Chronological
మూడు వంశాలు ఇండ్లకు వెళ్లటం
22 అప్పుడు రూబేను, గాదు వంశాలు, మనష్షే వంశంలో సగం మంది, అందరినీ ఒక సమావేశానికి పిలిచాడు యెహోషువ. 2 యెహోషువ వారితో ఇలా అన్నాడు: “మీరు చేయాలని మోషే చెప్పిన వాటన్నింటికీ మీరు విధేయులయ్యారు. మోషే యెహోవా సేవకుడు. మరియు, మీరు నా ఆజ్ఞలన్నింటికి కూడా విధేయులయ్యారు. 3 ఇంకను ఇన్నాళ్లూ ఇశ్రాయేలు ఇతర ప్రజలందరినీ మీరు బలపర్చారు. మీ యెహోవా దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నింటికీ మీరు జాగ్రత్తగా విధేయులయ్యారు. 4 ఇశ్రాయేలు ప్రజలకు శాంతి ఇస్తానని మీ యెహోవా దేవుడు వాగ్దానం చేసాడు. కనుక ఇప్పుడు యెహోవా తన వాగ్దానం నిలబెట్టుకొన్నాడు. ఇప్పటికి మీరు తిరిగి మీ ఇండ్లకు వెళ్లవచ్చును. మీకు ఇవ్వబడ్డ దేశానికి మీరు తిరిగి వెళ్లవచ్చును. ఇది యొర్దాను నదికి తూర్పున ఉన్న దేశం. యెహోవా సేవకుడు మోషే మీకు ఇచ్చిన దేశం ఇది. 5 అయితే మోషే మీకు ఇచ్చిన చట్టానికి లోబడుతూనే ఉండాలని జ్ఞాపకం ఉంచుకోండి. మీ యెహోవా దేవుడ్ని ప్రేమిస్తూ, ఆయన ఆజ్ఞలకు లోబడటమే ఆ చట్టం. మీరు ఆయనను వెంబడిస్తూనే ఉండాలి, మీకు చేతనైనంత బాగుగా అయనను సేవిస్తూనే ఉండాలి.”
6 తర్వాత యెహోషువ వారికి వీడ్కోలు చెప్పగా, వారు వెళ్లిపోయారు. వారు వారి ఇండ్లకు వెళ్లిపోయారు. 7 బాషాను దేశాన్ని మనష్షే అర్ధ వంశం వారికి మోషే ఇచ్చాడు. మిగిలిన అర్ధ వంశంవారికి యొర్దాను నది పడమటి వైపు దేశాన్ని యెహోషువ ఇచ్చాడు. అక్కడికి వారి ఇండ్లకు యోహోషువ వారిని పంపివేసాడు. యెహోషువ వారిని ఆశీర్వదించాడు. 8 “మీ ఇండ్లకు మీ ఐశ్వర్యాలకు తిరిగి వెళ్లండి. మీకు చాల పశువులు, చాల విలువైన నగలు, వెండి, బంగారం ఉన్నాయి. మీకు చాల అందమైన బట్టలు ఉన్నాయి. మరియు మీ శత్రువుల దగ్గర చాల వస్తువులు మీరు తీసుకొన్నారు. వీటన్నింటినీ మీలో మీరు పంచుకోవాలి.” అని అతడు చెప్పాడు.
9 కనుక రూబేను, గాదు, మనష్షే వంశాలవారు మిగిలిన ఇశ్రాయేలు ప్రజలను విడిచి వెళ్లారు. వారు కనానులోని షిలోహులో ఉన్నారు. ఆ స్థలం విడిచి వారు తిరిగి గిలాదు వెళ్లారు. ఇది వారి స్వంత దేశం. ఈ దేశాన్ని మోషే వారికి ఇవ్వాలని యెహోవా ఆజ్ఞాపించినందువల్ల అతడు దానిని వారికి ఇచ్చాడు.
10 రూబేను, గాదు, మనష్షే ప్రజలు గెలిలోతు అనే స్థలానికి ప్రయాణం చేసారు. ఇది కనాను దేశంలో యొర్దాను నది దగ్గర ఉంది. ఆ స్థలంలో ప్రజలు ఒక చక్కని బలిపీఠం నిర్మించారు. 11 కానీ ఈ మూడు వంశాలవారు నిర్మించిన బలిపీఠం గూర్చి, ఇంకా షిలోహులోనే ఉన్న ఇతర ఇశ్రాయేలు ప్రజలు విన్నారు. కనాను సరిహద్దులో గెలిల్‌తో అనే చోట బలిపీఠం ఉన్నదని వారు విన్నారు. అది యొర్దాను నది దగ్గర ఇశ్రాయేలీయుల వైపుగా ఉంది. 12 ఈమూడు వంశాల మీద ఇశ్రాయేలు ప్రజలందరికీ చాల కోపం వచ్చింది. వారు కలుసుకొని, వాళ్లతో యుద్ధం చేయాలని నిర్ణయం చేసారు.
