Revised Common Lectionary (Complementary)
111 యెహోవాను స్తుతించండి!
మంచి మనుష్యులు సమావేశమయ్యే సమాజంలో
నేను నా హృదయపూర్తిగా యెహోవాకు వందనాలు చెల్లిస్తాను.
2 యెహోవా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
దేవుని నుండి లభ్యమయ్యే మంచిది ప్రతి ఒక్కటి ప్రజలకు కావాలి.
3 దేవుడు వాస్తవంగా మహిమగల ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
ఆయన మంచితనం నిరంతరం కొనసాగుతుంది.
4 దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
కనుక యెహోవా దయ, జాలి గలవాడని మనం జ్ఞాపకం చేసుకొంటాము.
5 దేవుడు తన అనుచరులకు ఆహారం ఇస్తాడు.
దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొంటాడు.
6 దేవుడు చేసిన శక్తివంతమైన పనులు ఆయన తన ప్రజలకు
వారి దేశాన్ని ఇస్తున్నాడని తెలియజేస్తున్నాయి.
7 దేవుడు చేసే ప్రతిది మంచిది, న్యాయమయింది కూడా.
ఆయన ఆదేశాలు అన్నీ నమ్మదగినవి.
8 దేవుని ఆదేశాలు నిత్యం కొనసాగుతాయి.
ఆ ఆదేశాలు ఇవ్వటంలోగల దేవుని కారణాలు నిజాయితీగలవి, పవిత్రమైనవి.
9 దేవుడు తన ప్రజలను రక్షిస్తాడు. దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా కొనసాగేందుకు చేసాడు.
దేవుని నామం అద్భుతం, పవిత్రం!
10 దేవుడంటే భయము, భక్తి ఉంటేనే జ్ఞానం ప్రారంభం అవుతుంది.
దేవుణ్ణి గౌరవించే ప్రజలు చాలా జ్ఞానంగలవారు.
శాశ్వతంగా దేవునికి స్తుతులు పాడుతారు.
లేవీ కుటుంబాలు
34 మోషే, అహరోను, ఇశ్రాయేలు ప్రజా నాయకులు కహాతీ ప్రజలను లెక్కించారు. వంశాలుగా, కుటుంబాలుగా వారు వారిని లెక్కించారు. 35 30 నుండి 50 సంవత్సరాల వయసు గలిగి యుద్ధంలో పని చేసిన పురుషులందరిని వారు లెక్కించారు. సన్నిధి గుడారంకోసం చేయాల్సిన ప్రత్యేక పని వీరికి అప్పగించబడింది.
36 ఈ పని చేసేందుకు అర్హులు 2,750 మంది పురుషులు కహాతు వంశంలో ఉన్నారు. 37 కనుక కహాతు వంశంలోని ఈ పురుషులకు సన్నిధి గుడారం కోసం చేయాల్సిన ప్రత్యేక పని అప్పగించబడింది. మోషేతో యెహోవా చెప్పిన ప్రకారం మోషే, అహరోను యిలా చేసారు. 38 మరియు, గెర్షోను కుటుంబం కూడ లెక్కించబడింది. 39 30 నుండి 50 సంవత్సరాల వయసు ఉండి సైన్యంలో పని చేసిన పురుషులంతా లెక్కించబడ్డారు. సన్నిధి గుడారం కోసం వారు చేయాల్సిన ప్రత్యేక పని ఈ మనుష్యులకు అప్పగించటం జరిగింది. 40 గెర్షోను వంశాల్లో అర్హులైన పురుషులు 2,630 మంది ఉన్నారు. 41 కనుక గెర్షోను వంశంలోని ఈ మనుష్యులకు సన్నిధి గుడారం కోసం చేయాల్సిన ప్రత్యేక పని అప్పగించటం జరిగింది. మోషేకు యెహోవా చెప్పిన ప్రకారం మోషే, అహరోను ఇలా చేసారు.
42 మరియు మెరారి వంశంలోని పురుషులు లెక్కించబడ్డారు. 43 30 నుండి 50 సంవత్సరాల వయసు ఉండి సైన్యంలో పని చేసిన పురుషులంతా లెక్కించబడ్డారు. సన్నిధి గుడారం కోసం వీరు చేయాల్సిన ప్రత్యేక పని వీరికి అప్పగించబడింది. 44 మెరారి వంశాల్లో అర్హులైన పురుషులు 3,200 మంది ఉన్నారు. 45 కనుక మెరారి వంశంలోని ఈ పురుషులకు వారి ప్రత్యేక పని అప్పగించబడింది. మోషేతో యెహోవా చెప్పిన ప్రకారం మోషే అహరోనులు ఇలా చేసారు.
