Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ద్వితీయోపదేశకాండము 21-23

ఒకడు హత్య చేయబడి ఉంటే

21 “మీరు నివసించేందుకు, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో ఒక పొలంలో హత్య చేయబడిన వాడు ఒకడు కనబడవచ్చును. కాని ఆతణ్ణి చంపింది ఎవరో ఎవరికీ తెలియదు. అప్పుడు మీ నాయకులు, న్యాయమూర్తులు బయటకు వచ్చి, చంపబడిన మనిషి చుట్టూ ఉన్న పట్టణాల దూరాన్ని కొలత వేయాలి. చచ్చిన వానికి అతి దగ్గరగా ఉన్న పట్టణం ఏదో తెలిసినప్పుడు, ఆ పట్టణం పెద్దల వారి మందలో నుండి ఒక ఆవును తీసుకొని రావాలి. అది పెయ్యగా ఉండాలి. అది ఎన్నడూ ఏ పనికీ వినియోగించబడనిది కావాలి. అప్పుడు ఆ పట్టణపు నాయకుడు, నీరు ప్రవహిస్తున్న ఒక లోయలోనికి ఆ ఆవును తీసుకొని రావాలి. ఆ లోయ ఇదివరకు ఎన్నడూ దున్ననిది, మొక్కలు నాటనిదిగా ఉండాలి. అప్పుడు నాయకులు ఆ లోయలో ఆవు మెడను విరుగగొట్టాలి. లేవీ సంతతివారు యాజకులుకూడ అక్కడికి వెళ్లాలి. (యెహోవాను సేవించేందుకు, ఆయన పేరిట ప్రజలను దీవించేందుకు మీ దేవుడైన యెహోవా ఈ యాజకులను ఏర్పాటు చేసుకొన్నాడు. వివాదానికి సంబంధించిన ప్రతి విషయంలో న్యాయం ఎవరిదో యాజకులే నిర్ణయిస్తారు.) ఆ శవానికి అతి సమీపంగా ఉన్న పట్టణపు నాయకులంతా, లోయలో మెడ విరుగగొట్టబడిన ఆవుమీద వారి చేతులు కడుగుకోవాలి. ఈ నాయకులు ఇలా చెప్పాలి, ‘ఈ మనిషిని మేము చంపలేదు. అది జరగటం మేము చూడలేదు. యెహోవా, నీవు విమోచించిన నీ ఇశ్రాయేలు ప్రజలను క్షమించు. నీ ప్రజల్లో నిర్దోషిని ఎవరినీ నిందించబడనీయకు.’ అప్పుడు ఆ హత్య నిమిత్తం వారు నిందించబడరు. అలాంటి పరిస్థితుల్లో ఇలా చేయటమే మీకు సరి. అలా చేయటం ద్వారా నిర్దోషులు ఎవరి హత్యనుగూర్చీ నిందించబడరు.

యుద్ధంలో పట్టుబడ్డ స్త్రీలు

10 “మీరు మీ శత్రువులతో యుద్ధం చేస్తారు, మీరు వారిని ఓడించేటట్టు మీ దేవుడైన యెహోవా చేస్తాడు. అప్పుడు మీరు మీ శత్రువులను బందీలుగా కొనిపోతారు. 11 ఆ బందీలలో అందమైన ఒక స్త్రీని నీవు చూడవచ్చు. నీవు ఆమెను వాంఛించి, నీ భార్యగా చేసుకోవాలని తలంచవచ్చు. 12 అప్పుడు నీవు ఆమెను నీ ఇంటికి తీసుకొని రావాలి. ఆమె తన తల గొరిగించుకొని, గోళ్లు కత్తిరించుకోవాలి. 13 ఆమె ధరించి ఉన్న బట్టలు తీసివేయాలి. ఆమె నీ ఇంటనే ఉండి తన తల్లిదండ్రుల కోసం నెల రోజులు విలపించాలి, ఆ తర్వాత నీవు ఆమె దగ్గరికి పోవచ్చును. ఆమెకు భర్తవు కావచ్చును. ఆమె నీకు భార్య అవుతుంది. 14 కాని ఆమె వలన నీకు సంతృప్తి కలుగకపోతే, తనకు ఇష్టంవచ్చిన చోటికి నీవు ఆమెను పోనివ్వాలి. ఆయితే నీవు ఆమెను అమ్మకూడదు. నీవు ఆమెను బానిసగా చూడరాదు. ఎందుకంటే నీ వలన ఆమెకు అవమానము కలిగింది గనుక.

