Revised Common Lectionary (Complementary)
22 ఆ రాత్రి చాలా గడిచిన తర్వాత యాకోబు లేచి బయల్దేరాడు. అతని భార్యలను, ఇద్దరు దాసీలను, తన పదకొండుమంది పిల్లలను అతడు తనతో కూడ వెంటబెట్టుకొని బయల్దేరాడు. యబ్బోకు నదిని దాటవలసిన చోట యాకోబు దాటాడు. 23 తన కుటుంబాన్ని నది దాటించాడు యాకోబు. తర్వాత యాకోబు తనకి కలిగిన దాన్ని అంతటినీ నది దాటించాడు.
దేవునితో పోరాటం
24 అందరికంటే చివర యాకోబు నదిని దాటాడు. అయితే అతడు దాటక ముందు, అతడు ఇంకా ఒంటరిగా ఉండగానే, ఒక మనిషి వచ్చి అతనితో పోరాడాడు. సూర్యుడు ఉదయించే వరకు ఆ మనిషి అతనితో పోరాడాడు. 25 ఆ మనిషి యాకోబును ఓడించలేనట్లు గ్రహించాడు. అందుచేత అతడు యాకోబు కాలును తాకాడు. అప్పుడే యాకోబు కాలి కీలు జారిపోయింది.
26 అప్పుడు ఆ మనిషి, “నన్ను వెళ్లనివ్వు, సూర్యుడు వచ్చేస్తున్నాడు” అని యాకోబుతో అన్నాడు.
కాని యాకోబు, “నేను నిన్ను వెళ్లనియ్యను. నీవు నన్ను ఆశీర్వదించాల్సిందే” అన్నాడు.
27 “నీ పేరేమిటి?” ఆ మనిషి అడిగాడు.
“నా పేరు యాకోబు” అన్నాడు యాకోబు.
28 అప్పుడు, “నీ పేరు ఇకమీదట యాకోబు కాదు. ఇప్పుడు నీ పేరు ఇశ్రాయేలు.[a] దేవునితోను, మనుష్యులతోను నీవు పోరాడి, ఓడిపోలేదు గనుక నీకు నేను ఈ పేరు పెడుతున్నాను” అన్నాడు ఆ మనిషి.
29 అప్పుడు యాకోబు, “దయచేసి నీ పేరు ఏమిటో చెప్పు” అని అడిగాడు.
అయితే ఆ మనిషి “నీవు నా పేరెందుకు అడగాలి?” అన్నాడు. అప్పుడే యాకోబును అతడు ఆశీర్వదించాడు.
30 అందుచేత ఆ స్థలానికి పెనూయేలు[b] అని యాకోబు పేరు పెట్టాడు. “ఇక్కడ దేవుణ్ణి నేను ముఖాముఖిగా చూశాను. అయినప్పుటికి నా ప్రాణం దక్కింది” అన్నాడు యాకోబు. 31 అతడు పెనూయేలు దాటుతుండగా సూర్యుడు ఉదయించాడు. యాకోబు కాలికి అలా జరిగినందువల్ల అతడు కుంటుతూ ఉన్నాడు.
యాత్ర కీర్తన.
121 కొండల తట్టు నేను చూసాను.
కాని నిజానికి నా సహాయం ఎక్కడనుండి వస్తుంది?
2 భూమిని, ఆకాశాన్ని సృష్టించిన యెహోవా దగ్గరనుండి
నాకు సహాయం వస్తుంది.
3 దేవుడు నిన్ను పడిపోనివ్వడు.
నిన్ను కాపాడేవాడు నిద్రపోడు.
4 ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు.
దేవుడు ఎన్నడూ నిద్రపోడు.
5 యెహోవాయే నిన్ను కాపాడేవాడు.
యెహోవా తన మహా శక్తితో నిన్ను కాపాడుతాడు.
6 పగటి సూర్యుడు నీకు బాధ కలిగించడు.
రాత్రివేళ చంద్రుడు నీకు బాధ కలిగించడు.
7 ప్రతి అపాయం నుండి యెహోవా నిన్ను కాపాడుతాడు.
యెహోవా నీ ప్రాణాన్ని కాపాడుతాడు.
8 నీవు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు యెహోవా నీకు సహాయంగా ఉంటాడు.
ఇప్పుడు, ఎల్లప్పుడూ యెహోవా నీకు సహాయంగా ఉంటాడు.
