Chronological
ఇశ్రాయేలీయులు ఈజిప్టునుండి వెళ్లిపోవుట
33 మోషే, అహరోనులు ఇశ్రాయేలు ప్రజలను వంశాలవారీగా ఈజిప్టునుండి బయటకు నడిపించారు. వారు ప్రయాణం చేసిన స్థలాలు ఇవి. 2 ఆ ప్రయాణాలను గూర్చి మోషే ఇలా వ్రాశాడు. యెహోవా కోరిన విషయాలను మోషే వ్రాశాడు. ఆ ప్రదేశాలు ఇవి:
3 మొదటి నెల 15వ తేదిన వారు రామెసేసు నుండి బయల్దేరారు. పస్కా మరునాటి ఉదయం ఇశ్రాయేలు ప్రజలు జయనినాదాలు చేస్తూ ఈజిప్టునుండి బయటకు వచ్చారు. ఈజిప్టు ప్రజలంతా వారిని చూశారు. 4 యెహోవా చంపిన తమ వారందరిని ఈజిప్టువారు సమాధి చేస్తూఉన్నారు. తమ పెద్ద కుమారులందరినీ వారు పాతిపెడ్తూ ఉన్నారు. ఈజిప్టు దేవతల మీద యెహోవా తన తీర్పు తీర్చాడు.
5 ఇశ్రాయేలు ప్రజలు రామెసేసును విడిచి సుక్కోతుకు ప్రయాణం చేసారు. 6 సుక్కోతు నుండి వారు ఏతాముకు ప్రయాణం చేసారు. అక్కడ అరణ్య శివార్లలో ప్రజలు నివాసం చేసారు. 7 వారు ఏతాము విడిచి పీహహీరోతు వెళ్లారు. ఇది బయల్సెఫోను దగ్గర ఉంది. మిగ్దోలు దగ్గర ప్రజలు నివాసం చేసారు.
8 ప్రజలు సీహహీరోతు విడిచి, సముద్రం మధ్య నుంచి నడిచారు. వారు అరణ్యంవైపు వెళ్లారు. అప్పుడు వారు ఏతాము అరణ్యంలో మూడు రోజులు ప్రయాణం చేసారు. మారా దగ్గర ప్రజలు నివాసం చేసారు.
9 ప్రజలు మారాను విడిచి ఏలీము వెళ్లి అక్కడ నివాసం చేసారు. అక్కడ 12 నీటి ఊటలు, 70 ఈతచెట్లు ఉన్నాయి. 10 ప్రజలు ఏలీము విడిచిపోయి ఎర్ర సముద్రం దగ్గర నివాసం చేసారు.
11 ప్రజలు ఎర్ర సముద్రం విడిచిపోయి సీను అరణ్యంలో నివాసంచేసారు.
12 ప్రజలు సీను అరణ్యం విడిచి వెళ్లి దోపకాలో నివాసం చేసారు.
13 ప్రజలు దోపకా విడిచి వెళ్లి ఆలూషులో నివాసం చేసారు.
14 ప్రజలు ఆలూషు విడిచి వెళ్లి, రెఫీదీములో నివాసం చేసారు. ఆ స్థలంలోనే ప్రజలు తాగేందుకు నీరు దొరకలేదు.
15 ప్రజలు రెఫీదీము విడిచివెళ్లి, సీనాయి అరణ్యంలో నివాసం చేసారు.
16 ప్రజలు సీనాయి అరణ్యం విడిచివెళ్లి, కిబ్రోతు హత్తావాలో నివాసం చేసారు.
17 ప్రజలు కిబ్రోతు హత్తావా విడిచివెళ్లి హజేరోతులో నివాసం చేసారు.
18 ప్రజలు హజేరోతు విడిచివెళ్లి, రిత్మాలో నివాసం చేసారు.
19 ప్రజలు రిత్మా విడిచివెళ్లి రిమ్మోను పారెసులో నివాసం చేసారు.
20 ప్రజలు రిమ్మోను పారెసు విడిచివెళ్లి, లిబ్నాలో నివాసం చేసారు.
