Revised Common Lectionary (Complementary)
7 “నా ప్రజలిలా నాకు మొరపెట్టుకుంటారు: జరిగిన విషయాలన్నిటికీ మా తప్పులే కారణమని మాకు తెలుసు.
మా పాపాల ఫలంగా మేమిప్పుడు కష్టాలనుభవిస్తున్నాము.
యెహోవా, నీ నామ ఘనత కొరకు ఏదో ఒకటి చేసి మాకు సహాయపడుము.
నిన్ను అనేక సార్లు మేము వదిలిపెట్టినట్లు మేము ఒప్పుకుంటున్నాము.
నీ పట్ల మేము పాపం చేశాము.
8 ఓ దేవా! ఇశ్రాయేలుకు నీవు ఆశాజ్యోతివి!
కష్ట కాలంలో ఇశ్రాయేలును ఆదుకొనేవాడవు నీవే.
అయినా ఇప్పుడి దేశంలో పరాయి వానిలా ప్రవర్తిస్తున్నావు.
ఒక్కరాత్రి ఉండిపోయే బాటసారిలా ఉన్నావు.
9 ఆకస్మికంగా దాడి చేయబడిన వ్యక్తిలా ఉన్నావు.
ఎవ్వరినీ రక్షించలేని అశక్తుడైన సైనికునిలా ఉన్నావు.
అయినా నీవు మాతో ఉన్నావు.
యెహోవా, నీ పేరుతో మేము పిలువబడుతూ ఉన్నాము. మమ్మల్ని నిస్సహాయులుగా వదిలి పెట్టవద్దు!”
10 యూదా ప్రజల విషయంలో యెహోవా ఇలా చెపుతున్నాడు: “యూదా ప్రజలు నన్ను వదిలి పెట్టటానికి ఇష్టపడ్తారు. వారు నన్ను వదిలి వెళ్లటంలో ఏమాత్రం వెనుకాడరు. కనుక ఇప్పుడు నేను వారిని అంగీకరించను. వారు చెసిన దుష్టకార్యాలను నేను గుర్తు పెట్టుకుంటాను. వారి పాపాలకు నేను వారిని శిక్షిస్తాను.”
19 యోహోవా, యూదా రాజ్యాన్ని నీవు పూర్తిగా విడనాడావా?
యెహోవా, సీయోనును నీవు ప్రేమించడం లేదా?
నీవు మమ్ములను గాయపర్చిన రీతి చూస్తే, మేము తిరిగి కోలుకొనలేమనిపిస్తున్నది.
నీవు ఆ పని ఎందుకు చేశావు?
మేము శాంతిని కోరుకుంటున్నాము.
కాని దాని వల్ల ఏమీ మంచి జరుగలేదు.
మేము స్వస్థపడే సమయం కొరకు ఎదురుచూశాము;
కాని భయము పుట్టుచున్నది.
20 యెహోవా, మేము చాలా దుర్మార్గులమని మాకు తెలుసు.
మా పూర్వీకులు చెడుపనులు చేసినట్లు మాకు తెలుసు.
అవును. మేము నీ పట్ల పాపం చేశాము.
21 యెహోవా, ఉన్నతమైన నీ నామము కొరకైనా మమ్మల్ని త్రోసివేయవద్దు!
దివ్యమైన నీ సింహాసనపు గౌరవాన్ని తగ్గించవద్దు.
మాతో నీవు చేసిన ఒడంబడికను గుర్తుంచుకోవాలి.
ఆ నిబంధనను మరువవద్దు.
22 అన్య దేవతల విగ్రహాలకు వర్షం కురిపించే శక్తిలేదు.
ఆకాశానికి వర్షాలను పంపే ప్రభావము లేదు.
నీవే మాకు దిక్కు
నీవే ఈ కార్యములన్నీ జరిపించేది.
సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. కోరహు కుమారుల స్తుతి కీర్తన
84 సర్వశక్తిమంతుడువైన యెహోవా, నీ ఆలయం నిజంగా రమ్యమైనది.
2 యెహోవా, నేను వేచియుండి అలసిపోయాను.
నేను నీ ఆలయంలో ఉండాలని ఆశిస్తున్నాను.
నాలోని ప్రతి అవయవం జీవంగల దేవునికి ఆనంద గానం చేస్తుంది.
3 సర్వ శక్తిమంతుడువైన యెహోవా, నా రాజా, నా దేవా,
పిచ్చుకలకు, వానకోవెలలకు సహితం నివాసాలు ఉన్నాయి.
