Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
న్యాయాధిపతులు 3-5

1-2 ఇతర రాజ్యాల ప్రజలంతా ఇశ్రాయేలీయుల దేశం విడిచిపెట్టేటట్టు యెహోవా బలవంతం చేయలేదు. ఇశ్రాయేలీయులను యెహోవా పరీక్షించాలనుకున్నాడు. ఈ సమయంలో జీవిస్తూ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఒక్కరు కూడ కనాను దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు జరిగిన యుద్ధాల్లో పాల్గొనలేదు. అందుచేత ఆ ఇతర రాజ్యాలను యెహోవా వారి దేశంలో ఉండనిచ్చాడు. (ఆ యుద్ధాలలో పాల్గొనని ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించాలని యెహోవా ఇలా చేసాడు). ఆ దేశంలో యెహోవా ఉండనిచ్చిన రాజ్యాల పేర్లు ఇవి: ఫిలిష్తీయుల అయిదుగురు పరిపాలకులు, కనానీయులు అందరూను, సీదోను ప్రజలు, గయెలు హెర్మోను నుండి లెబోహమాతు వరకు గల లెబానోను కొండల్లో జీవించిన హివ్వీ ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలను పరీక్షించటానికి యెహోవా ఆ రాజ్యాలను దేశంలో ఉండనిచ్చాడు. వారి పూర్వీకులకు మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆదేశాలకు ఇశ్రాయేలు ప్రజలు విధేయులవుతారేమోనని ఆయన చూడాలనుకున్నాడు.

కనానీయులతో, హిత్తీ ప్రజలతో, అమోరీ ప్రజలతో, పెరిజ్జీ ప్రజలతో, హివ్వీ ప్రజలతో, యెబూసీ ప్రజలతో కలిసి ఇశ్రాయేలు ప్రజలు జీవించారు. ఇశ్రాయేలు ప్రజలు, ఆ ప్రజల కుమార్తెలను వివాహము చేసుకోవటం మొదలు పెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు తమ కుమార్తెలను ఆ మనుష్యుల కుమారులు వివాహము చేసుకోనిచ్చారు. మరియు ఇశ్రాయేలు ప్రజలు ఆ మనుష్యుల దేవుళ్లను పూజించటం మొదలు పెట్టారు.

మొదటి న్యాయమూర్తి, ఒత్నీయేలు

ఇశ్రాయేలు ప్రజలు చెడు పనులు చేసినట్టు యెహోవా చూశాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి దేవుడు యెహోవాను మరచిపోయి, బయలు మరియు అషేరా[a] అను బూటకపు దేవుళ్లను సేవించారు. ఇశ్రాయేలీయుల మీద యెహోవాకు కోపం వచ్చింది. యెహోవా అరామునహరాయిము[b] రాజు కూషన్రిషాతాయిము ఇశ్రాయేలు ప్రజలను ఓడించి, వారిని పాలించనిచ్చాడు. ఇశ్రాయేలీయులు ఎనిమిది సంవత్సరాల పాటు ఆ రాజు పాలనలో ఉన్నారు. కానీ ఇశ్రాయేలీయులు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు. వారిని రక్షించేందుకు యెహోవా ఒక మనిషిని పంపించాడు. ఆ మనిషి పేరు ఒత్నీయేలు. అతడు కనజు అనే వ్యక్తి కుమారుడు. కనజు కాలేబుకు చిన్న తమ్ముడు. ఒత్నీయేలు ఇశ్రాయేలీయులను రక్షించాడు. 10 యెహోవా ఆత్మ ఒత్నీయేలు మీదికి వచ్చినప్పుడు అతడు ఇశ్రాయేలీయులకు న్యాయమూర్తి అయ్యాడు. ఇశ్రాయేలీయులను ఒత్నీయేలు యుద్ధానికి నడిపించాడు. అరాము రాజు కూషన్రిషాతాయిమును ఓడించేందుకు యెహోవా ఒత్నీయేలుకు సహాయం చేసాడు. 11 అందుచేత కనజు కుమారుడు ఒత్నీయేలు చనిపోయేంతవరకు నలభై సంవత్సరాలు దేశం శాంతితో ఉండెను.

