Revised Common Lectionary (Complementary)
యాత్ర కీర్తన.
121 కొండల తట్టు నేను చూసాను.
కాని నిజానికి నా సహాయం ఎక్కడనుండి వస్తుంది?
2 భూమిని, ఆకాశాన్ని సృష్టించిన యెహోవా దగ్గరనుండి
నాకు సహాయం వస్తుంది.
3 దేవుడు నిన్ను పడిపోనివ్వడు.
నిన్ను కాపాడేవాడు నిద్రపోడు.
4 ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు.
దేవుడు ఎన్నడూ నిద్రపోడు.
5 యెహోవాయే నిన్ను కాపాడేవాడు.
యెహోవా తన మహా శక్తితో నిన్ను కాపాడుతాడు.
6 పగటి సూర్యుడు నీకు బాధ కలిగించడు.
రాత్రివేళ చంద్రుడు నీకు బాధ కలిగించడు.
7 ప్రతి అపాయం నుండి యెహోవా నిన్ను కాపాడుతాడు.
యెహోవా నీ ప్రాణాన్ని కాపాడుతాడు.
8 నీవు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు యెహోవా నీకు సహాయంగా ఉంటాడు.
ఇప్పుడు, ఎల్లప్పుడూ యెహోవా నీకు సహాయంగా ఉంటాడు.
యాకోబు, లాబాను సంధి
43 యాకోబుతో లాబాను చెప్పాడు: “ఈ అమ్మాయిలు నా కుమార్తెలు. వారి పిల్లలు నాకు చెందినవాళ్లు. ఈ జంతువులన్నీ నావే. ఇక్కడ నీకు కనబడుతోన్న సమస్తం నాదే. అయినప్పటికీ నా కుమార్తెలను, వారి పిల్లలను నా దగ్గర ఉంచుకొనేందుకు నేను చేయగలిగింది ఏమీ లేదు. 44 కనుక నీతో ఒడంబడిక చేసుకొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మనకు ఒడంబడిక ఒకటి కుదిరిందని సూచించేందుకు మనం ఇక్కడ ఒక రాళ్ల కుప్ప వేద్దాం.”
45 కనుక యాకోబు ఒక పెద్ద బండను తెచ్చాడు, అతడు ఒక ఒడంబడిక చేసుకొన్నట్లు సూచనగా దాన్ని నిలువబెట్టాడు. 46 మరికొన్ని రాళ్లు తెచ్చి కుప్పగా వేయమని అతడు తన సేవకులతో చెప్పాడు. అప్పుడు ఆ రాళ్ల కుప్ప ప్రక్కన వాళ్లు భోజనం చేశారు. 47 ఆ స్థలానికి యగర్ శాహదూత[a] అని లాబాను పేరు పెట్టాడు. కానీ యాకోబు ఆ స్థలానికి గలేదు[b] అని పేరు పెట్టాడు.
48 “మనం ఇద్దరం మన ఒడంబడికను జ్ఞాపకం చేసుకొనేందుకు ఈ రాళ్ల కుప్ప సహాయపడుతుంది” అన్నాడు లాబాను యాకోబుతో. అందుకే ఆ స్థలానికి గలేదు అని యాకోబు పేరు పెట్టాడు.
49 అప్పుడు లాబాను, “మనం ఒకరినుండి ఒకరం విడిపోయేటప్పుడు యెహోవా మనల్ని కాపాడును గాక!” అన్నాడు. కనుక ఆ స్థలానికి మిస్పా అని కూడ పేరు.
50 అప్పుడు లాబాను అన్నాడు, “నా కుమార్తెలను నీవు బాధిస్తే, దేవుడు నిన్ను శిక్షిస్తాడని జ్ఞాపకం ఉంచుకో. నీవు ఇతర స్త్రీలను పెళ్లి చేసుకొంటే దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు. 51 ఇవిగో, ఇవి మన యిద్దరి మధ్య నేను ఉంచిన రాళ్లు. మనమిద్దరం ఒక ఒడంబడిక చేసుకొన్నామని సూచించేందుకు, జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఈ రాళ్ల కుప్ప. ఇది ప్రత్యేక బండ. 52 మనం మన ఒడంబడికను జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఈ రాళ్ల కుప్ప, ఈ ప్రత్యేక బండ మనకు తోడ్పడుతాయి. నేనెన్నడూ ఈ రాళ్లు దాటి నీ మీదకు రాను. అలానే నీవు కూడా ఎన్నడూ ఈ రాళ్లు దాటి నామీద పోరాడటానికి రాకూడదు. 53 ఈ ఒప్పందాన్ని గనుక మనం మీరితే, అబ్రాహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి పూర్వీకుల దేవుడు మనలను నేరస్థులుగా తీర్పు చెప్పును గాక.”