జ్యేష్ఠ కుమారడు

15 “ఒక పురుషునికి ఇద్దరు భార్యలు ఉండి, వారిలో ఒకదానికంటె మరొక దానిని అతడు ఎక్కువగా ప్రేమిస్తూ ఉండవచ్చును. ఆ ఇద్దరు భార్యలూ అతనికి పిల్లలను కనవచ్చును. అతడు ప్రేమించని భార్యకు పుట్టిన బిడ్డ మొదటి బిడ్డ కావచ్చును. 16 అతడు తన ఆస్తిని తన పిల్లలకు పంచి ఇచ్చేటప్పుడు జ్యేష్ఠునికి చెందిన ప్రత్యేకమైనవాటిని, తాను ప్రేమించే భార్య కుమారునికి అతడు ఇచ్చివేయకూడదు. 17 తన ప్రేమకు పాత్రము కాని మొదటి భార్య బిడ్డను అతడు స్వీకరించాలి. అతడు అన్నింటిలో రెండంతల భాగం మొదటి కుమారునికి ఇవ్వాలి. ఎందుకంటే, ఆ బిడ్డ అతని మొదటి బిడ్డ గనుక. ప్రథమ సంతానం హక్కు ఆ బిడ్డకే చెందుతుంది.

లోబడేందుకు తిరస్కరించే కుమారులు

18 “ఒకని కుమారుడు మొండివాడు, లోబడడు. ఈ కుమారుడు తండ్రికి గాని తల్లికి గాని విధేయుడు కాడు. తల్లిదండ్రులు ఆ కుమారుని శిక్షిస్తారు. అయినప్పటికీ వారి మాట అతడు నిరాకరిస్తాడు. 19 అప్పుడు పట్టణ సమావేశ స్థలం దగ్గర ఉండే ఆ పట్టణ నాయకుల దగ్గరకు ఆ తల్లిదండ్రులు వానిని తీసుకొని వెళ్లాలి. 20 ఆ పట్టణ నాయకులతో వారు ఇలా చెప్పాలి: ‘మా కుమారుడు మొండివాడు, లోబడటం లేదు. మేము చెప్పిన ఏ పనీ అతడు చేయడు. వాడు విపరీతంగా తిని, తాగుతున్నాడు.’ 21 అప్పుడు ఆ పట్టణంలోని మనుష్యులు ఆ కుమారుని రాళ్లతో కొట్టి చంపాలి. ఇలా చేయటం ద్వారా ఈ చెడుతనాన్ని మీ నుండి తొలగిస్తారు. ఇశ్రాయేలు ప్రజలంతా దీనిగూర్చి విని భయపడతారు.

నేరస్థులు చంపబడి చెట్టుకు వ్రేలాడదీయబడటం

22 “ఒక వ్యక్తి మరణ శిక్షకు యోగ్యమైన పాపం చేసి నేరస్థుడు కావచ్చును. అతణ్ణి చంపేసిన తర్వాత అతని శవాన్ని ఒక చెట్టుకు వేలాడదీయాలి. 23 అలా జరిగినప్పుడు అతని శవం రాత్రి అంతా చెట్టుకు ఉండకూడదు. ఆ మనిషిని మీరు ఆ రోజే తప్పక సమాధి చేయాలి. ఎందుకంటే, చెట్టుమీద వేలాడే మనిషి దేవుని చేత శపించబడ్డాడు. మీరు నివసించేందుకు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశాన్ని మీరు పాడు చేయకూడదు.