న్యాయమూర్తి ఏహూదు

12 ఇశ్రాయేలు ప్రజలు మరల చెడుకార్యాలు చేయటం యెహోవా చూశాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలను ఓడించేందుకు మోయాబు రాజు ఎగ్లోనుకు యెహోవా శక్తి ఇచ్చాడు. 13 అమ్మోనీ ప్రజలు, అమాలేకు ప్రజల దగ్గర నుండి ఎగ్లోను సహాయం పొందాడు. వారు అతనితో కలిసి, ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేశారు. ఎగ్లోను, అతని సైన్యం ఇశ్రాయేలు ప్రజలను ఓడించి, ఖర్జూరపు చెట్ల పట్టణం నుండి (యెరికో) వారిని బలవంతంగా వెళ్లగొట్టారు. 14 ఎగ్లోను ఇశ్రాయేలు ప్రజలను పద్దెనిమిది సంవత్సరాలు పాలించాడు.

15 ప్రజలు యెహోవాకు మొరపెట్టారు. ఇశ్రాయేలు ప్రజలను రక్షించేందుకు యెహోవా ఒక మనిషిని పంపించాడు. ఆ మనిషి పేరు ఏహూదు. ఏహూదు ఎడమచేతి వాటంగలవాడు. ఏహూదు బెన్యామీను వంశానికి చెందిన గెరా అనే పేరుగల వాని కుమారుడు. మోయాబు రాజు ఎగ్లోనుకు కొంత పన్ను డబ్బు చెల్లించేందుకు ఇశ్రాయేలు ప్రజలు ఏహూదును పంపించారు. 16 ఏహూదు అతనికోసం ఒక ఖడ్గం చేసుకున్నాడు. ఆ ఖడ్గానికి రెండంచులున్నాయి, దాని పొడవు పద్ధెనిమిది అంగుళాలు. ఏహూదు ఆ ఖడ్గాన్ని తన కుడి తొడకు కట్టుకొని తన బట్టల క్రింద దానిని కప్పిపెట్టాడు.

17 ఏహూదు మోయాబు రాజైన ఎగ్లోను దగ్గరకు వచ్చి పన్ను డబ్బు చెల్లించాడు. (ఎగ్లోను చాలా లావు పాటి మనిషి) 18 ఏహూదు ఆ డబ్బును ఎగ్లోనుకు చెల్లించిన తర్వాత, ఆ డబ్బును మోసుకుని వచ్చిన ఆ మనుష్యులను తిరిగి ఇంటికి పంపించివేసాడు. 19 ఏహూదు వెళ్లేందుకు బయలుదేరాడు. గిల్గాలు పట్టణంలో విగ్రహాలను అతడు సమీపించినప్పుడు అతడు వెనుకకు తిరిగాడు. అప్పుడు ఏహూదు, “ఓ రాజా, నీకు చెప్పాల్సిన ఒక రహస్య సందేశం నా దగ్గర ఉంది” అని ఎగ్లోనుతో చెప్పాడు.

ఊరకవుండు అన్నాడు రాజు. తర్వాత అతడు సేవకులందరినీ ఆ గదిలోనుండి బయటకు పంపివేసాడు. 20 ఏహూదు ఎగ్లోను రాజు దగ్గరకు వెళ్లాడు. ఎగ్లోను తన వేసవి కాలపు రాజ భవనంలో ఒంటరిగా కూర్చునియున్నాడు.