యాకోబు తండ్రియైన ఇస్సాకు, దేవుణ్ణి “భయంకరుడు” అని పిల్చాడు. కనుక యాకోబు ఆ పేరు మీదనే వాగ్దానం చేశాడు. 54 అప్పుడు యాకోబు ఒక పశువును వధించి, ఆ కొండమీద దానిని బలిగా అర్పించాడు. భోజనంలో పాలు పుచ్చుకోమని అతడు తన వాళ్లను పిల్చాడు. భోజనం చేసి, ఆ రాత్రికి వారు ఆ కొండమీదనే గడిపారు. 55 మర్నాడు ఉదయాన్నే లాబాను తన కుమార్తెలకు, వారి పిల్లలకు వీడ్కోలు ముద్దు పెట్టాడు. అతడు వాళ్లను ఆశీర్వదించి తిరిగి తన యింటికి వెళ్లిపోయాడు.
ఏశావును మళ్లీ కలుసుకొనుటకు యాకోబు సిద్ధపడుట
32 యాకోబు కూడ అక్కడ నుండి వెళ్లి పోయాడు. అతడు ప్రయాణం చేస్తుండగా దేవుని దూతలను చూశాడు. 2 యాకోబు వారిని చూసినప్పుడు, “ఇది దేవుని శిబిరం” అన్నాడు. కనుక ఆ స్థలానికి “మహనయీము”[c] అని యాకోబు పేరు పెట్టాడు.
దేవుడు సమ్మతించిన పనివాడు
14 వాళ్ళకు ఈ విషయాలు జ్ఞాపకము చేస్తూ ఉండు. వ్యర్థమైన మాటల్ని గురించి వాదించరాదని దేవుని సమక్షంలో వాళ్ళను హెచ్చరించు. అలాంటి వాదనవల్ల ఏ లాభం కలుగదు. పైగా విన్నవాళ్ళను అది పాడుచేస్తుంది. 15 దేవుని సమక్షంలో ఆయన అంగీకారం పొందే విధంగా నీ శక్తికి తగినట్లు కృషి చేయి. అప్పుడు నీవు చేస్తున్న పనికి సిగ్గు పడనవసరం ఉండదు. సత్యాన్ని సక్రమంగా బోధించు.
16 విశ్వాసహీనమైన మాటలు, పనికిరాని మాటలు మాట్లాడవద్దు. అలాంటివాళ్ళు దేవునికి యింకా దూరమైపోతారు. 17 వీళ్ళ బోధ పైకి కనిపించని వ్యాధిలా వ్యాపిస్తుంది. హుమెనై, ఫిలేతు ఈ గుంపుకు చెందినవాళ్ళు. 18 వీళ్ళు సత్యాన్ని విడిచి తప్పు దారి పట్టారు. పునరుత్థానం జరిగిపోయిందని చెప్పి కొందరి విశ్వాసాన్ని పాడు చేస్తున్నారు.
19 అయినా, దేవుడు వేసిన పునాది గట్టిది. దాన్ని ఎవ్వరూ కదల్చలేరు. ఈ పునాదిపై, “తనవాళ్ళెవరో ప్రభువుకు తెలుసు.(A) ప్రభువు నామాన్ని అంగీకరించిన ప్రతి ఒక్కడు దుర్మార్గాలు వదిలివెయ్యాలి” అని వ్రాయబడి ఉంది.
20 గొప్ప వాళ్ళ యిండ్లలో వెండి, బంగారు వస్తువులే కాక, చెక్కతో, మట్టితో చేయబడిన వస్తువులు కూడా ఉంటాయి. కొన్ని ప్రత్యేక సమయాల్లో ఉపయోగించేవి, మరికొన్ని ప్రతిరోజు ఉపయోగించేవి. 21 దుర్మార్గాలను వదిలినవాణ్ణి దేవుడు ప్రత్యేకమైన కార్యాలకు ఉపయోగిస్తాడు. అలాంటివాడు పవిత్రంగా ఉండి దేవునికి ఉపయోగకరంగా ఉంటాడు. మంచి కార్యాలను చేయటానికి సిద్ధంగా ఉంటాడు.
22 యౌవనంలో కలిగే చెడు కోరికలకు దూరంగా ఉండు. ప్రభువును పవిత్ర హృదయంతో కొలిచేవాళ్ళతో కలిసి నీతిని విశ్వాసాన్ని ప్రేమను, శాంతిని అనుసరించు. 23 కొందరు అర్థం లేకుండా మూర్ఖంగా వాదిస్తారు. అవి పోట్లాటలకు దారి తీస్తాయని నీకు తెలుసు. కనుక అలాంటి వివాదాల్లో పాల్గొనవద్దు. 24 అంతేకాక ప్రభువు సేవకుడు పోట్లాడరాదు. అందరి పట్ల దయ చూపాలి. బోధించ కలిగి ఉండాలి. సహనం ఉండాలి. 25 తనకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళకు శాంతంగా బోధించాలి. వాళ్ళ హృదయాలు మార్చి దేవుడు వాళ్ళకు సత్యం తెలుసుకోనే మార్గం చూపిస్తాడని ఆశించాలి. 26 అప్పుడు వాళ్ళకు బుద్ధి వచ్చి సాతాను వేసిన వలనుండి తప్పించుకోగల్గుతారు. ఎందుకంటే సాతాను వాళ్ళను తన యిచ్ఛ నెరవేర్చటానికి బంధించి పెట్టాడు.
© 1997 Bible League International