Revised Common Lectionary (Complementary)
దావీదు తన కుమారుడైన అబ్షాలోము నుండి పారిపోతున్న సమయంలో వ్రాసిన కీర్తన
3 యెహోవా, నాకు ఎందరెందరో శత్రువులు ఉన్నారు
అనేకమంది ప్రజలు నాకు విరోధంగా తిరిగారు.
2 చాలామంది మనుష్యులు నా విషయమై మాట్లాడుతున్నారు. “అతన్ని దేవుడు తప్పించడు!” అని ఆ మనుష్యులు అంటారు.
3 అయితే, యెహోవా, నీవు నాకు కేడెము.
నీవే నా అతిశయం.
యెహోవా, నీవు నన్ను ప్రముఖునిగా[a] చేస్తావు.
4 యెహోవాకు నేను ప్రార్థిస్తాను.
ఆయన తన పవిత్ర పర్వతం నుండి నాకు జవాబు ఇస్తాడు!
5 నేను పడుకొని విశ్రాంతి తీసుకోగలను, మరి నేను మేల్కొందును.
ఇది నాకు ఎలా తెలుస్తుంది? ఎందుచేతనంటే యెహోవా నన్ను ఆవరించి, కాపాడును గనుక!
6 వేలకు వేలుగా సైనికులు నా చుట్టూ మోహరించి ఉండవచ్చును.
కాని ఆ శత్రువులకు నేను భయపడను.
7 యెహోవా, లెమ్ము[b]
నా దేవా, వచ్చి నన్ను రక్షించుము!
నీవు చాలా బలవంతుడవు! నా దుష్ట శత్రువుల దవడమీద నీవు కొట్టి,
వారి పళ్లన్నీ నీవు విరుగగొడతావు.
8 యెహోవా తన ప్రజలను రక్షించగలడు.
యెహోవా, దయచేసి నీ ప్రజలకు నీవు మంచి సంగతులను జరిగించుము.
12 “అన్యాయం చేసి, నరహత్య చేసి నగరం నిర్మించిన నాయకునికి మిక్కిలి కీడు. 13 అటువంటి జనులు నిర్మింప తలపెట్టిన వాటన్నిటినీ అగ్నిచే కాల్చివేయటానికి సర్వశక్తిమంతుడైన యెహోవా నిర్ణయించాడు. వారు చేసిన పనంతా వృథా. 14 అప్పుడు ప్రతిచోట ప్రజలు యెహోవా యొక్క మహిమను గూర్చి తెలుసుకుంటారు. సముద్రంలోకి నీరు వ్యాపించునట్లు ఈ వార్త వ్యాపిస్తుంది. 15 తను కోపం చెంది, ఇతరులను బాధించే వ్యక్తికి మిక్కిలి శ్రమ. ఆ వ్యక్తి కోపంలో ఇతరులను నేలకు పడగొడతాడు. అతడు వారిని వస్త్రవిహీనులుగాను, తాగినవారిగాను చూస్తాడు.
16 “కాని అతడు యెహోవా కోపాన్ని తెలుసుకుంటాడు. ఆకోపం యెహోవా కుడి చేతిలో విషపు గిన్నెలా ఉంటుంది. అతడు ఆ కోపాన్ని రుచిచూచి, తాగిన వానిలా నేలమీద పడతాడు.
“దుష్టపాలకుడా, నీవు ఆ గిన్నెనుండి తాగుతావు. నీవు పొందేది అవమానం; గౌరవం కాదు. 17 నీవు లెబానోనులో ఎంతోమందిని బాధించావు. అక్కడ నీవు ఎన్నో పశువులను దొంగిలించావు. కావున, చనిపోయిన ప్రజల కారణంగాను, నీవా దేశానికి చేసిన చెడుపనుల వల్లను నీవు భయపడతావు. నీవా నగరాలకు, వాటిలో నివసించే ప్రజలకు చేసిన పనులనుబట్టి నీవు భయపడతావు”
విగ్రహాలను గూర్చిన వర్తమానం
18 అతని బూటకపు దేవుడు అతనికి సహాయం చేయడు. ఎందుకనగా అది ఒకానొకడు లోహవు తొడుగు వేసి చేసిన బొమ్మ. అది కేవలం విగ్రహం. కావున దానిని చేసినవాడు అది సహాయం చేస్తుందని ఆశించలేడు. ఆ విగ్రహం కనీసం మాట్లాడలేదు. 19 ఒక కొయ్య విగ్రహముతో “నిలబడు” అని చెప్పేవానికి మిక్కిలి వేదన! మాట్లాడలేని ఒక రాతితో, “మేలుకో” అని చెప్పేవానికి బాధ తప్పదు. ఆ వస్తువులు అతనికి సహాయపడలేవు. ఒక విగ్రహం బంగారంతో గాని, వెండితో గాని తొడుగు వేయబడవచ్చు. కాని ఆ విగ్రహంలో ప్రాణం లేదు.
20 కాని యెహోవా విషయం వేరు! యెహోవా తన పవిత్రాలయంలో ఉన్నాడు. కావున ఈ భూమి అంతా నిశ్శబ్దంగా వుండి, యెహోవాముందు గౌరవ భావంతో మెలగాలి.
ఎండిపొయిన అంజూరపు చెట్టు
(మత్తయి 21:18-19)
12 మరుసటిరోజు వాళ్ళు బేతనియనుండి బయలుదేరి వస్తుండగా యేసుకు ఆకలి వేసింది. 13 కొంత దూరంలో ఆకులున్న అంజూరపు చెట్టు ఉండటం యేసు చూసాడు. దాని మీద పండ్లున్నాయేమో చూడాలని దగ్గరకు వెళ్ళాడు. కాని దగ్గరకు వెళ్ళాక, అది పండ్లు కాచేకాలం కానందువల్ల ఆయనకు ఆకులు తప్ప పండ్లు కనిపించలేదు. 14 అప్పుడు యేసు ఆ చెట్టుతో, “ఎన్నడూ ఎవ్వరూ నీ ఫలాల్ని తినకూడదు!” అని అన్నాడు. ఆయన అలా అనటం శిష్యులు విన్నారు.
యేసు విశ్వాస శక్తిని చూపటం
(మత్తయి 21:20-22)
20 ఉదయం ఆ దారిన నడుస్తూ వాళ్ళా అంజూరపు చెట్టు వ్రేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండటం గమనించారు. 21 పేతురుకు యేసు అన్నమాటలు జ్ఞాపకం వచ్చి యేసుతో, “రబ్బీ! అదిగో చూడండి; మీరు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయింది” అని అన్నాడు.
22 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “దేవుణ్ణి విశ్వసించండి. 23 ఇది నిజం. హృదయంలో అనుమానించకుండా తాను అన్నది జరుగుతుందని నమ్మి ఒక కొండతో ‘వెళ్ళి సముద్రంలో పడు’ అని అంటే, అలాగే సంభవిస్తుంది. 24 అందువల్ల నేను చెప్పేదేమిటంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా మీకు లభిస్తుందని సంపూర్ణంగా విశ్వసించండి. అప్పుడు మీకది లభిస్తుంది.
© 1997 Bible League International