అప్పుడు ఏహూదు, “దేవుని దగ్గరనుండి నీ కోసము ఒక సందేశం నా వద్ద వుంది” అని చెప్పాడు. రాజు తన సింహాసనం నుండి లేచి ఏహూదుకు చాలా దగ్గరగా వచ్చాడు. 21 రాజు తన సింహాసనం నుండి లేచి నిలబడగా, ఏహూదు తన కుడి తొడకు కట్టబడిన ఖడ్గాన్ని తన ఎడమ చేతితో అందుకొని బయటకు తీసాడు. అప్పుడు ఏహూదు ఆ ఖడ్గాన్ని రాజు పొట్టలో పొడిచి వేసాడు. 22 ఆ ఖడ్గం పిడికూడ లోపలకు దిగిపోవునంతగా రాజు కడుపులోనికి దిగిపోయింది. రాజు కొవ్వు ఖడ్గము నిండా అతుక్కుపోయింది. కనుక ఏహూదు ఆ ఖడ్గాన్ని ఎగ్లోను పొట్టలోనే విడిచిపెట్టేసాడు.

23 ఏహూదు గదిలో నుండి బయటకు వెళ్లి దాని తలుపులు మూసి తాళం వేసాడు. 24 ఏహూదు వెళ్లిపోగానే సేవకులు తిరిగి వచ్చారు. ఆ గది తలుపులు తాళము వేసి ఉండటం ఆ సేవకులు చూశారు. కనుక ఆ సేవకులు, “రాజు తన విశ్రాంతి గదిలో మూత్ర విసర్జనకు వెళ్లి ఉంటాడు” అని చెప్పుకున్నారు. 25 అందుచేత ఆ సేవకులు చాలా సేపు వేచి ఉన్నారు. చివరికి వారు దిగులు చెందారు. వారు తాళం చెవి తెచ్చి తలుపులు తెరిచారు. ఆ సేవకులు ప్రవేశించినప్పుడు, వారి రాజు నేల మీద చచ్చిపడి ఉండటం చూశారు.

26 ఆ సేవకులు రాజు కొరకు వేచి ఉండగా, ఏహూదు పారిపోయేందుకు సమయం దొరికింది. ఏహూదు విగ్రహాలను దాటి శెయీరా అను స్థలంవైపు వెళ్లాడు. 27 ఏహూదు శెయీరా అను స్థలం చేరాడు. అప్పుడు అతడు అక్కడ ఎఫ్రాయిమీయుల కొండ దేశంలో బూర ఊదాడు. ఇశ్రాయేలు ప్రజలు బూర శబ్దం విని, ఏహూదు వారిని నడిపిస్తుండగా వారు కొండలు దిగివెళ్లారు. 28 ఏహూదు, “నన్ను వెంబడించండి! మన శత్రువులైన మోయాబు ప్రజలను ఓడించేందుకు యెహోవా మనకు సహాయం చేస్తాడు” అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు.

కనుక ఇశ్రాయేలు ప్రజలు ఏహూదును వెంబడించారు. ఎక్కడైతే యోర్దాను నదిని తేలికగా దాటి, మోయాబు దేశంలోనికి వెళ్లవచ్చునో ఆ స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు వారు ఏహూదు వెంట వెళ్లారు. ఇశ్రాయేలు ప్రజలు ఏ ఒక్కరినీ కూడా యోర్దాను నదిని దాటనివ్వలేదు. 29 మోయాబు ప్రజలలో ధైర్యం, బలంగల పదివేల మందిని ఇశ్రాయేలు ప్రజలు చంపివేసారు. మోయాబు వాడు ఒక్కడు కూడా తప్పించుకోలేదు. 30 కనుక ఆ రోజు నుండి ఇశ్రాయేలు ప్రజలు మోయాబు ప్రజలను పాలించటం మొదలు పెట్టారు. మరియు ఆ దేశంలో ఎనభై సంవత్సరాల వరకు శాంతి ప్రబలింది.

న్యాయమూర్తి షమ్గరు

31 ఏహూదు ఇశ్రాయేలు ప్రజలను రక్షించిన తర్వాత మరో మనిషి ఇశ్రాయేలీయులను రక్షించాడు. ఆ మనిషి పేరు షమ్గరు. అతడు అనాతు కుమారుడు. ఫిలిష్తీ మనుష్యులు ఆరువందల మందిని చంపేందుకు షమ్గరు ఒక ములుకోల (ఎద్దులను తోలే ముల్లుగల కర్ర)ను ప్రయోగించాడు.

