Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెహోషువ 16-18

ఎఫ్రాయిము, మనష్షే వంశీయులకు భూములు

16 యోసేపు కుటుంబానికి లభించిన దేశం ఇది. ఈ దేశం యెరికో సమీపాన యొర్దాను నది దగ్గర ప్రారంభమై యెరికో జలాల వరకు కొనసాగింది (ఇది యెరికోకు సరిగ్గా తూర్పున ఉంది). ఆ సరిహద్దు యెరికోనుండి పైకి, బేతేలు కొండ ప్రాంతంవరకు వ్యాపించింది. తర్వాత ఆ సరిహద్దు బేతేలు (లూజు) నుండి అతరోత్ వద్ద అర్కీయ సరిహద్దువరకు కొనసాగింది. తర్వాత ఆ సరిహద్దు పశ్చిమాన యాఫ్లెతీయ ప్రజల సరిహద్దువైపు పోయింది. దిగువ బెత్‌హరను వరకూ ఆ సరిహద్దు కొనసాగింది. తర్వాత ఆ సరిహద్దు గెజెరుకు పోయి, సముద్రం వరకు వ్యాపించింది.

కనుక మనష్షే, ఎఫ్రాయిం ప్రజలకు వారి భూమి లభించింది. (మనష్షే, ఎఫ్రాయిము యోసేపు కుమారులు)

ఎఫ్రాయిము ప్రజలకు ఇవ్వబడిన భూమి ఇది: తూర్పున ఎగువ బేత్‌హోరోను సమీపంలో అతారోతు అద్దారు వద్ద వారి సరిహద్దు మొదలయింది. మరియు పశ్చిమ సరిహద్దు మిస్మెతతు వద్ద మొదలయింది. ఆ సరిహద్దు తూర్పున తానతు షిలోహుకు మళ్లి, యానోయకు విస్తరించింది. అప్పుడు ఆ సరిహద్దు యానోయనుండి క్రిందికి అతారోతు మరియు నారాకు వెళ్ళింది. ఆ సరిహద్దు యెరికోను తాకి, యొర్దాను నది దగ్గర నిలిచిపోయేంతవరకు కొనసాగింది. ఆ సరిహద్దు తప్పూయ మొదలుకొని కానా ఏటివరకు పశ్చిమంగా వ్యాపించి, సముద్రం దగ్గర అంతమయింది. అది మొత్తం ఎఫ్రాయిము ప్రజలకు ఇవ్వబడిన దేశం. ఆ వంశంలోని ఒక్కో కుటుంబానికి ఈ దేశంలో కొంత భాగం దొరికింది. ఎఫ్రాయిము వారి సరిహద్దు పట్టణాలు అనేకం నిజానికి మనష్షే వారి సరిహద్దుల్లోనే ఉన్నాయి. కానీ ఆ పట్టణాలు, ఆ పొలాలు ఎఫ్రాయిము వారికే వచ్చాయి. 10 అయితే గెజరు పట్టణంనుండి కనానీ ప్రజలను ఎఫ్రాయిము ప్రజలు వెళ్లగొట్టలేకపోయారు. కనుక నేటికీ ఎఫ్రాయిము ప్రజల మధ్య కనానీ ప్రజలు నివసిస్తున్నారు. కానీ కనానీ ప్రజలు ఎఫ్రాయిము ప్రజలకు బానిసలుగా అయ్యారు.

17 తర్వాత మనష్షే వంశానికి భూమి ఇవ్వబడింది. యోసేపు మొదటి కుమారుడు మనష్షే. మనష్షే మొదటి కుమారుడు మాకీరు, ఇతడు గిలాదు తండ్రి.[a] మాకీరు గొప్ప వీరుడు, కనుక గిలాదు, బాషాను ప్రాంతాలు మాకీరు వంశానికి ఇవ్వబడ్డాయి మనష్షే వంశంలోని ఇతర కుటుంబాలకు కూడా భూమి యివ్వబడింది. ఆ కుటుంబాలు అబియెజెరు, హెలెకు, అజ్రియెలు, షెకెము, హెఫెరు, షెమిద. యోసేపు కుమారుడగు మనష్షే మిగిలిన కుమారులు వీరంతాను. ఈ మనుష్యుల కుటుంబాలకు కూడ కొంత భూమి లభించింది.