46 కనుక మోషే, అహరోను, ఇశ్రాయేలు ప్రజా నాయకులు లేవీయులలోని పురుషులందరినీ లెక్కించారు. ప్రతి వంశాన్ని, ప్రతి కుటుంబాన్ని వారు లెక్కించారు. 47 30 నుండి 50 సంవత్సరాల వయసువుండి సైన్యంలో పని చేసిన పురుషులందరూ లెక్కించబడ్డారు. సన్నిధి గుడారం కోసం చేయాల్సిన ప్రత్యేక పని వీరికి అప్పగించబడింది. వారు ప్రయాణం చేసినప్పుడు సన్నిధి గుడారాన్ని మోసే పనిని వారు చేసారు. 48 వారి మొత్తం సంఖ్య 8,500. 49 మోషేకు ఈ ఆజ్ఞను యెహోవా ఇచ్చాడు. ఒక్కో మనిషికి ఒక్కో పని ఇవ్వబడింది. ఏ మనిషి ఏమి మోయాలో ఆ మనిషికి చెప్పబడింది. కనుక యెహోవా ఆజ్ఞ ప్రకారం చేయబడింది. పురుషులంతా లెక్కించబడ్డారు.
పరిశుభ్రత నియమాలు
5 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 2 “ఇశ్రాయేలు ప్రజలు వ్యాధులు, రోగములు లేకుండ వారి నివాసమును కాపాడుకోవాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. కుష్ఠురోగం ఉన్న ఏ మనిషినైనా సరే వారి నివాసములో నుండి పంపించి వేయాలని ప్రజలతో చెప్పు. స్రావంగల ప్రతి మనిషిని వారి నివాసంలోనుండి పంపివేయాలని వారితో చెప్పు. శవాన్ని ముట్టిన ప్రతి మనిషినీ వారి నివాసమునుండి పంపివేయాలని వారితో చెప్పు. 3 అతడు స్త్రీగాని, పురుషుడుగాని గొప్పేమీ కాలేదు. రోగాన్ని వ్యాధిని వారు మీ నివాసములో వ్యాపింపజేయకుండునట్లు వారిని మీ నివాసమునుండి బయటకు పంపించివేయండి. మీ నివాసములో మీ మధ్య నేను నివసిస్తున్నాను.”
4 కనుక ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞకు విధేయులయ్యారు. అలాంటి వారిని నివాసము వెలుపలకు వారు పంపించివేసారు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం వారు ఇలా చేసారు.
క్రీస్తు యేసు యొక్క విధేయ సైనికుడు
2 నా కుమారుడా! యేసు క్రీస్తులోనున్న కృప ద్వారా బలవంతుడుగా నుండు. 2 నేను బోధించిన వాటిని నీవు విన్నావు. వాటిని నేను అనేకుల సమక్షంలో బోధించాను. ఆ ఉపదేశాలను నీవు నమ్మగలవాళ్ళకు, యితరులకు బోధించగల సామర్థ్యము ఉన్నవాళ్ళకు అప్పగించు. 3 యేసు క్రీస్తుకు మంచి సైనికునివలే, మాతో కలిసి విశ్వాసంతో కష్టాలు సహించు. 4 సైనికునిగా పని చేసేవాడు సామాన్య ప్రజల విషయాల్లో తలదూర్చడు. గాని అతడు, తన సైన్యాధిపతిని సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తాడు. 5 అదే విధంగా ఆట పందెంలో పాల్గొనేవాడు ఆ ఆట నియమాల్ని పాటిస్తే కాని విజయం సాధించలేడు. 6 కష్టించి పని చేసే రైతుకు, వచ్చిన పంటలో భాగము అందరికన్నా ముందు లభిస్తుంది. 7 నేను చెప్పేవాటిని గురించి ఆలోచించు. ప్రభువు నీకు వీటన్నిటిని గురించి తెలుసుకొనే జ్ఞానం కల్గిస్తాడు.
© 1997 Bible League International