స్త్రీ న్యాయమూర్తి దెబోరా

చెడ్డవి అని యెహోవా చెప్పిన వాటినే ప్రజలు ఏహూదు చనిపోయిన తర్వాత మరల చేశారు. కనుక కనాను రాజు యాబీను ఇశ్రాయేలీయులను ఓడించేలాగ యెహోవా చేశాడు. యాబీను హాసోరు పట్టణంలో పరిపాలించాడు. సీసెరా అను పేరుగలవాడు యాబీను రాజు సైన్యానికి సేనాధిపతి. హరోషెతు హాగ్గోయిం అనే పట్టణంలో సీసెరా నివసించాడు. సీసెరాకు తొమ్మిదివందల ఇనుప రథాలున్నాయి. అతడు ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల ఎడల చాలా క్రూరంగా ఉన్నాడు. కనుక సహాయం కోసం వారు యెహోవాకు మొరపెట్టారు.

దెబోరా అనే పేరుగల ఒక ప్రవక్తి ఉంది. ఆమె లప్పీదోతు అను పేరుగల వాని భార్య. ఆ కాలంలో ఆమె ఇశ్రాయేలీయులకు న్యాయమూర్తి. ఒక రోజు దెబోరా ఖర్జూర చెట్టు క్రింద కూర్చుని ఉంది. సీసెరా విషయం ఏమి చెయ్యాలి అని ఆమెను అడిగేందుకు ఇశ్రాయేలు ప్రజలు ఆమె దగ్గరకు వచ్చారు. ఎఫ్రాయిము కొండ దేశంలో రామా, బేతేలుకు మధ్య దెబోరా యొక్క ఖర్జూర చెట్టు ఉంది. బారాకు అను పేరుగల మనిషికి దెబోరా ఒక వర్తమానం పంపింది. ఆమెను కలుసుకునేందుకు రమ్మని ఆమె అతనిని అడిగింది. బారాకు అబీనోయము అనే పేరుగల వాని కుమారుడు. బారాకు నఫ్తాలి ప్రాంతంలోని కెదెషు పట్టణంలో నివసించేవాడు. దెబోరా బారాకుతో ఇలా చెప్పింది: “ఇశ్రాయేలు దేవుడు యెహోవా నీకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ‘వెళ్లి నఫ్తాలి జెబూలూను వంశాల నుండి పదివేల మంది పురుషులను సమావేశపరచి, ఆ మనుష్యులను తాబోరు కొండకు నడిపించు. యాబీను రాజు సైన్యాధిపతి సీసెరాను నేను నీ దగ్గరకు రప్పిస్తాను. సీసెరాను, అతని రథాలను, మరియు అతని సైన్యాన్ని కీషోను నది దగ్గరకు నేను రప్పిస్తాను. అక్కడ నీవు సీసెరాను ఓడించేందుకు నేను నీకు సహాయం చేస్తాను.’”

అప్పుడు బారాకు, “నీవు నాతో కూడా వస్తే నేను వెళ్లి ఈ పని చేస్తాను. కాని నీవు నాతో రాకపోతే, నేనూ వెళ్లను” అని దెబోరాతో చెప్పాడు.

“ఓ, నేను తప్పకుండా నీతో వస్తాను” అని దెబోరా జవాబిచ్చింది. “కానీ నీ వైఖరి మూలంగా, సీసెరా ఓడించబడినప్పుడు నీవు ఘనత పొందవు. ఒక స్త్రీ సీసెరాను ఓడించేటట్టు యెహోవా చేస్తాడు” అని చెప్పింది.

కనుక బారాకుతో కూడ కెదెషు పట్టణానికి దెబోరా వెళ్లింది. 10 కెదెషు పట్టణం దగ్గర జెబూలూను, నఫ్తాలి వంశాలను బారాకు సమావేశ పరిచాడు. ఆ వంశాల నుండి అతనిని వెంబడించేందుకు పదివేల మంది పురుషులను సమావేశపర్చాడు. దెబోరా కూడా బారాకుతో వెళ్లింది.

