Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: “నాశనం చేయవద్దు” రాగం. దావీదు అనుపదగీతం. గుహలో సౌలు నుండి అతడు పారిపోయినప్పటిది.
57 దేవా, నన్ను కరుణించు
నా ఆత్మ నిన్నే నమ్ముకొన్నది గనుక దయ చూపించుము.
కష్టం దాటిపోయేవరకు
నేను నీ శరణు జొచ్చియున్నాను.
2 మహోన్నతుడైన దేవుని సహాయం కోసం నేను ప్రార్థించాను.
దేవుడు నా విషయమై సంపూర్ణ జాగ్రత్త తీసుకొంటాడు.
3 పరలోకము నుండి ఆయన నాకు సహాయం చేసి, నన్ను రక్షిస్తాడు.
నన్ను ఇబ్బందిపెట్టే మనుష్యులను ఆయన శిక్షిస్తాడు.
దేవుడు తన నిజమైన ప్రేమను
నాకు చూపిస్తాడు.
4 నా జీవితం ప్రమాదంలో ఉంది.
నా శత్రువులు నా చుట్టూరా ఉన్నారు.
ఈటెలు, బాణాలవంటి పదునైన పళ్లు,
మనుష్యులను తినే ఖడ్గంలా పదునైన నాలుకలుగల సింహాల్లా వారున్నారు.
5 దేవా, నీవు ఆకాశాలకంటె ఎత్తుగా హెచ్చింపబడ్డావు.
నీ మహిమ భూమిని ఆవరించి ఉంది.
6 నా శత్రువులు నాకు ఉచ్చు వేసారు.
వారు నన్ను ఉచ్చులో పట్టుకోవాలని చూస్తున్నారు.
నేను పడుటకు వారు గొయ్యి తవ్వారు.
కాని వారే దానిలో పడ్డారు.
7 దేవా, నిన్ను విశ్వసించటంలో నా హృదయం నిబ్బరంగా వున్నది.
నేను నీకు స్తుతులు పాడుతాను.
8 నా ఆత్మా, మేలుకొనుము!
స్వరమండలమా, సితారా, మేలుకోండి. వేకువను మనం మేల్కొందాము
9 నా ప్రభూ, నేను నిన్ను ప్రతి ఒక్కరి వద్దా స్తుతిస్తాను.
ప్రతీ జనంలో నేను నిన్ను గూర్చిన స్తుతిగీతాలు పాడుతాను.
10 నీ నిజమైన ప్రేమ ఆకాశంలోకెల్లా అత్యున్నత మేఘాలకంటె ఎత్తయింది.
11 ఆకాశాలకంటె దేవుడు ఎక్కువగా ఘనపర్చబడ్డాడు.
ఆయన మహిమ భూమి మీద నిండిపోయింది.
2 మాయోనులో ఒక ధనవంతుడు నివసిస్తుండేవాడు. అతనికి మూడువేల గొర్రెలు, వెయ్యి మేకలు ఉన్నాయి. ఏదో వ్యాపార రీత్యా అతడు కర్మెలులో ఉన్నాడు. కర్మెలులో అతడు తన గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడు. 3 అతని పేరు నాబాలు.[a] అతని భార్య పేరు అబీగయీలు. ఆమె చాలా తెలివైనది, మంచి అందగత్తె, కానీ నాబాలు క్రూరుడు, నీచుడు, కాలేబు సంతతివాడు.
4 దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు, నాబాలు తన గొర్రెలనుండి ఉన్ని తీస్తున్నట్లు విన్నాడు. 5 దావీదు పదిమంది యువకులను పిలిచి, “కర్మెలులో వున్న నాబాలు వద్దకు వెళ్లి అతనిని తన పక్షంగా పలుకరించమని” చెప్పాడు. 6 “నీవూ, నీ కుటుంబం బాగున్నారని ఆశిస్తున్నాను! నీకు ఉన్నదంతా క్షేమం అని కూడ నేను భావిస్తున్నాను, 7 నీవు నీ గొర్రెల నుండి ఉన్ని తీస్తున్నట్లు నేను విన్నాను. నీ గొర్రెల కాపరులు కొద్ది రోజులు మా వద్ద ఉన్నారు. అప్పుడు వారికి మేము ఏ హానీ చేయలేదు. వారు కర్మెలులో ఉన్నంత కాలం మేము వారినుండి ఏమి తీసుకోలేదు. 8 నీవు వారి నడిగితే ఇది నిజం అని వారే చెబుతారు. మేము ఈ సంతోష సమయంలో నీ దగ్గరకు వస్తున్నాము. అందుచేత ఈ యువకుల పట్ల నీవు కనికరం చూపించు. దయచేసి నీవు ఇవ్వగలిగింది వారికి ఇవ్వు. నీ స్నేహితుడనైన[b] దావీదు కోసం ఇది చేయి” అని చెప్పమన్నాడు దావీదు.