14 కాని, నీవు ఎవరినుండి నేర్చుకొన్నావో తెలుసు. కనుక, నీవు నేర్చుకొన్నవాటిని, విశ్వసించినవాటిని పాటిస్తూ ఉండు. 15 అంతే కాక, నీవు నీ చిన్ననాటినుండి పవిత్ర గ్రంథాలు తెలిసినవాడవు. అవి నీలో జ్ఞానం కలిగించి యేసు క్రీస్తు పట్ల నీకున్న విశ్వాసం మూలంగా రక్షణను ప్రసాదించాయి. 16 లేఖనాలన్నీ దేవునిచే ప్రేరేపింపబడినవి. నీతిని బోధించటానికి, గద్దించటానికి, సరిదిద్దటానికి, నీతి విషయం తర్బీదు చేయటానికి ఉపయోగపడతాయి. 17 వీటి ద్వారా దైవజనుడు ప్రతి మంచి కార్యాన్ని చేయటానికి సంపూర్ణంగా తయారుకాగలడు.
4 చనిపోయినవాళ్ళపై, బతికివున్నవాళ్ళపై తీర్పు చెప్పే దేవుని సమక్షంలో యేసు క్రీస్తు సమక్షంలో నీకొక ఆజ్ఞ యిస్తున్నాను. ఆయన ప్రత్యక్షం కానున్నాడు కనుక, ఆయన రాజ్యం రానున్నది కనుక, నీకీ విధంగా ఆజ్ఞాపిస్తున్నాను. 2 దైవసందేశాన్ని ప్రకటించు. అన్ని సమయాల్లో సిద్ధంగా ఉండు. తప్పులు సరిదిద్దుతూ, అవసరమైతే గద్దిస్తూ, ప్రోత్సాహమిస్తూ, సహనంతో బోధిస్తూ ఉండు.
3 ప్రజలు మంచి ఉపదేశాలు వినటం మానివేసే సమయం వస్తుంది. వాళ్ళు తమ యిష్టం వచ్చినట్లు చేస్తారు. తాము వినదల్చిన లౌకికమైన వాటిని చెప్పగలిగే పండితుల్ని తమ చుట్టూ ప్రోగుచేసుకొంటారు. 4 సత్యం వినటం మాని, కల్పిత సంగతులు వింటారు. 5 కాని అన్ని విషయాల్లో నిగ్రహంగా ఉండు. కష్టాలు ఓర్చుకో. సువార్త ప్రచారం చెయ్యటానికి కష్టించి పనిచెయ్యి. నీ సేవా సంబంధంలో చెయ్యవలసిన కర్తవ్యాలు పూర్తిగా నిర్వర్తించు.
పట్టు వదలని వితంతువు యొక్క ఉపమానం
18 నిరంతరం ప్రార్థిస్తూ ఉండాలని, నిరుత్సాహం చెందరాదని, బోధించటానికి యేసు తన శిష్యులకు ఈ ఉపమానం చెప్పాడు: 2 “ఒక గ్రామంలో ఒక న్యాయాధిపతి ఉండేవాడు. అతనికి దేవుడంటే భయంకాని, ప్రజలు తనని గురించి ఏమనుకొంటారనే భీతికాని లేకుండెను. 3 అదే గ్రామంలో ఒక వితంతువు ఉండేది. ఆమె ఆ న్యాయాధిపతి దగ్గరకు ప్రతిరోజు వచ్చి ‘నాకు ఒకడు అన్యాయం చేశాడు. నాకు న్యాయం చేకూర్చండి’ అని అడుగుతూ ఉండేది. 4 చాలా కాలం అతడు ఆమె మాటలు పట్టించుకోలేదు. కాని చివరకు ‘నాకు దేవుడంటే భయంకాని, ప్రజలంటే భీతికాని లేదు. 5 కాని ఈ వితంతువు వచ్చి నన్ను విసిగిస్తోంది. కాబట్టి ఈమె మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు రాకుండ ఈమెకు న్యాయం జరిగేలా చూస్తాను’ అని తన మనస్సులో అనుకున్నాడు.”
6 ఇలా చెప్పి ప్రభువు, “ఆ నీతి నియమం లేని న్యాయాధిపతి అనుకొన్న మాటలు విన్నారు కదా! 7 మరి దేవుడు తనను రాత్రింబగళ్ళు ప్రార్థించే తన వాళ్ళకు న్యాయం చేకూర్చకుండా ఉంటాడా? వాళ్ళకు న్యాయం చెయ్యటంలో ఆలస్యం చేస్తాడా! 8 ఆయన వాళ్ళకు వెంటనే న్యాయం చేకూరుస్తాడని నేను చెబుతున్నాను. కాని మనుష్యకుమారుడు వచ్చినప్పుడు ఈ ప్రపంచంలోని ప్రజలలో విశ్వాసాన్ని కనుగొంటాడా?” అని అన్నాడు.
© 1997 Bible League International