11 కెనితీ ప్రజలకు చెందిన, హెబెరు అను పేరుగల ఒకడు ఉన్నాడు. (కెనితీ ప్రజలు హోబాబు వంశస్థులు. హోబాబు మోషే భార్యకు సోదరుడు.) జయనన్నీము అనుచోట మస్తకి చెట్టు దగ్గర హెబెరు తన నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. జయనన్నీము కెదెషు పట్టణానికి దగ్గరగా ఉంది.

12 అబీనోయము కుమారుడు బారాకు తాబోరు కొండ దగ్గర ఉన్నాడని సీసెరాతో ఎవరో చెప్పారు. 13 కనుక సీసెరా తన తొమ్మిదివందల ఇనుప రథాలను సిద్ధం చేసాడు. సీసెరా తన మనుష్యులందరినీ ఒక్క చోట చేర్చాడు. వారు హారోషెతు హగ్గోయిము పట్టణం నుండి కీషోను నది దగ్గరకు సాగిపోయారు.

14 అప్పుడు దెబోరా, “ఈ వేళ నీవు సీసెరాను ఓడించేందుకు యెహోవా సహాయం చేస్తాడు. నీ కోసం యెహోవా ఇప్పటికే మార్గాన్ని చక్కగా తయారు చేశాడని నీకు గట్టిగా తెలుసు” అని బారాకుతో చెప్పింది. కనుక పదివేల మంది మనుష్యులను తాబోరు కొండ నుండి బారాకు నడిపించాడు. 15 బారాకు, అతని మనుష్యులు సీసెరా మీద దాడిచేసారు. యుద్ధ సమయంలో సీసెరాను, అతని సైన్యాన్ని, రథాలను యెహోవా కలవరపర్చాడు. ఏమి చేయాలో వారికి తెలియలేదు. అందుచేత బారాకు, అతని మనుష్యులు సీసెరా సైన్యాన్ని ఓడించారు. కానీ, సీసెరా తన రథాన్ని విడిచిపెట్టి కాలినడకన పారిపోయాడు. 16 బారాకు సీసెరా సైన్యంతో పోరాటం కొనసాంగించాడు. హారోషెతు, హగ్గోయిము వరకూ కూడా సీసెరా రథాలను, సైన్యాన్ని బారాకు, అతని మనుష్యులు తరిమి వేసారు. బారాకు, అతని మనుష్యులు వారి ఖడ్గాలను ఉపయోగించి సీసెరా మనుష్యులను చంపివేసారు. సీసెరా మనుష్యులలో ఒక్కడు కూడా ప్రాణంతో విడువబడలేదు.

17 కానీ సీసెరా పారిపోయాడు. యాయేలు అను స్త్రీ నివసిస్తున్న గుడారం దగ్గరకు అతడు వచ్చాడు. యాయేలు హెబెరు అనువాని భార్య. అతడు కెనితీ ప్రజల్లో ఒకడు. హెబెరు కుటుంబం హసోరు రాజగు యాబీనుతో సమాధానంగా ఉంది. కనుక సీసెరా యాయేలు గుడారానికి పరుగెత్తాడు. 18 సీసెరా రావటం యాయేలు చూసింది గనుక అతనిని కలుసుకొనేందుకు ఆమె బయటకు వెళ్లింది. యాయేలు, “అయ్యా, నా గుడారంలోనికి రండి. రండి, భయపడవద్దు” అని సీసెరాతో చెప్పింది. కనుక సీసెరా, యాయేలు గుడారంలోనికి వెళ్లాడు. ఆమె అతనిని గొంగళితో కప్పింది.

19 “నాకు దాహంగా వుంది. దయచేసి తాగేందుకు నాకు కొంచెం నీళ్లు ఇవ్వు” అన్నాడు సీసెరా యాయేలుతో. జంతు చర్మంతో చేయబడిన ఒక బుడ్డి యాయేలు దగ్గర ఉంది. అందులో ఆమె పాలు పోసి ఉంచింది. సీసెరా తాగటానికి యాయేలు ఆ పాలు ఇచ్చింది. అప్పుడు ఆమె సీసెరాను కప్పివేసింది.

