Revised Common Lectionary (Complementary)
దావీదు దైవధ్యాన కీర్తన.
32 పాపాలు క్షమించబడినవాడు ధన్యుడు.
తన పాపాలు తుడిచి వేయబడినవాడు ధన్యుడు.
2 అపరాధి అని యెహోవా చేత ప్రకటించబడనివాడు ధన్యుడు.
తన పాపాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించనివాడు ధన్యుడు.
3 దేవా, నేను నీతో మరల మరల మాట్లాడాను.
కాని నా రహస్య పాపాలను గూర్చి నేను చెప్పలేదు.
నేను ప్రార్థించిన ప్రతిసారీ నేను బలహీనుడను మాత్రమే అయ్యాను.
4 దేవా, నీవు రాత్రింబవళ్లు నా జీవితాన్ని నాకు మరింత కష్టతరమైనదిగా చేశావు.
తీవ్రమైన వేసవిలో బాగా ఎండిపోయిన భూమిలా నేను తయారయ్యాను.
5 అయితే అప్పుడు నేను నా పాపాలన్నిటినీ యెహోవా దగ్గర ఒప్పుకోవాలని నిర్ణయించుకొన్నాను.
కనుక యెహోవా, నా పాపాలను గూర్చి నేను నీతో చెప్పుకొన్నాను.
నా దోషాన్ని ఏదీ నేను దాచిపెట్టలేదు.
మరియు నీవు నా పాపాలను క్షమించావు.
6 దేవా, ఈ కారణంచేత నీ అనుచరులు అందరూ నీకు ప్రార్థించాలి.
కష్టాలు మహా ప్రవాహంలా వచ్చినాసరే, నీ అనుచరులు నిన్ను ప్రార్థించాలి.
7 దేవా, నేను దాగుకొనేందుకు నీవే ఆశ్రయం.
నా కష్టాల నుండి నీవే నన్ను విడిపించుము.
నీవు నన్ను ఆవరించి, కాపాడుము.
నీవు నన్నురక్షించిన విధమును గూర్చి నేను పాటలు పాడతాను.
21 “యోబూ, నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. అప్పుడు నీకు ఆయనతో శాంతి ఉంటుంది.
ఇలా నీవు చేస్తే, నీవు ధన్యుడవవుతూ, విజయం పొందుతావు.
22 ఈ ఉపదేశము స్వీకరించి
ఆయన మాటలు నీ హృదయంలో భద్రం చేసుకో.
23 యోబూ! సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గరకు నీవు తిరిగి వస్తే, నీకు మరల మామూలు స్థితి ఇవ్వబడుతుంది.
నీవు మాత్రం దుర్మార్గాన్ని నీ ఇంటినుండి దూరంగా తొలగించి వేయాలి.
24 నీ బంగారాన్ని నీవు మట్టిపాలు చేయాలి,
ఓఫీరునుండి తెచ్చిన నీ బంగారాన్ని నదుల్లోని బండలకేసి విసిరికొట్టు.
25 సర్వశక్తిమంతుడైన దేవుడే నీకు బంగారంగాను,
వెండిగాను ఉండనియ్యి.
26 అప్పుడు నీవు ఎంతో సంతోషిస్తావు. సర్వశక్తిమంతుడైన దేవునిలో ఆనందం కనుగొంటావు.
నీవు నీ ముఖాన్ని దేవుని వైపు ఎత్తగలవు.
27 నీవు ఆయనను ప్రార్థించినప్పుడు ఆయన నీ ప్రార్థన వింటాడు.
నీవు ఏం చేస్తానని ఆయనకు ప్రమాణం చేస్తావో దానిని నీవు చేస్తావు.
28 నీవు చేసే ప్రతి దానిలో విజయం పొందుతావు.
నీ త్రోవలో వెలుగు ప్రకాశిస్తుంది
29 గర్విష్ఠులను దేవుడు సిగ్గు పరుస్తాడు
కానీ దీనులను దేవుడు రక్షిస్తాడు.
30 నిర్దోషి కాని మనిషిని కూడా దేవుడు రక్షిస్తాడు.
నీ చేతుల పవిత్రత మూలంగా అతడు రక్షించబడతాడు.”
యోబు జవాబు
23 అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు:
2 “ఈవేళ నేను ఇంకా కోపంగా ఆరోపిస్తూనే ఉన్నాను.
దేవుడు నన్ను కఠినంగా శిక్షిస్తున్నాడు, కనుక నేను ఆరోపిస్తూనే ఉంటాను.
3 దేవునిని ఎక్కడ వెదకాలో
ఆయన యొద్దకు ఎలా వెళ్లాలో నాకు తెలిస్తే బాగుండేది, అని నా ఆశ.
4 నేను దేవునికి నా గాధ వివరించుకొంటాను.
నేను నిర్దోషిని అని చూపించటంకోసం నా నోరు వాదాలతో నిండిపోతుంది.
5 నా వాదాలకు దేవుడు ఎలా జవాబు ఇస్తాడో నేను తెలిసికోవాలని కోరుతున్నాను.
అప్పుడు నేను దేవుని జవాబులు గ్రహిస్తాను.
6 దేవుడు గొప్ప శక్తితో నాకు విరోధంగా ఉంటాడా?
లేదు, ఆయన నా మాట వింటాడు!
7 అక్కడ, దేవుని యెదుట ఒక మంచి మనిషి తన గాధను దేవునికి వివరించవచ్చును.
అప్పుడు నా న్యాయమూర్తి నన్ను విముక్తుణ్ణి చేయవచ్చును.
8 “కానీ నేను తూర్పుకు వెళ్తే దేవుడు అక్కడ లేడు.
ఒకవేళ నేను పడమటికి వెళ్తే ఇంకా దేవుడు నాకు కనబడలేదు.