ఇతర ఆజ్ఞలు

22 “నీ పొరుగు వాని ఆవు లేక గొర్రె తప్పి పోయి తిరగటం నీవు చూసినప్పుడు చూడనట్టు విస్మరించకూడదు. నీవు దాన్ని తప్పక దాని యజమాని దగ్గరకు తీసుకొని వెళ్లాలి. ఆ యజమాని నివాసం నీకు దగ్గర్లో లేకపోతే, లేక అది ఎవరిదో నీకు తెలియకపోతే అప్పుడు ఆ ఆవును లేక గొర్రెను నీ ఇంటికి నీవు తీసుకొని వెళ్లాలి. దాని యజమాని దానికోసం వెదకుకొంటూ వచ్చేంతవరకు నీవు దానిని నీ దగ్గర ఉంచాలి. అప్పుడు నీవు అతనికి దానిని తిరిగి ఇచ్చివేయాలి. నీ పొరుగువాని గాడిద, నీ పొరుగువాని బట్టలు, లేక నీ పొరుగువాడు పోగొట్టుకొన్న దేని విషయంలోనైనా నీవు ఇలానే చేయాలి. నీ పొరుగువానికి నీవు సహాయం చేయాలి.

“నీ పొరుగువాని గాడిద లేక ఆవు దారిలో పడిపోతే నీవు దానిని చూడనట్టు పోకూడదు. దాన్ని లేవనెత్తటానికి నీవు అతనికి సహాయం చేయాలి.

“ఒక పురుషుని బట్టలను ఒక స్త్రీ ధరించకూడదు మరియు పురుషుడు స్త్రీల బట్టలు ధరించకూడదు. ఇలా చేసేవారు ఎవరైనాసరే మీ దేవుడైన యెహోవాకు అసహ్యం.

“నీవు దారిన నడుస్తుండగా ఒక పక్షిగూడును చెట్టుమీదగాని నేలమీదగాని నీవు చూడవచ్చును. తల్లి పక్షి పిల్ల పక్షులతోగాని గుడ్లమీదగాని కూర్చొని ఉంటే పిల్లలతోబాటు తల్లిపక్షిని నీవు తీసుకొనరాదు. పిల్ల పక్షుల్ని నీవు తీసుకొనవచ్చు. కాని నీవు తల్లిని పోనివ్వాలి. ఈ ఆజ్ఞలకు నీవు విధేయుడవైతే నీకు అన్నీ సక్రమంగా జరుగుతాయి, నీవు చాలా కాలం బ్రతుకుతావు.

“నీవు కొత్త యిల్లు కట్టినప్పుడు దాని పై కప్పు చుట్టూ పిట్టగోడ కట్టాలి. అప్పుడు ఆ యింటి మీదనుండి పడి చచ్చిన వారి మరణదోషం నీ మీద ఉండదు.

జతపర్చబడకూడని విషయాలు

“నీ ద్రాక్షపొలంలో రెండు రకాల విత్తనాలు నీవు విత్తకూడదు. ఎందుకంటే అప్పుడు నీవు విత్తిన విత్తనపు పంట, నీ పొలంలోని ద్రాక్ష రెండూ నిష్ప్రయోజనం.[a]

10 “గాడిదను, ఆవును కలిపి నీవు దున్నకూడదు.

11 “ఉన్ని, నార రెండూ కలిసి నేసిన బట్ట నీవు ధరించకూడదు.

12 “నీవు ధరించే అంగీకి నాలుగు మూలలా కుచ్చులు ఉండాలి.

వివాహ చట్టాలు

13 “ఒక పురుషుడు ఒక యువతిని వివాహం చేసుకొని ఆమెతో లైంగిక సంబంధం కలిగి ఉండ వచ్చును. ఆ తర్వాత ఆమె నచ్చలేదని అతడు చెప్పవచ్చు. 14 ‘నేను ఈమెను పెళ్లి చేసుకొన్నాను కానీ మేము లైంగికంగా కలిసినప్పుడు ఈమె కన్య కాదని నాకు తెలిసింది’ అని అతడు అబద్ధం చెప్పవచ్చు. ఆమెకు విరోధంగా ఇలా చెప్పటంవల్ల ప్రజలు ఆమెను గూర్చి చెడుగా భావిస్తారు. 15 ఇలా జరిగితే ఆమె తల్లిదండ్రులు ఆ పట్టణ సమావేశ స్థలం దగ్గర పెద్దల వద్దకు ఆమె కన్య అనే రుజువు తీసుకొని రావాలి. 16 ఆ యువతి తండ్రి పెద్దలతో చెప్పాలి, ‘నా కూతుర్ని ఇతనికి భార్యగా నేను ఇచ్చాను, కానీ ఇప్పుడు ఆమె అతనికి ఇష్టం లేదు. 17 ఇతడు నా కూతురి మీద అబద్ధాలు చెప్పాడు. “నీ కూతురు కన్య అనే ఋజువు నాకు కనబడలేదు” అని అతడు అన్నాడు. అయితే నా కూతురు కన్య, నా దగ్గర ఋజువుంది’ అప్పుడు వారు ఆమె బట్టను[b] పట్టణ పెద్దలకు చూపించాలి. 18 అప్పుడు ఆ పట్టణ పెద్దలు అతన్ని పట్టుకొని శిక్షించాలి. 19 నూరు వెండితులాలు వారు అతనికి జుల్మానా విధించాలి. ఆమె భర్త ఒక ఇశ్రాయేలు యువతికి అవమానం కలిగించాడు గనుక ఆమె తండ్రికి వారు ఆ ధనం ఇవ్వాలి. ఆ యువతి ఆ పురుషునికి భార్యగా కొనసాగాలి. అతడు తన జీవితాంతం ఆమెకు విడాకులు ఇవ్వకూడదు.