ఆ పక్షులు నీ బలిపీఠం దగ్గర గూళ్లు పెట్టుకొంటాయి.
అక్కడే వాటి పిల్లలు ఉంటాయి.
4 నీ ఆలయం వద్ద నివసించే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు.
వారు ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తారు.
5 ఎవరైతే వారి బలానికి నిన్ను ఆధారంగా ఉండనిస్తారో వారు సంతోషిస్తారు.
వారు నిన్నే నడిపించ నిస్తారు.
6 దేవుడు నీటి ఊటగా చేసిన తొలకరి వాన నిలిచే
నీటి మడుగుల బాకా లోయగుండా వారు పయనిస్తారు.
7 వారు దేవుని కలుసుకొనే సీయోనుకు పోయే మార్గంలో
ఆ ప్రజలు పట్టణం నుండి పట్టణానికి ప్రయాణం చేస్తారు.
6 నా ప్రాణాలు ధారపోయవలసిన గడియ దగ్గరకు వచ్చింది. నేను వెళ్ళే సమయం వచ్చింది. 7 ఈ పోటీలో నేను బాగా పరుగెత్తాను. విశ్వాసాన్ని వదులుకోకుండా పందెం ముగించాను. 8 ఇప్పుడు “నీతి” అనే కీరీటం నా కోసం కాచుకొని ఉంది. నీతిగా తీర్పు చెప్పే ప్రభువు “ఆ రానున్న రోజు” దాన్ని నాకు బహుమతిగా యిస్తాడు. నాకే కాక, ఆయన రాక కోసం నిరీక్షిస్తున్నవాళ్ళందరికీ ఆ బహుమతి లభిస్తుంది.
16 నా విషయంలో మొదటి సారి విచారణ జరిగినప్పుడు నాకు ఎవ్వరూ సహాయం చెయ్యలేదు. అందరు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపొయ్యారు. దేవుడు వాళ్ళను క్షమించు గాక! 17 నా ద్వారా సువార్త ప్రకటింపబడాలని యూదులు కానివాళ్ళందరు వినాలని ప్రభువు నా ప్రక్కన నిలబడి నాకు శక్తినిచ్చాడు. సింహాల నోటినుండి నన్ను కాపాడాడు. 18 ప్రభువు నాకు ఏ విధమైన కీడు సంభవించకుండా నన్ను కాపాడి, క్షేమంగా పరలోకంలో ఉన్న తన రాజ్యానికి పిలుచుకు వెళ్తాడు. ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆమేన్.
పరిసయ్యుడు, పన్నులు సేకరించేవాడు
9 తాము మాత్రమే నీతిమంతులమని అనుకొని యితర్లను చిన్నచూపు చూసేవాళ్ళకు యేసు ఈ ఉపమానం చెప్పాడు: 10 “ఇద్దరు మనుష్యులు మందిరానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు పన్నులు వసూలు చేసేవాడు. 11 పరిసయ్యుడు ఒక ప్రక్కనిలుచొని ఈ విధంగా ప్రార్థించటం మొదలు పెట్టాడు: ‘ప్రభూ! నేను యితరుల్లా, అంటే మోసగాళ్ళల్లా, దుర్మార్గుల్లా, వ్యభిచారుల్లా ఉండనందుకు నీకు కృతజ్ఞుణ్ణి. ఈ పన్నులు సేకరించేవానిలా నేను ఉండనందుకు కూడా కృతజ్ఞుణ్ణి. 12 నేను వారానికి రెండుసార్లు ఉపవాసాలు చేస్తాను. నా సంపదలో పదవవంతు దేవుని పేరిట యిస్తాను.’
13 “ఆ పన్నులు సేకరించేవాడు మరొక ప్రక్క నిలుచొని ఆకాశం వైపు కూడా చూడటానికి ధైర్యము లేక గుండెలు బాదుకుంటూ, ‘దేవుడా! నేనొక పాపిని, నాపై దయచూపు’ అని అన్నాడు. 14 దేవుని దృష్టిలో పరిసయ్యునికి మారుగా ఇతడు నీతిమంతుడనిపించుకొని ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే గొప్పలు చెప్పుకొన్నవాడు అణచబడతాడు. అణుకువతో ఉన్నవాడు గొప్ప స్థానానికి ఎత్తబడతాడు.”
© 1997 Bible League International