Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: తంతి వాయిద్యాలతో పాడదగిన దావీదు కీర్తన.
61 దేవా, నా ప్రార్థనా గీతం వినుము.
నా ప్రార్థన ఆలకించుము.
2 నేను ఎక్కడ ఉన్నా ఎంత బలహీనంగా ఉన్నా,
సహాయం కోసం నీకు మొరపెడతాను.
ఎత్తయిన క్షేమస్థలానికి
నన్ను మోసికొనిపొమ్ము.
3 నీవే నా క్షేమ స్థానం.
నా శత్రువుల నుండి నన్ను కాపాడే బలమైన గోపురం నీవే.
4 నీ గుడారంలో[a] నేను శాశ్వతంగా నివసిస్తాను.
నీవు నన్ను ఎక్కడ కాపాడగలవో అక్కడ దాక్కుంటాను.
5 దేవా, నేను నీకిస్తానని చేసిన ప్రమాణం నీవు విన్నావు.
కాని నిన్ను ఆరాధించేవారికి ఉన్న సమస్తం నీవద్ద నుండే వస్తుంది.
6 రాజుకు దీర్ఘాయుష్షు దయచేయుము.
అతన్ని శాశ్వతంగా జీవించనిమ్ము.
7 అతన్ని దేవుని ఎదుట శాశ్వతంగా జీవించనిమ్ము.
నీ నిజమైన ప్రేమతో మరియు విశ్వాసంతో అతనిని కాపాడుము.
8 నేను నీ నామాన్ని శాశ్వతంగా స్తుతిస్తాను.
నేను ప్రమాణం చేసినవాటిని ప్రతి రోజూ చేస్తాను.
19 “నెమ్మదికలిగి వెళ్లుము” అని ఎలీషా నయమానుకు చెప్పాడు.
అందువల్ల నయమాను ఎలీషాని విడిచి కొంతదూరం వెళ్లాడు. 20 కాని దైవజనుడు అయిన ఎలీషా సేవకుడు గేహజీ, “నా యజమాని (ఎలీషా) సిరియనుడయిన నయమానుని వెళ్లనిచ్చాడు. కాని అతడు తెచ్చిన కానుకను స్వీకరించలేదు. యెహోవా జీవము తోడుగా వెనుకనే నేను పరిగెత్తుకుపోయి, అతని వద్దనుంచి ఏదైనా తీసుకువస్తాను” అని అనుకున్నాడు. 21 అందువల్ల గేహజీ నయమాను వద్దకు పరుగెత్తుకు వెళ్లాడు.
తన వెనుక ఎవరో పరిగెత్తుకుని వస్తున్నట్లు నయమాను గ్రహించి. అతను తన రథం దిగి గేహజీని కలుసుకుని, “అంతా సవ్యంగా వుందిగదా” అని నయమాను అడిగాడు.
22 “అవును. అంతా సవ్యంగానే వుంది. నా యజమాని (ఎలీషా) నన్ను పంపాడు. ఇద్దరు యువకులు నావద్దకు వచ్చారనీ, కొండ దేశమైన ఎఫ్రాయిము నుంచి ప్రవక్తల బృందానికి వారు చెందిన వారనీ, వారికి డెభైఐదు పౌన్లు వెండి మరియు రెండురకాల దుస్తులు ఇమ్మని ఆయన చెప్పాడు” అని గేహజీ చెప్పాడు.
23 “అయ్యా, నూట ఏభై పౌన్లు తీసుకోండి” అని నయమాను చెప్పాడు. గేహజీ ఆ వెండిని తీసుకునేందుకు నయమాను అతనిని ఒప్పించాడు. నయమాను నూట ఏభై పౌన్లు వెండిని రెండు సంచులలో వేసి, రెండు రకాల దుస్తులు కూడా తీసుకున్నాడు. తర్వాత ఆ వస్తువుల్ని నయమాను తన సేవకులిద్దిరకి ఇచ్చాడు. గేహజీ కొరకు వారు ఆ వస్తువులను మోసుకు వెళ్లారు. 24 గేహజీ కొండ వద్దకు రాగానే, ఆ వస్తువులను అతని సేవకుల వద్దనుంచి తీసుకుని, ఆ సేవకులను పంపివేశాడు. వారు వెళ్లిపోయారు. తర్వాత గేహజీ ఆ వస్తువులను ఇంట్లో దాచాడు.
