Revised Common Lectionary (Complementary)
దావీదు తన కుమారుడైన అబ్షాలోము నుండి పారిపోతున్న సమయంలో వ్రాసిన కీర్తన
3 యెహోవా, నాకు ఎందరెందరో శత్రువులు ఉన్నారు
అనేకమంది ప్రజలు నాకు విరోధంగా తిరిగారు.
2 చాలామంది మనుష్యులు నా విషయమై మాట్లాడుతున్నారు. “అతన్ని దేవుడు తప్పించడు!” అని ఆ మనుష్యులు అంటారు.
3 అయితే, యెహోవా, నీవు నాకు కేడెము.
నీవే నా అతిశయం.
యెహోవా, నీవు నన్ను ప్రముఖునిగా[a] చేస్తావు.
4 యెహోవాకు నేను ప్రార్థిస్తాను.
ఆయన తన పవిత్ర పర్వతం నుండి నాకు జవాబు ఇస్తాడు!
5 నేను పడుకొని విశ్రాంతి తీసుకోగలను, మరి నేను మేల్కొందును.
ఇది నాకు ఎలా తెలుస్తుంది? ఎందుచేతనంటే యెహోవా నన్ను ఆవరించి, కాపాడును గనుక!
6 వేలకు వేలుగా సైనికులు నా చుట్టూ మోహరించి ఉండవచ్చును.
కాని ఆ శత్రువులకు నేను భయపడను.
7 యెహోవా, లెమ్ము[b]
నా దేవా, వచ్చి నన్ను రక్షించుము!
నీవు చాలా బలవంతుడవు! నా దుష్ట శత్రువుల దవడమీద నీవు కొట్టి,
వారి పళ్లన్నీ నీవు విరుగగొడతావు.
8 యెహోవా తన ప్రజలను రక్షించగలడు.
యెహోవా, దయచేసి నీ ప్రజలకు నీవు మంచి సంగతులను జరిగించుము.
దేవుడు హబక్కూకునకు సమాధానమివ్వటం
5 యెహోవా సమాధానమిచ్చాడు: “ఇతర జనులవైపు చూడు! వారిని గమనించు. నీకు విస్మయం కలుగుతుంది. నీ జీవిత కాలంలో నీకు విస్మయం కలిగించే ఒక పని చేస్తాను. నీవు అది నమ్మాలంటే చూసి తీరాలి. దాని విషయం నీకు చెపితే అది నీవు నమ్మవు. 6 బబులోను ప్రజలను నేను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దుతాను. ఆ ప్రజలు నీచులు; శక్తిగల యుద్ధవీరులు. వారు భూమికి అడ్డంగా నడుస్తారు. వారికి చెందని ఇండ్లను, నగరాలను వారు వశపర్చుకుంటారు. 7 బబులోనువారు ఇతర ప్రజలను భయపెడతారు. బబులోనువారు వారు చేయదల్చుకున్నది చేస్తారు; వెళ్ళదల్చుకున్న చోటుకి వెళతారు. 8 వారి గుర్రాలు చిరుతపులులకంటే వేగం కలవి. సూర్యుడు అస్తమించాక అవి తోడేళ్ళకంటె నీచంగా ఉంటాయి. వారి గుర్రపు దళంవారు దూరప్రాంతలనుండి వస్తారు. ఆకలిగొన్న గరుడ పక్షి ఆకాశంనుండి కిందికి దూసుకు వచ్చినట్లు, వారు తమ శత్రువులను వేగంగా ఎదుర్కొంటారు. 9 వారంతా చేయకోరుకునే ఒకే ఒక్క విషయం యుద్ధం. వారి సైన్యాలు ఎడారిలో గాలిలా వేగంగా నడుస్తాయి. మరియు బబులోను సైనికులు అనేకానేక మందిని చెరబడతారు. ఇసుక రేణువుల్లా లెక్కలేనంత మందిని పట్టుకుంటారు.
10 “బబులోను సైనికులు ఇతర దేశాల రాజులను చూసి నవ్వుతారు. పరదేశ పాలకులు వారికి హాస్యగాండ్రవలె ఉంటారు. పొడవైన, బలమైన గోడలు గల నగరాలను చూచి బబులోను సైనికులు నవ్వుతారు. ఆ సైనికులు గోడమీదికంటె మట్టి బాట సునాయాసంగా నిర్మించి, నగరాలను తేలికగా జయిస్తారు. 11 పిమ్మట వారు గాలిలా వెళ్లి మరో ప్రాంతంలో యుద్ధం చేస్తారు. బబులోనువారు ఆరాధించే ఒకే ఒక్క వస్తువు వారి స్వయంశక్తి.”