20 “అయితే ఒకవేళ ఆ భర్త తన భార్యను గూర్చి చెప్పిన విషయాలు నిజం కావచ్చును. ఆమె కన్య అని చెప్పేందుకు ఆ భార్య తల్లిదండ్రుల దగ్గర ఋజువు లేక పోవచ్చును. ఇలా జరిగితే 21 అప్పుడు ఆ పట్టణ నాయకులు ఆ యువతిని ఆమె తల్లిదండ్రుల ఇంటి గుమ్మం దగ్గరకు తీసుకొని రావాలి. తర్వాత ఆ పట్టణంలోని మనుష్యులు ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. ఎందుకంటే, ఇశ్రాయేలులో ఆమె అవమానకరమైన పని చేసింది. ఆమె తన తండ్రి ఇంటిలో ఒక వేశ్యలా ప్రవర్తించింది. చెడ్డది ఏదైనా సరే మీ ప్రజల్లోనుండి మీరు తీసివేయాలి.

లైగింక పాపాలు

22 “ఒక పురుషుడు మరొక పురుషుని భార్యతో లైంగిక సంబంధం కలిగి ఉంటే ఆ స్త్రీ, ఆమెతో లైగింక సంబంధం గల ఆ పురుషుడూ ఇద్దరూ చావాలి. చెడ్డది ఏదైనా సరే ఇశ్రాయేలు నుండి తొలగించాలి.

23 “మరొక పురుషునికి ప్రధానం చేయబడిన ఒక యువతిని ఇంకో పురుషుడు కలియవచ్చును. ఆతడు ఆమెతో లైంగిక సంబంధం కలిగి ఉండవచ్చు. ఇది పట్టణంలో జరిగితే 24 మీరు వాళ్లిద్దర్నీ పట్టణ ద్వారం బయటకు తీసుకొని వచ్చి, మీరు వారిని రాళ్లలో కొట్టి చంపాలి. ఆ పురుషుడు మరొకని భార్యను లైగింక పాపానికి వాడుకున్నాడు గనుక మీరు ఆతడ్ని చంపాలి. ఆ యువతి పట్టణంలోనే ఉండి కూడా సహాయం కోరలేదు గనుక మీరు ఆ యువతిని చంపాలి. చెడ్డది ఏదైనా సరే మీ ప్రజల్లోనుండి మీరు తొలగించాలి.

25 “అయితే ప్రధానం చేయబడిన ఒక యువతిని ఒక పురుషుడు పొలంలో చూచి అతనితో లైగింక సంబంధం అనుభవించమని ఆమెను బలవంతం చేస్తే. అప్పుడు ఆ పురుషుడు మాత్రమే చావాలి. 26 ఆ యువతి మరణశిక్షకు పాత్రమైనది ఏమీ చేయలేదు, గనుక మీరు ఆమెను ఏమీ చేయకూడదు. ఒకడు మరొక అమాయకుని మీద దాడి చేసి హత్య చేసిన వంటిదే ఈ వ్యాజ్యెముకూడాను. 27 ఆ పురుషుడు ప్రధానం చేయబడిన యువతిని బయట పొలంలో చూసాడు. ఆ యువతి సహాయం కోసం కేకలు పెట్టింది, కానీ ఆమెకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు.