హెపెరు కుమారుడు సెలోపెహాదు. గిలాదు కుమారుడు హెపెరు. గిలాదు మాకీరు కుమారుడు, మాకీరు మనష్షే కుమారుడు. కానీ సెలోపెహాదుకు కుమారులు లేరు. అతనికి ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెల పేర్లు మహల, నోయ, హోగ్ల, మీల్కా, తిర్సా. యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడైన యెహోషువ ఇశ్రాయేలు నాయకులందరి దగ్గరకు ఆ కుమార్తెలు వెళ్లారు. “మగవారికి ఇచ్చినట్టే మాకూ భూమి ఇవ్వాలని మోషేతో యెహోవా చెప్పాడు” అన్నారు ఆ కుమార్తెలు. కనుక ఎలియాజరు యెహోవాకు విధేయుడై, ఆ కుమార్తెలకు కొంత భూమి యిచ్చాడు. కనుక కుమారులవలెనే ఈ కుమార్తెలకుగూడ కొంత భూమి లభించింది.

కనుక మనష్షే వంశానికి యొర్దాను నదికి పశ్చిమాన పది ప్రాంతాలు, యొర్దాను నది ఆవలి ప్రక్క గిలాదు, బాషాను అనే మరి రెండు ప్రాంతాలు ఉన్నాయి. మనష్షే కుమార్తెలకు గూడ కుమారులవలెనే భూమి లభించింది. మనష్షే మిగిలిన కుటుంబాలకు గిలాదు దేశం ఇవ్వబడింది.

మనష్షే భూములు ఆషేరు, మిక్మెతాతు మధ్య ప్రాంతంలో ఉన్నాయి. ఇది షెకెము దగ్గర సరిహద్దు దక్షిణాన ఎన్‌తపూయా వరకు వెళ్లింది. తపూయ దేశం మనష్షేకు చెందినదే కాని తపూయ పట్టణం మాత్రం కాదు. తపూయా పట్టణం మనష్షే దేశ సరిహద్దు పక్కగా ఉంది, అది ఎఫ్రాయిము కుమారులకు చెందినది. మనష్షే సరిహద్దు దక్షిణాన కానా ఏటివరకు వ్యాపించింది. ఈ మనష్షే ప్రాంతంలోని పట్టణాలు ఎఫ్రాయిముకు చెందినవి. నదికి ఉత్తరాన ఉంది మనష్షే సరిహద్దు మరియు అది పశ్చిమాన సముద్రం వరకు విస్తరించింది. 10 దక్షిణ దేశం ఎఫ్రాయిముకు చెందినది. ఉత్తర దేశం మనష్షేది. మధ్యధరా సముద్రం పడమటి సరిహద్దు. ఆ సరిహద్దు ఉత్తరాన ఆషేరు దేశాన్ని, తూర్పున ఇశ్శాఖారు దేశాన్ని తాకుతుంది.

11 ఇశ్శాఖారు, ఆషేరు ప్రాంతంలో బెత్‌షియాను, దాని తాలూకు చిన్న పట్టణాలు, ఇబ్లెయాము, దాని తాలుకు చిన్న పట్టణాలు మనష్షే స్వంతం. దోరు పట్టణంలో, దాని తాలూకు చిన్న పట్టణాల్లో, ఎన్‌దోరు పట్టణంలో దాని తాలూకు చిన్న పట్టణాల్లో నివసించే ప్రజలంతా మనష్షే స్వంతం. తానాకు, దాని చిన్న పట్టణాల్లో, మెగిద్దో, దాని చిన్న పట్టణాల్లో, నాఫోతు మూడు పట్టణాల్లో నివసించే ప్రజలంతా మనష్షే స్వంతం. 12 మనష్షే ప్రజలు ఆ పట్టణాలను ఓడించలేకపోయారు. కనుక కనానీ ప్రజలు అక్కడనే నివసించటం కొనసాగించారు. 13 అయితే ఇశ్రాయేలు ప్రజలు బలవంతులుగా ఎదిగారు. ఇది జరిగినప్పుడు కనానీ ప్రజలను తమకు బానిసలుగా చేసుకొన్నారు. కానీ ఆ దేశం విడిచి పొమ్మని మాత్రం కనానీ ప్రజలను వారు ఒత్తిడి చేయలేదు.

