Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: “నాశనం చేయవద్దు” రాగం. దావీదు అనుపదగీతం. గుహలో సౌలు నుండి అతడు పారిపోయినప్పటిది.
57 దేవా, నన్ను కరుణించు
నా ఆత్మ నిన్నే నమ్ముకొన్నది గనుక దయ చూపించుము.
కష్టం దాటిపోయేవరకు
నేను నీ శరణు జొచ్చియున్నాను.
2 మహోన్నతుడైన దేవుని సహాయం కోసం నేను ప్రార్థించాను.
దేవుడు నా విషయమై సంపూర్ణ జాగ్రత్త తీసుకొంటాడు.
3 పరలోకము నుండి ఆయన నాకు సహాయం చేసి, నన్ను రక్షిస్తాడు.
నన్ను ఇబ్బందిపెట్టే మనుష్యులను ఆయన శిక్షిస్తాడు.
దేవుడు తన నిజమైన ప్రేమను
నాకు చూపిస్తాడు.
4 నా జీవితం ప్రమాదంలో ఉంది.
నా శత్రువులు నా చుట్టూరా ఉన్నారు.
ఈటెలు, బాణాలవంటి పదునైన పళ్లు,
మనుష్యులను తినే ఖడ్గంలా పదునైన నాలుకలుగల సింహాల్లా వారున్నారు.
5 దేవా, నీవు ఆకాశాలకంటె ఎత్తుగా హెచ్చింపబడ్డావు.
నీ మహిమ భూమిని ఆవరించి ఉంది.
6 నా శత్రువులు నాకు ఉచ్చు వేసారు.
వారు నన్ను ఉచ్చులో పట్టుకోవాలని చూస్తున్నారు.
నేను పడుటకు వారు గొయ్యి తవ్వారు.
కాని వారే దానిలో పడ్డారు.
7 దేవా, నిన్ను విశ్వసించటంలో నా హృదయం నిబ్బరంగా వున్నది.
నేను నీకు స్తుతులు పాడుతాను.
8 నా ఆత్మా, మేలుకొనుము!
స్వరమండలమా, సితారా, మేలుకోండి. వేకువను మనం మేల్కొందాము
9 నా ప్రభూ, నేను నిన్ను ప్రతి ఒక్కరి వద్దా స్తుతిస్తాను.
ప్రతీ జనంలో నేను నిన్ను గూర్చిన స్తుతిగీతాలు పాడుతాను.
10 నీ నిజమైన ప్రేమ ఆకాశంలోకెల్లా అత్యున్నత మేఘాలకంటె ఎత్తయింది.
11 ఆకాశాలకంటె దేవుడు ఎక్కువగా ఘనపర్చబడ్డాడు.
ఆయన మహిమ భూమి మీద నిండిపోయింది.
23 అయితే అబీగయీలు దావీదును చూడగానే వెంటనే గాడిద మీదనుంచి దిగి, దావీదుకు సాగిలపడి అభివందనం చేసింది. 24 అబీగయీలు దావీదు పాదాల మీద పడి, “అయ్యా, నన్ను నీతో మాట్లాడనియ్యి. నేను చెప్పేది విను. జరిగిన దానికి నన్నేనిందించు. 25 నీవు పంపిన మనుష్యుల్ని నేను చూడలేదు. ఈ పనికిమాలిన మనిషి నాబాలును నీవు లక్ష్యపెట్టకు. అతను తన పేరుకు తగినట్టే ఉన్నాడు. అతని పేరుకు ‘బుద్ధిహీనుడని’ అర్థం. అతడు నిజంగానే బుద్ధిహీనుడు. 26 నిర్దోషులను చంపకుండా, యెహోవాయే నిన్ను దూరంగా ఉంచాడు. యెహోవా జీవిస్తున్నాడు నిజంగా, నీవు జీవిస్తున్నావు నిజంగా నీ శత్రువులంతా, మరియు నీకు కీడు తలపెట్టిన వారంతా నాబాలువలె అవుదురు గాక! 27 నీ కోసం నేను ఈ కానుకలు తెచ్చాను. నిన్ను అనుసరిస్తున్న నీ మనుష్యులకు ఈ కానుకలనివ్వు. 28 తప్పు చేసినందుకు నన్ను క్షమించు. యెహోవా నీ కుటుంబాన్ని బలపరచి నీ కుటుంబంలో అనేక మంది రాజులు పుట్టేలా చేస్తాడని నాకు తెలుసు. నీవు ఆయన తరపున యుద్ధాలు చేస్తున్నావు గనుక యెహోవా అలా చేస్తాడు. నీవు జీవించియున్నంత కాలం ప్రజలకు నీలో ఏ తప్పూ కనబడదు. 