Chronological
జనులు వెక్కిరించబడ్డారు
26 ఆ మహా రోగం తర్వాత మోషేతో, అహరోను కుమారుడు యాజకుడైన ఎలియాజరుతో యెహోవా మాట్లాడాడు: 2 “ఇశ్రాయేలు ప్రజలందరినీ లెక్కించండి. ప్రతి కుటుంబాన్నీ చూచి, 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉన్న పురుషులందరిని లెక్కించండి. వీరు ఇశ్రాయేలు సైన్యంలో పని చేయటానికి సమర్థులు” అని ఆయన చెప్పాడు.
3 ఇప్పటికి మోయాబు మైదానంలోనే ప్రజలు నివాసం చేస్తున్నారు. ఇది యెరికోకు ఎదురుగా యొర్దాను నది దగ్గర ఉంది. కనుక మోషే, యాజకుడైన ఎలియాజరు ప్రజలతో మాట్లాడారు. వారు 4 “20 గాని, అంతకంటె ఎక్కువ వయసు గాని ఉన్న మగవాళ్ల సంఖ్య లెక్కించాలి. ఇది మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞ అన్నారు.”
ఈజిప్టు నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజల జాబితా ఇది:
5 రూబేను సంతతి వాళ్లు వీరే. (యాకోబుకు) ఇశ్రాయేలు పెద్ద కుమారుడు రూబేను వంశాలు:
హనోకు – హనోకీల వంశం
పల్లు – పల్లువారి వంశం
6 హెస్రోను – హెస్రోనీల వంశం
కర్మి – కర్మీల వంశం
7 రూబేను సంతతిలోని వంశాలు అవి. మొత్తం 43,730 మంది పురుషులు.
8 పల్లు కుమారుడు ఏలీయాబు. 9 నెమూయేలు, దాతాను, అబీరాము ముగ్గురూ ఏలీయాబు కుమారులు. మోషే, అహరోనులకు ఎదురు తిరిగిన నాయకులు దాతాను, అబీరాము అని జ్ఞాపకం ఉంచుకోండి. యెహోవాకు కోరహు ఎదురు తిరిగినప్పుడు వారు కోరహును వెంబడించారు. 10 అప్పుడే భూమి తెరచుకొని, కోరహును, అతని అనుచరులు అందరినీ మింగివేసింది. చనిపోయిన వారి సంఖ్య మొత్తం 250 మంది పురుషులు. ఇశ్రాయేలు ప్రజలందరికీ ఇది ఒక హెచ్చరిక, గుర్తు. 11 అయితే కోరహు కుటుంబంలోని ఇతరులు మరణించలేదు.
12 షిమ్యోను సంతతిలోని వంశాలు ఇవి:
నెమూయేలు – నెమూయేలీ వంశం
యామీను – యామీనీల వంశం
యాకీను – యాకీనీల వంశం
13 జెరహు – జెరహీల వంశం
షావూలు – షావూలీ వంశం
14 షిమ్యోను సంతతిలోని వంశాలు అవి. వారు మొత్తం 22,200 మంది.
15 గాదు సంతతిలోని వంశాలు ఇవి:
సెపోను – సెపోనీల వంశం
హగ్గి – హగ్గీల వంశం
షూనీ – షూనీల వంశం
16 ఓజని – ఓజనీల వంశం
ఏరీ – ఏరీల వంశం
17 అరోది – అరోదీల వంశం
అరేలి – అరేలీల వంశం
18 అవి గాదు సంతతిలోని వంశాలు. వారు మొత్తం 40,500 మంది పురుషులు.
19-20 యూదా సంతతిలోని వంశాలు ఇవి:
షేలా – షేలావారి వంశం
పెరెసు – పెరెసీల వంశం
జెరహు – జెరహీల వంశం
(యూదా కుమారులు ఏరు, ఓనాను అనే ఇద్దరు కనానులో చనిపోయారు.)
21 పెరెసు వంశాలు ఇవి:
హెస్రోను – హెస్రోనీల వంశం
హములు – హములీల వంశం
22 యూదా సంతతిలోని వంశాలు ఇవి. పురుషుల సంఖ్య మొత్తం 76,500.
23 ఇశ్శాఖారు సంతతిలోని వంశాలు ఇవి:
తోల – తోలాలీ వారి వంశం
పువ్వా – పువ్వీల వంశం
24 యాషూబు – యాషూబీల వంశం
షిమ్రోను – షిమ్రోనీల వంశం
25 ఇశ్శాఖారు సంతతిలోని వంశాలు అవి. పురుషుల సంఖ్య మొత్తం 64,300.
26 జెబూలూను సంతతిలోని వంశాలు:
సెరెదు – సెరెదీల వంశం
ఏలోను – ఏలోనీల వంశం
యహలేలు – యహలేల వంశం
27 జెబూలూను సంతతిలోని వంశాలు అవి. పురుషులు సంఖ్య మొత్తం 60,500.