14 యోసేపు వంశంవారు యెహోషువతో మాట్లాడి “నీవు మాకు ఒక్క ప్రాంతం మాత్రమే ఇచ్చావు. కానీ మేము చాలమందిమి ఉన్నాము. యెహోవా తన ప్రజలకు ఇచ్చిన భూమి అంతటిలో ఒక్క భాగం మాత్రమే మాకు ఎందుకు యిచ్చావు?” అన్నారు.

15 అప్పుడు యెహోషువ, “మీరు గనుక చాలినంతమంది ఉంటే, మీరు కొండ ప్రదేశానికి వెళ్లి, మీకు నివాస స్థలాన్ని చేసుకోండి. ఇది పెరిజ్జీ ప్రజలకు, రెఫాయిము ప్రజలకు చెందిన దేశం. ఇది ఎఫ్రాయిము వారి కొండ ప్రదేశం కాదు. ఎఫ్రాయిము కొండ ప్రదేశం మీకు మరీ చిన్నది అవుతుంది” అని బదులు చెప్పాడు.

16 యోసేపు ప్రజలు, “నిజమే, ఎఫ్రాయిము కొండ దేశం మాకు చాలదు. కానీ కనానీ ప్రజలు నివసిస్తున్న ప్రదేశం ప్రమాదకరమయింది. వారు నైపుణ్యంగల యుద్ధ వీరులు. మరియు బెత్‌షియనులోను, ఆ ప్రాంతంలోని చిన్న పట్టణాలన్నింటిలోను వారికి బలమైన ఆయుధాలు, ఇనుప రథాలు ఉన్నాయి. పైగా యెజ్రెయేలు లోయలోకూడ వాళ్ళున్నారు” అని చెప్పారు.

17 అప్పుడు యోసేపు కుమారులు ఎఫ్రాయిము, మనష్షే ప్రజలతో యెహోషువ ఇలా చెప్పాడు: “అయితే మీరు చాల విస్తారంగా ఉన్నారు. మీకూ మహాగొప్ప శక్తి ఉంది. మీకు చాల ఎక్కువ భూమిని ఇవ్వాలి. 18 కొండ ప్రదేశం మీదే. అది అడవి అయినా మీరు చెట్లు నరికి మంచి నివాస ప్రదేశంగా దాన్ని మార్చుకోవచ్చు. అది మొత్తం మీ స్వంతం అవుతుంది. కనానీ ప్రజలను మీరు ఆ దేశం నుండి వెళ్లగొట్టివేయాలి. వారికి బలమూ, బలమైన ఆయుధాలూ ఉన్నప్పటికీ మీరు వారిని ఓడించేస్తారు.”

మిగిలిన భూమిని పంచటం

18 ఇశ్రాయేలు ప్రజలంతా షిలోహు అనే ప్రాంతంలో సమావేశం అయ్యారు. అక్కడ సన్నిధి గుడారాన్ని[b] వారు నిలబెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశాన్ని వారి ఆధీనంలో ఉంచుకొన్నారు. ఆ దేశంలోని శత్రువులందరినీ వారు ఓడించారు. అయితే దేవుడు వాగ్దానం చేసిన ప్రదేశంలో భాగం పొందని ఇశ్రాయేలు వంశాలు అప్పటికి యింకా ఏడు ఉన్నాయి.