25 గేహజీ తన యజమాని అయిన ఎలీషా యెదుట నిలబడ్డాడు. గేహజీతో ఎలీషా, “గేహజీ, నీవు ఎక్కడికి వెళ్లావు?” అని అడిగాడు.
“నేనెక్కడికీ వెళ్లలేదు” అని గేహజీ చెప్పాడు.
26 “ఇది నిజం కాదు నిన్ను కలుసుకునేందుకు నయమాను తన రథంనుంచి క్రిందికి దిగినప్పుడు నా హృదయం నీతో వున్నది. పైకం, వస్త్రాలు, ఒలివలు, ద్రాక్షలు, గొర్రెలు, ఆవులు లేక స్త్రీ పురుష సేవకులు మొదలైనవి తీసుకునేందుకు ఇది సమయం కాదు. 27 ఇప్పుడు నీకు, నీ వంశానికి నయమాను వ్యాధి సంక్రమిస్తుంది. ఎల్లప్పుడూ నీకు కుష్ఠువ్యాధి వుంటుంది” అని ఎలీషా గేహజీతో చెప్పాడు.
ఎలీషాని విడిచి గేహజీ వెళ్లగానే, గేహజీ శరీరం మంచువలె తెల్లగా కనిపించింది. గేహజీకి కుష్ఠువ్యాధి కలిగింది.
దేవుడు యిచ్చిన ఆయుధాలు
10 చివరకు చెప్పేదేమిటంటే ప్రభువుతో మీకు లభించిన ఐక్యత మీకు అధిక బలాన్నిస్తుంది. ఆయనలో ఉన్న శక్తి మీకు శక్తినిస్తుంది. 11 సాతాను పన్నే పన్నాగాలను ఎదిరించటానికి దేవుడిచ్చిన ఆయుధాలన్నిటిని ధరించండి. 12 మనం పోట్లాడుతున్నది మానవులతో కాదు. చీకటిని పాలించే వాళ్ళతో, దానిపై అధికారమున్న వాళ్ళతో, చీకటిలోని శక్తులతో ఆకాశంలో కనిపించని దుష్టశక్తులతో మనం పోరాడుతున్నాము. 13 కనుక దేవుడిచ్చిన ఆయుధాలను ధరించండి. అప్పుడు ఆ దుర్దినమొచ్చినప్పుడు మీరు శత్రువును ఎదిరించ గలుగుతారు. చివరిదాకా పోరాడాక కూడా మీ యుద్ధరంగంలో మీరు నిలబడగలుగుతారు.
14 కనుక ధైర్యంగా నిలబడండి. సత్యమనే దట్టి నడుముకు చుట్టుకొని, నీతి అనే కవచాన్ని ధరించండి. 15 శాంతి సందేశమనే పాదరక్షల్ని ధరించి సిద్ధంగా ఉండండి. 16 వీటితో పాటు విశ్వాసమనే డాలును ధరించి సాతాను ప్రయోగించే అగ్నిబాణాల్ని ఆర్పటానికి సిద్ధంకండి. 17 రక్షణ అనే శిరస్త్రాణము, ఆత్మ యిచ్చిన వాక్యమనే దేవుని ఖడ్గాన్ని ధరించండి. 18 ప్రార్థనలు, విన్నపాలు, పరిశుద్ధాత్మ ద్వారా చెయ్యండి. అన్ని వేళలా ప్రార్థించండి. మెలకువతో ఉండండి. దేవుని ప్రజలకోసం ప్రార్థించటం మానవద్దు. వాళ్ళ కోసం అన్ని వేళలా ప్రార్థించండి.
19 నేను నా నోరు కదల్చినప్పుడు దేవుడు తన వాక్యాన్ని నాకందివ్వాలని నాకోసం కూడ ప్రార్థించండి. అప్పుడు నేను దైవసందేశంలో ఉన్న రహస్యాన్ని ధైర్యంగా చెప్పగలుగుతాను. 20 సంకెళ్ళలోవున్న నేను ఈ సందేశం బోధించటానికి రాయబారిగా వచ్చాను. నేను ధైర్యంగా ప్రకటించాలి కనుక ఆ ధైర్యం నాలో కలిగేటట్లు నాకోసం ప్రార్థించండి.
© 1997 Bible League International