13 కనుక రూబేను, గాదు, మనష్షే ప్రజలతో మాట్లాడేందుకు ఇశ్రాయేలు ప్రజలు కొందరు మనుష్యుల్ని పంపించారు. యాజకుడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు ఈ మనుష్యులకు నాయకుడు. 14 వంశాల నాయకులలో పదిమందిని కూడ వారు అక్కడికి పంపించారు. షిలోహులో ఉన్న ఇశ్రాయేలు వంశాల్లో ఒక్కో దాని నుండి ఒక్కో మనిషి అందులో ఉన్నాడు.
15 కనుక ఈ పదకొండు మంది గిలాదు వెళ్లారు. రూబేను, గాదు, మనష్షే ప్రజలతో మట్లాడటానికి వారు వెళ్లారు. ఆ పదకొండు మంది వారితో అన్నారు: 16 “ఇశ్రాయేలు ప్రజలంతా మిమ్మల్ని అడిగేది ఏమిటంటే, ‘ఇశ్రాయేలీయుల దేవునికి వ్యతిరేకంగా మీరు ఈ పని ఎందుకు చేసారు? మీరెందుకు యెహోవాకు అడ్డం తిరిగారు? మీకోసం మీరెందుకు బలిపీఠం కట్టుకొన్నారు? ఇది దేవుని చట్టానికి విరుద్ధం అని మీకు తెలుసు. 17 పెయొరు అనే మనిషి జ్ఞాపకం ఉన్నాడా? అతడు ఇలాగే చేసాడు. అతడి పాపం మూలంగా నేటికీ మనం శ్రమ అనుభవిస్తున్నాం. అతడి మహా అపరాధం మూలంగా ఇశ్రాయేలు ప్రజలు అనేకమంది రోగులు అయ్యేటట్టు దేవుడు చేసాడు. ఆ రోగం మూలంగా మనం నేడు కూడ శ్రమపడుతున్నాం. 18 ఇప్పుడు మీరు మళ్లీ అలాగే చేస్తున్నారు. మీరు యెహోవాకు విరోధంగా తిరుగుతున్నారు. యెహోవాను వెంబడించటానికి మీరు నిరాకరిస్తారా? మీరు చేస్తున్న దానిని మానివేయకపోతే ఇశ్రాయేలీయుల్లో ప్రతి ఒక్కరి మీదా యెహోవా కోపగిస్తాడు.
19 “‘ఆరాధించుకొనేందుకు మీ దేశం తగినట్టుగా లేకపోతే, మా దేశంలోనికి రండి. యెహోవా గుడారం మా దేశంలో ఉంది. మీరు కూడ మా దేశంలో కొంత తీసుకొని, అక్కడే నివసించవచ్చు. అంతేకాని యెహోవాకు విరోధంగా తిరుగకండి. మరో బలిపీఠం నిర్మించవద్దు. మన యెహోవా దేవుని బలిపీఠం సన్నిధి గుడారంలో ఇదివరకే ఉంది.
20 “‘జెరహు కుమారుడు ఆకాను ఆనేవాడ్ని జ్ఞాపకం చేసుకోండి. నాశనం చేయాల్సిన వస్తువుల విషయంలో అతడు ఆజ్ఞకు లోబడేందుకు ఇష్టపడలేదు. ఆ ఒక్కడు యెహోవా ఆజ్ఞకు ఉల్లంఘించాడు, కానీ ఇశ్రాయేలు ప్రజలంతా శిక్షపొందారు. ఆకాను అతని అపరాధం మూలంగా చనిపోయాడు. కానీ అతని వలన ఇంకా చాలమంది ప్రజలు కూడ చనిపోయారు.’”
