు నివసించే ప్రాంతాన్ని చేరుకున్నారు. ఆ ప్రాంతం గలిలయ సముద్రానికి అవతలి వైపున ఉంటుంది. 27 యేసు ఒడ్డు చేరగానే దయ్యం పట్టిన ఆ ఊరి వాడొకడు యేసు దగ్గరకు వచ్చాడు. చాలాకాలం నుండి అతడు బట్టలు వేసుకొనేవాడు కాదు. ఇంట్లో నివసించే వాడు కాదు. స్మశానాల్లో నివసించేవాడు.

28 ఆ దయ్యం పట్టినవాడు యేసును చూడగానే పెద్ద గొంతుతో, “యేసూ! దేవుని కుమారుడా! నాతో నీకేం పని? నన్ను హింసించవద్దని వేడుకొంటున్నాను” అని బిగ్గరగా అంటూ ఆయన కాళ్ళ మీద పడ్డాడు. 29 యేసు ఆ దయ్యాన్ని అతని నుండి బయటకు రమ్మని ఆజ్ఞాపించాడు. ఈ దయ్యం అతణ్ణి చాలాసార్లు ఆవరించింది. అతని కాళ్ళు చేతులు గొలుసులతో కట్టేసి కాపలాలోవుంచేవాళ్ళు. అయినా అతడు ఆ గొలసులను తెంపుకొనేవాడు. ఆ దయ్యం అతణ్ణి నిర్మానుష్య స్థలాలకు లాక్కొని వెళ్ళేది.

30 యేసు, “నీ పేరేమిటి?” అని అడిగాడు.

అతడు, “సేన” అని సమాధానం చెప్పాడు. ఎన్నో దయ్యాలు వానిలో ఉండటం వల్ల ఈ విధంగా సమాధానం చెప్పాడు. 31 ఆ దయ్యాలు తమను పాతాళం లోకి పడవేయ వద్దని ఎంతో ప్రాధేయ పడ్డాయి. 32 అక్కడ కొండ మీద ఒక పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది. ఆ దయ్యాలు, తాము ఆ పందుల్లోకి వెళ్ళేటట్లు అనుమతి యివ్వుమని యేసును వేడుకున్నాయి. ఆయన అనుమతినిచ్చాడు. 33 ఆ దయ్యాలు ఆ మనిషి నుండి బయటకు వచ్చి పందుల్లోకి జొరబడ్డాయి. ఆ తర్వాత అవి ఆ కొండనుండి క్రిందికి పరుగెత్తి సముద్రంలో పడి మునిగి పొయ్యాయి.

34 పందులు కాస్తున్న వాళ్ళు జరిగింది చూసి పరుగెత్తి వెళ్ళి గ్రామంలో ఉన్న వాళ్ళకు, పొలాల్లో ఉన్న వాళ్ళకు చెప్పారు. 35 ప్రజలు ఏమి జరిగిందో చూడాలని అక్కడికి వెళ్ళారు. అంతా యేసు దగ్గరకు వచ్చారు. అక్కడ దయ్యాలు వదిలింపబడ్డవాడు యేసు కాళ్ళ దగ్గరవుండటం వాళ్ళు చూశారు. అతని ఒంటిపై దుస్తులువున్నాయి. అతని ప్రవర్తన సహజంగా ఉంది. ఇది గమనించి వాళ్ళకు భయం వేసింది. 36 జరిగింది చూసిన వాళ్ళు ఆ దయ్యం పట్టినవానికి ఏ విధంగా నయమైపోయిందో వచ్చిన వాళ్ళకు చెప్పారు. 37 గెరాసేను ప్రజలందరికి చాలా భయం వేయటంవల్ల తమ ప్రాంతం వదిలి వెళ్ళమని వాళ్ళు యేసుతో అన్నారు.

అందువల్ల ఆయన పడవనెక్కి వెళ్ళిపోయాడు. 38 దయ్యాలు వదిలింపబడ్డ వాడు వెంటవస్తానని యేసును బ్రతిమిలాడాడు. 39 యేసు అతనితో, “నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు చేసిన మేలు అందరికి చెప్పు” అని అతణ్ణి పంపివేసాడు.

అందువల్ల అతడు వెళ్ళి యేసు తనకు చేసిన మేలు తన గ్రామంలో ఉన్న వాళ్ళందరికి చెప్పాడు.

Read full chapter