20 అప్పుడు సీసెరా యాయేలుతో, “వెళ్లి, గుడార ద్వారం దగ్గర నిలువబడు. ఎవరైనా అటువైపు వచ్చి, ‘లోపల ఎవరైనా ఉన్నారా?’ అని అడిగితే ‘లేరు’ అని చెప్పు” అన్నాడు.

21 కానీ యాయేలు ఒక గుడారపు మేకును, ఒక సుత్తెను చూసింది. యాయేలు త్వరగా సీసెరా దగ్గరకు వెళ్లింది. సీసెరా చాలా అలసిపోయినందువల్ల, నిద్రపోతున్నాడు. యాయేలు గుడారపు మేకును సీసెరా కణతల మీద పెట్టి, సుత్తెతో దిగ గొట్టేసింది. ఆ గుడారపు మేకు సీసెరా కణతల్లో నుండి నేల మీదికి దిగిపోయింది. సీసెరా మరణించాడు.

22 సరిగ్గా అప్పుడే సీసెరా కోసం వెదుక్కొంటూ బారాకు యాయేలు గుడారంవైపు వచ్చాడు. యాయేలు బారాకును కులుసుకొనేందుకు బయటకు వెళ్లి, “ఇక్కడ లోపలికి రా, నీవు వెదుకుతున్న మనిషిని నేను నీకు చూపిస్తాను” అంది. కనుక బారాకు యాయేలుతో కలిసి గుడారంలో ప్రవేశించాడు. అక్కడ కణతల్లో నుండి నేలమీదికి గుడారపు మేకు దిగిపోయి, చచ్చిపడి ఉన్న సీసెరా బారాకుకు కనిపించాడు.

23 ఆ రోజు కనాను రాజు యాబీనును ఇశ్రాయేలు ప్రజలకోసం దేవుడు ఓడించాడు. 24 కనుక ఇశ్రాయేలు ప్రజలు కనాను రాజు యాబీనును ఓడించటంతో మరింత బలవంతులయ్యారు. కనాను రాజు యాబీనును ఇశ్రాయేలు ప్రజలు చివరికి నాశనం చేసారు.

దెబోరా గీతం

ఇశ్రాయేలు ప్రజలు సీసెరాను ఓడించిన రోజున దెబోరా, అబీనోయము కుమారుడు బారాకు ఈ గీతం పాడారు:

“ఇశ్రాయేలు మనుష్యులు యుద్ధానికి సిద్ధమయ్యారు.
    యుద్ధానికి వెళ్లేందుకు ప్రజలు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చారు.
యెహోవాను స్తుతించండి.

“రాజులారా, వినండి.
    అధికారులారా గమనించండి!
నేను పాడుతాను.
    నా మట్టుకు నేనే యెహోవాకు గానం చేస్తాను.
యెహోవాకు, ఇశ్రాయేలు ప్రజల దేవునికి
    నేను సంగీతం గానం చేస్తాను.

“యెహోవా, గతంలో నీవు శేయీరు[c] దేశం నుండి వచ్చావు.
    ఎదోము దేశం నుండి నీవు సాగిపోయావు.
నీవు నడువగా భూమి కంపించింది.
    ఆకాశాలు వర్షించాయి.
    మేఘాలు నీళ్లు కురిపించాయి.
సీనాయి పర్వత దేవుడగు యెహోవా ఎదుట
    ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా ఎదుట పర్వతాలు కంపించాయి.

“అనాతు కుమారుడు షమ్గరు[d] రోజుల్లో యాయేలు రోజుల్లో,
    రహదారులు ఖాళీ అయ్యాయి.
    ప్రయాణీకుల ఒంటెలు వెనుక దారుల్లో వెళ్లాయి.

“దెబోరా, నీవు వచ్చేవరకు,
    ఇశ్రాయేలుకు నీవు ఒక తల్లిగా వచ్చేవరకు
    సైనికులు లేరు ఇశ్రాయేలులో సైనికులు లేరు.

