Chronological
ఇశ్రాయేలీయులు వారి దేశానికి తిరిగి వెళ్తారు
30 “నేను చెప్పిన ఈ సంగతులన్నీ మీకు సంభవిస్తాయి. ఆశీర్వాదాల నుండి మంచి సంగతులు, శాపాలనుండి చెడు సంగతులు మీకు సంభవిస్తాయి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఇతర దేశాలకు పంపించివేస్తాడు. అప్పుడు మీరు ఈ విషయాలను గూర్చి తలుస్తారు. 2 ఆ సమయంలో మీరూ, మీ సంతానం మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి వస్తారు. నేడు నేను మీకు యిచ్చిన ఆయన ఆదేశాలన్నింటికీ పూర్తిగా విధేయులై, మీ హృదయపూర్తిగా మీరు ఆయనను వెంబడిస్తారు. 3 అప్పుడు మీ దేవుడైన యెహోవా మీ మీద దయ చూపిస్తాడు. యెహోవా మిమ్మల్ని మళ్లీ స్వతంత్రుల్ని చేస్తాడు. ఆయన మిమ్మల్ని పంపించిన దేశాలనుండి తిరిగి వెనుకకు తీసుకొనివస్తాడు. 4 ఆయన మిమ్మల్ని చివరి భూదిగంతాలవరకు పంపించినాసరే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని సమావేశపర్చి, అక్కడనుండి తిరిగి వెనుకకు తీసుకొని వస్తాడు. 5 యెహోవా మిమ్మల్ని మీ పూర్వీకుల దేశానికి తీసుకొనివస్తాడు, ఆ దేశం మీదే అవుతుంది. యెహోవా మీకు మేలు చేస్తాడు. మీ పూర్వీకులకు ఉన్నదానికంటె మీకు ఎక్కువ ఉంటుంది. 6 మీ దేవుడైన యెహోవా మీ యొక్కయు మీ సంతానం యొక్కయు హృదయాలు సున్నతి చేస్తాడు. దాన్ని బట్టే మీ దేవుడైన యెహోవాను మీరు మీ నిండు హృదయంతోను, మీ నిండు మనస్సుతోను ప్రేమించి బతుకుతారు.
7 “మిమ్మల్ని ద్వేషించి. మీకు కష్టం కలిగించే మీ శత్రువుల మీద ఆ శాపాలన్నింటినీ మీ దేవుడైన యెహోవా రప్పిస్తాడు. 8 మరియు మీరు తిరిగి యెహోవాకు విధేయులవుతారు. ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆయన ఆదేశాలన్నింటికీ మీరు విధేయులవుతారు. 9 మీ దేవుడైన యెహోవా మీరు చేసే ప్రతిదీ విజయవంతం చేస్తాడు. ఆయన మీకు చాలా మంది పిల్లల్ని ఇచ్చి ఆశీర్వదిస్తాడు. విస్తారమైన దూడలను ఇచ్చి మీ మందలను, మంచి పంటలతో మీ పొలాలను ఆయన ఆశీర్వదిస్తాడు. యెహోవా మీ యెడల మంచి జరిగిస్తాడు. యెహోవా మీ పూర్వీకులకు మేలు చేసి సంతోషించినట్టు, ఆయన మరల మీకు మేలు చేయటంలో ఆనందిస్తాడు. 10 అయితే మీరు చేయాలని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించినవాటిని మీరు చేయాలి. ఈ ధర్మశాస్త్రంలోని వ్రాయబడిన నియమాలు మీరు పాటించాలి, ఆదేశాలకు మీరు విధేయులు కావాలి, మీ నిండు హృదయంతో, మీ ఆత్మతో మీరు మీ దేవుడైన యెహోవా తట్టు తిరగాలి. అప్పుడు ఈ మంచి విషయాలన్నీ మీకు సంభవిస్తాయి.
జీవం లేక మరణం
11 “ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞ చాలా కష్టతరమయింది కాదు. అది చాలా దూరమైనదీ కాదు. 12 మేము దానిని విని, దానిని జరిగించేందుకు ‘ఎవరు మా కోసం ఆకాశానికి వెళ్లి దాన్ని తీసుకొని వస్తారు అని మీరు చేప్పేందుకు ఈ ఆదేశం ఆకాశంలో లేదు.’ 13 మేము దానిని విని, దానిని జరిగించడానికి ‘మాకోసం ఎవరు సముద్రం దాటి వెళ్లి, దానిని మాకోసం తీసుకొని వస్తారు అని చెప్పటానికి ఈ ఆదేశం సముద్రానికి అవతలపక్క లేదు.’ 14 లేదు, మాట మీకు చాలా సమీపంగా ఉంది. అది మీరు చేయగలిగేటట్టు మీ నోటిలో, మీ హృదయంలో ఉంది.