21 రూబేను, గాదు, మనష్షే వంశాల ప్రజలు ఆ పదకొండు మందికీ జవాబు చెప్పారు. వారు చెప్పింది ఇదే: 22 “యెహోవాయే మా దేవుడు. మళ్లీ చెబుతున్నాము. యెహోవాయే మా దేవుడు. మేము ఎందుకు ఇలా చేసామో దేవునికి తెలుసు. మీరు కూడ తెలుసుకోవాలని మేము కోరుతున్నాము. మేము చేసినదానికి వీరు విచారణ జరుపవచ్చు. మేము చేసింది తప్పు అనే నమ్మకం మీకు కలిగితే, మీరు మమ్మల్ని చంపవచ్చు. 23 మేము గనుక దేవుని చట్టాన్ని ఉల్లంఘించిఉంటే, మమ్మల్ని శిక్షించుమని చెప్పి ఆ దేవుడినే మేము అడుగుతాము. ధాన్యార్పణలు, సమాధానబలులు అర్పించేందుకు, దహనబలుల కోసమూ మేము ఈ బలిపీఠం నిర్మించామని మీరు తలుస్తున్నారా? లేదు. ఆ కారణంతో మేము దీన్ని నిర్మించలేదు. మేము ఈ బలిపీఠాన్ని ఎందుకు నిర్మించాము? 24 మేము కూడ మీ దేశంలో భాగస్థులమేనని మీ ప్రజలు భవిష్యత్తులో ఒప్పుకోరేమోనని మేము భయపడ్డాం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను మేము ఆరాధించకూడదని అప్పుడు మీ ప్రజలు అంటారు. 25 యొర్దాను నది అవతలి వైపు దేవుడు మాకు భూమి ఇచ్చాడు. అంటే యొర్దాను నది మనల్ని వేరు చేస్తుందని దీని అర్థం. మీ పిల్లలు పెద్దవారై, మీ దేశాన్ని పాలించినప్పుడు, మేమూ మీ వాళ్లమేనని వారికి జ్ఞాపకం ఉండదు. ‘రూబేను, గాదు ప్రజలారా, మీరు ఇశ్రాయేలు ప్రజల మధ్యను చెందినవారు కారు’ అని మాతో వారు అంటారు. అందుచేత మా పిల్లలు యెహోవాను ఆరాధించకుండా మీ పిల్లలు ఆటంకపరుస్తారు.
26 “అందుచేత మేము ఈ బలిపీఠం నిర్మించాలని నిర్ణయించాం. అంతేగాని దీనిని దహనబలులకు, బలులకు ఉపయోగించాలని మేము తలంచలేదు. 27 మీరు ఆరాధిస్తున్న, మీరు ఆరాధించే దేవుడినే మేమూ ఆరాధిస్తున్నామనే విషయం మా బలిపీఠం మా ప్రజలకు తెలియజేయాలనేదే అసలైన కారణం. మేము యెహోవాను ఆరాధిస్తామని మీకు, మాకు, మనభవిష్యత్ పిల్లలందరికీ ఈ బలిపీఠం ఋజువుగా ఉంటుంది. మా బలులు, ధాన్యార్పణలు, సమాధాన బలులు యెహోవాకు అర్పిస్తాము. మీ పిల్లలు పెరిగి పెద్దవారైనప్పుడు, మీవలెనే మేము కూడ ఇశ్రాయేలీయులం అని తెలుసుకోవాలని మా కోరిక. 28 ముందు నాటికి మేము ఇశ్రాయేలీయులకు చెందిన వాళ్లము కాదు అని మీ పిల్లలు చెప్పినట్లయితే ‘చూడండి! మాకు ముందు జీవించిన మా పితరులు ఒక బలిపీఠం నిర్మించారు. ఆ బలిపీఠం సరిగ్గా పవిత్ర గుడారం ముందర ఉన్న బలిపీఠంలాగానే ఉంది. ఈ బలిపీఠాన్ని బలులు అర్పించేందుకు మేము ఉపయోగించము. మేమూ ఇశ్రాయేలు ప్రజల్లో ఒక భాగమే అని ఈ బలిపీఠం తెలియజేస్తుంది’ అని మా పిల్లలు చెప్పగలుగుతారు.
29 “వాస్తవంగా మేము యెహోవాకు వ్యతిరేకంగా ఉండాలనుకోవటం లేదు. ఆయనను వెంబడించటం ఇప్పుడు మానివేయాలని కోరటం లేదు. పవిత్ర గుడారం ఎదుట ఉన్నదే సత్యమైన ఒకే బలిపీఠం అని మాకు తెలుసు. ఆ బలిపీఠం మన యెహోవా దేవునిది.”