9 దేవుడు ఉత్తరాన పని చేస్తున్నప్పుడు నాకు ఆయన కనబడడు.
దేవుడు దక్షిణంగా తిరిగినప్పుడు ఇంకా ఆయన నాకు కనబడడు.
10 కానీ నేను వేసే ప్రతి అడుగూ దేవునికి తెలుసు.
ఆయన నన్ను పరీక్షించటం ముగించినప్పుడు నాలో మైల ఏమీ లేనట్టుగా ఆయన చూస్తాడు. నేను స్వచ్ఛమైన బంగారంలా ఉన్నట్టు ఆయన చూస్తాడు.
11 నేను ఎల్లప్పుడూ దేవుడు కోరిన మార్గంలోనే నడిచాను.
దేవుని మార్గం అనుసరించకుండా నేను ఎన్నడూ తిరిగిపోలేదు.
12 దేవుడు ఆజ్ఞాపించే వాటినే నేను ఎల్లప్పుడూ చేస్తాను.
నా భోజనం కంటే దేవుని నోటినుండి వచ్చే మాటలు నాకు ఇష్టం.
13 “కానీ దేవుడు ఎన్నటికీ మారడు.
ఏ మనిషి ఆయనకు విరోధంగా నిలబడలేడు.
దేవుడు అనుకొన్నది ఆయన చేస్తాడు.
14 దేవుడు నాకు వ్యతిరేకంగా ఏమి పథకం వేశాడో దాన్ని ఆయన చేస్తాడు.
నా కోసం ఆయనకు ఇంకా ఎన్నో పథకాలు ఉన్నాయి.
15 అందుకే నేను దేవుని ఎదుట జీవిస్తూ ఉండగా నేను భయపడతాను.
వీటన్నింటిని గూర్చీ నేను తలచినప్పుడు దేవునికి నేను భయపడతాను.
16 దేవుడు నా హృదయాన్ని బలహీనం చేస్తాడు.
నేనేమో నా ధైర్యం కోల్పోతాను. సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను భయపెడతాడు.
17 కానీ చీకటి నన్ను మౌనంగా ఉండేటట్టు చేయదు.
గాఢాంధకారం నా ముఖాన్ని కప్పేస్తుంది.
1 యేసు క్రీస్తు సేవకుడును, అపొస్తలుడునైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు, మన రక్షకుడైన క్రీస్తు యొక్కయు నీతినిబట్టి మాలాగే అమూల్యమైన విశ్వాసాన్ని పొందినవాళ్ళకు వ్రాస్తున్నది.
2 దేవుణ్ణి గురించి, మన ప్రభువైన యేసు క్రీస్తును గురించి మీరు జ్ఞానం సంపాదించాలి. ఆ జ్ఞానం ద్వారా మీకు అనుగ్రహం, శాంతి సమృద్ధిగా లభించాలని కోరుతున్నాను.
మనకవసరమైన ప్రతిదాన్ని దేవుడు మనకిచ్చాడు
3 మన దేవుడు తనను గురించి మనలో ఉన్న జ్ఞానం ద్వారా తన మహిమను, మంచితనాన్ని పంచుకోవటానికి మనల్ని పిలిచాడు. అంతేకాక రక్షణ, ఆత్మీయ జీవితానికి కావలసినవాటిని దేవుడు తన శక్తి ద్వారా మనకిచ్చాడు. 4 ఈ విధంగా, అమూల్యమైనటువంటి గొప్ప వాగ్దానాన్ని మనకోసం చేసాడు. ఆ వాగ్దానాల సహాయంతో దురాశ వల్ల సంభవించే ఈ ప్రపంచంలోని పాపాలనుండి తప్పించుకొని, తన స్వభావంలో మీరు భాగం పంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఇలా చేసాడు.
5 అందువల్ల మీలో ఉన్న విశ్వాసానికి తోడుగా మంచితనాన్ని కూడా అలవరుచుకోవటానికి అన్ని విధాలా ప్రయత్నం చెయ్యండి. మంచితనానికి తోడుగా జ్ఞానాన్ని, 6 జ్ఞానానికి తోడుగా ఆత్మనిగ్రహాన్ని, ఆత్మనిగ్రహానికి తోడుగా పట్టుదలను, పట్టుదలకు తోడుగా ఆత్మీయతను, 7 ఆత్మీయతకు తోడుగా సోదర ప్రేమను, సోదర ప్రేమకు తోడుగా దయతో నిండిన ప్రేమను అలవరుచుకోండి. 8 ఈ గుణాలు మీలో పెరుగుతూ ఉండాలి. మన ప్రభువైన యేసు క్రీస్తును గురించిన జ్ఞానం మీలో ఉంది. పై గుణాలు మీలో ఉంటే ఈ జ్ఞానాన్ని ఫలవంతంగాను, ఉపయోగకరంగాను చేస్తాయి. 9 ఆ గుణాలు లేనివానికి దూరదృష్టి ఉండదు. అలాంటివాడు గ్రుడ్డివానితో సమానము. అంటే ఇలాంటి వ్యక్తి, తాను యిదివరలో చేసిన పాపాల్ని దేవుడు క్షమించాడన్న విషయం మరిచిపోయాడన్నమాట.
10 సోదరులారా! దేవుని పిలుపు, మీ ఎన్నిక ఫలించేటట్లు యింకా ఎక్కువ శ్రద్ధ వహించండి. ఇవన్నీ చేస్తూవుంటే మీరేనాటికీ క్రిందపడరు. 11 తద్వారా మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క శాశ్వతమైన రాజ్యంలోకి మీకు ఘనస్వాగతం లభిస్తుంది.
© 1997 Bible League International