15 “జీవం, మరణం, మంచి చెడుల మధ్య కోరుకొనే అవకాశం ఈ వేళ నేను మీకు యిచ్చాను. 16 మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలనీ, ఆయన మార్గాల్లో నడచుకోవాలనీ, ఆయన ఆదేశాలకు, ఆజ్ఞలకు, నియమాలకు విధేయులు కావాలనీ ఈ వేళ నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. అప్పుడు మీరు బ్రతుకుతారు. మీ దేశం విస్తరిస్తుంది. మరియు స్వంతంగా మీరు తీసుకొనేందుకు ప్రవేశిస్తున్న దేశంలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. 17 అయితే మీరు యెహోవా నుండి మరలిపోయి, వినడానికి నిరాకరిస్తే, ఇతర దేవుళ్లను పూజించి, సేవించేందుకు మీరు తిప్పివేయబడితే 18 మీరు నాశనం చేయబడతారు. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు మీ స్వంతంగా తీసుకొనేందుకు ప్రవేశించాలని సిద్ధంగా ఉన్నయొర్దాను నది అవతలి వైపు దేశంలో మీరు ఎక్కువ కాలం బ్రతకరు.
19 “ఈ వేళ మీరు కోరుకొనేందుకు రెండు విషయాలు మీకు యిస్తున్నాను. మీరు కోరుకొనే దానికి సాక్షులుగా ఉండమని భూమిని, ఆకాశాన్ని నేను అడుగుతున్నాను. మీరు జీవం కోరుకోవచ్చు లేదా మరణం కోరుకోవచ్చు. మొదటిది కోరుకుంటే అది ఆశీర్వాదం తెచ్చిపెడ్తుంది. రెండోది కోరుకుంటే అది శాపం తెస్తుంది. అందుచేత జీవం కోరుకోండి. అప్పుడు మీరూ, మీ పిల్లలూ జీవిస్తారు. 20 మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయనకు విధేయులు కావాలి. ఎన్నటికీ ఆయనను విడిచిపెట్టవద్దు. ఎందుచేతనంటే యెహోవాయే మీకు జీవం, మీ పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు యిస్తానని ఆయన వాగ్దానం చేసిన దేశంలో మీ దేవుడైన యెహోవా మీకు దీర్ఘాయుష్షు ఇస్తాడు.”
కొత్త నాయకుడు యెహోషువ
31 అప్పుడు మోషే వెళ్లి, ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పాడు. 2 మోషే వాళ్లతో ఇలా చెప్పాడు, “ఇప్పుడు నాకు 120 సంవత్సరాల వయస్సు. ఇంక మిమ్మల్ని నేను నడిపించలేను. ‘నీవు యొర్దాను నది దాటి వెళ్లవు’ అని యెహోవా నాతో చెప్పాడు. 3 మీ దేవుడైన యెహోవా మీకు ముందు వెళ్తాడు. మీకోసం ఈ రాజ్యాలను ఆయనే నాశనం చేస్తాడు. వారి దగ్గరనుండి వారి రాజ్యాన్ని మీరు తీసుకుంటారు. యెహోషువ మిమ్మల్ని ముందుగా దాటిస్తాడు. ఇది యెహోవా చెప్పాడు:
4 “అమోరీ రాజులైన సీహోను, ఓగులకు చేసినట్టే యెహోవా ఈ రాజ్యాలకు చేస్తాడు. ఆ రాజుల దేశానికి చేసిన విధముగానే ఆయన చేస్తాడు. వారి దేశాన్ని యెహోవా నాశనం చేసాడు. 5 మరియు మీరు ఈ రాజ్యాలను నాశనం చేసేటట్టు యెహోవా సహాయం చేస్తాడు. మీరు చేయాలని నేను చేప్పిన విషయాలన్నీ మీరు వాళ్లకు చేయాలి. 6 నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. ఈ జనాలకు భయపడకండి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీతో పాటు వెళ్తున్నాడు. యెహోవా మిమ్మల్ని విడిచిపెట్టడు, మీకు సహాయం చేయకుండా ఉండడు.”
7 అప్పుడు మోషే యెహోషువాను పిలిచాడు. మోషే యెహోషువతో చెబుతుంటే ఇశ్రాయేలు ప్రజలంతా విన్నారు: “నిబ్బరంగా, ధైర్యంగా ఉండు, వారి పూర్వీకులకు యిస్తానని యెహోవా వాగ్దానం చేసిన దేశంలోనికి ఈ ప్రజలను నీవు నడిపించాలి. ఈ దేశాన్ని తమ స్వంతంగా తీసుకునేందుకు ఇశ్రాయేలు ప్రజలకు నీవు సహాయం చేయాలి. 8 యెహోవా నీకు ముందు వెళ్తాడు. సాక్షాత్తూ ఆయనే నీతో ఉంటాడు. ఆయన నీకు సహాయం చేయకుండా ఉండడు నిన్ను విడువడు, భయపడవద్దు, దిగులుపడవద్దు.”