30 రూబేను, గాదు, మనష్షే ప్రజలు చెప్పిన ఈ విషయాలను యాజకుడు ఫీనెహాసు, పదిమంది నాయకులు విన్నారు. ఈ మనుష్యులు సత్యమే చెబుతున్నారని వారు తృప్తిపడ్డారు. 31 కనుక యాజకుడు ఫీనెహాసు, “యెహోవా మనతో ఉన్నాడని ఇప్పుడు మాకు తెలుసు. మరియు మీరు ఆయనకు విరోధంగా తిరుగలేదని కూడ ఇప్పుడు తెలుస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా చేత శిక్షించబడరు గనుక మేము సంతోషిస్తున్నాము” అన్నాడు.
32 అప్పుడు ఫీనెహాసు, తదితర నాయకులు ఆ చోటువిడిచి, ఇంటికి వెళ్లారు. రూబేను, గాదు ప్రజలను గిలాదు దేశంలో విడిచిపెట్టి, వారు కనానుకు తిరిగి వెళ్లారు. ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వారు తిరిగి వెళ్లి జరిగినది వారికి తెలియజేసారు. 33 ఇశ్రాయేలు ప్రజలు కూడ తృప్తి చెందారు. వారు సంతోషించి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. రూబేను, గాదు, మనష్షే ప్రజల మీదికి యుద్ధానికి వెళ్లకూడదని వారు తీర్మానించారు. ఆ దేశాలను నాశనం చేయకూడదని వారు నిర్ణయించారు.
34 మరియు, “యెహోవాయే దేవుడని మేము నమ్ముతున్నట్టు ఈ బలిపీఠం ప్రజలందరికీ తెలియజేస్తుంది” అని రూబేను, గాదు, మనష్షే ప్రజలు చెప్పారు. అందుచేత వారు ఆ బలిపీఠానికి “ఋజువు” (ఏద) అని పేరు పెట్టారు.
యెహోషువ ప్రజలను ప్రోత్సాహించటం
23 ఇశ్రాయేలీయులకు వారి చుట్టూ ఉండే శత్రువులనుండి యెహోవా శాంతిని ఇచ్చాడు. ఇశ్రాయేలీయులను యెహోవా క్షేమంగా ఉంచాడు. చాల సంవత్సరాలు గడిచాయి, యెహోషువ వృద్దుడయ్యాడు. 2 ఈ సమయంలో ఇశ్రాయేలు నాయకులు, కుటుంబ పెద్దలు న్యాయమూర్తులు అందరినీ యెహోషువ సమావేశపర్చాడు. యెహోషువ ఇలా చెప్పాడు: “నేను చాల ముసలివాడినయ్యాను. 3 మన శత్రువులకు యెహోవా చేసిన వాటిని మీరు చూసారు. మనకు సహాయం చేసేందుకు అయన అలా చేసాడు. మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా పోరాడాడు. 4 పశ్చిమాన మహా సముద్రానికి, యొర్దానుకు మధ్యగల దేశమంతా మీ ప్రజలు తీసుకోవచ్చని నేను మీతో చెప్పినది జ్ఞాపకం ఉంచుకోండి. నేను మీకు ఇస్తానని చెప్పిన దేశం అది. కానీ మీరు ఇంకా దానిని స్వాధీనం చేసుకోలేదు. 5 అక్కడ నివసిస్తున్న ప్రజలను మీ యెహోవా దేవుడు బలవంతంగా వెళ్లగొట్టేస్తాడు. మీరు ఆ దేశంలో ప్రవేశిస్తారు, అక్కడ నివసిస్తున్న ప్రజలను యెహోవా వెళ్లగొట్టేస్తాడు. మీ దేవుడైన యెహోవా చేసిన వాగ్దానం ఇది.
6 “యెహోవా మనకు ఆజ్ఞాపించిన వాటన్నింటికీ విధేయులుగా ఉండేందుకు మీరు జాగ్రత్తపడాలి. మోషే ధర్మశాస్రంలో వ్రాయబడిన వాటన్నింటికీ విధేయులుగా ఉండండి. ఆ ధర్మశాస్త్రానికి విముఖులు కావద్దు. 7 ఇశ్రాయేలు ప్రజలు కానివాళ్లు ఇంకా కొంతమంది మన మధ్య నివసిస్తున్నారు. ఆ ప్రజలు వారి స్వంత దేవుళ్లను ఆరాధిస్తున్నారు. ఆ ప్రజలతో స్నేహం చేయవద్దు. వారి దేవుళ్లను సేవించవద్దు, ఆరాధించవద్దు. 8 మీ దేవుడైన యెహోవాను వెంబడించటం మీరు కొనసాగించాలి. గతంలో మీరు ఇలా చేసారు. ఇలాగే మీరు చేస్తూ ఉండాలి.