21 ప్రజలు లిబ్నా విడిచివెళ్లి రీసాలో నివాసం చేసారు.
22 ప్రజలు రీసా విడిచి వెళ్లి కెహెలాతాలో నివాసం చేసారు.
23 ప్రజలు కెహేలాతా విడిచివెళ్లి షాపెరు కొండ దగ్గర నివాసం చేసారు.
24 ప్రజలు షాపెరు కొండ విడిచివెళ్లి హరాదాలో నివాసం చేసారు.
25 ప్రజలు హరాదా విడిచివెళ్లి మకెలోతులో నివాసం చేసారు.
26 ప్రజలు మకెలోతు విడిచివెళ్లి తాహతులో నివాసం చేసారు.
27 ప్రజలు తాహతు విడిచివెళ్లి తారహులో నివాసం చేసారు.
28 ప్రజలు తారహు విడిచివెళ్లి మిత్కాలో నివాసం చేసారు.
29 ప్రజలు మిత్కా విడిచివెళ్లి హష్మోనాలో నివాసం చేసారు.
30 ప్రజలు హష్మోనా విడిచివెళ్లి మొసెరోతులో నివాసం చేసారు.
31 ప్రజలు మొసేరోతు విడిచివెళ్లి బెనే యాకానులో నివాసం చేసారు.
32 ప్రజలు బెనేయాకాను విడిచివెళ్లి హోర్ హగ్గిద్గాదులో నివాసం చేసారు.
33 ప్రజలు హోర్ హగ్గిద్గాదు విడిచివెళ్లి యొత్బాతాలో నివాసం చేసారు.
34 ప్రజలు యొత్బాతా విడిచివెళ్లి ఎబ్రోనాలో నివాసం చేసారు.
35 ప్రజలు ఎబ్రోనా విడిచివెళ్లి ఎసోన్గెబెరులో నివాసం చేసారు.
36 ప్రజలు ఎసోన్గెబెరు విడిచివెళ్లి సీను అరణ్యంలోని కాదేషులో నివాసం చేసారు.
37 ప్రజలు కాదేషు విడిచి వెళ్లి హోరులో నివాసం చేసారు. ఇది ఎదోము సరిహద్దు దగ్గర కొండ. 38 యాజకుడు అహరోను యెహోవా మాటకు విధేయుడై హోరు కొండ మీదికి వెళ్లాడు. ఆ స్థలంలోనే అహరోను మరణించాడు. ఐదో నెల మొదటి రోజున అహరోను చనిపోయాడు. అది ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు విడిచిన 40 వ సంవత్సరం. 39 అహరోను హోరు కొండ మీద చనిపోయినప్పుడు అతని వయస్సు 123 సంవత్సరాలు. కనాను దేశంలోని నెగెవు ప్రాంతంలో అరాదు ఒక పట్టణం.
40 ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నారని అక్కడ వున్న కనానీ రాజు విన్నాడు. 41 ప్రజలు హోరు కొండ విడిచి సల్మానాలో నివాసం చేసారు.
42 ప్రజలు సల్మానా విడిచివెళ్లి పూనొనులో నివాసం చేసారు.
43 ప్రజలు పూనొను విడిచివెళ్లి ఓబోతులో నివాసం చేసారు.
44 ప్రజలు ఓబోతు విడిచివెళ్లి ఈయ్యె అబారీములో నివాసం చేసారు. ఇది మోయాబు దేశ సరిహద్దులో ఉంది.
45 ప్రజలు ఈయ్యె అబారీము విడిచివెళ్లి దీబోను గాదులో నివాసం చేసారు.
46 ప్రజలు దీబోను గాదు విడిచివెళ్లి అల్మోను దిబ్లాతాయిములో నివాసం చేసారు.
47 ప్రజలు అల్మోను దిబ్లాతాయిము విడిచివెళ్లి నెబో దగ్గర అబారీము కొండల మీద నివాసం చేసారు.