హబక్కూకు రెండవ ఫిర్యాదు
12 పిమ్మట హబక్కూకు చెప్పాడు:
“యెహోవా, నీవు ఎల్లకాలములయందు ఉండే దేవుడవు!
నీవు చావులేని పవిత్ర దేవుడవు!
యెహోవా, జరుగవలసిన కార్యం జరిపించటానికే నీవు బబులోను ప్రజలను సృష్టించావు.
మా ఆశ్రయ దుర్గమా, యూదా ప్రజలను శిక్షించటానికి నీవు వారిని సృష్టించావు.
13 నీ కండ్లు దుష్టత్వాన్ని చూడలేవు.
ప్రజలు తప్పు చేయటాన్ని నీవు చూడలేవు.
మరి అటువంటి నీవు ఆ దుష్టులు జయించటం ఎలా చూడగలుగుతున్నావు?
దుష్టులు మంచివారిని ఓడించటం నీవెలా చూడగలుగుతున్నావు?
14 “నీవు ప్రజలను సముద్రంలో చేపల్లా తయారు చేశావు.
నాయకుడులేని చిన్న సముద్ర జంతువుల్లా వారున్నారు.
15 వారందరినీ గాలాలు, వలలు వేసి శత్రువు పట్టుకుంటాడు.
శత్రువు వారిని తన వలలో పట్టి లాగుతాడు,
తను పట్టుకున్న దానిని చూసి శత్రువు చాలా సంతోషిస్తాడు.
16 శత్రువు తను భాగ్యవంతుడుగా నివసించటానికి,
మంచి ఆహారం తినటానికి అతని వల అతనికి సహాయపడుతుంది.
కావున శత్రువు తన వలను ఆరాధిస్తాడు.
తన వల యొక్క గౌరవార్థం అతడు దానికి బలులు అర్పించి, ధూపంవేస్తాడు.
17 తన వలతో ధనాన్ని తీసుకుపోవటం అతడు కొనసాగిస్తాడా?
దయా దాక్షిణ్యం లేకుండా అతడు (బబులోను సైన్యం) ప్రజలను నాశనం చేయటం కొనసాగిస్తాడా?”
విశ్వాసము, జ్ఞానము
2-3 నా సోదరులారా! మీకు పరీక్షలు కలిగినప్పుడు పరమానందంగా భావించండి. విశ్వాసం పరీక్షింపబడటం వల్ల సహనం కలుగుతుందని మీకు తెలుసు. 4 మీరు చేసే పనిలో పూర్తిగా సహనం చూపండి. అలా చేస్తే మీరు బాగా అభివృద్ధి చెంది పరిపూర్ణత పొందుతారు. అప్పుడు మీలో ఏ లోపం ఉండదు.
5 మీలో జ్ఞానం లేనివాడు ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి. దేవుడు కోపగించుకోకుండా అందరికీ ధారాళంగా యిస్తాడు. కనుక మీకు కూడా యిస్తాడు. 6 కాని దేవుణ్ణి అడిగినప్పుడు సంశయించకుండా విశ్వాసంతో అడగండి. సంశయించేవాడు గాలికి ఎగిరి కొట్టుకొను సముద్రం మీది తరంగంతో సమానము. 7 అలాంటివాడు ప్రభువు నుండి తనకు ఏదైనా లభిస్తుందని ఆశించకూడదు. 8 అలాంటివాడు ద్వంద్వాలోచనలు చేస్తూ అన్ని విషయాల్లో చంచలంగా ఉంటాడు.
ధనము, దరిద్రము
9 దీనస్థితిలో ఉన్న సోదరుడు తనకు గొప్ప స్థానం లభించినందుకు గర్వించాలి. 10 ధనవంతుడు తాను కూడా గడ్డిపువ్వులా రాలిపోవలసినవాడే కనుక తనకు దీనస్థితి కలిగినందుకు ఆనందించాలి. 11 ఎందుకంటే, సూర్యుడు ఉదయిస్తాడు. మండుటెండకు గడ్డి ఎండిపోతుంది. దాని పువ్వులు రాలి దాని అందం చెడిపోతుంది. అదే విధంగా ధనవంతుడు తన వ్యాపారం సాగిస్తుండగానే మరణిస్తాడు.
© 1997 Bible League International