9 “మహా బలంగల అనేక రాజ్యాలను ఓడించేందుకు యెహోవా మీకు సహాయం చేసాడు. ఆ ప్రజలను యెహోవా బలవంతంగా వెళ్లగొట్టాడు. ఏ రాజ్యం కూడా మిమ్మల్ని ఓడించలేకపోయింది. 10 యెహోవా సహాయంతో ఇశ్రాయేలీయులలో ఒక్కడు వేయిమంది శత్రువులను ఓడించగలిగాడు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా పోరాడటంవల్లనే ఇది జరిగింది. ఇలా చేస్తానని యెహోవా వాగ్దానం చేసాడు. 11 అందుచేత మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూనే ఉండాలి. మీరు సంపూర్ణులుగా అయనను ప్రేమించాలి.
12 “యెహోవా మార్గంనుండి తొలగిపోవద్దు. ఇశ్రాయేలీయులకు చెందని ఏ ఇతరులతో స్నేహం చేయవద్దు. వారి మనుష్యులను ఎవరినీ పెళ్లాడకండి. అయితే మీరే గనుక ఈ మనుష్యులతో స్నేహం చేస్తే 13 మీ శత్రువులను జయించేందుకు మీ దేవుడైన యెహోవా మీకు సహాయం చేయడు. కనుక ఈ ప్రజలు మీకు ఒక ఉచ్చుగా ఉంటారు. వారు మీ కళ్లలో పొగలా, ధూళిలా మీకు బాధ కలిగిస్తారు. మరియు ఈ మంచిదేశం నుండి మీరు వెళ్లగొట్టబడుతారు. ఇది మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశం, కానీ మీరు ఈ ఆజ్ఞకు విధేయులు కాకపోతే, దీనిని పోగొట్టుకొంటారు.
14 “ఇది దాదాపు నేను చనిపోవాల్సిన సమయం యెహోవా మీకోసం ఎన్నో గొప్ప కార్యాలు చేసాడని మీకు తెలుసు, మీరు వాస్తవంగా నమ్ముతున్నారు. ఆయన చేసిన వాగ్దానాలు ఏవీ ఆయన తప్పలేదని మీకు తెలుసు. మనకు ఇచ్చిన ప్రతి వాగ్దానమూ యెహోవా నెరవేర్చాడు. 15 మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ప్రతి మంచి వాగ్దానం నిజంగా నెరవేరింది. అయితే అదే విధంగా యెహోవా తన ఇతర వాగ్దానాలను కూడ నెరవేరుస్తాడు. మీరు తప్పు చేస్తే మీకు కీడు కలుగుతుందని ఆయన వాగ్దానం చేసాడు. ఆయన మీకు ఇచ్చిన ఈ మంచి దేశంనుండి బలవంతంగా మిమ్మల్ని వెళ్లగొట్టేస్తానని ఆయన వాగ్దానం చేసాడు. 16 మీ దేవుడైన యెహోవాతో మీరు చేసిన ఒడంబడికను నిలబెట్టుకొనేందుకు మీరు నిరాకరిస్తే ఇలా జరుగుతుంది. మీరు వెళ్లి ఇతర దేవుళ్లను పూజిస్తే మీరు ఈ దేశాన్ని పోగొట్టుకొంటారు. ఆ ఇతర దేవుళ్లను మీరు పూజించకూడదు. మీరు గనుక అలా చేస్తే మీ మీద యెహోవాకు చాలా కోపం వస్తుంది. అప్పుడు ఆయన మీకు ఇచ్చిన ఈ మంచి దేశంనుండి మీరు వెంటనే వెళ్లగొట్టబడతారు.”
యెహోషువ వీడ్కోలు చెప్పటం
24 అప్పుడు ఇశ్రాయేలీయుల వంశాలన్ని షెకెములో సమావేశం అయ్యాయి. వారందరినీ యెహోషువ అక్కడికి పిలిచాడు. అప్పుడు ఇశ్రాయేలు నాయకులను, కుటుంబ పెద్దలను, న్యాయమూర్తులను యెహోషువ పిలిచాడు. వీళ్లంతా దేవుని ఎదుట నిలబడ్డారు.