48 ప్రజలు అబారీము కొండలు విడిచి వెళ్లి యొర్దాను నది దగ్గర అర్బత్ మోయాబులో నివాసం చేసారు. ఇది యెరికో దగ్గర, యొర్దానుకు సమీపంలో వారు నివాసం చేసారు. 49 బెత్యేషిమోతు నుండి తుమ్మ పొలంవరకు వారి నివాసం ఆక్రమించుకొంది. ఇది అర్బత్ మోయాబు అనే చోట ఉంది.
50 అర్బత్ మోయాబు వద్ద మోషేతో యెహోవా మాట్లాడాడు. ఆయన అన్నాడు: 51 “ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడు. వారితో ఈ విషయాలు చెప్పు: మీరు యొర్దాను నది దాటుతారు. కనాను దేశంలోనికి మీరు వెళతారు. 52 అక్కడ మీరు చూసే మనుష్యుల దగ్గరనుండి దేశాన్ని మీరు స్వాధీనం చేసుకొంటారు. చెక్కబడిన వారి ప్రతిమలను విగ్రహాలను అన్నింటినీ మీరు నాశనం చేయాలి. వారి ఉన్నత స్థలాలు అన్నింటినీ మీరు నాశనం చేయాలి. 53 ఆ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకొని, మీరు అక్కడ స్థిరపడతారు. ఎందుకనగా ఈ దేశాన్ని నేనే మీకు ఇస్తున్నాను. అది మీ కుటుంబాలకు చెందుతుంది. 54 మీ కుటుంబాలు ప్రతి ఒక్కదానికీ ఆ దేశంలో భాగం ఉంటుంది. దేశంలోని ఒక్కోభాగం ఏ కుటుంబానికి వస్తుందో తెలుసుకొనేందుకు మీరు చీట్లు వేయాలి. పెద్ద కుటుంబాలకు ఆ దేశంలో పెద్ద భాగం ఇవ్వాలి. చిన్న కుటుంబాలకు ఆ దేశంలో చిన్న భాగం ఇవ్వాలి. చీట్లు చేసిన నిర్ణయం ప్రకారమే ప్రజలకు భూమి ఇవ్వబడుతుంది. ప్రతి వంశానికి తమ వంతు భూమి ఇవ్వబడుతుంది.
55 “ఆ ఇతర మనుష్యులు దేశాన్ని వదలి పోయేటట్టుగా మీరు చేయాలి. ఆ ప్రజలను మీరు దేశంలో ఉండనిస్తే, వారు మీకు ఎన్నో కష్టాలు కలిగిస్తారు. వారు మీ కళ్లలో పొడుచుకొనే ముళ్లలా, పక్కలో ముళ్లుగాను ఉంటారు. మీరు నివసించబోయే దేశానికి వారు చాల కష్టాలు తెస్తారు. 56 నేను వారికి ఏమి చేస్తానో మీకు చూపించాను. ఆ ప్రజలను మీ దేశంలో గనుక మీరు ఉండనిస్తే దానినే నేను మీకు కూడా చేస్తాను.”