28 యోసేపు ఇద్దరు కుమారులు మనష్షే, ఎఫ్రాయిము. ఒక్కో కుమారుడు కొన్ని స్వంత వంశాలతో కూడిన ఒక్కో సంతతి అయ్యారు. 29 మనష్షే సంతతి ఏవనగా:
మాకీరు – మాకీరువారి వంశం (మాకీరు గిలాదుకు తండ్రి,)
గిలాదు – గిలాదీల వంశం
30 గిలాదు వంశాలు:
ఈజరు – ఈజరీల వంశం
హెలెకు – హెలెకీవారి వంశం
31 అశ్రీయేలు – అశ్రీయేలీల వంశం
షెకెము – షెకెమీల వంశం
32 షెమిద – షెమిదీల వంశం
హెపెరు – హెపెరీల వంశం
33 హెపెరు కుమారుడు సెలోపెహాదు. కానీ అతనికి కుమార్తెలు తప్ప కుమారులు లేరు. అతని కుమార్తెల పేర్లు మహల, నోయా, హొగ్ల, మిల్కా, తిర్సా.
34 అవన్నీ మనష్షే సంతతిలోని వంశాలు. పురుషుల సంఖ్య మొత్తం 52,700.
35 ఎఫ్రాయిము సంతతిలోని వంశాలు ఏవనగా:
షుతల – షుతలీల వంశం
బేకరు – బేకరీల వంశం
తహను – తహనీల వంశం
36 షుతలహు వంశం వాడు ఏరాను.
అతని వంశం ఏరానీల వంశం
37 ఎఫ్రాయిము సంతతిలోని వంశాలు అవి. పురుషుల సంఖ్య మొత్తం 32,500.
యోసేపు సంతతికి చెందిన మొత్తం మనుష్యులు వారే.
38 బెన్యామీను సంతతిలోని వంశాలు:
బెలా – బెలాలీ వంశం
అష్బెలు – అష్బెలీ వంశం
అహీరం – అహీరమీయీల వంశం
39 షుపం – షుపామీల వంశం
హుపం – హుపామీల వంశం
40 బెలా వంశాలు ఏవనగా:
ఆర్దు – ఆర్దీల వంశం
నయమాను – నయమానీల వంశం
41 బెన్యామీను సంతతిలోని వంశాలన్నీ అవి. పురుషుల సంఖ్య మొత్తం 45,600.
42 దాను సంతతిలోని వంశాలు:
షూషాము – షూషామీల వంశం.
అది దాను సంతతిలోని కుటుంబం. 43 షూషామీల వంశంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. పురుషుల సంఖ్య మొత్తం 64,400.
44 ఆషేరు సంతతిలోని వంశాలు:
ఇమ్నా – ఇమ్నా వారి వంశం
ఇష్వి – ఇష్వీల వంశం
బెరీయ – బెరీయాల వంశం
45 బెరీయా వంశాలు:
హెబెరు – హెబెరీల వంశం
మల్కీయేలు – మల్కీయేలీల వంశం.
46 (ఆషేరుకు శెరహు అనే కూతురు కూడ ఉంది.) 47 ఆషేరు సంతతిలోని వంశాలు అవి. పురుషుల సంఖ్య మొత్తం 53,400.
48 నఫ్తాలీ సంతతిలోని వంశాలు:
యహసియేలు – యహసియేలీల వంశం
గూనీ – గూనీల వంశం
49 యెసెరు – యెసెరీల వంశం
షిల్లేము – షిల్లేమీల వంశం
50 నఫ్తాలీ సంతతిలోని వంశాలు అవి. పురుషుల సంఖ్య మొత్తం 45,400.
51 కనుక ఇశ్రాయేలు పురుషుల సంఖ్య మొత్తం 6,01,730.
52 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: 53 “ప్రతి వంశానికి దేశం లభిస్తుంది. ఇది నేను వారికి వాగ్దానం చేసిన దేశం. లెక్కించబడిన ప్రజలందరికీ సరిపడినంత భూమి ప్రతి వంశానికి లభిస్తుంది. 54 పెద్ద వంశానికి ఎక్కువ భూమి లభిస్తుంది. చిన్న వంశానికి తక్కువ భూమి లభిస్తుంది. అయితే నేను వాగ్దానం చేసిన దేశం ప్రతి వంశానికీ లభిస్తుంది. మరియు వారికి లభించే భూమి, లెక్కించబడిన వారందరికీ సరిపోయేటంత ఉంటుంది. 55 ప్రతి వంశానికీ ఆ భూమి ఇవ్వబడుతుంది. ఏ వంశం వారి భూమికి ఆ పేరే పెట్టబడుతుంది. 56 ప్రజలకు ఇస్తానని నేనే వాగ్దానం చేసినంతగా ఉంటుంది ఆ భూమి. పెద్ద వంశాలకీ, చిన్నవాటికీ అందివ్వబడుతుంది.”