2 అప్పుడు యెహోషువ ప్రజలందరితో మాట్లాడాడు. అతడు ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మీతో చెబుతున్నదే నేను మీతో చెబుతున్నాను. చాలకాలం క్రిందట మీ పూర్వీకులు యూఫ్రటీసు నదికి ఆవలిపక్క నివసించారు. అబ్రాహాము, నాహోరుల తండ్రి తెరహు వంటి మనుష్యులను గూర్చి నేను చెప్పుచున్నాను. అప్పట్లో వాళ్లు ఇతర దేవుళ్లను పూజించారు. 3 అయితే యెహోవానైన నేను మీ తండ్రి అబ్రాహామును నది ఆవలివైపు దేశంనుండి బయటకు రప్పించాను. నేను అతనిని కనాను దేశంగుండా నడిపించి, అతనికి అనేకమంది పిల్లల్ని ఇచ్చాను. అబ్రాహాముకు ఇస్సాకు అనే కొడుకును నేను ఇచ్చాను. 4 మరియు ఇస్సాకునకు యాకోబు, ఏశావు అనే ఇద్దరు కొడుకులను నేను ఇచ్చాను. శేయీరు చుట్టూరా ఉన్న పర్వతాలను నేను ఏశావుకు ఇచ్చాను. కానీ యాకోబు, అతని కొడుకులు అక్కడ నివసించలేదు. బ్రతికేందుకు వారు ఈజిప్టు వెళ్లారు.
5 “అప్పుడు మోషే, అహరోనులను నేను ఈజిప్టుకు పంపించాను. నా ప్రజలను వారు ఈజిప్టునుండి బయటకు తీసుకొని రావాలని నేను కోరాను. ఈజిప్టు ప్రజలకు అనేకమైన భయంకర సంగతులు జరిగేటట్టు నేను చేసాను. అప్పుడు నేను మీ వాళ్లను ఈజిప్టునుండి బయటకు రప్పించాను. 6 కనుక నేనే మీ పూర్వీకులను ఈజిప్టునుండి బయటకు రప్పించాను. వారు ఎర్ర సముద్రం వరకు వచ్చేటప్పటికి, ఈజిప్టు మనుష్యులు వారిని తరుముతున్నారు. రథాలు ఉన్నాయి, రౌతులు ఉన్నారు అక్కడ. 7 కనుక యెహోవానైన నన్ను ప్రజలు సహాయం కోరారు. నేను ఈజిప్టు ప్రజల మీదికి మహాగొప్ప కష్టం వచ్చేటట్టు చేసాను. సముద్రం వాళ్లను కప్పివేసేటట్టుగా యెహోవానైన నేను చేసాను. ఈజిప్టు సైన్యానికి నేను చేసిన దీనిని మీ మట్టుకు మీరే చూసారు.
“ఆ తర్వాత చాలా కాలం మీరు అరణ్యంలో నివసించారు. 8 అప్పుడు నేను అమోరీయుల దేశానికి మిమ్మల్ని తీసుకొని వచ్చాను. ఇది యొర్దాను నదికి తూర్పున ఉంది. ఆ ప్రజలు మీతో యుద్ధం చేసారు కాని మీరు వారిని ఓడించేటట్టు నేను చేసాను. ఆ ప్రజలను నాశనం చేసే శక్తి నేను మీకు ఇచ్చాను. అప్పుడు మీరు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొన్నారు.
9 “అప్పుడు మోయాబు రాజు, సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. రాజు బెయోరు కుమారుడైన బిలామును పిలిపించాడు. మిమ్మల్ని శపించమని అతడు బిలామును అడిగాడు. 10 కానీ యెహోవానైన నేను బిలాము మాట వినటానికి నిరాకరించాను. కనుక మీకు మంచి సంగతులు సంభవించాలని అర్థించాడు. అతడు మిమ్మల్ని చాలాసార్లు ఆశీర్వదించాడు. నేను మిమ్మల్ని రక్షించి, కష్టంనుండి బయటకు రప్పించాను.
11 “అప్పుడు మీరు యొర్దాను నది దాటి ప్రయాణంచేసారు. మీరు యెరికో చేరుకొన్నారు. యెరికో పట్టణం ప్రజలు మీతో పోరాడారు. మరియు అమోరీ ప్రజలు, పెరిజ్జీ ప్రజలు, హివ్వీ ప్రజలు, యెబూసీ ప్రజలు మీతో పోరాడారు. కాని వాళ్లందరినీ మీరు ఓడించేటట్టు నేను చేసాను. 12 మీ సైన్యం ముందుకు వెళ్తున్నప్పుడు వారికి ముందుగా కందిరీగలను నేను పంపించాను. ఆ కందిరీగలు మీ శత్రువులను పారిపోయేటట్టు చేసాయి. కనుక మీరు ఖడ్గాలు, బాణాలు ప్రయోగించకుండా దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు.