9 దావీదు మనుష్యులు నాబాలు దగ్గరకు వెళ్లారు. దావీదు సందేశాన్ని వారు నాబాలుకు అందజేశారు. 10 కాని నాబాలు చాలా అసభ్యకరంగా వ్యవహరించాడు. తన వద్దకు వచ్చిన దావీదు సేవకులతో, “ఎవడీ దావీదు? ఎవడీ యెష్షయి కొడుకు? ఇటీవల చాలా మంది బానిసలు తమ యజమానులనుండి పారిపోతున్నారు! 11 నావద్ద రొట్టె, నీళ్లూ ఉన్నాయి. అవి, నావద్ద ఉన్న మాంసం, ఉన్ని తీసే నా సేవకులకు కావాలి. నాకు తెలియని వాళ్లెవరికీ నేను దాన్ని ఇవ్వను,” అని కసురుకున్నాడు నాబాలు.
12 నాబాలు అన్నదంతా దావీదు మనుష్యులు తిరిగి వెళ్లి దావీదుకు చెప్పారు. 13 ఇది విన్న దావీదు తన మనుష్యులను, “తమ కత్తులు తీసుకోమన్నాడు.” కనుక దావీదు అతని మనుష్యులు తమ తమ కత్తులు చేపట్టారు. సుమారు నాలుగు వందల మంది దావీదుతో వెళ్లారు. రెండువందల మంది సామాన్ల వద్ద కాపలా ఉన్నారు.
అబీగయీలు ఆపదను తప్పించుట
14 నాబాలు నౌకర్లలో ఒకడు తన యజమాని భార్య అబీగయీలు వద్దకు వెళ్లి, “దావీదు అరణ్యం నుండి కొందరు దూతలను మా యజమాని నాబాలును పలకరించేందుకు పంపాడు. అయితే నాబాలు వారితో నీచంగా ప్రవర్తించాడు అని చెప్పాడు. 15 దావీదు మనుష్యులు మనపట్ల చాలా మర్యాదగా ఉన్నారు. మనకు ఏ అపకారమూ చేయలేదు. మేము గొర్రెలను పొలాలకు తోలుకు వెళ్లినప్పుడు వారు మాతోనే ఉన్నారు. వారు ఎప్పుడూ ఏమీ దొంగిలించలేదు. 16 రాత్రింబగళ్లు దావీదు మనుష్యులు మమ్మల్ని కాపాడారు. మేము గొర్రెలను మేపుతున్న రోజుల్లో వారు మాకు పెట్టని కోటలా ఉండి మమ్మల్ని కాపాడారు. 17 ఇప్పుడు నీవు ఏమి చేయగలవో నీవే ఆలోచించి నిశ్చయించు. మా యజమాని నాబాలుకూ, అతని కుటుంబానికీ భయంకర ఆపద రాబోతోంది. నాబాలు చెప్పిన మాటలు బుద్ధి తక్కువ మాటలు” అని చెప్పాడు.
18 అబీగయీలు వెంటనే రెండువందల రొట్టెలు, రెండు నిండు ద్రాక్షారసపు తిత్తులు, వండిన ఐదు గొర్రెల మాంసం, సుమారు ఐదు మానికల వండిన ఆహారం, ఒక మూట ఎండు ద్రాక్ష, ఎండిన అంజూరపు పండ్ల అడలు రెండు వందలు, కొన్ని గాడిదల మీద ఎత్తించింది. 19 తరువాత అబీగయీలు తన నౌకర్లతో, “వాటిని తీసుకుని వెళ్లమని, వారి వెనుక తను బయలు దేరి వస్తానని చెప్పింది.” కానీ ఆమె ఇదంతా తన భర్తకు చెప్పలేదు.