28 “ఒక పురుషుడు ప్రధానం చేయబడని ఒక కన్యను చూచి, అతనితో లైగింక సంబంధం అనుభవించమని బలవంతం చేయవచ్చును. ఒకవేళ అతడు ఇలా చేయటం ప్రజలు చూస్తే 29 అప్పుడు అతడు ఆ అమ్మాయి తల్లిదండ్రులకు యాభై తులాల వెండి ఇవ్వాలి. ఆ యువతి అతని భార్య అవుతుంది. ఎందుకంటే అతడు ఆమెను లైంగికంగా వాడుకొన్నాడు గనుక. అతడు తన జీవితాంతం ఆమెకు విడాకులు ఇవ్వకూడదు.

30 “ఒక పురుషుడు తన తండ్రి భార్యతో లైంగింక సంబంధం కలిగియుండి తన తండ్రికి అవమానం కలిగించకూడదు.

ఆరాధనలో పాల్గొనలేని మనుష్యులు

23 “ఈ వ్యక్తులు యెహోవాను ఆరాధించుటలో ఇశ్రాయేలు ప్రజల్లో భాగంగా ఉండకూడదు. వృషణాలు గాయపడినవాడు, పురుషాంగం కోసివేయబడ్డవాడు లేక వివాహం కాని తల్లిదండ్రులకు పుట్టినవాడు. ఇతని సంతతిలో ఏ వ్యక్తీ యెహోవా ప్రజల్లో భాగంగా ఉండకూడదు.

“అమ్మోనీవాడు, మోయాబువాడు యెహోవా ప్రజలకు చెందడు. వారి సంతానంలో ఎవ్వరూ, చివరికి పదో తరం వారు కూడా యెహోవా ప్రజల్లో భాగం కాజాలరు. ఎందుకంటే, మీరు ఈజిప్టునుండి వచ్చినప్పుడు మీ ప్రయాణంలో అమ్మోనీయులు, మోయాబీయులు మీకు భోజనం, నీళ్లు ఇవ్వటానికి నిరాకరించారు. మరియు మిమ్మల్ని శపించేందుకు వారు బిలాముకు డబ్బు ఇచ్చారు గనుక వారు యెహోవా ప్రజల్లో భాగంగా ఉండజాలరు. (యరాము[c] లోని పెతోరు పట్టణపువాడైన బెయొరు కుమారుడు బిలాము.) అయితే యెహోవా దేవుడు బిలాము మాట వినకుండా నిరాకరించాడు. శాపాన్ని మీకు ఆశీర్వాదంగా యెహోవా మార్చాడు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనుక. అమ్మోనీ ప్రజలతోగాని, మోయాబీ ప్రజలతో గాని సమాధాన పడేందుకు మీరు ఎన్నడూ ప్రయత్నించకూడదు. మీరు జీవించినంత కాలం వారితో స్నేహంగా ఉండవద్దు.

ఇశ్రాయేలీయులు అంగీకరించాల్సిన ప్రజలు

“ఎదోము వాణ్ణి మీరు ద్వేషించకూడదు. ఎందుకంటే అతడు మీకు బంధువు. ఈజిప్టు వాణ్ణి మీరు ద్వేషించకూడదు. ఎందుకంటే అతని దేశంలో మీరు పరాయివారుగా ఉన్నారు. ఎదోము, ఈజిప్టు వాళ్ల మూడో తరంవారి పిల్లలు యెహోవా ప్రజల్లో భాగంగా ఉండవచ్చును.

సైన్యం పాళెమును పరిశుభ్రంగా ఉంచటం

“మీ సైన్యం మీ శత్రువుల మీదికి వెళ్లినప్పుడు, మిమ్మల్ని అపవిత్రపరచే వాటన్నింటికీ దూరంగా ఉండండి. 10 రాత్రిపూట కలలో తడిసి అపవిత్రమైన వాడు మీ మధ్య ఎవడైనా ఉంటే అతడు మీ పాళెము నుండి బయటకు వెళ్లిపోవాలి. అతడు పాళెమునుండి దూరంగా ఉండాలి. 11 అయితే సాయంకాలం అతడు స్నానంచేయాలి. సూర్యుడు అస్తమించాక అతడు పాళెములోనికి రావచ్చును.