29 ఒక మనిషి నిన్ను చంపాలని వెంటాడినా, నీ దేవుడైన యెహోవా నీ ప్రాణాన్ని రక్షిస్తాడు. ఒడిసెలలో పెట్టి విసరిన రాయిలా యెహోవా నీ శత్రువుల ప్రాణాలను విసిరేస్తాడు. 30 నీకు అనేక మంచి వాటిని చేస్తానని యెహోవా వాగ్దానం చేసాడు. కనుక యెహోవా వాటన్నింటినీ నెరవేరుస్తాడు. ఆయన నిన్ను ఇశ్రాయేలుకు నాయకునిగా చేస్తాడు. 31 అప్పుడు నీవు ఈ బోనులోపడవు. దుర్మార్గాలు చేసిన దోషం నీకు ఉండదు. నిర్దోషులను చంపావనే దోషం నీ మీద ఉండదు. ఆ మహా గొప్ప విజయం నీకు యెహోవా చేకూర్చినప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను” అని వేడుకున్నది.
32 దావీదు అబీగయీలుకు సమాధానమిస్తూ, “ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం. నన్ను కలుసుకునేందుకు దేవుడే నిన్ను పంపించాడు. 33 నీవు సరియైన న్యాయ విచారణ చేసినందుకు దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక! ఈ రోజు నేను నిర్దోషులను చంపకుండా నీవే నన్ను వారించావు. 34 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా జీవిస్తున్నంత నిజంగా నీవు గనుక ఇంత త్వరగా ఈరోజు నన్ను కలుసుకొనేందుకు రాకపోతే రేపటి ఉదయం లోపల నాబాలు వంశంలో ఒక్క మగవాడు కూడా మిగిలే వాడు కాదు” అని చెప్పాడు దావీదు.
35 అప్పుడు దావీదు అబీగయీలు తెచ్చిన కానుకలు స్వీకరించి, “శాంతితో ఇంటికి వెళ్లు. నీ మాటలు నేను విన్నాను, నీవు కోరినట్టు నేను చేస్తాను” అని దావీదు ఆమెతో చెప్పాడు.
సహనము
7 అందువల్ల సోదరులారా! ప్రభువు వచ్చే వరకు సహనంతో ఉండండి. రైతు పొలం నుండి వచ్చే విలువైన పంటకోసం ఏ విధంగా కాచుకొని ఉంటాడో గమనించండి. అతడు, తొలకరి కడవరి వర్షం దాకా సహనంతో కాచుకొని ఉంటాడు. 8 ప్రభువు రానున్న సమయం సమీపిస్తోంది. కనుక ధైర్యం చెడకుండా సహనంతో ఉండండి. 9 సోదరులారా! ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోకండి. అలా చేస్తే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆ న్యాయాధిపతి మీ తలుపు ముందు నిలుచున్నాడు.
10 సోదరులారా! ప్రభువు పక్షాన మాట్లాడిన ప్రవక్తలు కష్టాలు అనుభవించారు. వాళ్ళలో సహనం ఉంది. వాళ్ళను ఆదర్శంగా తీసుకోండి. 11 కష్టాలు అనుభవించి కూడా విశ్వాసంతో ఉన్నవాళ్ళను మనము ధన్యులుగా భావిస్తాము. యోబు సహనాన్ని గురించి మీరు విన్నారు. ప్రభువు చేసినదాన్ని చూసారు. ప్రభువులో దయా దాక్షిణ్యాలు సంపూర్ణంగా ఉన్నాయి.
మీరేమంటున్నారో జాగ్రత్త
12 నా సోదరులారా! అన్నిటికన్నా ముఖ్యమైనదేమిటంటే, పరలోకం పేరిట గాని, భూమి పేరిట గాని, మరేదానిపై గాని ఒట్టు పెట్టుకోకండి. మీరు “ఔను” అని అనాలనుకొంటె “ఔను” అనండి. “కాదు” అని అనాలనుకొంటె “కాదు” అని అనండి. అలా చేస్తే దేవుడు మిమ్మల్ని శిక్షించడు.
© 1997 Bible League International