ప్రబోధాల పుస్తకాన్ని మోషే వ్రాయటం
9 అప్పుడు మోషే ఈ ధర్మశాస్త్రం వ్రాసి, లేవీ సంతానపు యాజకులకు ఇచ్చాడు. యెహోవా ఒడంబడిక పెట్టె మోసే పని వాళ్లదే. ఆ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు నాయకులందరికి కూడా మోషే యిచ్చాడు. 10 తర్వాత మోషే నాయకులకు ఆజ్ఞాపించాడు. అతను ఇలా చెప్పాడు: “ప్రతి ఏడు సంవత్సరాల ఆఖరిలో, స్వాతంత్ర్యపు సంవత్సరంలో, పర్ణశాలల పండుగ సమయములో ఈ ధర్మశాస్త్రం చదవండి. 11 ఆ సమయంలో మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకునే ప్రత్యేక స్థలంలో ఆయనను కలుసుకునేందుకు ఇశ్రాయేలు ప్రజలంతా వస్తారు. అప్పుడు ప్రజలు వినగలిగేటట్టు నీవు వారికి ఈ ధర్మశాస్త్రం చదివి వినిపించాలి. 12 పురుషులు, స్త్రీలు చిన్నపిల్లలు, మీ పట్టణాల్లో నివసించే విదేశీయులు అందరిని సమావేశ పర్చాలి. వాళ్లు ధర్మశాస్త్రాన్ని విని, మీ దేవుడైన యెహోవాను గౌరవించంటం నేర్చుకుంటారు. ఈ ధర్మశాస్త్రంలోని ఆదేశాలకు వారు జాగ్రత్తగా విధేయులవుతారు. 13 ధర్మశాస్త్రం ఎరుగనివారి సంతానంవాళ్లంతా దానిని వింటారు. వాళ్లు మీ దేవుడైన యెహోవాను గౌరవించటం నేర్చుకుంటారు. యొర్దాను నది ఆవలి ప్రక్క మీరు స్వాధీనం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న దేశంలో మీరు జీవించినంత కాలం వారు ఆయనను గౌరవిస్తారు.”
మోషేను, యెహోషువను యెహోవా పిలవటం
14 “నీవు చనిపోయే సమయం దగ్గరపడింది. యెహోషువను వెంటబెట్టుకుని, సన్నిధి గుడారం దగ్గరకు రా. యెహోషువ చేయాల్సిన పనులు నేను ఆతనికి చెబుతాను” అని మోషేతో యెహోవా చెప్పాడు. కనుక మోషే, యెహోషువ సన్నిధి గుడారానికి వెళ్లారు.
15 ఆ గుడారంలో ఒక మేఘస్తంభంలో యెహోవా ప్రత్యక్షమయ్యాడు. మేఘస్తంభం గుడార ద్వారం దగ్గర నిలిచింది. 16 మోషెతో యెహోవా ఇలా చెప్పాడు: “త్వరలో నీవు చనిపోతావు. నీవు నీ పూర్వీకులతో ఉండేందుకు వెళ్లిపోయిన తర్వాత, ఈ ప్రజలు నాకు నమ్మకంగా ఉండరు. నేను వాళ్లతో చేసిన ఒడంబడికను వాళ్లు ఉల్లంఘిస్తారు. వాళ్లు నన్ను విడిచిపెట్టేసి, వారు వెళ్తున్న దేశంలోని ఇతర దేవుళ్లను, అబద్ధపు దేవుళ్లను పూజించటం మొదలు పెడ్తారు. 17 ఆ సమయంలో నేను వారిమీద చాలా కోపగించి, వాళ్లను విడిచి పెడ్తాను. వాళ్లకు సహాయం చేయటానికి నేను ఒప్పుకోను, వాళ్లు నాశనం చేయబడతారు. వాళ్లకు భయంకరమైన సంగతులు జరుగుతాయి, వాళ్లకు కష్టాలు వస్తాయి. అప్పుడు ‘మన దేవుడు మనతో లేడు గనుక ఈ కీడులు మనకు కలిగాయి’ అని వారు అంటారు. 18 వాళ్లు కీడు చేసి, ఇతర దేవుళ్లను పూజించారు గనుక నేను వారికి సహాయం చేయటానికి ఒప్పుకోను.