12 “నీకు పాళెము వెలుపల బహిర్భూమిగా ఒక స్థలం ఉండాలి. 13 మరియు నీ ఆయుధాలతో పాటు ఒక కట్టె నీకు ఉండాలి; నీవు బహిర్భూమికి వెళ్లవల్సినప్పుడు ఆ కట్టెతో నీవు ఒక గుంట తవ్వుకొని తర్వాత దానిని పూడ్చివేయాలి. 14 ఎందుకంటే మిమ్మల్ని రక్షించి, మీ శ్రతువులను ఓడించటానికి మీ దేవుడైన యెహోవా మీ పాళెములో ఉన్నాడు. అందు చేత మీ పాళెము పవిత్రంగా ఉండాలి. అప్పుడు మీ మధ్యలో అపరిశుభ్రం లేదని చూసి, మీ దగ్గరనుండి వెళ్లిపోడు.

ఇతర ఆజ్ఞలు

15 “బానిస ఒకడు తన యజమాని దగ్గర్నుండి పారిపోయి నీ దగ్గరకు వస్తే, ఆ బానిసను నీవు తిరిగి అతని యజమానికి అప్పగించకూడదు. 16 ఈ బానిస నీతో, తనకు ఇష్టం వచ్చిన చోట నివసించవచ్చును. అతడు కోరుకొన్న పట్టణంలో నివసించవచ్చు. నీవు అతన్ని తొందరపెట్టకూడదు.

17 “ఇశ్రాయేలు పురుషుడేగాని, స్త్రీగాని ఎన్నటికీ ఆలయ వేశ్య కాకూడదు. 18 ఒక వేశ్య లేక పురుషగామి సంపాదించిన డబ్బును నీ దేవుడైన యెహోవా ఆలయానికి తీసుకొని రాకూడదు. దేవునికి చేసిన మొక్కు బడి చెల్లించటానికి ఎవరూ ఆ డబ్బు ఉపయోగించకూడదు. మీ దేవుడైన యెహోవాకు వ్యభిచారులు అంటే అసహ్యం.

19 “మరో ఇశ్రాయేలు వానికి నీవు డబ్బు అప్పు ఇస్తే, నీవు వడ్డీ తీసుకోకూడదు. వడ్డీ ఆర్జించిపెట్టే దేనిమీదగానీ, డబ్బు మీద, ఆహారం మీదగాని వడ్డీ వసూలు చేయవద్దు. 20 ఒక విదేశీయుని దగ్గర నీవు వడ్డీ తీసుకోవచ్చును. కానీ మరో ఇశ్రాయేలువాని దగ్గర మాత్రం నీవు వడ్డీ తీసుకోకూడదు. ఈ నియమాలు నీవు పాటిస్తే, నీవు నివసించబోయే దేశంలో నీవు చేసే వాటన్నింటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు.

21 “నీ దేవుడైన యెహోవాకు నీవు ఒక వాగ్దానం చేస్తే, నీ వాగ్దానం అంతటినీ చెల్లించేందుకు వెనుకాడవద్దు. ఎందుకంటే, నీవు దాన్ని చెల్లించాలని నీ దేవుడైన యెహోవా అడుగుతాడు. నీవు వాగ్దానం చేసినదానిని చెల్లించకపోతే అది నీకు పాపం అవుతుంది. 22 నీవు ఆ వాగ్దానం చేయకపోతే నీయందు పాపం వుండదు. 23 కానీ నీవు చేస్తానని చెప్పిన వాటిని మాత్రం నీవు చేయాలి. నీవు నీ దేవుడైన యెహోవాకు స్వచ్ఛందంగా వాగ్దానం చేసినప్పుడు, నీ వాగ్దానం ప్రకారం నీవు చేయాలి.

24 “మరొకరి ద్రాక్షా పొలంగుండా నీవు వెళ్లినప్పుడు, నీవు కోరినన్ని ద్రాక్షాపండ్లు నీవు తినవచ్చును. కానీ నీ బుట్టలో మాత్రం ద్రాక్షాపండ్లు ఏమీ వేసుకోకూడదు. 25 నీవు మరొకరి పంట పొలంలోనుంటి వెళ్లినప్పుడు నీవు నీ చేతుల్తో వెన్నులు త్రుంచుకొని తినవచ్చును. కానీ అవతలివాడి పంట తీసుకొనేందుకు నీవు కొడవలితో కోయకూడదు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International