కనుక ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ చెప్పాడు, “మీ దేశాన్ని తీసుకొనేందుకు మీరెందుకు ఇంత కాలం చూస్తూ ఊరుకున్నారు. మీ తండ్రుల దేవుడు యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చాడు. కనుక మీ వంశాల్లో ఒక్కోదాని నుండి ముగ్గురు మనుష్యుల్ని ఏర్పాటు చేసుకోవాలి. దేశాన్ని పరిశీలించి చూచేందుకు నేను ఆ మనుష్యుల్ని బయటకు పంపిస్తాను. ఆ దేశ పటాన్ని వారు తయారు చేస్తారు. తర్వాత వారు తిరిగి నా దగ్గరకు వస్తారు. దేశాన్ని వారు ఏడు భాగాలుగా విభజిస్తారు. యూదా ప్రజలు వారి దేశాన్ని దక్షిణాన ఉంచుకొంటారు. యోసేపు ప్రజలు వారి దేశాన్ని ఉత్తరాన ఉంచుకొంటారు. అయితే మీరు పటం గీసి, దేశాన్ని ఏడు భాగాలుగా విభజించాలి. ఆ పటాన్ని నా దగ్గరకు తీసుకొని రండి, ఏ వంశానికి ఏ భూమి రావాలో అది మనం యెహోవా దేవుడినే నిర్ణయం చేయనిద్దాం. కానీ లేవీ ప్రజలకు మాత్రం ఈ భూముల్లో ఎలాంటి భాగమూ ఉండదు. వారు యాజకులు, వారి పని యెహోవాను సేవించటమే. గాదు, రూబేను, మనష్షే వంశాలలో సగం మంది వారికి వాగ్దానం చేయబడిన దేశాన్ని ఇదివరకే తీసుకొన్నారు. వారు యొర్దాను నదికి తూర్పు వైపున ఉన్నారు. యెహోవా సేవకుడు మోషే ఇదివరకే వారికి ఆ దేశాన్ని ఇచ్చాడు.”

కనుక ఏర్పాటు చేయబడిన మనుష్యులు ఆ దేశంలో ప్రవేశించటం మొదలు పెట్టారు. ఆ దేశం యొక్క వివరాలను తయారు చేసి, వాటిని యెహోషువ దగ్గరకు తీసుకొని రావాలి అనేది వారి పథకం. కనుక యెహోషువ, “వెళ్లి దేశాన్ని పరిశీలించి, దాని వివరాలు తయారు చేయండి. అప్పుడు తిరిగి నా దగ్గరకు రండి. అప్పుడు మీకు ఏ భూమి రావాలి అనేది నేను నిర్ణయించేందుకు సహాయం చేయాల్సిందిగా యెహోవాను అడుగుతాను. ఇది మనం ఇక్కడ షిలోహులో చేద్దాం” అని వారితో చెప్పాడు.

కనుక ఆ మనుష్యులు ఆ చోటు విడిచి ఆ దేశంలో ప్రవేశించారు. ఆ మనుష్యులు ఆ దేశాన్ని పరిశీలించి, యెహోషువ కొరకు పటాలు తయారుచేసారు. ప్రతి పట్టణాన్నీ వారు పరిశీలించి, దేశం ఏడు భాగాలు అయ్యేటట్టు చేసారు. వారు ఆ పటాలు తయారుచేసి యెహోషువ దగ్గరకు తిరిగి వచ్చారు. యెహోషువ ఇంకా షిలోహులోని పాళెములోనే ఉన్నాడు. 10 ఆ సమయంలో యెహోషువ యెహోవాను సహాయం కొరకు వేడుకున్నాడు. ఒక్కో వంశానికి ఇవ్వాల్సిన దేశాలను యెహోషువ నిర్ణయించాడు.

బెన్యామీనీయులకు భూభాగం

11 యూదాకు యోసేపుకు మధ్యగల ప్రాంతంలోని దేశం బెన్యామీను వంశానికి ఇవ్వబడింది. బెన్యామీను వంశంలోని ప్రతి కుటుంబానికీ కొంత భూమి లభించింది. బెన్యామీనుకు నిర్ణయించబడిన భూమి ఇది: 12 ఉత్తర సరిహద్దు యొర్దాను నది దగ్గర మొదలయింది. యెరికో ఉత్తరపు అంచున కొనసాగింది ఆ సరిహద్దు. తర్వాత ఆ సరిహద్దు పశ్చిమాన కొండ దేశంలోనుండి వెళ్లింది. బెత్ అవెనుకు సరిగ్గా తూర్పున చేరేంతవరకు ఆ సరిహద్దు కొనసాగింది. 13 తర్వాత ఆ సరిహద్దు లూజుకు (బేతేలు) దక్షిణంగా విస్తరించింది. తర్వాత ఆ సరిహద్దు అతారోతు అద్దారుకు వెళ్లింది. దిగువ బెత్ హరానుకు దక్షిణాన కొండమీద ఉంది అతారోత్ అద్దార్. 14 బెత్‌హరానుకు దక్షిణంగా ఒక కొండ ఉంది. ఈ కొండ దగ్గర ఆ సరిహద్దు మళ్లుకొని కొండ పడమటి పక్కకు దగ్గర్లో దక్షిణంగా వెళ్లింది. ఆ సరిహద్దు కిర్యత్ బాలాకు (కిర్యత్యారం) పోయింది. ఇది యూదా ప్రజలు నివసించిన ఒక పట్టణం. ఇది పడమటి సరిహద్దు.