20 అబీగయీలు తన గాడిద మీద ఎక్కి పర్వతం అవతలి వైపుకు వచ్చింది. ఎదురుగా వస్తున్న దావీదును, అతని మనుష్యులను ఆమె కలుసుకున్నది.
21 అబీగయీలు దావీదును కలుసుకోక ముందు దావీదు తన అనుచరులతో, “నాబాలు ఆస్తిని అరణ్యంలో నేను అనవసరంగా కాపాడాను. వాని గొర్రెలలో ఒక్కటికూడ తప్పిపోకుండా అదుపు చేయించాను. నేనతనికి అన్నీ మంచి పనులు చేశాను. కానీ అతను నాపట్ల చాలా చెడుగా ప్రవర్తించాడు. 22 రేపటి ఉదయంలోగా నేను నాబాలు కుటుంబంలో ఒక్క మగవాడు కూడా లేకుండా చంపకపోతే యెహోవా నన్ను శిక్షించును గాక!” అన్నాడు.
క్రైస్తవుల మధ్య వివాదాలు
6 ఒకవేళ మీ మధ్య తగువులొస్తే, మన సంఘంలో ఉన్న పవిత్రుల దగ్గరకు వెళ్ళాలి కాని, సంఘానికి చెందనివాళ్ళ దగ్గరకు వెళ్ళేందుకు మీ కెంత ధైర్యం? 2 పవిత్రులు ప్రపంచం మీద తీర్పు చెపుతారన్న విషయం మీకు తెలియదా? మీరు ప్రపంచంమీద తీర్పు చెప్పగలిగినప్పుడు, సాధారణమైన విషయాలపై తీర్పు చెప్పే స్తోమత మీలో లేదా? 3 మనము దేవదూతల మీద కూడా తీర్పు చెపుతామన్న విషయం మీకు తెలియదా? అలాంటప్పుడు ఈ జీవితానికి సంబంధించిన విషయాలు ఏ పాటివి? 4 మీ మధ్య వివాదాలొస్తే, సంఘం లెక్కచెయ్యనివాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళను న్యాయం చెప్పమంటారా? 5 సిగ్గుచేటు! సోదరుల మధ్య కలిగే తగువులు తీర్చగలవాడు మీలో ఒక్కడు కూడా లేడా? 6 సంఘానికి చెందినవాని దగ్గరకు వెళ్ళకుండా ఒక సోదరుడు మరొక సోదరునిపై నేరారోపణ చేయటానికి న్యాయస్థానానికి వెళ్ళుతున్నాడు. అంటే సంఘానికి చెందనివాళ్ళను అడుగుతున్నాడన్న మాట.
7 మీ మధ్య వ్యాజ్యాలు ఉండటం వల్ల మీరు పూర్తిగా ఓడిపొయ్యారని చెప్పవచ్చు. వ్యాజ్యాలు పెట్టు కోవటంకన్నా అన్యాయం సహించటం, మోసపోవటం మంచిది. 8 దానికి మారుగా మీరే అన్యాయాలు, మోసాలు చేస్తున్నారు. ఇతరులను కాక, మీ సోదరులనే మోసం చేస్తున్నారు.
9 దుష్టులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోకండి. లైంగిక విషయాల్లో అవినీతిగా జీవించేవాళ్ళకు, విగ్రహారాధికులకు, వ్యభిచారులకు, మగ వేశ్యలు, మగవాళ్ళతో మగవాళ్ళు, ఆడవాళ్ళతో ఆడవాళ్ళు తమ కామాన్ని తీర్చుకొనే వాళ్ళకు, 10 దొంగలకు, దురాశాపరులకు, త్రాగుబోతులకు, అపవాదాలు లేవదీసేవాళ్ళకు, మోసగాళ్ళకు, దేవుని రాజ్యం దొరకదు. 11 మీలో కొందరు ఆ విధంగా జీవించారు. కాని దేవుడు మీ పాపాలు కడిగివేశాడు. కనుక మీరు పవిత్రంగా ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువు పేరిట మన దేవుని ఆత్మ ద్వారా మీరు నిర్దోషులుగా పరిగణింపబడ్డారు.
© 1997 Bible League International