Revised Common Lectionary (Complementary)
8 సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, నా ప్రార్థన ఆలకించే
యాకోబు దేవా, నా మాట వినుము.
9 దేవా, మా సంరక్షకుని కాపాడుము.
నీవు ఏర్పరచుకొన్న రాజుకు దయ చూపుము.[a]
10 దేవా, నేను మరో స్థలంలో వెయ్యి రోజులు గడుపుటకంటె
నీ ఆలయంలో ఒక్కరోజు ఉండుట మేలు.
దుర్మార్గుల ఇంటిలో నివసించుటకంటె
నా దేవుని ఆలయ ద్వారము దగ్గర నేను నిలిచియుండుట మేలు.
11 యెహోవా మా సంరక్షకుడు, మహిమగల రాజు.
దేవుడు మమ్మల్ని దయ, మహిమతో దీవిస్తున్నాడు.
యెహోవాను వెంబడించి ఆయనకు విధేయులయ్యే ప్రజలకు
ఆయన ఆన్ని మేళ్లూ అనుగ్రహిస్తాడు.
12 సర్వశక్తిమంతుడవైన యెహోవా, నిన్ను నమ్ముకొనే ప్రజలు నిజంగా సంతోషిస్తారు.
13 అందువల్ల దానియేలును రాజు వద్దకు తీసుకు వచ్చారు. దానియేలుతో రాజు, “నీ పేరేనా దానియేలు, రాజైన మా తండ్రి యూదానుండి బందీగా తీసుకొని వచ్చినవాడవు నీవేనా? 14 నీలో దేవతల ఆత్మ ఉన్నదని నేను విన్నాను. నీవు చురుకైనవాడవనీ, చాలా వివేక వంతుడవనీ, రహస్యాలను నీవు అర్థం చేసుకో గలవనీ విన్నాను. 15 వివేకవంతుల్నీ, ఇంద్రజాలికుల్నీ గోడమీది వ్రాత చదవటానికి నా వద్దకు తీసుకువచ్చారు. కాని వారు నాకు గోడమీది వ్రాతకుగల అర్థాన్ని తెలుపలేకపోయారు. 16 నేను నిన్ను గురించి విన్నాను. మర్మముల అర్థం ఏమిటో నీవు చెప్పగలవని విన్నాను. కఠినమైన ప్రశ్నలకు సమాధానం చెప్పగలవని కూడా విన్నాను. గోడమీది వ్రాతను చదివి, దాని అర్థాన్ని నీవు వివరించగలిగితే, నీకు ఊదారంగుగల బట్టలు ధరింపజేస్తాను. నీ మెడకు బంగారు గొలుసు వేస్తాను. తర్వాత రాజ్యంలో నీవు మూడవ ఉన్నత పరిపాలకుడవు కాగలవు” అని అన్నాడు.
17 తర్వాత దానియేలు రాజుతో, “బెల్షస్సరు రాజా, నీ కానుకలు నీవద్దనే ఉంచుకో. లేకపోతే, ఆ బహుమతుల్ని మరెవరికైనా ఇవ్వు. కాని నీ కోసం నేను గోడమీది వ్రాతను చదువగలను. మరియు దాని అర్థమేమిటో నీకు వివరించగలను” అని చెప్పాడు.
18 “రాజా, సర్వోన్నతుడైన దేవుడు నీ తండ్రి నెబుకద్నెజరును మహా శక్తివంతుడైన రాజుగా చేశాడు. దేవుడు అతన్ని అతి ముఖ్యుడుగా చేశాడు. 19 పెక్కు దేశాలకు చెందిన ప్రజలు, పలు భాషలు మాట్లాడే ప్రజలు నెబుకద్నెజరును చూచి భయపడేవారు. ఎందు కంటే సర్వోన్నతుడైన దేవుడు అతన్ని అతి ముఖ్యుడైన రాజుగా చేసిన కారణంవల్ల. నెబుకద్నెజరు ఒక వ్యక్తిని చంపదలచినట్లయితే, అతనిని చంపేవాడు. ఒక వ్యక్తిని జీవింపజేయ తలచుకుంటే, అతణ్ణి జీవించేలా చేసేవాడు. ఏ మనుష్యుల్ని ముఖ్యులుగా చేయదలుచుకుంటే, ఆ మనుష్యుల్ని ముఖ్యులుగా చేసేవాడు. హీనులుగా చేయదలచుకుంటే, హీనులుగా చేసేవాడు.