15 దక్షిణ సరిహద్దు కిర్యత్యారీము దగ్గర మొదలై నెఫ్తోయ నదివరకు విస్తరించింది. 16 తర్వాత బెన్‌హిన్నోము లోయ దగ్గర కొండ మట్టానికి ఆ సరిహద్దు విస్తరించింది. ఇది రెఫాయిము లోయకు ఉత్తర దిశ. ఆ సరిహద్దు యెబూసు పట్టణానికి దక్షిణంగా హిన్నోము లోయగుండా సాగిపోయింది. తర్వాత ఆ సరిహద్దు ఎన్‌రోగెలుకు విస్తరించింది. 17 అక్కడ ఆ సరిహద్దు ఉత్తరంగా మళ్లి ఎన్‌షెమెషుకు పోయింది. ఆ సరిహద్దు గెలిలోతుకు (పర్వతాల్లోని అదుమీము కనుమ దగ్గర ఉంది గెలిలోతు) కొనసాగింది. ఆ సరిహద్దు రూబేను కుమారుడు బోహను కోసం పేరుపెట్టబడిన మహాశిలవరకు క్రిందికి విస్తరించింది. 18 బెత్‌అరబా ఉత్తర ప్రాంతంవరకు ఆ సరిహద్దు కొనసాగింది. తర్వాత ఆ సరిహద్దు అరబాలోనికి విస్తరించింది. 19 తర్వాత ఆ సరిహద్దు బెత్‌హోగ్లా ఉత్తర ప్రాంతంవరకు వెళ్లి, ఉప్పు సముద్రపు ఉత్తర తీరాన ముగిసింది. ఇక్కడే యొర్దాను నది ఆ సముద్రంలో పడుతుంది. అది దక్షిణ సరిహద్దు.

20 తూర్పు వైపున యొర్దాను నది సరిహద్దు. కనుక బెన్యామీను వంశానికి ఇవ్వబడిన దేశం ఇది. అవే అన్ని వైపులా సరిహద్దులు. 21 కనుక బెన్యామీను కుటుంబాలు ప్రతీ ఒక్కటీ ఈ దేశాన్ని పొందాయి. మరియు వారి స్వంత పట్టణాలు ఇవి: యెరికో, బెత్‌హోగ్లా, ఎమెక్ కెజిబ్ 22 బెత్ అరాబా, సెమరాయిము, బేతేలు 23 అవ్విము, పారా, ఓఫ్రా 24 కెఫెరు అమ్మోని, ఓఫ్ని, గెబ. ఇవి పన్నెండు పట్టణాలు, ఈ పట్టణాల దగ్గర ప్రజలు నివసిస్తున్న చిన్న ప్రాంతాలు కూడా ఉన్నాయి.

25 బెన్యామీను వంశం స్వంత పట్టణాల్లో గిబియోను, రామా, బెయెరొతు 26 మిస్పే, కెఫిరా, మోసా, 27 రెకెము, ఇర్పెయెలు, తరలా 28 సేలా, ఎలెపు, యెబూసీ పట్టణం (యెరుషలేము), గిబియా, కిర్యత్ ఉన్నాయి. ఇవి పద్నాలుగు పట్టణాలు, వీటి దగ్గర్లో ప్రజలు నివసిస్తున్న చిన్న ప్రాంతాలు కూడ ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ బెన్యామీను వంశానికి లభించిన భూములు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International