కనాను—సరిహద్దులు
34 మోషేతో యెహోవా మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు: 2 “ఇశ్రాయేలు ప్రజలకు ఈ ఆజ్ఞ ఇవ్వుము. మీరు కనాను దేశానికి వస్తున్నారు. ఈ దేశాన్ని మీరు జయిస్తారు. కనాను దేశం అంతా మీరు స్వాధీనం చేసుకొంటారు. 3 దక్షిణాన ఎదోము దగ్గర సీను అరణ్యంలో కొంత భాగం మీకు వస్తుంది. మృత సముద్రపు దక్షిణ కొనలో మీ దక్షిణాది సరిహద్దు మొదలవుతుంది. 4 అక్రబ్బీము దక్షిణాన్ని అది దాటిపోతుంది. సీను అరణ్యంనుండి కాదేషు, బర్నేయ, అక్కడ్నుండి హసరద్దారు మళ్లీ అక్కడ్నుండి అస్మోను వరకు ఉంటుంది. 5 అస్మోను నుండి ఈజిప్టు నది వరకు పోయి, మధ్యధరా సముద్రం దగ్గర సరిహద్దు ముగిస్తుంది. 6 మీ పశ్చిమ సరిహద్దు మధ్యధరా సముద్రం. 7 మీ ఉత్తర సరిహద్దు మధ్యధరా సముద్రం దగ్గర ప్రారంభమై, హోరు కొండవరకు ఉంటుంది. (లెబానోనులో.) 8 హోరు కొండ నుండి లెబోహమత్ వరకు, అక్కడ నుండి సెదాదు వరకు ఉంటుంది. 9 తర్వాత జిప్రోను వరకు వ్యాపించి, హసరేనాన్ దగ్గర అయిపోతుంది. కనుక అది మీ ఉత్తర సరిహద్దు. 10 మీ తూర్ఫు సరిహద్దు ఎనాను దగ్గర ప్రారంభమై షెపాము వరకు వ్యాపిస్తుంది. 11 షెపామునుండి సరిహద్దు అయీనుకు తూర్పుగా వ్యాపించి రిబ్లావరకు ఉంటుంది. కిన్నెరెతు సముద్రం (గలలీయ సముద్రం) ప్రక్కగా కొండల వెంబడి సరిహద్దు సాగిపోతుంది. 12 తర్వాత సరిహద్దు యొర్దాను నదీ తీరం వెంబడి కొనసాగుతుంది. మృత సముద్రం దగ్గర అది అయిపోతుంది. అవి మీ దేశం చుట్టూ సరిహద్దులు.”
13 కనుక ఇశ్రాయేలు ప్రజలకు మోషే ఈ ఆజ్ఞ ఇచ్చాడు: “అది మీకు లభించే దేశం. పది వంశాలు, మనష్షే వంశంలో సగం మంది కలసి చీట్లు వేసుకొని ఆ దేశాన్ని పంచుకోవాలి. 14 రూబేను, గాదు వంశాలు, మనష్షే వంశంలో సగంమంది ముందే వారి భూమిని తీసుకున్నారు. 15 ఆ రెండున్నర వంశాల వారు యొర్దాను నదికి తూర్పువైపు యెరికో దగ్గర్లో భూమి తీసుకున్నారు.”
16 అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు: 17 “దేశాన్ని భాగాలు చేసేందుకు యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడు యెహోషువ నీకు సహయపడతారు. వీరు 18 అన్ని వంశాల నాయకులు. ఒక్కో వంశంనుండి ఒక్కో నాయకుడు ఉంటాడు. వారు దేశాన్ని భాగిస్తారు. 19 ఆ నాయకుల పేర్లు ఇవి:
యూదా వంశంనుండి – యెపున్నె కుమారుడు కాలేబు;
20 షిమ్యోను వంశంనుండి – అమ్మిహూదు కుమారుడు షెమూయేలు;
21 బెన్యామీను వంశంనుండి – కిస్లోను కుమారుడు ఎలీదాదు
22 దాను వంశంనుండి – యొగ్లి కుమారుడు బుక్కి
23 మనష్షే (యోసేపు కుమారుడు) వంశంనుండి
ఏఫోదు కుమారుడు హన్నీయేలు
24 ఎఫ్రాయిము (యోసేపు కుమారుడు) వంశంనుండి – షిఫ్తాను కుమారుడు కెమూయేలు
25 జెబూలూను వంశంనుండి – పర్నాకు కుమారుడు ఎలీషాపాను
26 ఇశ్శాఖారు వంశంనుండి – అజాను కుమారుడు పల్తీయేలు
27 ఆషేరు వంశంనుండి – షెలోమి కుమారుడు అహీహోదు
28 నఫ్తాలి వంశంనుండి – అమ్మీహోదు కుమారుడు పెదహేలు.”
29 ఇశ్రాయేలు ప్రజలకు కనాను దేశాన్ని పంచేందుకు ఆ మనుష్యులను యెహోవా ఏర్పరచుకొన్నాడు.
© 1997 Bible League International