20 “కాని నెబుకద్నెజరు గర్విష్ఠి అయ్యానాడు, మొండివాడయ్యాడు. అందువల్ల అతనినుండి అధికారం తీసుకొనబడింది. అతని రాజ సింహాసనం తొలగించబడింది. అతని ప్రభావం తొలగించబడింది. 21 అతని బుద్ధి జంతువుల బుద్ధివలె మారింది. అతను అడవి గాడిదలతో నివసించసాగాడు. ఎద్దువలె పచ్చిక మేసాడు. మంచువల్ల తడిసాడు. అతను పాఠం నేర్చుకొనే వరకు ఈ సంగతులు జరిగాయి. తర్వాత సర్వోన్నతుడైన దేవుడు మనుష్యుల రాజ్యాల్ని పాలించువాడని, తనకు నచ్చిన వానికి రాజ్యాలు అప్పగించగలడని తెలుసుకొన్నాడు.
22 “నెబుకద్నెజరు కుమారుడవైన బెల్షస్సరూ! ఈ విషయాలు నీకు ఇంతకు మునుపే తెలుసు, 23 అయినా నిన్ను నీవు తగ్గించుకొనలేదు. అందుకు బదులుగా నీవు పరలోకమందున్న ప్రభువుకు విరోధంగా హెచ్చించుకున్నావు. యెహోవా ఆలయంనుండి నీవు త్రాగే పాత్రలు నీ కోసం ఆజ్ఞాపించి తెప్పించావు. తర్వాత నీవు, నీ భార్యలు, నీ ఉపపత్నులు, రాజోద్యోగులు ఆ పాత్రలనుండి ద్రాక్షామద్యం పానం చేశారు. నీవు వెండి, బంగారు, కంచు, ఇనుము, రాయి, కర్రలతో చేయబడిన దేవుళ్లను కీర్తించావు. అవి నిజమైన దేవుళ్లు కావు. అవి చూడలేవు, వినలేవు, లేక ఏమీ అర్థం చేసుకోలేవు. కాని నీ జీవితం మీదను, నీవు చేసేవాటి మీదను, అధికారంగల దేవుణ్ణి నీవు గౌరవించలేదు. 24 ఆ కారణం వల్ల, దేవుడు గోడమీద వ్రాసే హస్తాన్ని పంపించాడు. 25 ఈ క్రింది మాటలే గోడమీద వ్రాయబడినవి:
మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్.
26 “ఈ మాటలకు అర్థం ఇది:
మెనే: అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్కచూసి దాన్ని ముగించాడు.
27 టెకేల్: అనగా దేవుడు నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడ్డావు.
28 ఉఫార్సీన్: అనగా నీ రాజ్యం నీ వద్దనుండి తీసివేయబడి మాదీయులకూ పారసీకులకూ విభజింపబడింది.”
29 తర్వాత బెల్షస్సరు ఊదారంగు బట్టలు దానియేలుకు ధరింపచేసేలా ఆజ్ఞ ఇచ్చాడు. అతని మెడకు బంగారు గొలుసు ధరింపజేశాడు. అతను రాజ్యంలో మూడవ గొప్ప పాలకుడని ప్రకటింపజేశాడు. 30 ఆ రాత్రే బబులోను రాజైన బెల్షస్సరు హతుడయ్యాడు. 31 దర్యావేషు అనే పేరుగల మాదీయుడు క్రొత్తగా రాజు అయ్యాడు. దర్యావేషు సుమారు అరవై రెండు యేండ్లవాడు.
తండ్రి మాట పాలించిన కుమారుని ఉపమానం
28 “ఆలోచించి సమాధానం చెప్పండి. ఒకనికి యిద్దరు కుమారులుండేవాళ్ళు. అతడు మొదటి కుమారుని దగ్గరకు వెళ్ళి, ‘నాయనా! వెళ్ళి ఈ రోజు ద్రాక్షతోటలో పనిచెయ్యి!’ అని అన్నాడు.
29 “కుమారుడు, ‘నాకిష్టంలేదు’ అని సమాధానం చెప్పాడు. కాని తదుపరి తన మనస్సు మార్చుకొని పని చెయ్యటానికి వెళ్ళాడు.
30 “తండ్రి రెండవ కుమారునికి అదే విషయం చెప్పాడు. రెండవ కుమారుడు ‘వెళ్తానండి’ అని అన్నాడు. కాని వెళ్ళలేదు.
31 “ఆ యిద్దరిలో తండ్రి మాటను ఎవరు పాటించారు? అని యేసు అడిగాడు.”
“మొదటి వాడు” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, “నేను మీకు సత్యం చెబుతున్నాను. సుంకరులు, వేశ్యలు మీకన్నా ముందు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు. 32 మీకు నీతిమార్గాన్ని చూపటానికి యోహాను వచ్చాడు. మీరతణ్ణి నమ్మలేదు. కాని సుంకరులు, వేశ్యలు ఆయన్ని విశ్వసించారు. ఇది చూసాక కూడా మీరు మారుమనస్సు పొందలేదు, విశ్వసించలేదు.
© 1997 Bible League International