13 “యెహోవానైన నేను మీకు ఆ దేశాన్ని ఇచ్చాను. మీరు పని చేయాల్సిన అవసరం లేకుండానే ఆ దేశాన్ని నేను మీకు ఇచ్చాను. మీరు నిర్మించని పట్టణాలను నేను మీకు ఇచ్చాను. ఇప్పుడు మీరు ఆ దేశంలో, ఆ పట్టణాల్లో నివసిస్తున్నారు. మీరు నాటకుండానే ద్రాక్షాతోటలు, ఒలీవ మొక్కలు మీకు ఉన్నాయి.”
14 అప్పుడు యెహోషువ ప్రజలతో ఇలా చెప్పాడు: “ఇప్పుడు మీరు యెహోవా మాటలు విన్నారు. కనుక మీరు యెహోవాను గౌరవించి, నిజంగా ఆయనను సేవించాలి. మీ పూర్వీకులు పూజించిన అసత్య దేవుళ్లను పారవేయండి. అది ఎప్పుడో చాలకాలం క్రిందట నదికి అవతల, ఈజిప్టులో జరిగిన విషయం. ఇప్పుడు మీరు యెహోవాను సేవించాలి.
15 “అయితే ఒకవేళ యెహోవాను సేవించటం మీకు ఇష్టం లేదేమో. అది ఈ వేళే మీరు తేల్చుకోవాలి. మీరు ఎవరిని సేవిస్తారో నేడే నిర్ణయించుకోవాలి. మీ పూర్వీకులు నదికి ఆవల నివసించినప్పుడు సేవించిన దేవుళ్లను మీరు సేవిస్తారో? లేదా ఈ దేశంలో నివసించిన అమోరీయుల దేవుళ్లను సేవిస్తారో? మీకు మీరే కోరుకోండి. అయితే, నేను, నా కుటుంబం మాత్రం యెహోవాను సేవిస్తాము!”
16 అప్పుడు ప్రజలు ఇలా జవాబిచ్చారు, “లేదు, యెహోవాను అనుసరించటం మేము ఎన్నటికీ మానము. ఇక ఇతర దేవుళ్లను ఎన్నటికి మేము సేవించము. 17 మన ప్రజలను ఈజిప్టునుండి బయటకు రప్పించినవాడు యెహోవాయే అని మాకు తెలుసు. ఆ దేశంలో మనం బానిసలం. అయితే అక్కడ యెహోవా మనకోసం మహాగొప్ప కార్యాలు చేసాడు. ఆయనే ఆ దేశంనుండి మనల్ని బయటకు రప్పించాడు, ఇతర దేశాలగుండా మనము ప్రయాణించినప్పుడు ఆయనే మనలను కాపాడాడు. 18 తర్వాత ఈ దేశాల్లో నివసించే ప్రజలను ఓడించటానికి యెహోవాయే మనకు సహాయం చేసాడు. ఇప్పుడు మనం ఉన్న ఈ దేశంలో నివసించిన అమోరీ ప్రజలను ఓడించేందుకు యెహోవా మనకు సహాయం చేసాడు. కనుక మేము ఆయననే సేవిస్తాం. ఎందుచేతనంటే ఆయనే మన దేవుడు గనుక.”
19 అప్పుడు యెహోషువ అన్నాడు, “(అది నిజం కాదు) మీరు యెహోవాను సరిగ్గా సేవించలేరు. యెహోవా దేవుడు పరిశుద్ధుడు. తన ప్రజలు ఇతర దేవుళ్లను పూజిస్తే దేవునికి అసహ్యం. అలా మీరు ఆయనకు వ్యతిరేకంగా తిరిగితే దేవుడు మిమ్మల్ని క్షమించడు. 20 మీరు యెహోవాను విడిచిపెట్టి, ఇతర దేవుళ్లను సేవిస్తారు మరియు భయంకర సంగతులను దేవుడు మీకు సంభవింపజేస్తాడు. యెహోవా మిమ్మల్ని నాశనం చేస్తాడు. యెహోవా దేవుడు మీ ఎడల దయగా ఉన్నాడు కానీ మీరు ఆయనకు విరోధంగా తిరిగితే ఆయన మిమ్మల్ని నాశనం చేస్తాడు.”
21 అయితే ప్రజలు, “లేదు, మేము యెహోవానే సేవిస్తాము” అని యెహోషువతో చెప్పారు.
22 అప్పుడు యెహోషువ, “మీ చుట్టూ, ఇక్కడ మీతో ఉన్న ప్రజల చుట్టూ చూడండి. మీరు యెహోవానే సేవించేందుకు నిర్ణయం చేసారని మీకు తెలుసా, మీరు ఒప్పుకొన్నారా? దీనికి మీరంతా సాక్షులేనా?” అన్నాడు.