57 లేవీ సంతతి కూడ లెక్కించబడింది. లేవీ సంతతిలోని వంశాలు ఇవి:
గెర్షోను – గెర్షోనీల వంశం
కహాతు – కహాతీల వంశం
మెరారి – మెరారిల వంశం
58 ఇవి కూడ లేవీ సంతతిలోని వంశాలే:
లిబ్నీల వంశం
హెబ్రోనీల వంశం
మహ్లీల వంశం
మూషీల వంశం
కోరహీల వంశం
అమ్రాము కహాతు వంశం వాడు. 59 అమ్రాము భార్య పేరు యోకెబెదు. ఆమె కూడ లేవీ సంతతిలోనిదే. ఆమె ఈజిప్టులో పుట్టింది. అమ్రాము, యోకెబెదులకు అహరోను, మోషే ఇద్దరు కుమారులు. వారికి మిర్యాము అని ఒక కుమార్తె కూడ ఉంది.
60 నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారులకు తండ్రి అహరోను. 61 కానీ నాదాబు, అబీహు చనిపోయారు. అంగీకారం కాని అగ్నితో దేవునికి అర్పణచేసినందువల్ల వారు చనిపోయారు.
62 లేవీ సంతతిలో పురుషుల సంఖ్య మొత్తం 23,000, అయితే ఇతర ఇశ్రాయేలు మనుష్యులతో వీరు లెక్కించబడలేదు. మిగిలినవారికి యెహూవా వాగ్దానం చేసిన భూమి మాత్రం లేదు.
63 మోషే, యాజకుడైన ఎలియాజరు ఈ ప్రజలందరినీ లెక్క వేసారు. మోయాబు మైదానాల్లో వారు ఇశ్రాయేలు ప్రజలను లెక్క తీసారు. ఇది యెరికో ఎదుట యొర్దాను నది అవతల జరిగింది. 64 చాలకాలం క్రిందట సీనాయి అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ మోషే, యాజకుడైన అహరోనూ లెక్కపెట్టారు. అయితే వాళ్లంతా చనిపోయారు. మోషే మోయాబు మైదానాల్లో లెక్కపెట్టిన వారు వేరు, అంతకుముందు లెక్కపెట్టిన వారు వేరు. 65 వారు అందరూ ఎడారిలోనే చస్తారు అని ఇశ్రాయేలు ప్రజలతో యెహోవా చెప్పినందువల్ల ఇలా జరిగింది. సజీవంగా ఉన్నవాళ్లు యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ మాత్రమే.
సెలోపెహాదు కుమార్తెలు
27 హెసెరు కుమారుడు సెలోపెహాదు. హెసెరు గిలాదు కుమారుడు. గిలాదు మాకీరు కుమారుడు. మాకీరు మనష్షే కుమారుడు. మనష్షే యోసేపు కుమారుడు. సెలోపెహాదుకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వారి పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. 2 సన్నిధి గుడారం దగ్గర సమావేశం అవుతోన్న మోషే, యాజకుడైన ఎలియాజరు, పెద్దలు, ప్రజలు అందరి ముందరకు ఈ అయిదుగురు స్త్రీలూ వెళ్లి, సన్నిధి గుడారం ఎదుట నిలబడ్డారు.
ఈ ఐదుగురు కూతుళ్లు ఈ విధంగా చెప్పారు: 3 “మనం అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడే మా తండ్రి చనిపోయాడు. అతడు కోరహు గుంపులో చేరినవాడు కాడు. (కోరహు యెహోవానుంచి తొలగి ఎదురు తిరిగినవాడు.) మా తండ్రిది సహజ మరణం. కానీ మా తండ్రికి కుమారులు లేరు. 4 అంటే మా తండ్రి పేరు కొనసాగదు. మా తండ్రి పేరు కొనసాగక పోవటం సక్రమం కాదు. ఆయనకు కుమారులు లేరు గనుక ఆయన పేరు అంతం అవుతుంది. అందుచేత మా తండ్రి సోదరులకు వచ్చే భూమిలో మాకు కొంత ఇవ్వవలసిందిగా మేము మీకు మనవి చేస్తున్నాము.”
5 కనుక ఏమి చేయాలని యెహోవాను మోషే అడిగాడు. 6 అతనితో యెహోవా ఇలా అన్నాడు, 7 “సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది సరియైనదే. వాళ్లు వారి తండ్రి సోదరులతో పాటు భూమిని పంచుకోవలసిందే. కనుక నీవు వారి తండ్రికిచ్చిన భూమిని వారికి ఇవ్వాలి.