“వారు కొత్త దేవతలను అనుసరించాలని కోరుకొన్నారు.
    అందుచేత వారి పట్టణ ద్వారాల వద్ద వారు పోరాడవలసి వచ్చింది.
నలభైవేల మంది ఇశ్రాయేలు సైనికుల్లో
    ఎవరివద్దా ఒక డాలుగాని, బల్లెంగాని లేదు.

“నా హృదయం ఇశ్రాయేలు సైన్యాధికారులతోనే ఉంది.
    ఈ సైన్యాధికారులు ఇశ్రాయేలీయుల కోసం పోరాడేందుకు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చారు.
యెహోవాను స్తుతించండి!

10 “తెల్లగాడిదల మీద ప్రయాణం చేసే ప్రజలారా,
    వాటి వీపు మీద తివాచీ[e]
    లపై కూర్చొనే ప్రజలారా,
    దారిలో ప్రయాణం చేసే ప్రజలారా గమనించండి!
11 యెహోవా విజయాలను గూర్చి ఇశ్రాయేలీయుల మధ్య
    యెహోవా సైనికుల విజయాలను గూర్చి
యెహోవా ప్రజలు పట్టణ ద్వారాల్లో పోరాడేందుకు వెళ్లినప్పటి విషయాలను గూర్చి
    పశువులు నీళ్లు త్రాగే చోట్ల తాళాల శబ్దాలతో వారు చెప్పుకొంటున్నారు.

12 “దెబోరా మేలుకో, మేలుకో!
    మేలుకో, మేలుకో, ఒక పాట పాడు!
బారాకూ లెమ్ము!
    అబీనోయము కుమారుడా, వెళ్లి, నీ శత్రువులను పట్టుకో!

13 “ఆ సమయంలో బతికి ఉన్నవారు నాయకుల దగ్గరకు వచ్చారు.
    యెహోవా ప్రజలు సైనికులతో కలిసి నా దగ్గరకు వచ్చారు.

14 “అమాలేకు కొండ దేశంలో
    ఎఫ్రాయిము మనుష్యులు స్థిరపడ్డారు.
బెన్యామీనూ, ఆ మనుష్యులు నిన్నూ,
    నీ ప్రజలను వెంబడించారు.
మాకీరు కుటుంబ వంశంనుండి సైన్యాధికారులు దిగి వచ్చారు.
    జెబూలూను వంశం నుండి ఇత్తడి దండం పట్టి నడిపించు వారు వచ్చారు.
15 ఇశ్శాఖారు నాయకులు దెబోరాతో ఉన్నారు.
    ఇశ్శాఖారు వంశం వారు బారాకునకు నమ్మకంగా ఉన్నారు.
    ఆ మనుష్యులు లోయలోనికి కాలి నడకన సాగిపోయారు.

“రూబేనీయులలో బహు గొప్పగా హృదయ పరిశోధన జరిగింది.
16 అలాగైతే, మీరంతా గొర్రెల దొడ్ల గోడల వద్ద ఎందుకు కూర్చున్నారు?
రూబేను, వారి సాహస సైనికులు యుద్ధం గూర్చి గట్టిగా తలచారు.
    కానీ వారు గొర్రెల కోసం వాయించిన సంగీతం వింటూ, ఇంటి వద్దనే కూర్చుండిపోయారు.
17 గిలాదువారు యోర్దానుకు ఆవలివైపున వారి గుడారాల్లోనే ఉండిపోయారు.
దాను ప్రజలారా,
    మీరు మీ ఓడల దగ్గరే ఎందుకు ఉండిపోయారు?
ఆషేరు వంశం వారు సముద్ర తీరంలోనే ఉండిపోయారు.
    క్షేమ కరమైన ఓడ రేవుల్లోనే వారు ఉండి పోయారు.