ప్రజలు “అవును, ఇది సత్యం. మేము యెహోవానే సేవిస్తామని మేము నిర్ణయించు కొన్నట్టు మా అందరికీ తెలుసు” అని జవాబిచ్చారు.
23 అప్పుడు యెహోషువ, “అలాగైతే మీ మధ్య ఉన్న అసత్య దేవుళ్లను పారవేయండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతో ప్రేమించండి” అని చెప్పాడు.
24 అప్పుడు ప్రజలు “మేము మా దేవుడైన యెహోవానే సేవిస్తాము. మేము ఆయనకే విధేయులమవుతాము” అని యెహోషువతో చెప్పారు.
25 కనుక ఆ రోజున యెహోషువ ప్రజలతో ఒక ఒడంబడిక చేసాడు. ఈ ఒడంబడికను వారు పాటించాల్సిన ఒక చట్టముగా చేసాడు యెహోషువ. షెకెము అనబడిన పట్టణంలో ఇదంతా జరిగింది. 26 దేవుని ధర్మశాస్త్రపు గ్రంథంలో యెహోషువ ఈ సంగతులన్నీ వ్రాసాడు. అప్పుడు యెహోషువ ఒక పెద్ద బండను చూసాడు. (ఈ బండ ఈ ఒడంబడికకు ఋజువు) యెహోవా పవిత్ర గుడారం దగ్గర సింధూర వృక్షం క్రింద ఆ బండను అతడు పెట్టాడు.
27 అప్పుడు యెహోషువ ప్రజలందరితో చెప్పాడు: “ఈనాడు మనం చేసిన సంగతులను జ్ఞాపకం చేసుకునేందుకు ఈ బండ మీకు సహాయకరంగా ఉంటుంది. ఈనాడు యెహోవా మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ బండ ఇక్కడే ఉంది. కనుక ఈ వేళ జరిగిన దానిని మనం జ్ఞాపకం చేసుకునేందుకు సహాయకరంగా ఉంటుంది ఈ బండ. మీమీద ఈ బండ సాక్షి. మీ దేవుడైన యెహోవాకు మీరు విరోధంగా తిరుగకుండా ఈ బండ మిమ్మల్ని వారిస్తుంది.”
28 అప్పుడు యెహోషువ ప్రజలందరినీ వారి ఇండ్లకు వెళ్లిపొమ్మని చెప్పాడు. ప్రతి వ్యక్తీ తన స్వంత స్థలానికి వెళ్లిపోయాడు.
యెహోషువ మరణం
29 ఆ తర్వాత నూను కుమారుడైన యెహోషువ చనిపోయాడు. ఆయన వయస్సు నూటపది సంవత్సరాలు. 30 తిమ్నాత్ సెరహులోని తన స్వంత స్థలంలో యెహోషువ పాతిపెట్టబడ్డాడు. ఇది గాయషుకొండకు ఉత్తరాన ఎఫ్రాయిం దేశంలో ఉంది.
31 యెహోషువ జీవించిన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను సేవించారు. యెహోషువ మరణం తర్వాత కూడా ప్రజలు యెహోవాను సేవించారు. తమ నాయకులు బ్రతికి ఉన్నంతవరకు ప్రజలు యెహోవాను సేవించటం కొనసాగించారు ఇశ్రాయేలీయులకు యెహోవా చేసినవాటిని చూసినవారు ఈ నాయకులు.
యోసేపు ఎముకలను స్వదేశానికి తేవటం
32 ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టును విడిచినప్పుడు, యోసేపు ఎముకలను వారితోకూడ మోసుకునివచ్చారు. కనుక యోసేవు ఎముకలను షెకెములో ప్రజలు పాతిపెట్టారు. షెకెము తండ్రి, హమోరు కుమారుల దగ్గర యాకోబు కొన్న భూమిలో వారు ఆ ఎముకలను పాతిపెట్టారు. ఆ భూమిని యాకోబు వంద వెండి నాణాలకు కొన్నాడు. ఈ భూమి యోసేపు పిల్లలకు చెందినది.
33 అహరోను కుమారుడైన ఎలియాజరు చనిపోయాడు. అతడు గిబియాలో పాతిపెట్టబడ్డాడు. ఎఫ్రాయిము కొండ దేశంలో గిబియా ఒక పురం. ఆ పురం ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసుకు ఇవ్వబడింది.
© 1997 Bible League International