8 “కనుక ఇశ్రాయేలు ప్రజలకు, ఇలా చట్టం తయారు చేయి. ‘ఒకనికి కుమారులు లేకుండానే అతడు చనిపోతే, అతని ఆస్తి అంతా అతని కుమార్తెలకు ఇవ్వాలి. 9 అతనికి కుమార్తెలు లేకపోతే, అతని ఆస్తి అంతా అతని సోదరులకు ఇవ్వాలి. 10 అతనికి సోదరులు లేకపోతే అతని ఆస్తి అంతా అతని తండ్రి సోదరులకు ఇవ్వాలి. 11 అతని తండ్రికి సోదరులు లేకపోతే, అతని ఆస్తి అంతా, అతని కుటుంబంలో దగ్గర బంధువులకు ఇవ్వాలి. ఇశ్రాయేలు ప్రజల్లో ఇది ఒక చట్టంగా ఉండాలి. యెహోవాయే ఈ ఆజ్ఞను మోషేకు ఇస్తున్నాడు.’”
కొత్త నాయకుడుగా యెహోషువ
12 అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “ఆ కొండమీదికి ఎక్కు. యొర్దాను నదికి తూర్పున ఉన్న కొండల్లో అది ఒకటి. ఇశ్రాయేలు ప్రజలకు నేను ఇస్తున్న దేశాన్ని నీవు అక్కడ నుండి చూస్తావు. 13 నీవు ఈ దేశాన్ని చూశాక, నీ సోదరుడు అహరోను మరణించినట్టే నీవు మరణిస్తావు. 14 సీను అరణ్యంలో నీళ్లకోసం ప్రజలు కోపగించుకోవటం జ్ఞాపకం చేసుకో. నీవూ, అహరోనూ కూడ నా ఆజ్ఞకు విధేయులయ్యేందుకు నిరాకరించారు. ప్రజల ముందు నీవు నన్ను ఘనపర్చలేదు, పవిత్రంగా చూడలేదు.” (ఇది సీను అరణ్యంలో కాదేషు దగ్గర మెరీబా నీళ్ల సంగతి.)
15 యెహోవాతో మోషే ఇలా అన్నాడు: 16 “ప్రజల ఆలోచనలు తెలిసిన దేవుడు యెహోవా ప్రభువు, నీవే ఈ ప్రజలకోసం మరో నాయకుడిని ఎంచుకోమని మనవి చేస్తున్నాను. 17 ఈ దేశంలోనుండి వీరిని బయటకు నడిపించి, కొత్త దేశంలో చేర్చగల నాయకుడిని ఎంచవలసిందిగా నేను యెహోవాకు మనవి చేస్తున్నాను. అప్పుడు యెహోవా ప్రజలు కాపరి లేని గొర్రెల్లా ఉండరు.”
18 కనుక మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “నూను కుమారుడైన యెహోషువ నాయకుడుగా ఉంటాడు. యెహోషువ ఆత్మను పొందినవాడు. అతడిని కొత్త నాయకునిగా చేయి. 19 యాజకుడైన ఎలియాజరు ఎదుటా, ప్రజలందరి ఎదుటా నిలబడమని అతనితో చెప్పు. అప్పుడు అతడిని కొత్త నాయకునిగా నీవు చేయి.
20 “అతడిని నీవు నాయకునిగా చేస్తున్నావని ప్రజలకు చూపెట్టు, అప్పుడు ప్రజలంతా అతనికి లోబడతారు. 21 ఒకవేళ యెహోషువ ఒక కొత్త నిర్ణయం ఏదైనా చేయాలంటే అతడు యాజకుడైన ఎలియాజరు దగ్గరకు వెళతాడు. యెహోవా జవాబు తెలుసుకొనేందుకు ఎలియాజరు ఊరీమును ప్రయోగిస్తాడు. అప్పుడు యెహోషువ, ప్రజలందరూ దేవుడు చెప్పిన వాటిని చేస్తారు. ‘యుద్ధానికి వెళ్లండి’ అని అతడు చెబితే వారు యుద్ధానికి వెళ్తారు. ఒకవేళ ‘ఇంటికి వెళ్లండి’ అని అతడు చెబితే వారు ఇంటికి వెళతారు.”
22 మోషే యెహోవాకు విధేయుడయ్యాడు. యాజకుడైన ఎలియాజరు ముందు, ప్రజలందరి ఎదుట నిలబడమని యెహోషువాతో చెప్పాడు. మోషే, 23 అప్పుడు అతడే కొత్త నాయకుడు అని చూపెట్టేందుకు అతనిమీద మోషే చేతులు పెట్టాడు. అతనితో యెహోవా చెప్పినట్టే అతడు చేసాడు.
© 1997 Bible League International