18 “కానీ జెబూలూను మనుష్యులు
    నఫ్తాలి మనుష్యులు ఆ కొండల మీద పోరాడేందుకు వారి ప్రాణాలకు తెగించారు.
19 రాజులు వచ్చారు, వారు యుద్ధం చేసారు.
    కనాను రాజులు మెగిద్దో జలాల వద్ద తానాకు పట్టణం దగ్గర (కనాను రాజులు) యుద్ధం చేసారు.
కానీ వారు ఐశ్వర్యం ఏమీ ఇంటికి తీసుకుని పోలేదు.
20 నక్షత్రాలు ఆకాశంలోనుంచి పోరాడాయి.
    నక్షత్రాలు, వాటి మార్గం నుండి అవి సీసెరాతో పోరాడాయి.
21 కీషోను నది ప్రాచీన నది.
    ఆ కీషోను నది సీసెరా మనుష్యులను తుడిచిపెట్టింది.
నా ప్రాణమా, బలము కలిగి ముందుకు సాగిపో.
22 గుర్రాల డెక్కలు నేలను అదరగొట్టాయి.
    సీసెరా బలమైన గుర్రాలు పరుగులు తీసాయి.

23 “‘మేరోజు అను పట్టణాన్ని శపించండి’
అని యెహోవాదూత చెప్పాడు.
    ‘వారు యెహోవాకు సహాయం చేసేందుకు,
    యెహోవాకు సైనికులను ఇచ్చేందుకు రాలేదు గనుక వారిని శపించండి.’
24 కనానీయుడైన హెబెరు భార్య యాయేలు.
    ఆమె స్త్రీలలో దీవెన నొందును.
25 సీసెరా నీళ్లను అడిగెను.
    యాయేలు అతనికి పాలను ఇచ్చెను.
తరువాత సర్దారులకు తగిన పాత్రతో
    మీగడ తెచ్చియిచ్చెను.
26 మరియు యాయేలు డేరా మేకు చేత పట్టుకొనెను.
    పనివారు ఉపయోగించు సుత్తెను కుడి చేత పట్టుకొనెను.
తరువాత మేకుతో అతని తలను పగులగొట్టెను.
    అప్పుడు సీసెరా కణత పగిలి అక్కడే పడిపోయెను.
27 యాయేలు పాదాల మధ్య కుప్ప కూలిపోయాడు
    అతను పడిపోయాడు. అతను అక్కడే పడి ఉన్నాడు!
ఆమె పాదాల మధ్య అతడు కుప్పకూలిపోయాడు.
    అతడు పడిపోయాడు!
సీసెరా ఎక్కడ పడ్డాడో
    అక్కడ కూలిపోయాడు. చనిపోయాడు!

28 “సీసెరా తల్లి కిటికీలోంచి చూసి ఏడుస్తు వున్నది.
    సీసెరా తల్లి తెరలలో నుండి చూస్తు వున్నది,
‘సీసెరా రథం ఎందుకు ఆలస్యమైంది?
    అతని రథం, గుర్రాల ధ్వనులు ఎందుకు ఆలస్యం అయ్యాయి.’

29 “ఆమె పరిచారికలలో అతి తెలివిగల ఒకతె ఆమెకు జవాబిస్తుంది.
    అవును, సేవకురాలు ఆమెకు జవాబిస్తుంది.
30 ‘నిశ్చయంగా వారు గెలిచారు!
    వారు ఓడించిన ప్రజలనుండి వస్తువులను వారు తీసుకుంటున్నారు!
వారిలో వారు ఆ వస్తువులను పంచుకొంటున్నారు!
    ఒక్కో సైనికుడు ఒకరు లేక ఇద్దరు అమ్మాయిలను తీసుకుంటున్నారు.
ఒక వేళ సీసెరా రంగు వేయబడిన ఒక గుడ్డ ముక్క తీసుకుంటున్నాడేమో.
    అదీ సంగతి! విజయశాలి సీసెరా ధరించేందుకు ఒకటి రెండు విచిత్ర బుట్టా నేత బట్టలు తెచ్చుకుంటున్నాడు కాబోలు.’

31 “యెహోవా, నీ శత్రువులంతా ఇలానే మరణించెదరు గాక!
    కానీ నిన్ను ప్రేమించే మనుష్యులందరూ తేటగా ప్రకాశించే సూర్యునిలా ఉందురు గాక!”

ఆ దేశంలో 40 సంవత్సరాల వరకు శాంతి నెలకొన్నది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International