19 “కనుక ఈ పాట వ్రాసుకొని, ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించు, అది పాడటం వారికి నేర్పించు. అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నాకు ఈ పాట సాక్ష్యంగా ఉంటుంది. 20 వారి పూర్వీకులకు నేను వాగ్దానం చేసిన, మంచి వాటితో నిండిపోయిన దేశం లోనికి నేను వాళ్లను తీసుకొని వెళ్తాను. వారు తినేందుకు కావాల్సినవి అన్నీ వారికి ఉంటాయి. ఐశ్వర్యవంతమైన జీవితం వారికి ఉంటుంది. కానీ అప్పుడు వాళ్లు యితర దేవుళ్ల వైపు తిరిగి, వారిని సేవిస్తారు. నా నుండి వాళ్లు తిరిగిపోయి నా ఒడంబడికను ఉల్లంఘిస్తారు. 21 అప్పుడు వాళ్లకు ఎన్నో భయంకర సంగతులు జరుగుతాయి, వారికి ఎన్నో కష్టాలు వస్తాయి. అప్పటికి ఇంకా వారి ప్రజలకు ఈ పాట జ్ఞాపకం ఉంటుంది, వారిది ఎంత తప్పు అని యిది వారికి తెలియజేస్తుంది. నేను వారికి ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలోనికి నేను యింకా వారిని తీసుకొని వెళ్లలేదు; కానీ వాళ్లు అక్కడ ఏం చేయాలని పథకం వేస్తున్నారో నాకు అప్పుడే తెలుసు.”
22 కనుక ఆ రోజే మోషే ఆ పాట వ్రాసాడు. ఆ పాటను ఇశ్రాయేలు ప్రజలకు ఆతను నేర్పించాడు.
23 తర్వాత నూను కుమారుడైన యెహోషువతో యెహోవా మాట్లాడాడు: ఆతనితో, “దైర్యంగా, నిబ్బరంగా ఉండు. నేను ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేసిన దేశంలోకి నీవు ఆ ప్రజలను నడిపిస్తావు. నేను నీతో ఉంటాను” అని యెహోవా చెప్పాడు.
ఇశ్రాయేలు ప్రజలను మోషే హెచ్చరించటం
24 ఈ ఉపదేశాలు అన్నింటినీ మోషే జాగ్రత్తగా ఒక గ్రంథంలో వ్రాసాడు. అతడు ముంగించినప్పుడు 25 లేవీయులకు అతడు ఒక ఆజ్ఞ యిచ్చాడు. (వీళ్లు యెహోవా ఒడంబడిక పెట్టె విషయలో జాగ్రత్త తీసుకుంటారు.) అని మోషే చెప్పాడు, 26 “ఈ ధర్మశాస్త్రపు గ్రంథం తీసుకొని. మీ దేవుడైన యెహోవా ఒడంబడిక పెట్టె పక్కగా పెట్టండి. అప్పుడు అది మీ మీద సాక్ష్యంగా అక్కడ ఉంటుంది. 27 మీరు చాలా మొండి వాళ్లని నాకు తెలుసు. మీ ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్లాలని మీకు ఉంటుందని నాకు తెలుసు. చూడండి, నేను యింకా మీతో ఉన్న ఈనాడే మీరు యెహోవాకు విధేయులయ్యేందుకు నిరాకరించారు. నేను చనిపోయిన తర్వాత మీరు యెహోవాకు విధేయులయ్యేందుకు ఇంకా ఎక్కువ నిరాకరిస్తారు. 28 మీ వంశాల నాయకుల్ని, మీ అధికారుల్ని అందరిని సమావేశపర్చండి. వారికి నేను ఈ విషయాలు చెబుతాను. భూమిని, ఆకాశాన్ని నేను వారికి విరుద్ధంగా సాక్ష్యం పలికేందుకు పిలుస్తాను. 29 నా మరణం తర్వాత మీరు చెడ్డ వాళ్లవుతారని నాకు తెలసు, మీరు వెంబడించాలని నేను మీకు ఆదేశించిన మార్గంనుండి మీరు తిరిగి పోతారు. అప్పుడు భవిష్యత్తులో చెడ్డ సంగతులు మీకు జరుగుతాయి. ఎందుకంటే, ఏవి చెడ్డవని యెహోవా చెబుతాడో అవే మీరు చేయాలనుకుంటారు గనుక. మీరు చేసే పనుల మూలంగా మీరు ఆయనకు కోపం పుట్టిస్తారు.”
మోషే కీర్తన
30 అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలందరికీ ఈ పాట చెప్పాడు. మొత్తం పాట అంతా ముగించేంత వరకు అతడు ఆపుజేయలేదు.
© 1997 Bible League International